narcotics department
-
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్,సాక్షి: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. 8.5 కేజీల డ్రగ్స్‌ను పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పోలీసులతో పాటు నార్కోటిక్ బ్యూరో జాయింట్ ఆపరేషన్ చేపట్టి భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. ఒక డ్రగ్ పెడ్లర్‌తో పాటు ఇద్దరు సహాయకులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన డ్రగ్స్ రూ. 8.5 కోట్ల విలువ ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.హైదరాబాద్‌లొ భారీగా డ్రగ్స్ పట్టుకున్నామని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ వింగ్, బోయినపల్లి పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారని అన్నారు. ‘ఒక డ్రగ్ పెడ్లర్‌తో పాటు ఇద్దరు సహాయకులు అరెస్ట్ చేశాం. నిందితుల వద్ద నుండి 8.5 కేజీల అమ్ఫేటమైన్ డ్రగ్ సీజ్ చేశాం. దీనిద్వారా ఎండీఎంఏ డ్రగ్ తయారు చేస్తారు. మార్కెట్లో కేజీ కోటి నుంచి కొటీ 20 లక్షలు పలుకుతుంది. రూ. 8.5 కోట్లు విలువ చేసే డ్రగ్స్ పట్టుబడింది.డ్రగ్స్ పెడ్లర్ నాగరాజుతో పాటు, వినోద్ కుమార్, శ్రీశైలంలు అరెస్ట్ అయ్యారు. సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదలలో అంజిరెడ్డి అనే వ్యక్తి కంపెనీలో ఈ డ్రగ్స్ తయారు చేశారు. నిందితులపై నేషనల్ డొమెస్టిక్ ప్రిపేర్డ్నెస్ కన్సార్టియం(NDPC)యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి’ అని అన్నారు. -
ముంబైలో రూ.3 కోట్ల డ్రగ్స్ సీజ్
ముంబై: గత నెల రోజుల వ్యవధిలో రూ.3.25 కోట్ల విలువైన 16 కిలోల డ్రగ్స్‌ను స్వా«దీనం చేసుకుని, 12 మంది పెడ్లర్లను అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీస్ శాఖ యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్సీ) ఆదివారం తెలిపింది. సహర్ గ్రామం, నల్లసొపార, శాంటాక్రుజ్, కుర్లా, బైకుల్లా తదితర ప్రాంతాలకు చెందిన పెడ్లర్ల నుంచి హెరాయిన్, గంజాయి, ఎండీని స్వా«దీనం చేసుకున్నట్లు వివరించింది. 2023లో 106 కేసుల్లో 229 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసి, రూ.53.23 కోట్ల డ్రగ్స్‌ను పట్టుకున్నట్లు ఏఎన్సీ వివరించింది. -
నార్కోటిక్స్ వింగ్.. నామ్‌కే వాస్తే
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాటే వినిపించకూడదు. మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతాం. గంజాయి సహా అన్ని నిషేధిత ఉత్పత్తుల రవాణా, విక్రయం, వినియోగం ఉపేక్షించేదిలేదు’. గత, ప్రస్తుత ప్రభుత్వ పెద్దల మాటలివి. వాస్తవ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మంగా ఏర్పాటైన తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ నాబ్) పరిస్థితే దీనికి ఉదాహరణ. ఇది ఆవిర్భవించి తొమ్మిది నెలలు కావస్తున్నా.. ఇప్పటికీ తీవ్రమైన వనరుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది. సిబ్బంది కంటే అధికారులే అధికం.. పోలీసు శాఖలో ఏ విభాగాన్ని తీసుకున్నా ఉన్నతాధికారులు, అధికారుల సంఖ్య తక్కువగా, క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించే కింది స్థాయి సిబ్బంది సంఖ్య ఎక్కువగా ఉంటుంది. బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌నే ఉదాహరణగా తీసుకుంటే.. అక్కడ ఇద్దరు ఇన్స్పెక్టర్లు, 11 మంది ఎస్సైలు, 15 మంది హెడ్–కానిస్టేబుళ్లు, 67 మంది కానిస్టేబుళ్లు పని చేస్తున్నారు. టీఎస్ నాబ్ వ్యవహారం రొటీన్‌కు భిన్నంగా ఉంది. ఇక్కడ ఒక డైరెక్టర్, ఇద్దరు ఎస్పీలతో పాటు 15 మంది ఏసీపీ, 19 మంది ఇన్స్పెక్టర్లు ఉండటం వరకు బాగానే ఉంది. క్షేత్రస్థాయిలో కీలకమైన ఎస్సైలు 8, కానిస్టేబుళ్లు 23 మంది మాత్రమే ఉన్నారు. ప్రతిష్టాత్మకమైన ఈ విభాగంలో క్షేత్రస్థాయి సిబ్బంది కంటే అధికారుల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. కానరాని మౌలిక వసతులు.. టీఎస్ నాబ్‌ను ఏర్పాటు చేస్తూ గత ప్రభుత్వం పోయినేడాది ఏప్రిల్ 30న ఉత్తర్వులు జారీ చేయగా.. అదే ఏడాది మే 31న ఆవిష్కారమైంది. ప్రాథమికంగా ఈ విభాగానికి 300 పోస్టులు కేటాయించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలతో పాటు వరంగల్ల్లో నార్కోటిక్స్ ఠాణాలు, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, సంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోనూ రీజినల్ నార్కోటిక్స్ సెల్స్ ఏర్పాటు చేయాలి. పోలీసు స్టేషన్లకు డీఎస్పీ స్థాయి అధికారి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా (ఎస్హెచ్ఓ) ఉంటారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌లో ఇచ్చిన కార్యాలయం తప్ప... రాష్ట్రంలో మరెక్కడా చిన్న గది కూడా ఈ విభాగానికి కేటాయించలేదు. డైరెక్టర్ సహా ఇప్పటి వరకు ఈ వింగ్‌కు రిపోర్టు చేసిన వారి సంఖ్య కేవలం 68 మాత్రమే. ఉన్నతాధికారులు మినహా మరెవరూ సంచరించడానికి వాహనాలు సహా ఏ ఇతర సదుపాయం లేదు. ప్రోత్సాహకం మాటే మరిచారు.. ఏసీబీ, సీఐడీ, ఇంటెలిజెన్స్ విభాగాల మాదిరిగా టీఎస్ నాబ్కూ డైరెక్టు రిక్రూట్మెంట్ లేదు. ఇందులోని పోస్టుల్ని అపోర్షన్మెంట్గా పిలిచే డిప్యుటేషన్ విధానంలో భర్తీ చేస్తారు. ఆసక్తి ఉన్న వాళ్లు దరఖాస్తు చేసుకోవాలంటూ గతంలోనే పోలీసు విభాగం అంతర్గతంగా ప్రకటన ఇచి్చంది. దీంతో అనేక మంది ఆసక్తి చూపుతూ ముందుకు కూడా వచ్చారు. ఎస్సైలను రేంజ్ డీఐజీలు, ఇన్స్పెక్టర్లను జోన్ ఐజీలు, కానిస్టేబుళ్లను యూనిట్ ఆఫీసర్లు రిలీవ్ చేసి పంపాల్సి ఉంది. వీళ్లల్లో ఎవరూ స్పందించకపోవడంతో అనేక ఖాళీలతో టీఎస్ నాబ్ ఆపసోపాలు పడుతోంది. ఈ విభాగంలో పని చేసే వారికి ప్రత్యేక ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు గతంలో ఉన్నతాధికారులు చెప్పారు. సాధారణంగా రిస్‌్కతో కూడిన ఉద్యోగాలు చేసే వింగ్స్‌కు వేతనంపై 60 శాతం అదనంగా ఇస్తారు. ఇప్పటి వరకు చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో టీఎస్ నాబ్‌లో పని కూడా రిస్‌్కతో కూడిన వ్యవహారంగా తేలింది. అయినప్పటికీ ఈ ప్రోత్సాహకం విషయం ఇప్పుడు ఎవరూ పట్టించుకోవట్లేదు. వీటి ఊసెత్తేవారే లేరు.. టీఎస్ నాబ్ రాష్ట్ర స్థాయిలో, ఇతర విభాగాలు, రాష్ట్రాలతో సమన్వయంతో పని చేయాల్సి ఉంది. మాదకద్రవ్యాల ఉత్పత్తి, రవాణా, విక్రయం, వినియోగం సహా అన్ని అంశాల పైనా ఈ బ్యూరో కన్నేసి ఉంచి సూత్రధారులకు చెక్ చెప్పాలి. దీని డైరెక్టర్ ఆ«దీనంలో ఠాణాలు, రీజినల్ నార్కోటిక్ కంట్రోల్ సెల్స్‌తో పాటు 26 నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్స్ పని చేయాలి. ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ అండ్ లీగల్ వింగ్‌లో ఠాణాలు, డాక్యుమెంటేషన్ ట్రైనింగ్ అండ్ అవేర్సెస్ వింగ్‌లో డ్రగ్ డిస్పోజల్ అండ్ అవేర్నెస్ కమిటీలతో పాటు వివిధ రాష్ట్ర, కేంద్ర విభాగాలు, అడ్మిన్ అండ్ లాజిస్టిక్ వింగ్‌లో ట్రాన్స్‌పోర్టు, కంట్రోల్ రూమ్ తదితరాలు, టెక్నికల్ వింగ్‌లో డేటా ఎనాలసిస్, డార్క్ వెబ్, సోషల్ మీడియా మానిటరింగ్, ఫైనాన్షియల్ ఎనాలసిస్, డిజిటల్ ఫోరెన్సిక్, అఫెండర్స్ మానిటరింగ్ విభాగాలు, స్టేట్ టాస్‌్కఫోర్స్‌లో నార్కోటిక్స్ డిటెక్షన్ డాగ్స్ విభాగం ఏర్పాటు కావాల్సి ఉంది. ఇవి ఎప్పటికి సాకారమవుతా యన్నది ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. -
డ్రగ్ మహమ్మారిని కూకటివేళ్లతో పెకిలించాలి
సాక్షి, హైదరాబాద్: ‘జూనియర్ కాలేజీలు, స్కూళ్లలోనూ ఇప్పుడు మత్తు పదార్థాలు అందుబాటులోకి వచ్చాయి. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి..దీనిని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించదు. మీరు గతంలో తీవ్రవాదులు, ఐఎస్‌ఐలాంటి వారిని కూకటివేళ్లతో పెకిలించడానికి ఏ రకంగా అయితే కఠినమైన చర్యలు తీసుకున్నారో, వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నారో, ఈ డ్రగ్ మహమ్మారినికి కూడా నిర్మూలించేందుకు అంతే కృషి చేయాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోలీస్ అధికారులకు దిశానిర్దేశనం చేశారు. ఉక్కుపాదంతో గంజాయిని అణచివేయాలని, గంజాయి అనే పదం రాష్ట్రంలో వినిపించకూడదన్నారు. ఆదివారం సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో పలు అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులకు స్పష్టత ఇచ్చారు. నార్కోటిక్ బ్యూరో కీలకపాత్ర పోషించాలి నార్కోటిక్ బ్యూరో అనేది అత్యంత కీలకమైన పాత్ర పోషించాలని, మత్తుపదార్థాల వినియోగంలో పంజాబ్‌లా తెలంగాణ మారకుండా నిర్మూలించాల్సిన బాధ్యత పోలీసులదే సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ‘ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణలో గంజాయి, డ్రగ్స్ ఇక్కడి యువతను ఆక్రమించుకుంటున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరం.సైబరాబాద్ కమిషనర్‌ను ఆదేశిస్తున్నా.. సన్‌బర్న్ పార్టీకి సంబంధించి డిజిటల్ మార్గంలో కొన్ని టికెట్లు అమ్ముతున్నారు. బుక్ మైషో లాంటి కొన్నింటిని నేను స్వయంగా గమనించినా.. వారు ప్రభుత్వ అనుమతి పొందలేదు.. అనుమతి పొందకుండా 31 రాత్రి సన్‌బర్న్ పార్టీకి సంబంధించి టికెట్లు విక్రయిస్తున్నారు.18 సంవత్సరాలలోపు వారికి అనుమతి లేదు. అండర్ 18 వారికి మద్యం అమ్మడానికి లేదు. ఈ రోజు స్కూల్ పిల్లలకు కూడా దొరుకుతున్నాయి. బుక్ మైషో ఫ్లాట్‌ఫాం ఏదైతో ఉందో దానిమీద విచారణ చేయండి.. అనుమతి లేకుండా పార్టీలు చేసుకోవడానికి వీలు లేదు. పోలీసుల అనుమతి లేకుండా టికెట్లు అమ్మడానికి లేదు. ఈవెంట్స్‌ను జల్లెడ పట్టండి..వాటిని ఆదాయవనరుగా చూడకండి. అలాంటివి యువతను పెడద్రోవకు మళ్లిస్తున్నాయి. హుక్కా సెంటర్స్, పబ్స్‌లో జరిగే వ్యవహారాలుగానీ, ఇట్లాంటి సన్‌బర్న్ పార్టీలను గోవా, కర్ణాటక, మహారాష్ట్రలు నిషేధించాయి. ప్రస్తుతం చాలా కఠినంగా వ్యవహరించండి. గంజాయి ఏఓబీ సప్లయ్ అవుతుందా? మన దగ్గర పండించేది చాలా తక్కువగా ఉండొచ్చు..కానీ వినియోగించేది ఎక్కువైంది. ఏఓబీ నుంచి మన ప్రాంతానికి ఏ రకంగా వస్తుంది? క్షుణ్ణంగా చూడండి ’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సైబర్ నేరాలే ఇప్పుడు బిగ్‌టాస్క్ గతంలో ఉన్న సంప్రదాయ నేరాలన్నీ ఇప్పుడు సైబర్నేరాలుగా మారిపోయాయని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇప్పుడు సైబర్ క్రైమ్ బిగ్గెస్ట్ టాస్క్ అని అన్నారు. ‘సైబర్ క్రైమ్ నేరగాళ్లు పెరిగిపోయారు. దీనిపై కూడా పోలీసులు ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. మతాల మధ్య, కులాల మధ్య వైషమ్యాలు పెంచేలా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. నకిలీ విత్తనాలు టెర్రరిజం కంటే ప్రమాదకరం నకిలీ విత్తనాల అంశం టెర్రరిజం కంటే ప్రమాదకరమైందని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డా రు. రైతులకు నష్ట పరిహారం ఇవ్వడానికి నకిలీ విత్తనాల కంపెనీల ఆస్తులను రెవెన్యూ రికవరీ యాక్టు కింద జప్తు చేయాలన్నారు. నకిలీ విత్తనాల మీద ఉక్కుపాదంతో అణచివేయాలి’ అ న్నారు. నకిలీ విత్తన కంపెనీల ఆస్తులు ఎందుకు సీజ్ చేయడం లేదు? చట్టంలో సీజ్ చేసే అవకాశం లేకుంటే చట్టాన్ని సవరించుకోవాలని అధికారులకు నేను ఆదేశిస్తున్నా. నకిలీ విత్తనాలను క్షమించే సమస్యనే లేదు’ అని స్పష్టం చేశారు. పౌరులకే ఫ్రెండ్లీ పోలీస్.. క్రిమినల్స్‌కు కాదు ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని తప్పుడు పద్ధతుల్లో వాడితే ప్రభుత్వం క్షమించదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘గంజాయి, హెరాయిన్, కొకైన్ వాడే వారితో ఫ్రెండ్లీగా ఉండమని కాదు..ఫ్రెండ్లీ పోలీసింగ్ అర్థం. నేరాలు, హత్యలు చేసిన వారు పోలీస్‌స్టేషన్‌కు వస్తే..వారిని ఫ్రెండ్స్‌లా ట్రీట్ చేయమని కాదు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే..సామాన్యమైన పౌరుడు స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వస్తే వారిని మర్యాదగా కూర్చోబెట్టి వారు ఏం చెబుతున్నారో అడిగి తెలుసుకోవాలి’ అని అన్నారు. -
డ్రగ్ పెడ్లర్‌గా మారిన భగ్న ప్రేమికుడు!
సాక్షి, హైదరాబాద్: నగరంలో స్థిరపడిన నెల్లూరుకు చెందిన ఓ యువకుడు ప్రేమ విఫలమై డిప్రెషన్లో మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డాడు. స్నేహితుడి సలహా మేరకు డ్రగ్ పెడ్లర్‌గా మారి హైదరాబాద్‌తో పాటు నెల్లూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజనీర్లకు సరఫరా చేయడం మొదలెట్టాడు. ఈ వ్యవహారాన్ని గుట్టురట్టు చేసిన తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (టీఎస్–నాబ్) అతనితో సహా 14 మందిని అరెస్టు చేసింది. వీరి నుంచి 42 ఎక్స్టసీ పిల్స్ స్వాధీనం చేసుకుంది. చేస్తున్న ఉద్యోగాలు మానేసి.. నెల్లూరులోని ఫతేఖాన్‌పేటకు చెందిన జె.ఆషిక్ యాదవ్ గతంలో బెంగళూరులోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఇతడు బీటెక్ చదువుతున్న రోజుల్లో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఓ యువతి కూడా ఉన్నత చదువుల కోసం అక్కడికే రావడంతో ఇద్దరూ కొన్నాళ్లు సహజీవనం చేశారు. అయితే ఇద్దరి మధ్యా వివాదాలు ఏర్పడటంతో ఆమె ఆషిక్‌కు దూరమైంది. దీంతో తీవ్ర డిప్రెషన్‌కు గురైన ఆషిక్ మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డాడు. బెంగళూరు, గోవాలకు చెందిన డ్రగ్స్ సప్లయర్స్ నుంచి మాదకద్రవ్యాలు ఖరీదు చేసి వినియోగించే వాడు. గతేడాది డిసెంబర్లో హైదరాబాద్‌కు వచ్చిన ఆషిక్ నానక్‌రామ్‌గూడలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. ఓ మల్టీనేషనల్ కంపెనీలో నెలకు రూ.22 వేల జీతం వస్తున్నా సరిపోకపోవడంతో గత జూన్‌లో ఆ ఉద్యోగం మానేసి మరో ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. మనమే ఆ దందా చేద్దామంటూ.. ఈ క్రమంలో నెల్లూరుకే చెందిన ఇతని క్లాస్మేట్ రాజేష్ వ్యాపార నిమిత్తం ఆగస్టులో హైదరాబాద్ వచ్చాడు. డ్రగ్స్ వినియోగించే అలవాటు ఉన్న ఇతడు ఆషిక్ నుంచి వాటిని తీసుకునే వాడు. నగరంలో మాదకద్రవ్యాలకు ఉన్న డిమాండ్ గుర్తించిన రాజేష్ తామే ఆ దందా చేద్దామని, మార్కెట్లో ఎక్స్టసీ పిల్స్‌కు మంచి డిమాండ్ ఉందని, వాటినే తీసుకువచ్చి విక్రయిద్దామని చెప్పాడు. దీంతో గోవాకు చెందిన తన స్నేహితుడు బాబాతో పాటు బెంగళూరుకు చెందిన సాయి చరంద్ నుంచి డ్రగ్స్ ఖరీదు చేస్తున్న ఆషిక్ వాటిని నగరానికి తీసుకువచ్చి రాజేష్‌కు అప్పగిస్తున్నాడు. ఇతడు నగరంతో పాటు నెల్లూరులోని తన స్నేహితులు, రెగ్యులర్ కస్టమర్లకు వీటిని విక్రయిస్తున్నాడు. అక్కడ ఒక్కో ఎక్స్టసీ పిల్‌ను రూ.1000కి ఖరీదు చేసి... ఇక్కడ రూ.3 వేలకు అమ్ముతు న్నారు. గత మంగళవారం గోవా వెళ్లిన ఆషిక్ అక్కడ బాబాకు రూ.60 వేలు చెల్లించి 60 ఎక్స్టసీ పిల్స్ ఖరీదు చేసుకువచ్చాడు. వీటిని తన వద్ద ఉంచుకున్న రాజేష్... శనివారం రెండు పిల్స్‌ను ఆషిక్‌కు ఇచ్చి తమ కస్టమర్లకు అందించమని చెప్పాడు. ఇతడి కదలికలపై టీఎస్–నాబ్‌కు సమాచారం అందింది. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం శనివారం ఉదయం అమీర్‌పేటలోని మైత్రీవనం వద్ద ఆషిక్‌ను పట్టుకుని రెండు పిల్స్ స్వాధీనం చేసుకుంది. అతడిచ్చిన సమాచారంతో సోమ వారం ఎస్ఆర్ నగర్‌లోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్ పై దాడి చేసింది. అక్కడ రాజేష్‌తో పాటు 12 మంది చిక్కారు. వీరికి డ్రగ్ పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. వీరి నుంచి మరో 40 పిల్స్ స్వాధీనం చేసుకుని సీజ్ చేసింది. ఇద్దరినీ న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. డ్రగ్స్‌తో అమీర్‌పేట, ఎస్ఆర్ నగర్లో రేవ్ పార్టీలు డ్రగ్స్ ఖరీదు చేసిన కొందరు గతంలో అమీర్‌పేట, ఎస్సార్నగర్ల్లోని సర్వీస్ అపార్ట్‌మెంట్స్‌లో రేవ్ పార్టీలు చేసుకున్నట్లు ఆధారాలు లభించాయి. ఓ బర్త్‌డే పార్టీతో పాటు న్యూ ఇయర్ వేడుకల కోసం కొందరు వీరి నుంచి ఈ పిల్స్ ఖరీదు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. టీఎస్–నాబ్ అధికారులు తదుపరి చర్యల నిమిత్తం కేసును ఎస్సార్‌నగర్ పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. నిందితుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజనీరింగ్ విద్యార్థులు ఆషిక్, రాజేష్ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను విశ్లేషించిన పోలీసులు రెగ్యులర్‌గా డ్రగ్స్ ఖరీదు చేసే 33 మందిని గుర్తించారు. వీరి వద్ద ఈ డ్రగ్ కొనుగోలు చేస్తున్న వారిలో నెల్లూరుకు చెందిన సంపత్, నిహార్, మోహిత్, అశోక్, అమిత్, జై, వసీమ్, ఫయాజ్, శ్రీరామ్, గౌతమ్, గిరిధర్, హనీష్, వేలాసరి, డాక్టర్ పునీత్, డాక్టర్ అరుణ్ మత్, డాక్టర్ ప్రశాంత్, నగరానికి చెందిన శ్రీరామ్, హృతిక్ ఉన్నారు. వీరిలో కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కాగా మిగిలిన వాళ్లు ఇంజినీరింగ్ విద్యార్థులతో పాటు డాక్టర్లు. -
హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పలువురు సీనియర్ ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఒకేసారి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లకు సీపీలను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాస రెడ్డి నియమితులయ్యారు. సైబరాబాద్ జాయింట్ సీపీ అడ్మిన్‌గా పనిచేస్తున్న 2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అవినాశ్ మహంతికి సైబరాబాద్ సీపీగా బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్‌గా పనిచేసిన 2001 బ్యాచ్ ఐపీఎస్ అధికారి జి సు«దీర్‌బాబు రాచకొండ సీపీగా నియమితులయ్యారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సందీప్ శాండిల్యను తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్‌గా బదిలీ చేశారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మాదక ద్రవ్యాల నియంత్రణ అంశంపై నిర్వహించిన సమీక్షలో తీసుకున్న నిర్ణయం మేరకు పూర్తి స్థాయి డైరెక్టర్‌ను నియమించారు. ఇప్పటి వరకు సైబరాబాద్, రాచకొండ సీపీలుగా పనిచేసిన స్టీఫెన్ రవీంద్ర, దేవేంద్రసింగ్ చౌహాన్లను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని సీఎస్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం మల్టీజోన్–2 ఐజీ షానవాజ్ ఖాసీం ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం మరో ఉత్తర్వును జారీ చేశారు. ఒకేసారి భారీ మార్పులపై సీఎం కసరత్తు! కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మంగళవారం జరిగిన ఐపీఎస్‌ల బదిలీలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భారీ కసరత్తే చేసినట్టు తెలుస్తోంది. గతానికి భిన్నంగా అత్యంత కీలకమైన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లను ఒకేసారి బదిలీ చేయడం అందులో భాగమని చర్చ జరుగుతోంది. మొత్తంగా సీఎం రేవంత్‌రెడ్డి తన మార్క్ టీంను సెట్ చేస్తున్నారు. త్వరలోనే పలు జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు సహా భారీ సంఖ్యలో ఐపీఎస్‌ల బదిలీలు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కొత్తకోటకు చాలాకాలం తర్వాత కీలక పోస్టింగ్ హైదరాబాద్ సీపీగా నియమితులైన సీనియర్ ఐపీఎస్ అధికారి, అడిషనల్ డీజీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డికి చాలా ఏళ్ల తర్వాత అత్యంత కీలక పోస్టింగ్ దక్కింది. గతంలో ఆపరేషన్స్ అడిషనల్ డీజీగా పనిచేసిన ఆయన తర్వాత అడిషనల్ డీజీ ఆర్గనైజేషన్స్, లీగల్‌గా బదిలీ అయ్యారు. గత కొన్ని నెలలుగా అక్కడ పనిచేస్తున్న ఆయనను ప్రభుత్వం అత్యంత కీలక పోస్టింగ్‌లోకి బదిలీ చేసింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్న స్టీఫెన్ రవీంద్రను తప్పించిన సర్కార్ ఆయన స్థానంలో అవినాశ్ మహంతికి బాధ్యతలు అప్పగించింది. సైబరాబాద్ సీపీ పోస్టు ఐజీ ర్యాంకు అయినా..డీఐజీ ర్యాంకులో ఉన్న అవినాశ్ మహంతికి అనూహ్యంగా ఆ బాధ్యతలు అప్పగించడం గమనార్హం. ఇక రాచకొండ పోలీస్ కమిషనర్‌గా డిసెంబర్ 2022లో బాధ్యతలు తీసుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహాన్ కేవలం పదకొండు నెలలకే బదిలీ అయ్యారు. ఇదే కమిషనరేట్‌లో గతంలో సుదీర్ఘ కా లంపాటు పనిచేసిన సు«దీర్‌బాబుకు కొత్త ప్రభు త్వం పోలీస్ కమిషనర్‌గా అవకాశం కలి్పంచింది. శాండిల్యకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ బాధ్యతలు ఎన్నికల కమిషన్ అనూహ్య నిర్ణయంతో హైదరాబాద్ సీపీగా అసెంబ్లీ ఎన్నికల ముందు బాధ్యతలు చేపట్టిన సందీప్‌శాండిల్యను సైతం ప్రభుత్వం తప్పించింది. సమర్థవంతమైన అధికారిగా పేరున్న సందీప్శాండిల్యకు తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ బాధ్యతలు అప్పగించింది. మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి దృఢ నిశ్చయంతో ఉండడంతో నిక్కచ్చిగా వ్యవహరించే సందీప్శాండిల్యకు నార్కోటిక్స్ బ్యూరో బాధ్యతలు అప్పగించినట్టు చర్చ జరుగుతోంది. -
మాదాపూర్ డ్రగ్స్ కేసులో కొత్త కోణాలు.. వెంకట్ లీలలు వెలుగులోకి..
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అరెస్టయిన సినీ ఫైనాన్షియర్ వెంకట్ అక్రమాలపై నార్కోటిక్ ఆరా తీస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కలిపి 25కుపైగా కేసులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఐఆర్ఎస్ అధికారినంటూ వెంకట్ మోసాలు పాల్పడినట్లు తేలింది. నిర్మాతలు సి.కల్యాణ్, రమేష్‌ల నుంచి ఐఆర్ఎస్ అధికారినంటూ రూ.30 లక్షలకుపైగా వెంకట్ కొట్టేశాడు. ఒక ఐఆర్ఎస్ అధికారిని సైతం పెళ్లి పేరుతో మోసం చేసినట్లు సమాచారం. సినిమాలో అవకాశాల పేరిట అమ్మాయిలకు వల వేసి.. ఇతర రాష్ట్రాల నుంచి రప్పించి వ్యభిచారం చేయించడంతో పాటు, పెళ్లి పేరుతో ఎన్ఆర్ఐ నంటూ విదేశీ యువతలను సైతం వెంకట్ మోసం చేసినట్లు బట్టబయలైంది. ఏపీకి చెందిన ఓ ఎంపీ పేరు చెప్పి వసూలు చేస్తున్న వెంకట్.. సినీ, రాజకీయ నాయకులను పార్టీలకు పిలిచి బురిడీ కొట్టించాడు.వెంకట్ కాంటాక్ట్‌లో ఉన్న వాళ్లను ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. చదవండి: మాదాపూర్ డ్రగ్స్ కేసు: టాలీవుడ్లో ప్రకంపనలు.. ఆ 18 మంది ఎవరు? -
మాదాపూర్ డ్రగ్స్ కేసు: టాలీవుడ్లో ప్రకంపనలు.. ఆ 18 మంది ఎవరు?
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ బ్యూరో విచారణ కొనసాగుతోంది. సినీ ఫైనాన్షియర్ వెంకట్ వాట్సాప్‌లో కీలక విషయాలు బట్టబయలవుతున్నాయి. బాలాజీ, వెంకట్ కలిసి డ్రగ్స్ పార్టీలు చేసినట్లు గుర్తించారు. 18 మందికి డ్రగ్స్‌ను అమ్మకాలు చేసినట్లు బాలాజీ, వెంకట్లు అంగీకరించారు. ఆ 18 మంది ఎవరు, అందులో సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. గతంలో సినీ నిర్మాత కేసీ చౌదరి అరెస్టు తర్వాత మరోసారి టాలీవుడ్లో ప్రకంపనలు రేపుతోంది. కేపీ చౌదరి లిస్టులో సినీ ప్రముఖులు, రాజకీయ, ఇతర రంగాల వ్యక్తులకు డ్రగ్స్ సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కేపీ చౌదరి వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన కొందరు పేర్లు జాబితా అప్పట్లో సిద్దం అవ్వగా, దర్యాప్తుకు సమయంలో పైస్థాయి నుంచి పోలీసులపై ఒత్తిడి వచ్చింది. ఇప్పుడు.. బాలాజీ, వెంకట్ వ్యవహారంలో డ్రగ్స్ వినియోగించిన 18 మంది జాబితాను పోలీసులు సిద్ధం చేశారా ? ప్రశ్నలు తలెత్తుతున్నాయి.మరోసారి నిందితుల్ని కస్టడీకి తీసుకొని విచారణ చేయాలని నార్కోటిక్ బ్యూరో భావిస్తోంది. కేపీ చౌదరికి సినీ ఫైనాన్షియర్ వెంకట్, బాలాజీకి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. గుడిమల్కాపూర్‌లో దొరికిన డ్రగ్స్ తీగ లాగితే.. టీఎస్–నాబ్ అధికారులకు గుడిమల్కాపూర్‌లో దొరికిన డ్రగ్స్ తీగ లాగితే... మాదాపూర్ విఠల్‌నగర్‌లో ఉన్న ఓ అపార్ట్మెంట్లో జరుగుతున్న రేవ్ పార్టీ డొంక కదిలింది. ఈ వ్యవహారంలో ఓ ఫిల్మ్ ఫైనాన్షియర్ సహా ముగ్గురిని పట్టుకున్నారు. కేసుకు సంబంధించి పరారీలో ఉన్న 18 మంది కస్టమర్లు, నలుగురు డ్రగ్ పెడ్లర్స్ కోసం గాలిస్తున్నట్టు టీఎస్–నాబ్(తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో) ఎస్పీ (వెస్ట్) డి.సునీతరెడ్డి గురువారం వెల్లడించారు. నేవీ నుంచి బాలాజీ బయటకొచ్చాక... నెల్లూరుకు చెందిన బి.బాలాజీ ఇండియన్ నేవీలో పనిచేస్తుండగా, కంటికి తీవ్రమైన గాయమైంది. మెడికల్లీ అన్‌ఫిట్ కావడంతో నేవీ నుంచి బయటకు వచ్చి వ్యాపారిగా మారాడు. తరచూ హైదరాబాద్‌కు వచ్చి వెళ్లే బాలాజీ తన స్నేహితులతో కలిసి మాదాపూర్ అపార్ట్మెంట్లోని సర్వీస్ ఫ్లాట్‌లో జరిగే రేవ్ పార్టీలకు హాజరయ్యేవాడు. ఇలా హైదరాబాద్‌తోపాటు బెంగుళూరులో ఉన్న డ్రగ్ పెడ్లర్స్‌తో సంబంధాలు ఏర్పడ్డాయి. ఆపై రేవ్ పార్టీలు ఏర్పాటు చేయడం బాలాజీకి వ్యాపకంగా మారింది. స్నేహితులతో పాటు పరిచయస్తుల కోసం నగరంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోని ఫామ్‌హౌస్‌లు, గెస్ట్ హౌస్‌ల్లో వీటిని నిర్వహించేవాడు. ఈ క్రమంలోనే బెంగళూరులో ఉన్న నైజీరియన్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని, వారి నుంచి మాదకద్రవ్యాలు ఖరీదు చేసేవాడు. ఆపై పారీ్టలు నిర్వహిస్తూ, విక్రయాలు ప్రారంభించాడు. బాలాజీ ఖాతాదారుల్లో సినీరంగానికి చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు. ఫిల్మ్ ఫైనాన్షియర్ కూడా...: గుంటూరులోని నెహ్రూనగర్‌కు చెందిన కె.వెంకటరమణారెడ్డి గతంలో జూబ్లీహిల్స్ పరిధిలో ఓ గెస్ట్‌హౌస్ లీజుకు తీసుకున్నాడు. ఇందులో వ్యభిచారం జరుగుతోందనే సమాచారంతో అప్పట్లో పోలీసులు దాడి చేయగా, నిర్వాహకులు పరారయ్యారు. ఈ కేసులో చిక్కిన వెంకటరమణారెడ్డి ఆపై అమెరికా వెళ్లాడు. అక్కడ నుంచి తిరిగిన వచి్చన తర్వాత తన సన్నిహితులకు సంబంధించిన ప్రొడక్షన్ సంస్థ నిర్వహిస్తూ ఫిల్మ్ ఫైనాన్షియర్‌గా మారాడు. డమరుకం, కిక్, బిజినెస్‌మ్యాన్, లవ్లీ, ఆటోనగర్ సూర్య వంటి చిత్రాలకు ఫైనాన్స్ చేశాడు. ఈ క్రమంలోనే రేవ్ పార్టీలకు వెళ్లడం అలవాటైంది. రేవ్ పారీ్టలు నిర్వహించే వారికి ఫైనాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఇలా బాలాజీతో కూడా పరిచయం ఏర్పడింది. బెంగళూరుకు చెందిన ముగ్గురు నైజీరియన్లతో పాటు విశాఖపట్నానికి చెందిన మరో వ్యక్తి నుంచి డ్రగ్స్ ఖరీదు చేసిన బాలాజీ వీటిలో కొన్నింటిని వెంకటరమణారెడ్డికి అందించాడు. ఈ మాదకద్రవ్యాలతో బుధవారం రాత్రి మాదాపూర్‌లోని అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు. గుడిమల్కాపూర్‌లో చిక్కిన బాలాజీ: రేవ్ పార్టీకి హాజరుకావడానికి మరికొన్ని మాదకద్రవ్యాలను తీసుకొని వస్తున్న బాలాజీ కదలికలపై టీఎస్–నాబ్‌కు సమాచారం అందింది. ఏసీపీ కె.నర్సింగ్‌రావు, ఇన్స్పెక్టర్ పి.రాజేష్‌లతో కూడిన బృందం వలపన్ని పట్టుకుంది. బాలాజీ వద్ద నుంచి కొన్ని డ్రగ్స్ స్వాధీనం చేసుకుని ప్రశ్నించగా, సర్వీస్ ఫ్లాట్ విషయం చెప్పా డు. దీంతో గురువారం తెల్లవారుజామున పోలీసులు ఆ ఫ్లాట్ పై దాడి చేశారు. అక్కడ వెంకటరమణారెడ్డితో పాటు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ వద్ద సీనియర్ స్టెనోగా పనిచేస్తున్న డి.మురళి పట్టుబడ్డాడు. మద్యంమత్తులో మ్యూజిక్ పెట్టుకుని చిందులు వేస్తున్న వీరు డైనింగ్ టేబుల్‌పై ప్లేట్లో ఉంచిన కొకైన్‌ను కరెన్సీ నోటు సాయంతో ముక్కులోకి పీలుస్తున్నారు. వీరి వద్ద టీఎస్–నాబ్ బృందం 2.8 గ్రాముల కొకైన్, ఆరు ఎల్ఎస్డీ బోల్ట్స్, 25ఎక్స్టసీ పిల్స్, రెండు ప్యాకెట్ల గాంజా, రూ.72,500 నగదు, రెండు కార్లు, ఐదుసెల్ఫోన్లు స్వాధీనం చే సుకున్నారు. వీటి విలువ రూ.32.89 లక్షలుగా నిర్థారించారు. స్నాప్‌చాట్‌లో కోడ్ నేమ్స్ డ్రగ్ పెడ్లర్‌గా మారిన బాలాజీ కస్టమర్లలో సినీరంగానికి చెందిన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లతో పాటు కొందరు నటీనటులు ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వీళ్లందరితో బాలాజీ సోషల్‌మీడియా యాప్ స్నాప్‌చాట్ ద్వారా సంప్రదింపులు జరిపేవాడు. సందేశాలు, కాల్స్ అన్నీ దీని ద్వారానే చేసేవాడు. ఇందులో వారివారి కాంటాక్ట్స్ ర్యాంబో, కిమ్స్, కింగ్, క్యాచీ, సూపర్ వంటి కోడ్ నేమ్స్‌తో ఉన్నాయి. ఆ కాంటాక్ట్స్‌లో ఫోన్‌నంబర్లు సహా ఇతర వివరాలు కనిపించకపోవడంతో వారిని గుర్తించడానికి లోతుగా విశ్లేషిస్తున్నారు. ప్రాథమిక వివరాలను బట్టి 18 మందిని కస్టమర్లుగా గుర్తించి వారి కోసం గాలిస్తున్నారు. పరారీలో ఉన్న ముగ్గురు నైజీరియన్లతో సహా నలుగురు పెడ్లర్స్ కోసం ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. వెంకట రమణారెడ్డి ఇద్దరు ఢిల్లీ యువతులను సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ తీసుకొచ్చాడు. వీళ్లిద్దరూ సైతం ఆ అపార్ట్మెంట్లోని సర్వీస్ ఫ్లాట్‌లో పోలీసులకు చిక్కారు. చదవండి: గందరగోళంగా కోరుట్ల దీప్తి కేసు.. -
ఢిల్లీలో భారీ సైబర్ క్రైం
న్యూఢిల్లీ: మహారాష్ట్ర నార్కోటిక్స్ డివిజన్ అధికారులమంటూ ఢిల్లీకి చెందిన ఓ వైద్యురాలి(34) నుంచి సుమారు రూ.4.50 కోట్లు కాజేశారు సైబర్ నేరగాళ్లు. ఢిల్లీలో ఇంత భారీ స్థాయిలో జరిగిన ఈ తరహా సైబర్ నేరం ఇదేనంటున్నారు పోలీసులు. ఫెడ్ఎక్స్ కొరియర్ సర్వీస్ ద్వారా ఆమె పేరుతో ముంబై నుంచి తైవాన్ వెళ్లాల్సిన పార్సిల్లో ఇతర వస్తువులతోపాటు డ్రగ్స్ ఉన్నాయంటూ నేరగాళ్లు మే 5న సదరు బాధితురాలికి ఫోన్ చేశారు. అది మొదలుకొని అంధేరి పోలీస్ స్టేషన్, ముంబై డీసీపీ, ఆర్బీఐ, కస్టమ్స్, నార్కోటిక్స్ అధికారుల పేరుతో పలువురు స్కైప్ ద్వారా మాట్లాడుతూ ఆమెకు మాయమాటలు చెప్పారు. ఈ విషయాలను భర్త సహా ఎవరికీ చెప్పొద్దంటూ నమ్మించారు. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్‌గా ఉన్న రూ.4.47 కోట్లను డ్రా చేయించి, ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ చేయించుకున్నారు. స్కైప్ ద్వారా జరిగిన సంభాషణలను డిలీట్ చేయించారు. డబ్బును తిరిగి ఇస్తామన్న మోసగాళ్లు ఎంతకీ ఇవ్వకపోవడంతో బాధితురాలు మోసం గ్రహించి, పోలీసులను ఆశ్రయించారు. -
మాయదారి మందులు.. ఔషధం నుంచి డ్రగ్‌గా అవతారం!
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు కేవలం మాదకద్రవ్యాల పైనే దృష్టి పెట్టిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ), టాస్‌్కఫోర్స్ అధికారులు తమ పంథా మార్చారు. పక్కదారి పడుతున్న పలు ఔషధాలపైనా కన్నేయాలని నిర్ణయించారు. డ్రగ్ కంట్రోల్ అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు నగర వ్యాప్తంగా నిఘా ముమ్మరం చేశారు. ఫలితంగానే కోడిన్ ఫాస్పేట్ సిరప్, ఆల్ఫాజోలం, స్టామ్బేర్, ఏర్క్లెన్, డెబొలాన్ టాబ్లెట్లు... డ్యురాడెక్స్, సీ–జెక్ట్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ముఠాలు చిక్కాయి. ఈ నిఘా, దాడులు కొనసాగించాలని నిర్ణయించిన అధికారులు ఇలాంటి ఔషధాల వినియోగాన్ని అధ్యయనం చేస్తున్నారు. కీటమైన్... ఔషధం నుంచి డ్రగ్‌గా.. శస్త్రచికిత్స చేసే సందర్భాల్లో రోగులకు మత్తు కలిగించడం కోసం ఇచ్చే కీటమైన్ హైడ్రోక్లోరైడ్ మార్కెట్లో విచ్చలవిడిగా లభిస్తుండటంతో అనేక మంది మత్తుకు బానిసైన వారు ఈ ఇంజెక్షన్‌ను వినియోగించడం మొదలెట్టారు. దీంతో స్పందించిన ప్రభుత్వం 1969లో దీన్ని ‘యంత్రణ జాబితాలోని మందు’గా మార్చింది. కీటమైన్ నుంచి పొడిని తయారు చేసి నిషా కోసం వాడుతుండటంతో 2011లో కేంద్రం ఈ పొడిని నిషేధిత మాదకద్రవ్యాల జాబితాలో చేర్చింది. ఇప్పుడు ఈ పొడిని ఇంట్లోనే తయారు చేసి విక్రయిస్తున్న, వినియోగిస్తున్న వారు పుట్టుకువచ్చారని అధికారులు గుర్తించారు. గంజాయికి ప్రత్యామ్నాయంగా నెట్రావిట్.. కేవలం ఇదొక్కటే కాదు మాదకద్రవ్యాలు కాని ఇలాంటి మత్తు ‘మందులు’ అనేకం నగరంలో చెలామణి అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి వారికి బ్లాక్మార్కెట్లో ఆ మత్తు ‘మందుల్ని’ సరఫరా చేయడానికి అనేక వ్యవస్థీకృత ముఠాలు సైతం పుట్టుకువచ్చాయి. ఇతర రాష్ట్రాల్లో అక్రమంగా తయారైనవి, మందుల దుకాణాలు, డీలర్ల నుంచి బయటకు వచ్చినవి బానిసలకు చేరుతున్నాయని హెచ్–న్యూ గుర్తించింది. గంజాయికి బానిసైన యువత ప్రస్తుతం నెట్రావిట్ టాబ్లెట్స్ వినియోగిస్తున్నారు. వీరికి బ్లాక్‌లో విక్రయించడానికి ఈ మాత్రలను మహారాష్ట్ర నుంచి అక్రమ రవాణా చేసి తీసుకువస్తున్నారు. దగ్గు మందులే ఎక్కువ దుర్వినియోగం.. మత్తు కోసం వినియోగిస్తున్న ఔషధాల్లో దగ్గు మందులే ప్రధానమైనవి. కొన్ని రకాలైన ఔషధాలను సేకరించడం కష్టసాధ్యం. అలాగే వైట్నర్ను ఖరీదు చేయడం తేలికే అయినప్పటికీ వినియోగించేప్పుడు ఇతరుల దృష్టిలో పడే అవకాశాలు ఉంటాయి. ఈ కారణాల నేపథ్యంలో దగ్గు మందు ఎక్కువగా వినియోగిస్తున్నారు. అత్యధిక శాతం దగ్గు మందుల్ని డెక్స్ట్రోమెథారి్ఫన్, కోడైన్‌లతో తయారు చేస్తారు. కోడైన్‌తో కూడిన ఈ రసాయనం నియంత్రిత జాబితాలో ఉన్న మాదకద్రవ్యం. మత్తును కలిగించే దీన్ని కేవలం ఔషధాత తయారీకి మాత్రమే వినియోగిస్తుంటారు. ప్రధానంగా డెక్స్ట్రోమెథారి్ఫన్ కారణంగానే అనేక మంది దగ్గు మందులకు బానిసలు అవుతున్నారని పోలీసులు గుర్తించారు. స్టెరాయిడ్స్ గానూ కొన్ని.. ఇలా ఔషధాలను కేవలం మత్తు కోసమే కాదు... కండల కోసమూ వినియోగించడం ఆందోళన కలిగించే అంశం. అత్యవసర సమయాల్లో వినియోగించే మెఫన్‌టెరై్మన్ సల్ఫేట్ ఇంజెక్షన్‌ను నగర యువత స్టెరాయిడ్‌గా వినియోగిస్తోంది. జిమ్‌ల్లో ఎక్కువ సమయం గడిపి, కండలు పెంచడానికి ఈ సూది మందు తీసుకుంటోంది. ఈ ఇంజెక్షన్‌ను అక్రమంగా యువతకు విక్రయిస్తున్న ముఠాలను గతంలో టాస్‌్కఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మెఫన్‌టెర్మైన్ సల్ఫేట్, డ్యురాడెక్స్, సీ–జెక్ట్ ఇంజెక్షన్లు, స్టామ్బేర్, ఏర్క్లెన్, డెలాన్ టాబ్లెట్లు ఉ్రత్పేరకాలుగా పని చేస్తాయని చెప్తున్నారు. ఈ టాబ్లెట్లు, ఇంజెక్షన్లను అథ్లెట్స్ స్టెరాయిడ్గానూ వాడుతున్నారు. మెడికల్ షాపులపై డేగకన్ను... ఇలాంటి ఔషధాలను నిబంధనల ప్రకారం వైద్యుడి చీటీ లేనిదే అమ్మడానికి వీలులేదు. ఇలా చేస్తున్న మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ అ«ధికారులతో పాటు హెచ్–న్యూ నిఘా ఉంచింది. ఒక్క టాబ్లెట్/ఇంజెక్షన్/టానిక్ దుర్వినియోగమైనా చర్యలు తప్ప వని స్పష్టం చేస్తోంది. యజమానుల అరెస్టు, దుకాణాల సీజ్ వంటి తీవ్రమైన చర్యలు తక్షణం, లైసెన్సు రద్దుకు సిఫార్సు ఉంటుందని హెచ్చరిస్తున్నారు. -
మా వాళ్లనే అరెస్ట్ చేస్తారా? ఢిల్లీ పోలీసులపై 100 మంది ఆఫ్రికన్ల దాడి!
న్యూఢిల్లీ: వీసా గడువు ముగిసినా దేశ రాజధానిలో ఉంటున్న ముగ్గురు నైజీరియన్లు అదుపులోకి తీసుకుంది యాంటీ డ్రగ్స్ ఫోర్స్. దీంతో దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమవారిని అరెస్ట్ చేస్తున్నారని తెలిసి సుమారు 100 మంది ఆఫ్రికన్లు పోలీసులను చుట్టు ముట్టారు. నైజీరియన్లను వారి నుంచి విడిపించేందుకు పోలీసులకు చుక్కులు చూపించారు. దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని స్వదేశం పంపించేందుకు నెబ్‌సరాయ్‌లోని రాజుపార్క్‌కు శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు నార్కొటిక్స్ సెల్ బృందం వెళ్లింది. వీసా గడువు ముగిసిన ముగ్గురు నైజీరియన్లను తమ అదుపులోకి తీసుకున్నారు. అప్పుడే పోలీసులను 100 మంది ఆఫ్రికన్లు చుట్టుముట్టారు. వారిని వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ గందరగోళ పరిస్థితుల్లోనే ముగ్గురిలో ఇద్దరు పోలీసుల చెర నుంచి తప్పించుకున్నారు. 22 ఏళ్ల పిలిప్ అనే వ్యక్తి దొరికిపోయాడు. పోలీసులపై మూకదాడి సమాచారం అందుకున్న నెబ్సరాయ్ పోలీస్ స్టేషన్ బృందం, నార్కొటిక్స్ స్క్వాడ్ సాయంత్రం 6.30 గంటలకు రాజ్‌పార్క్‌కు చేరుకుంది. ఓ మహిళతో పాటు మొత్తం నలుగురు నైజీరియన్లను అదుపులోకి తీసుకుంది. మళ్లీ సుమారు 150-200 మంది ఆఫ్రికన్ దేశాల ప్రజలు పోలీసులను చుట్టుముట్టారు. పోలీసుల చెరలో ఉన్న వారు తప్పించుకునేందుకు సాయం చేశారు. వారిని చెదరగొట్టిన పోలీసులు నిందితులను నెబ్సరాయ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి వారిని స్వదేశాలకు పంపించనున్నారు. Delhi Cops Arrest 3 On Drug Charge, Foreigners' Mob Brings Them Back https://t.co/Ggnt34m0rC pic.twitter.com/tFJLQBcF1L — NDTV (@ndtv) January 8, 2023 ఇదీ చదవండి: రాజౌరీ: హిందువులే లక్ష్యంగా దాడులు.. కేంద్రం కీలక నిర్ణయం.. గ్రామ రక్షణ కమిటీల పునరుద్ధరణ -
ప్రవీణ్... ఎ డ్రగ్ డిస్ట్రిబ్యూటర్!!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కెమికల్ షాపుల నుంచి అక్రమంగా పెట్రోలియం ఈథర్ ఖరీదు చేయడం... దీన్ని విశాఖ ఏజెన్సీకి తరలించి హష్ ఆయిల్ తయారీదారులకు విక్రయించడం... వాళ్ల నుంచి హష్ ఆయిల్ కొనుగోలు చేసి హైదరాబాద్‌తో పాటు బెంగళూరులో ఉన్న పెడ్లర్లకు సరఫరా చేయడం... కొన్నాళ్లుగా ఈ పంథాలో రెచ్చిపోతున్న ‘డ్రగ్ డిస్ట్రిబ్యూటర్’ ఎన్.ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారు లకు చిక్కాడు. ఇతడితో పాటు ముగ్గురు పెడ్లర్స్‌ను పట్టుకున్నట్లు డీసీపీ చక్రవర్తి గుమ్మి మంగళవారం వెల్లడించారు. మూడేళ్ల క్రితం పెడ్లర్‌గా మొదలెట్టి... కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన ప్రవీణ్ కుమార్ దాదాపు మూడేళ్ల క్రితం గంజాయి పెడ్లర్‌గా మారాడు. ఇతడికి విశాఖ ఏజెన్సీలోని గూడెం మాడుగుల మండలం అలగాం ప్రాంతానికి చెందిన గంజాయి పండించే గిరిజనులతో పరిచయమైంది. కొన్నాళ్లుగా వాళ్లు గంజాయి నుంచి తీసే హష్ ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో ప్రవీణ్ అదే దందా చేశాడు. హష్ ఆయిల్ తయారీకి పెట్రోలియం ఈథర్ అవసరం. ఇది ఏజెన్సీలో దొరకట్లేదనే విషయం తెలుసుకున్న ఇతగాడు తాను సరఫరా చేస్తానంటూ గిరిజను లతో ఒప్పందం చేసుకున్నాడు. దాన్ని వినియో గించి తనకు హష్ ఆయిల్ తయారు చేసి ఇవ్వాలంటూ షరతు పెట్టాడు. రెండు ఏజెన్సీల నుంచి అక్రమంగా... పెట్రోలియం ఈథర్‌ను పారిశ్రామిక అవసరాల కోసం మాత్రమే విక్రయించాలి. అదీ అధీకృత పత్రాలు సేకరించిన తర్వాతే అమ్మాలి. అయితే నగరంలోని కూకట్పల్లి ప్రశాంతినగర్‌కు చెందిన నర్మద ట్రేడర్స్, మహాలక్ష్మీ కెమికల్ ట్రేడర్స్ ఈ నిబంధనను తుంగలో తొక్కాయి. ఎలాంటి పత్రాలు లేకుండా ప్రవీణ్‌కు భారీ మొత్తంలో విక్రయిస్తున్నాయి. దీని రవాణా కోసం ఓ వాహ నం ఖరీదు చేసిన ఇతను డ్రైవర్‌ను నియమించుకున్నాడు. ఈథర్‌ను ఇక్కడ లీటర్ రూ.100కు కొని, అలగాం తరలించి అక్కడి వారికి రూ.400కు అమ్ముతున్నాడు. ఇలా ఇప్పటి వరకు ఈ రెండు ఏజెన్సీల నుంచి 1400 లీటర్లు కొనుగోలు చేశాడు. హష్ ఆయిల్ ‘డిస్ట్రిబ్యూటర్’గా మారి... పెట్రోలియం ఈథర్‌తో తయారు చేసిన హష్ ఆయిల్‌ను ప్రవీణ్ గిరిజనుల నుంచి తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నాడు. లీటర్ గరిష్టంగా రూ.30 వేలకు కొని, తీసుకువచ్చి హైదరాబాద్ లోని 15 మంది పెడ్లర్స్‌తో పాటు బెంగళూరులో ఉన్న వారికీ సరఫరా చేస్తున్నాడు. నగరంలో లీటర్ రూ.70 వేల నుంచి రూ.80 వేలకు, బెంగళూరులో రూ.1.2 లక్షలు నుంచి రూ.1.4 లక్ష లకు విక్రయిస్తున్నాడు. చిన్న చిన్న డబ్బాల్లో ప్యాక్ చేసి డబ్బాల్లో అమ్మితే ప్రవీణ్‌కు లీటర్‌కు రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తోంది. ఇలా అటు ఇథనాల్, ఇటు హష్ ఆయిల్ రెండింటి దందా చేస్తూ కొన్నాళ్లుగా రెచ్చిపోతున్న ఇతడికి గోవాలో కూడా నెట్వర్క్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. చిక్కడపల్లిలో సరఫరా చేస్తుండగా... ప్రవీణ్ కుమార్‌కు నగరంలో ఉన్న పెడ్లర్లలో పటాన్చెరు, కూకట్పల్లి ప్రాంతాలకు చెందిన పి.మోహన్ యాదవ్, పి.కళ్యాణ్, బి.సురేష్ కీల కం. ఇటీవల ఏజెన్సీ నుంచి హష్ ఆయిల్ తెచ్చిన ఇతడు దాన్ని చిన్న డబ్బాల్లో ప్యాక్‌చేసి పెడ్లర్స్‌కు సరఫరా చేస్తున్నాడు. మంగళవారం చిక్కడపల్లి వద్దకు ఈ ముగ్గురికీ ఇచ్చేందుకు 60 డబ్బాలు తీసుకువచ్చాడు. దీనిపై హెచ్–న్యూ ఇన్స్పెక్టర్ పి.రమేష్‌రెడ్డికి సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు ఎస్సై సి.వెంకటరాములు నేతృత్వంలోని బృందం వలపన్ని నలుగురినీ పట్టు కుంది. వీరి నుంచి హష్ ఆయిల్‌తో పాటు 400 లీటర్ల ఈథర్, వాహనం స్వాధీనం చేసుకున్నా రు. నిబంధనలకు విరుద్ధంగా పెట్రోలియం ఈథర్‌ను వికయ్రించిన కూకట్పల్లి ప్రశాంతినగర్‌కు చెందిన నర్మద ట్రేడర్స్, మహాలక్ష్మీ కెమికల్ ట్రేడర్స్‌పై కేసులు నమోదు చేశారు. ప్రవీణ్‌పై గతంలోనూ కేసులు కాగా, ప్రవీణ్‌పై గతంలో రెండు కేసులు నమోదై నట్టు పోలీసులు గుర్తించారు. 2015లో కూకట్ పల్లిలో ఓ చిన్నారిని కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేసిన ముఠాలో సభ్యుడిగా కేసు నమోదైంది. 2020లో కూకట్‌పల్లిలోనే గంజాయి అమ్ముతూ పట్టుబడిన కేసు విచారణలో ఉంది. -
Roundup 2022: నిషా ముక్త్ షహరే.. డ్రగ్ ఫ్రీ సిటీ దిశగా!
సాక్షి, సిటీబ్యూరో: నిషా ముక్త్ షహరే లక్ష్యంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏర్పాటైన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ), నార్కోటిక్ ఇన్వెస్టిగేషన్ సూపర్ విజన్ వింగ్ (ఎన్‌ఐఎస్‌డబ్ల్యూ) తమ మార్కు చూపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఈ ఏడాది ఫిబ్రవరి 9న వీటికి రూపమిచ్చారు. ► నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్స్ కోసం ఏర్పాటైన ఎస్ఐబీ, గ్రేహౌండ్స్ స్ఫూర్తితో... వాటి మాదిరిగా ఏకైక లక్ష్యంగా ఈ రెండు విభాగాలు సమన్వయంతో పని చేస్తున్నాయి. మాదకద్రవ్యాల మూలాల నుంచి రవాణా, విక్రయం, వినియోగంపై నిఘా ఉంచి దాడులు చేసేందుకు హెచ్–న్యూ, ఎఫ్ఐఆర్ నమోదు నుంచి కేసు విచారణ పూర్తయ్యే వరకు పర్యవేక్షించేందుకు ఎన్‌ఐఎస్‌డబ్ల్యూ ఉపకరిస్తున్నాయి. ► హెచ్–న్యూ టాస్‌్కఫోర్స్ మాదిరిగా పని చేస్తోంది. ఇది కేవలం మాదకద్రవ్యాల వ్యవహారాలను మాత్రమే పర్యవేక్షిస్తోంది. యుక్త వయస్సులో, కాలేజీ రోజుల్లో స్నేహితుల బలవంతంతోనే, తమకు ఉన్న ఉత్సుకత నేపథ్యంలోనే అనేక మంది సరదాగా డ్రగ్స్ వాడటం మొదలెడుతున్నారు. ఆపై వాటిని బానిసలుగా మారి జీవితాలను నిరీ్వర్యం చేసుకుంటున్నారు. ఎందరో యువత ఈ మహమ్మారికి సంబంధించిన ఛట్రంలో ఇరుక్కుంటున్నారని హెచ్–న్యూ అధికారులు గుర్తించారు. ► ఒకప్పుడు కేవలం డ్రగ్స్ సరఫరాదారులు, విక్రేతలను మాత్రమే అరెస్టు చేసేవాళ్లు. అయితే తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసులు వీరితో పాటు వినియోగదారుల పైనా చర్యలకు ఉపక్రమించారు. ► ఎన్డీపీఎస్ యాక్ట్‌లో ఉన్న సెక్షన్ల ప్రకారం పదేపదే వాడుతున్న వారినీ అరెస్టు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో కలిసి రీహాబిటేషన్ విధానానికీ శ్రీకారం చుట్టారు. డిసెంబర్ 31 రాత్రి జరిగే పారీ్టల్లో డ్రగ్స్, గంజాయి వినియోగం జరిగే అవకాశం ఉంది. ► ఈ నేపథ్యంలోనే నగర వ్యాప్తంగా హెచ్–న్యూ నిఘా ముమ్మరం చేసింది. దీనికోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. గతంలో ఈ కేసుల్లో అరెస్టు అయి, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న వారిని నిశితంగా గమనిస్తున్నాయి. చదవండి: TS: సంక్షేమ శాఖల్లో 581 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ -
డ్రగ్ కేసు: గోవాలో కీలక సూత్రధారి ఎడ్విన్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గోవా డ్రగ్ కేసులో కీలక సూత్రధారి ఎడ్విన్ నూనిస్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా కేంద్రంగా దేశ్యావ్యాప్తంగా డ్రగ్స్ సరాఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాలో ఎడ్విన్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. గత 15 రోజులుగా ఎడ్విన్ కోసం గోవాలో పోలీసులు గాలిస్తుండగా.. ఎట్టకేలకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. శనివారం రోజు రాత్రి వరకు అతన్ని హైదరాబాద్ తీసుకురానున్నారు. కాగా ఎడ్విన్ గోవా కర్లీస్ రెస్టారెంట్, పబ్ యజమాని. ఇక ఇదే కేసులో మూడు నెలల క్రితం నారాయణ బోర్కర్‌ను హైదరాబాద్ నార్కోటిక్ విభాగం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బోర్కర్ గోవా నుంచి డ్రగ్స్ తీసుకొని హైదరాబాదులో సరాఫరా చేస్తుంటాడు. ఇతను గోవాలోని అంజునా బీచ్ కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో ఏళ్లుగా డ్రగ్స్ దందా చేస్తూ దాదాపు 600 మంది కస్టమర్లు కలిగి ఉన్నాడు. ఈ ఘరానా పెడ్లర్ ప్రీతీష్ నారాయణ్ బోర్కర్‌ను హెచ్–న్యూ ఆగస్టు 17న పట్టుకుంది. ఇతడికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న స్టీవెన్, ఎడ్విన్ నూనిస్‌లకు బీజేపీ నేత, టిక్‌టాక్ స్టార్ సొనాలీ ఫోగాట్ హత్య కేసుతోనూ సంబంధాలు బయటపడ్డాయి. అయితే నారాయణ బోర్కర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా గోవాలో పలువురుపై నార్కోటిక్ విభాగం పోలీసులు నిఘా పెట్టారు ఈ క్రమంలోనే మూడురోజులుగా తప్పించుకు తిరుగుతున్న ఎడ్విన్‌ను అదుపులోకి తీసుకున్నారు. చదవండి: ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు అనుమానాస్పద మృతి.. హత్యకేసుగా.. -
బోర్కర్..మామూలోడు కాదు!.. పెద్ద బ్యాగ్రౌండే ఉంది
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు గత నెలలో అరెస్టు చేసిన గోవా డ్రగ్ పెడ్లర్ ప్రీతీష్ నారాయణ్ బోర్కర్‌కు పెద్ద బ్యాగ్రౌండే ఉంది. గోవా పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన డ్రగ్ డీలర్ సదానంద్ చిముల్కర్‌కు సమీప బంధువు ఇతడు. భూయ్ అనే మారు పేరు కూడా ఉన్న చిముల్కర్ 2010–14 మధ్య గోవా సహా అనేక రాష్ట్రాల పోలీసులను పరుగులు పెట్టించాడు. ప్రీతీష్‌ను ఇటీవల తమ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు లోతుగా విచారించగా అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. గోవాలోని అంజునా బీచ్ కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో ఏళ్లుగా డ్రగ్స్ దందా చేస్తూ దాదాపు 600 మంది కస్టమర్లు కలిగి ఉన్న ఘరానా పెడ్లర్ ప్రీతీష్ నారాయణ్ బోర్కర్‌ను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) గత నెల 17న పట్టుకుంది. ఇతడికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న స్టీవెన్, ఎడ్విన్ నూనిస్‌లకు బీజేపీ నేత, టిక్‌టాక్ స్టార్ సొనాలీ ఫోగాట్ హత్య కేసుతోనూ సంబంధాలు బయటపడ్డాయి. అంజునా ప్రాంతానికి చెందిన డ్రగ్స్ డాన్ సదానంద్ అలియాస్ భుయ్ చిముల్కర్‌కు ప్రీతీష్ బోర్కర్ సమీప బంధువు. సదానంద్ జీవశైలి, సంపాదన, డబ్బు ఖర్చు చేసే విధానం..ఇవన్నీ చూసిన ప్రీతీష్ తానూ డ్రగ్స్ దందా చేయాలని నిర్ణయించుకున్నాడు. సదానంద్‌కు సరఫరా చేసే వారి నుంచే ఎండీఎంఏ, ఎల్ఎస్డీ, ఎక్స్టసీ, కొకైన్ తదితర మాదకద్రవ్యాలు ఖరీదు చేసే అమ్మడం మొదలెట్టాడు. సదానంద్‌ను గోవా యాంటీ నార్కోటిక్స్ సెల్ (ఏఎన్సీ) అధికారులు 2010 జనవరిలో అరెస్టు చేశారు. అప్పట్లో ఇతడి నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చార్జ్‌షీట్ దాఖలు చేసిన తర్వాత సదానంద్ అడ్డం తిరిగాడు. అసలు తాను డ్రగ్సే అమ్మలేదని, తన కారులో ఏఎన్సీ అధికారులే వాటిని పెట్టారని కోర్టులో పిటిషన్ వేశాడు. లంచం ఇవ్వనందుకే ఇలా చేశారంటూ ఆరోపించాడు. అయితే పోలీసులు చూపించిన ఆధారాలతో ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దీంతో గోవా పోలీసులు సదానంద్‌ను కట్టడి చేయడానికి ఆర్థిక మూలాలపై దృష్టి పెట్టారు. గోవా పోలీసు చరిత్రలో తొలిసారిగా డ్రగ్స్ కేసులో నిందితుడి ఆస్తులు, బంగారం, ఇన్సూరెన్స్ పాలసీలు, బ్యాంకు ఖాతాల్లోని నగదును జప్తు చేశారు. దీనికి తోడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు (ఈడీ) లేఖ రాశారు. దీంతో ఆ అధికారులు సదానంద్‌పై 2014లో మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇలా డ్రగ్స్ డాన్‌పై ఈడీ కేసు నమోదు కావడం కూడా గోవాలో అదే తొలిసారి. ఈ పరిణామాలతో కంగుతిన్న ప్రీతీష్ బోర్కర్ తన ఉనికి బయటపడకుండా దందా చేయడం ప్రారంభించాడు. ప్రధానంగా సింథటిక్ డ్రగ్స్ అయిన ఎక్స్టసీ పిల్స్, ఎల్ఎస్డీ బోల్ట్సŠ, ఎండీఎంఏ మాత్రమే అమ్మేవాడు. అప్పుడప్పుడు మాత్రం చెరస్‌ను సరఫరా చేస్తుండేవాడు. అయితే ఇతడి వ్యవహారాలపై సమాచారం అందుకున్న గోవా పోలీసులు 2014 నవంబర్‌లో అక్కడి సియోలిమ్ వద్ద పట్టుకుని జైలుకు పంపారు. అప్పట్లో ఓ కస్టమర్‌కు నేరుగా డ్రగ్స్ డెలివరీ చేయడానికి వెళ్లిన ప్రీతీష్ పట్టుబడ్డాడు. దీంతో అప్పటి నుంచి ఇతగాడు తన పంథా మార్చాడు. ఎవరికీ కనిపించకుండా, కొరియర్స్ ద్వారానే డ్రగ్స్ సరఫరా చేపట్టాడు. ఇన్నాళ్లకు మళ్లీ హబ్సిగూడకు చెందిన కస్టమర్ల కోరిక మేరకు వారికి డ్రగ్స్ సరఫరా చేయడానికి గత నెల్లో హైదరాబాద్‌కు వచ్చి హెచ్–న్యూకు చిక్కాడు. -
హష్.. కేరాఫ్ నగేశ్.. సేద్యం, తయారీ, సరఫరా
సాక్షి, హైదరాబాద్: ఈ నగేశ్ మామూలోడు కాదు. హష్ ఆయిల్ నెట్‌వర్క్‌లో ఏపీలోని లోగిలి గ్రామానికి చెందిన కె.నాగేశ్వర్రావు పాత్ర కీలకమని పోలీసులు గుర్తించారు. తెలంగాణలో నమోదైన తొలి డ్రగ్స్ మరణానికి సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడు ప్రేమ్ ఉపాధ్యాయకు హష్ ఆయిల్ సరఫరా చేసిన వీరవల్లి లక్ష్మీపతి ఇతడి దళారుల్లో ఒకరని హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్(హెచ్–న్యూ) అధికారులు నిర్ధారించారు. వీరి నుంచి హష్ ఆయిల్ ఖరీదు చేస్తున్న మరో ఇద్దరు వినియోగదారులనూ కటకటాల్లోకి పంపామని డీసీపీ చక్రవర్తి గుమ్మి బుధవారం ఇక్కడ మీడియాకు వెల్లడించారు. కుటుంబం మొత్తం అదే దందాలో... నగేశ్‌గా ప్రాచుర్యం పొందిన కె.నాగేశ్వర్రావు కొన్నేళ్లుగా కుటుంబీకులు, బంధువులతో కలసి 2016 వరకు గంజాయి దందా చేశాడు. ఆ తర్వాత హష్ ఆయిల్ విక్రయించడం మొదలుపెట్టాడు. తన స్వస్థలంలోనే గంజాయి పండించి ప్రాసెస్ చేయించేవాడు. అక్కడే హష్ ఆయిల్ తీసి, కిలో చొప్పున ప్యాక్ చేసి ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేవాడు. ఈ నేరాలకు సంబంధించి నల్లగొండ టూ టౌన్ పోలీసుస్టేషన్లో అతడిపై 2021లో కేసు నమోదైంది. ఈ కేసులో నగేశ్ కుటుంబీకులు, బంధువులు అరెస్టు అయినా అతడు మాత్రం పరారీలో ఉన్నాడు. ఈ ఏడాది హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్ ఠాణాలో నమోదైన అశుతోష్ కేసు, నల్లకుంట ఠాణాకు సంబంధించిన ప్రేమ్ ఉపాధ్యాయ కేసులో నగేశ్ నిందితుడు. నగేశ్ దందాలో దళారిగా ఉన్న లక్ష్మీపతి మరో మూడు కేసుల్లో నిందితుడు. లక్ష్మీపతి మాదిరిగా మరో 58 మంది రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, వరంగల్‌లతో పాటు ఒడిశా, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ముంబై, ఉత్తరప్రదేశ్, బిహార్‌ల్లోనూ నగేశ్‌కు సంబంధించిన 58 మంది పెడ్లర్స్ పరారీలో ఉన్నారు. నల్లగొండలోని పెడ్లర్స్ ఇప్పటికే అరెస్టు అయ్యారు. 100 మంది విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులను కస్టమర్లుగా చేసుకుని హష్ ఆయిల్ విక్రయిస్తున్న లక్ష్మీపతి, నగేశ్‌తోపాటు మియాపూర్‌కు చెందిన ఎ.వంశీకృష్ణ, బీరంగూడకు చెందిన విద్యార్థి విక్రమ్ మౌర్యలను హెచ్–న్యూ బృందం అరెస్టు చేసింది. రూ. 50 వేలకు కొని రూ. 6 లక్షలకు అమ్మకం లక్ష్మీపతి హష్ ఆయిల్‌ను నగేష్ నుంచి కిలో రూ.50 వేలకు ఖరీదు చేసి రూ.6 లక్షల వరకు అమ్ముతున్నాడు. ప్రస్తుతం వీరిద్దరి నుంచి దాదాపు రూ.5 లక్షల విలువైన 840 గ్రాముల ఆయిల్ లభించింది. వీరి నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. నగరంలో మాదకద్రవ్యాలపై సమాచారం తెలిసిన వాళ్లు 94906 16688కు అందించాలి. వారి పేర్లు, వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతాం. – చక్రవర్తి గుమ్మి, హెచ్–న్యూ డీసీపీ -
ప్రత్యేక నార్కోటిక్ సెల్ ఏదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ కోసం ఏర్పాటు చేయదలచిన ప్రత్యేక యాంటీ నార్కోటిక్ సెల్ అడుగు ముందుకు పడటం లేదు. సీఎం కేసీఆర్ స్వయంగా ఆదేశించినా.. అధికారవర్గాల్లో కదలిక కనిపించడం లేదు. యాంటీ నార్కోటిక్ సెల్‌తోపాటు ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్ ఏర్పాటు చేయాలని రెండు నెలల కింద సీఎం కేసీఆర్ ఆదేశించారు. డ్రగ్స్ నియంత్రణ విషయంగా డీజీపీ నుంచి ఎస్పీస్థాయి వరకు, ఎక్సైజ్ కమిషనర్ నుంచి ఎస్సై వరకు అధికారులతో కీలక సమావేశం కూడా నిర్వహించారు. కానీ ఇప్పటివరకు కూడా ప్రత్యేక సెల్ విషయంగా పోలీస్‌శాఖ నుంచి గానీ, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచిగానీ ఎలాంటి ప్రతిపాదన రాలేదని హోంశాఖ వర్గాలు చెప్తున్నాయి. అసలు ప్రత్యేక విభాగం ఏర్పాటవుతుందా లేదా అన్నదానిపై సీనియర్ పోలీస్ అధికారులకే స్పష్టత లేదని అంటున్నాయి. ఒక్క హైదరాబాద్‌లో మాత్రమే.. రాష్ట్రంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మాత్రమే హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ), నార్కోటిక్ ఇన్వెస్టిగేషన్ సూపర్విజన్ వింగ్ ఏర్పాటు చేశారు. ఇదితప్ప ఏ కమిషనరేట్‌లో గానీ, జిల్లా యూనిట్లోగానీ డ్రగ్స్, వ్యవస్థీకృత నేరాల నియంత్రణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటుకాలేదు. అయితే డ్రగ్స్ దందా, వినియోగం చాలా వరకు హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లోనే జరుగుతోంది. గతంలో అరెస్టయిన ఇంటర్నేషనల్ డ్రగ్ పెడ్లర్ టోనీ వ్యవహారం నుంచి.. తాజాగా డ్రగ్స్ మితిమీరి ప్రాణాలు కోల్పోయిన యువకుడి వరకు పరిశీలిస్తే.. డ్రగ్స్ మహమ్మారి ఎంతగా విస్తరించిందో తెలుస్తోంది. రెండు, మూడు రోజుల హడావుడితో సరి.. సీఎం కేసీఆర్ సమావేశం తర్వాత రెండు మూడు రోజులు హడావుడి చేసిన పోలీస్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు.. ఆ తర్వాత కనీసం ఒక్కసారి కూడా సమావేశం కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంలో ప్రధాన పాత్ర పోలీస్ శాఖదే అయినా, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్తో సమన్వయం తప్పనిసరి. కానీ ఆ దిశగా చర్చలు గానీ, యూనిట్ల ఏర్పాటులో భాగస్వామ్యంపై ఎక్కడా అడుగు ముందుకు పడని పరిస్థితి. రాష్ట్ర స్థాయిలోనా.. జిల్లాకొకటా? డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక సెల్‌ను రాష్ట్రస్థాయిలో ఏర్పాటుచేయాలా? లేకా ఎక్కడికక్కడ జిల్లా, కమిషనరేట్ల పరిధిలో ఏర్పాటుచేయాలా అన్నదానిపై ఇప్పటికీ ఎలాంటి ప్రతిపాదన కూడా లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని పలువురు జిల్లా పోలీస్ అధికా రులు అంటున్నారు. ఎస్పీలు, కమిషనర్ల పరిధి లో బృందాలను ఏర్పాటు చేసి.. కేసుల తీవ్రతను బట్టి పర్యవేక్షణ కోసం రాష్ట్రస్థాయిలో ఒక సీనియర్ ఐపీ ఎస్‌కు బాధ్యతలు అప్పగిస్తారా అన్నదీ తేల లేదు. అసలు డ్రగ్స్ నియంత్రణపై ఏం చర్యలు చేపడుతున్నారో కూడా కమిషనర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం లేదని పోలీసువర్గాలే చెప్తుండటం గమనార్హం. సిటీ చుట్టుపక్కల కేవలం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే కాదు, శివార్లు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఇంజనీరింగ్, మెడిసిన్, ఇతర కాలేజీల్లోనూ డ్రగ్స్ మాఫియా దందా సాగుతోందని ఇటీవలి ఘటనల్లో బయటపడింది. అయినా.. సైబరాబాద్, రాచకొండ, సంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం లాంటి ప్రాంతాల్లో యాంటీ నార్కోటిక్ సెల్ ఏర్పాటుకు ఎలాంటి చర్యలూ చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదు. -
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ సరాఫరా చేస్తున్న ఓ నైజీరియన్‌తోపాటు 12 మందిని హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే డ్రగ్స్ సేవిస్తున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ఎమ్డీఎమ్ఏ, ఎల్ఎస్డీ బ్లాట్‌లతో పాటు గంజాయి, హ్యాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఆర్ నగర్, కార్ఖానా, సికింద్రాబాద్‌లో ముఠాగా ఏర్పడి డ్రగ్స్ అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను బషీర్ బాగ్ సీపీ కార్యాలయంలో కమిషనర్ సీవీ ఆనంద్ మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు. చదవండి: సీబీఐ మరో కట్టుకథ: చంపుతుంటే.. పడుకున్నాడు! -
మాదకద్రవ్యాల వ్యవహారాన్ని ఆటకట్టించేలా ‘హెచ్–న్యూ’
సాక్షి హైదరాబాద్: రాజధానిలో డ్రగ్ అనే మాట వినపడకూడదంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను అమలు పెట్టడంలో భాగంగా నగర కొత్వాల్ సీవీ ఆనంద్ ప్రత్యేక విభాగానికి అంకురార్పణ చేశారు. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్‌గా (హెచ్–న్యూ) పిలిచే దీంతో పాటు డ్రగ్స్‌పై పోరు కోసం ప్రత్యేకంగా నార్కోటిక్స్ ఇన్వెస్టిగేషన్ సూపర్వైజింగ్ వింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండింటినీ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి బుధవారం ఆవిష్కరించనున్నారు. బషీర్‌బాగ్‌లోని నగర పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. హెచ్–న్యూకు డీసీపీ స్థాయి అధికారి అధిపతిగా ఉండనున్నారు. తాత్కాలికంగా ఈ బాధ్యతల్ని ప్రస్తుత టాస్క్‌ఫోర్స్ డీసీపీ చక్రవర్తి గుమ్మికి అప్పగిస్తున్నారు. ఇద్దరు ఇన్స్పెక్టర్లు, నలుగురు సబ్–ఇన్స్పెక్టర్లతో పాటు 20 మంది కానిస్టేబుళ్లతో పని చేసే ఈ విభాగం గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం సేకరించడం, దాడులు చేయడం, నిందితులను పట్టుకోవడం వంటి విధులు నిర్వర్తిస్తూ ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్ మాదిరిగా ఎన్ఫోర్స్మెంట్ వింగ్‌గా కొనసాగుతుంది. వీటికి సంబంధించిన కేసులు మాత్రం స్థానికంగా ఆయా పోలీసుస్టేషన్లలోనే నమోదు అవుతాయి. ఈ కేసుల దర్యాప్తు పక్కాగా సాగి, నిందితులు కోర్టులో దోషులుగా నిరూపితమై శిక్షలు పడితేనే పూర్తి స్థాయి ఫలితాలు ఉంటాయని పోలీసు కమిషనర్ ఆనంద్ భావిస్తున్నారు. దీనికోసమే ప్రత్యేకంగా నార్కోటిక్స్ ఇన్వెస్టిగేషన్ సూపర్వైజింగ్ వింగ్‌ను ఏర్పాటు చేశారు. అదనపు సీపీ (సిట్, నేరాలు) ఏఆర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో పని చేసే దీనికి సీసీఎస్ ఏసీపీ కందుకూరి నర్సింగ్‌రావు నేతృత్వం వహించనున్నారు. ఇన్స్పెక్టర్, ఎస్సైతో పాటు ఆరుగురు కానిస్టేబుళ్లు ఇందులో ఉంటారు. డ్రగ్స్ కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు నుంచి కోర్టుల్లో విచారణ పూర్తయ్యే వరకు ఈ విభా గం పర్యవేక్షిస్తుంది. దీనిపై బుధవారం ప్రకటన వెలువడే అవకాశం ఉంది. -
మహిళ నుంచి రూ. 7.4 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
ముంబై: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో బుధవారం భారీ ఎత్తున మత్తు మందులను స్వాధీనం చేసుకున్నారు. దోహా మీదుగా దార్-ఇ-సలామ్‌కు భారీ ఎత్తున మెథాక్విలోన్ అక్రమంగా తరలిస్తుండగా స్నిఫర్ డాగ్స్ పట్టేశాయి. 74 కేజీల మెథాక్విలోన్ ను తరలిస్తున్న టాంజానియా మహిళ చాంబో ఫాత్మా బాసిల్ ఎయిర్ ఇంటిలిజెన్స్ విభాగానికి చిక్కింది. ఈ డ్రగ్స్ విలువ 7.4 కోట్ల రూపాయలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా స్నిఫర్ డాగ్స్ మత్తు మందుల బ్యాగ్ ను గుర్తించాయని ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ఎత్తున మత్తుమందులను పట్టుకోవడం ఇదే మొదటిసారని కస్టమ్స్ ఎడిషనల్ కమిషనర్ మిలింద్ లాంజేవార్ తెలిపారు. తక్షణమే బాసిల్‌ను అదుపులోకి తీసుకున్నామని తదుపరి విచారణ కొనసాగుతుందని తెలిపారు. గతంలో జింబాబ్వే మహిళ 13 కేజీలు ,ఇపుడు టాంజానియా మహిళ74 కేజీల అక్రమంగా రవాణా చేస్తున్న మత్తుమందులను పట్టుకోవడంలో కూడా తమ స్నిఫర్ డాగ్స్ టీమ్ ప్రముఖ పాత్ర వహించాయని అధికారులు వెల్లడించారు.