
సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు పోస్టులు పెడితే ఊరుకోం.. తోడ్క తీస్తాం..
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చలో సీఎం రేవంత్‌రెడ్డి
ప్రజా జీవితంలో ఉన్నామని ఓపిక పడుతున్నాం.. లేదంటే ఒక్కడూ బయట తిరగలేడు
జర్నలిస్టులు ఎవరో మీడియా సంఘాలు జాబితా ఇవ్వండి..
అలాగాకుండా జర్నలిస్టు ముసుగు వేసుకుని వస్తే బట్టలూడదీసి కొడతాం
కోర్టుకు వెళ్లినా బెయిల్ రాకుండా చట్టాన్ని సవరిస్తాం
డ్రగ్స్ విక్రయించేవారిని వదిలేది లేదు.. వారి ఇళ్లకు కరెంటు, నీళ్లు కట్ చేస్తాం
విద్యార్థులు స్కూళ్లలో డ్రగ్స్ వాడితే యాజమాన్యాలదే బాధ్యత
నగరం లోపలున్న పరిశ్రమలను ఓఆర్‌ఆర్ బయటికి తరలిస్తామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ‘‘సోషల్ మీడియాలో భాష చూడండి. కుటుంబ సభ్యులు, ఆడబిడ్డల మీద ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతున్నారు. ప్రజాజీవితంలో ఉన్నాం కదా అని ఓపిక పడుతున్నాం. లేదంటే ఒక్కడు కూడా బయట తిరగలేడు. హద్దు దాటితే ఊరుకోబోం. మీడియా మిత్రులు, మీడియా సంఘాలు.. మీరైనా చెప్పండి. జర్నలిస్టులు ఎవరో మీరే జాబితా ఇవ్వండి. జాబితాలో లేనివాడు జర్నలిస్టు కాడు. జర్నలిస్టు కానోడిని క్రిమినల్‌గానే చూస్తాం. క్రిమినల్స్‌కు ఎట్లా జవాబు చెప్పాల్నో అట్లానే చెప్తాం.
జర్నలిస్టు ముసుగేసుకుని వస్తే.. ముసుగుతీసి ఒక్కొక్కడిని బట్టలూడదీసి కొడతాం, తోడ్కలు తీస్తా..’’ అని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. తాను సీఎం కురీ్చలో ఉన్నానని, అందువల్ల ఊరుకుంటానని అనుకుంటున్నారని.. కానీ ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘నేనూ మనిషినే.. చీమూనెత్తురు ఉన్నాయి. నన్ను తిట్టిన తిట్లకు మీపేరు పెట్టుకుని చూడండి. నేను ఓపికతో ఉన్నా.. కేసీఆర్ మీ పిల్లలకు బుద్ధిచెప్పు.. హద్దు దాటితే, మాటజారితే అనుభవిస్తరు. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోను. కోర్టుకు పోతే బెయిల్ వస్తుందని అనుకుంటున్నారు. అవసరమైతే చట్టాన్ని సవరిస్తాం.
ఇకపై ఇలా పోస్టులు చేస్తే ఉప్పు పాతరేస్తం. చట్టపరిధిలో అన్ని చర్యలు ఉంటాయి. సోషల్ మీడియాపై చర్చ పెట్టండి. పరిష్కారం చూపకపోతే సమాజం దెబ్బతింటుంది. దీనిపై చట్టం చేద్దాం. ఇది నా ఒక్కరి వేదన కాదు.. అందరి ఆవేదన. స్వీయ నియంత్రణతోపాటు రాజ్యాంగ నియంత్రణ ఉండాలి. ఒకరోజు దీనిపై చర్చ పెట్టాలి. సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు ఈ అంశంపై దృష్టి పెట్టాలి.
ఇష్టమొచ్చినట్టు అబద్ధాలు ఆడుతారా?
రాష్ట్రంలో కులగణనను 1931 తర్వాత ఇప్పుడు మేమే చేశాం. ఈ సర్వేలో 96.9 శాతం మంది పాల్గొన్నారు. మిగతావారి కోసం మరో అవకాశం ఇచ్చాం. కానీ బీఆర్‌ఎస్ వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ కుటుంబం మొత్తం అబద్ధాలతోనే బతుకుతున్నారు. 42శాతం బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకే కులగణనపై అబద్ధాలు మాట్లాడుతున్నారు. అబద్ధాలపై జీఎస్టీ లేదని ఇష్టమున్నట్టు అబద్ధాలు ఆడుతారా? ప్రధాని మోదీకి చెప్పి అబద్ధాల మీద కూడా ట్యాక్స్ వేయించాలని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డిని కోరుతున్నాను.
నామీద కోపం ఎందుకు ఉంటుంది?
మేం తెలంగాణ సంస్కృతిని గౌరవించాం. తెలంగాణ తల్లిని సచివాలయం లోపల ప్రతిష్టించాం. నామీద అన్ని వర్గాలకు కోపం ఉందని ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు, రైతులకు, యువతకు 15 నెలల్లోనే ఎన్నో చేశాం. ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే కార్యక్రమం చేపట్టాం. రైతులకు రుణమాఫీ, రూ.500 బోనస్ ఇస్తున్నాం. యువతకు ఉద్యోగాలిస్తున్నాం. గ్రూప్స్ పరీక్షలు నిర్వహించి, పోస్టులు భర్తీ చేస్తున్నాం. నామీద ఎందుకు కోపం ఉంటుంది?
15 ఏళ్లు పైబడ్డ వాహనాలు తిరగొద్దు
హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు 1,600 కొత్త వాహనాలు వస్తున్నాయి. ఇంటికి నాలుగు వాహనాలు ఉంటున్నాయి. దీనితో ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది. ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా, కొత్త రోడ్లు వేసినా పరిస్థితిలో మార్పు రాదు. ప్రజా రవాణాను పెంచుతున్నాం. కాలుష్యం నుంచి హైదరాబాద్‌ను కాపాడాలి. మరో ఢిల్లీ కాకుండా చూడాలి. నగరంలోని 3 వేల డీజిల్ ఆర్టీసీ బస్సులను గ్రామాలకు పంపి.. ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తం.
15ఏళ్లు పైబడిన వాహనాలను నగరంలోకి అనుమతించం. పరిశ్రమలను ఓఆర్‌ఆర్ ఆవలికి తరలిస్తాం. పాతబస్తీలో రవాణా సదుపాయాలను మెరుగుపరుస్తాం. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సూచన మేరకు లాల్‌దర్వాజా ఆలయం అభివృద్ధికి స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద రూ.20కోట్లు కేటాయిస్తున్నా. ఈ మేరకు జారీ చేసే జీవోలో అక్బరుద్దీన్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించాలి..’’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
డ్రగ్స్ విక్రేతల ఇళ్లకు కరెంటు, నీళ్లు కట్
‘‘రాష్ట్రంలో గంజాయి, కొకైన్ వంటి మత్తు పదార్థాలను సరఫరా చేసే పెడ్లర్లు ఎంత పెద్దవారైనా వదిలేది లేదు. డ్రగ్స్ విక్రయించే వారి ఇళ్లకు కరెంటు, నీటి సరఫరా నిలిపివేస్తాం. రూ.250 కోట్లు వెచ్చించి యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను పటిష్టం చేశాం. ఇటీవల దుబాయిలో చనిపోయిన వ్యక్తికి సంబంధించిన పోస్టుమార్టం వివరాలన్నీ తెప్పించాం.
డ్రగ్స్‌కు సంబంధించిన గుట్టంతా మా వద్ద ఉంది. స్కూళ్లలో డ్రగ్స్ వినియోగిస్తే ఆ స్కూల్ యాజమాన్యానిదే బాధ్యత. వారిపై కేసులు పెట్టాలని నిర్ణయించాం. లక్షలకొద్దీ ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లలో ఏం జరుగుతోందో, పిల్లల మానసిక స్థితి ఎలా ఉందో యాజమాన్యమే పర్యవేక్షించాలి. ప్రతి స్కూల్‌లో సైకాలజీ టీచర్‌ను తప్పనిసరిగా నియమించుకోవాలి. స్కూళ్లు, కాలేజీల వద్ద ప్రత్యేకంగా నిఘాపెడతాం.’’
Comments
Please login to add a commentAdd a comment