నాగేశ్వర్‌రావు, లక్ష్మీపతి
సాక్షి, హైదరాబాద్: ఈ నగేశ్ మామూలోడు కాదు. హష్ ఆయిల్ నెట్‌వర్క్‌లో ఏపీలోని లోగిలి గ్రామానికి చెందిన కె.నాగేశ్వర్‌రావు పాత్ర కీలకమని పోలీసులు గుర్తించారు. తెలంగాణలో నమోదైన తొలి డ్రగ్స్ మరణానికి సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడు ప్రేమ్ ఉపాధ్యాయకు హష్ ఆయిల్ సరఫరా చేసిన వీరవల్లి లక్ష్మీపతి ఇతడి దళారుల్లో ఒకరని హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్(హెచ్–న్యూ) అధికారులు నిర్ధారించారు. వీరి నుంచి హష్ ఆయిల్ ఖరీదు చేస్తున్న మరో ఇద్దరు వినియోగదారులనూ కటకటాల్లోకి పంపామని డీసీపీ చక్రవర్తి గుమ్మి బుధవారం ఇక్కడ మీడియాకు వెల్లడించారు.
కుటుంబం మొత్తం అదే దందాలో...
నగేశ్‌గా ప్రాచుర్యం పొందిన కె.నాగేశ్వర్‌రావు కొన్నేళ్లుగా కుటుంబీకులు, బంధువులతో కలసి 2016 వరకు గంజాయి దందా చేశాడు. ఆ తర్వాత హష్ ఆయిల్ విక్రయించడం మొదలుపెట్టాడు. తన స్వస్థలంలోనే గంజాయి పండించి ప్రాసెస్ చేయించేవాడు. అక్కడే హష్ ఆయిల్ తీసి, కిలో చొప్పున ప్యాక్ చేసి ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేవాడు.
ఈ నేరాలకు సంబంధించి నల్లగొండ టూ టౌన్ పోలీసుస్టేషన్‌లో అతడిపై 2021లో కేసు నమోదైంది. ఈ కేసులో నగేశ్ కుటుంబీకులు, బంధువులు అరెస్టు అయినా అతడు మాత్రం పరారీలో ఉన్నాడు. ఈ ఏడాది హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్ ఠాణాలో నమోదైన అశుతోష్ కేసు, నల్లకుంట ఠాణాకు సంబంధించిన ప్రేమ్ ఉపాధ్యాయ కేసులో నగేశ్ నిందితుడు. నగేశ్ దందాలో దళారిగా ఉన్న లక్ష్మీపతి మరో మూడు కేసుల్లో నిందితుడు.
లక్ష్మీపతి మాదిరిగా మరో 58 మంది
రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, వరంగల్‌లతో పాటు ఒడిశా, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ముంబై, ఉత్తరప్రదేశ్, బిహార్‌ల్లోనూ నగేశ్‌కు సంబంధించిన 58 మంది పెడ్లర్స్ పరారీలో ఉన్నారు. నల్లగొండలోని పెడ్లర్స్ ఇప్పటికే అరెస్టు అయ్యారు. 100 మంది విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను కస్టమర్లుగా చేసుకుని హష్ ఆయిల్ విక్రయిస్తున్న లక్ష్మీపతి, నగేశ్‌తోపాటు మియాపూర్‌కు చెందిన ఎ.వంశీకృష్ణ, బీరంగూడకు చెందిన విద్యార్థి విక్రమ్ మౌర్యలను హెచ్–న్యూ బృందం అరెస్టు చేసింది.
రూ. 50 వేలకు కొని రూ. 6 లక్షలకు అమ్మకం
లక్ష్మీపతి హష్ ఆయిల్‌ను నగేష్ నుంచి కిలో రూ.50 వేలకు ఖరీదు చేసి రూ.6 లక్షల వరకు అమ్ముతున్నాడు. ప్రస్తుతం వీరిద్దరి నుంచి దాదాపు రూ.5 లక్షల విలువైన 840 గ్రాముల ఆయిల్ లభించింది. వీరి నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. నగరంలో మాదకద్రవ్యాలపై సమాచారం తెలిసిన వాళ్లు 94906 16688కు అందించాలి. వారి పేర్లు, వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతాం.
– చక్రవర్తి గుమ్మి, హెచ్–న్యూ డీసీపీ
Comments
Please login to add a commentAdd a comment