సాక్షి, హైదరాబాద్: ‘జూనియర్ కాలేజీలు, స్కూళ్లలోనూ ఇప్పుడు మత్తు పదార్థాలు అందుబాటులోకి వచ్చాయి. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి..దీనిని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించదు. మీరు గతంలో తీవ్రవాదులు, ఐఎస్‌ఐలాంటి వారిని కూకటివేళ్లతో పెకిలించడానికి ఏ రకంగా అయితే కఠినమైన చర్యలు తీసుకున్నారో, వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నారో, ఈ డ్రగ్ మహమ్మారినికి కూడా నిర్మూలించేందుకు అంతే కృషి చేయాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోలీస్ అధికారులకు దిశానిర్దేశనం చేశారు.
ఉక్కుపాదంతో గంజాయిని అణచివేయాలని, గంజాయి అనే పదం రాష్ట్రంలో వినిపించకూడదన్నారు. ఆదివారం సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో పలు అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులకు స్పష్టత ఇచ్చారు.
నార్కోటిక్ బ్యూరో కీలకపాత్ర పోషించాలి
నార్కోటిక్ బ్యూరో అనేది అత్యంత కీలకమైన పాత్ర పోషించాలని, మత్తుపదార్థాల వినియోగంలో పంజాబ్‌లా తెలంగాణ మారకుండా నిర్మూలించాల్సిన బాధ్యత పోలీసులదే సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ‘ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణలో గంజాయి, డ్రగ్స్ ఇక్కడి యువతను ఆక్రమించుకుంటున్నాయి.
ఇది అత్యంత ప్రమాదకరం.సైబరాబాద్ కమిషనర్‌ను ఆదేశిస్తున్నా.. సన్‌బర్న్ పార్టీకి సంబంధించి డిజిటల్ మార్గంలో కొన్ని టికెట్లు అమ్ముతున్నారు. బుక్ మైషో లాంటి కొన్నింటిని నేను స్వయంగా గమనించినా.. వారు ప్రభుత్వ అనుమతి పొందలేదు.. అనుమతి పొందకుండా 31 రాత్రి సన్‌బర్న్ పార్టీకి సంబంధించి టికెట్లు విక్రయిస్తున్నారు.18 సంవత్సరాలలోపు వారికి అనుమతి లేదు. అండర్ 18 వారికి మద్యం అమ్మడానికి లేదు. ఈ రోజు స్కూల్ పిల్లలకు కూడా దొరుకుతున్నాయి. బుక్ మైషో ఫ్లాట్‌ఫాం ఏదైతో ఉందో దానిమీద విచారణ చేయండి.. అనుమతి లేకుండా పార్టీలు చేసుకోవడానికి వీలు లేదు.
పోలీసుల అనుమతి లేకుండా టికెట్లు అమ్మడానికి లేదు. ఈవెంట్స్‌ను జల్లెడ పట్టండి..వాటిని ఆదాయవనరుగా చూడకండి. అలాంటివి యువతను పెడద్రోవకు మళ్లిస్తున్నాయి. హుక్కా సెంటర్స్, పబ్స్‌లో జరిగే వ్యవహారాలుగానీ, ఇట్లాంటి సన్‌బర్న్ పార్టీలను గోవా, కర్ణాటక, మహారాష్ట్రలు నిషేధించాయి.
ప్రస్తుతం చాలా కఠినంగా వ్యవహరించండి. గంజాయి ఏఓబీ సప్లయ్ అవుతుందా? మన దగ్గర పండించేది చాలా తక్కువగా ఉండొచ్చు..కానీ వినియోగించేది ఎక్కువైంది. ఏఓబీ నుంచి మన ప్రాంతానికి ఏ రకంగా వస్తుంది? క్షుణ్ణంగా చూడండి ’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
సైబర్ నేరాలే ఇప్పుడు బిగ్‌టాస్క్
గతంలో ఉన్న సంప్రదాయ నేరాలన్నీ ఇప్పుడు సైబర్‌నేరాలుగా మారిపోయాయని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇప్పుడు సైబర్ క్రైమ్ బిగ్గెస్ట్ టాస్క్ అని అన్నారు. ‘సైబర్ క్రైమ్ నేరగాళ్లు పెరిగిపోయారు. దీనిపై కూడా పోలీసులు ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. మతాల మధ్య, కులాల మధ్య వైషమ్యాలు పెంచేలా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
నకిలీ విత్తనాలు టెర్రరిజం కంటే ప్రమాదకరం
నకిలీ విత్తనాల అంశం టెర్రరిజం కంటే ప్రమాదకరమైందని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డా రు. రైతులకు నష్ట పరిహారం ఇవ్వడానికి నకిలీ విత్తనాల కంపెనీల ఆస్తులను రెవెన్యూ రికవరీ యాక్టు కింద జప్తు చేయాలన్నారు. నకిలీ విత్తనాల మీద ఉక్కుపాదంతో అణచివేయాలి’ అ న్నారు. నకిలీ విత్తన కంపెనీల ఆస్తులు ఎందుకు సీజ్ చేయడం లేదు? చట్టంలో సీజ్ చేసే అవకాశం లేకుంటే చట్టాన్ని సవరించుకోవాలని అధికారులకు నేను ఆదేశిస్తున్నా. నకిలీ విత్తనాలను క్షమించే సమస్యనే లేదు’ అని స్పష్టం చేశారు.
పౌరులకే ఫ్రెండ్లీ పోలీస్.. క్రిమినల్స్‌కు కాదు
ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని తప్పుడు పద్ధతుల్లో వాడితే ప్రభుత్వం క్షమించదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘గంజాయి, హెరాయిన్, కొకైన్ వాడే వారితో ఫ్రెండ్లీగా ఉండమని కాదు..ఫ్రెండ్లీ పోలీసింగ్ అర్థం. నేరాలు, హత్యలు చేసిన వారు పోలీస్‌స్టేషన్‌కు వస్తే..వారిని ఫ్రెండ్స్‌లా ట్రీట్ చేయమని కాదు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే..సామాన్యమైన పౌరుడు స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వస్తే వారిని మర్యాదగా కూర్చోబెట్టి వారు ఏం చెబుతున్నారో అడిగి తెలుసుకోవాలి’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment