నార్కోటిక్స్‌ వింగ్‌.. నామ్‌కే వాస్తే | Hyderabad Narcotics Enforcement Wing | Sakshi
Sakshi News home page

నార్కోటిక్స్‌ వింగ్‌.. నామ్‌కే వాస్తే

Feb 14 2024 9:29 AM | Updated on Feb 14 2024 9:31 AM

Hyderabad Narcotics Enforcement Wing - Sakshi

సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో డ్రగ్స్‌ అనే మాటే వినిపించకూడదు. మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతాం. గంజాయి సహా అన్ని నిషేధిత ఉత్పత్తుల రవాణా, విక్రయం, వినియోగం ఉపేక్షించేదిలేదు’. గత, ప్రస్తుత ప్రభుత్వ పెద్దల మాటలివి. వాస్తవ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మంగా ఏర్పాటైన తెలంగాణ స్టేట్‌ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో (టీఎస్‌ నాబ్‌) పరిస్థితే దీనికి ఉదాహరణ. ఇది ఆవిర్భవించి తొమ్మిది నెలలు కావస్తున్నా.. ఇప్పటికీ తీవ్రమైన వనరుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది.  

సిబ్బంది కంటే అధికారులే అధికం..  
పోలీసు శాఖలో ఏ విభాగాన్ని తీసుకున్నా ఉన్నతాధికారులు, అధికారుల సంఖ్య తక్కువగా, క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించే కింది స్థాయి సిబ్బంది సంఖ్య ఎక్కువగా ఉంటుంది. బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌నే ఉదాహరణగా తీసుకుంటే.. అక్కడ ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, 11 మంది ఎస్సైలు, 15 మంది హెడ్‌–కానిస్టేబుళ్లు, 67 మంది కానిస్టేబుళ్లు పని చేస్తున్నారు. టీఎస్‌ నాబ్‌ వ్యవహారం రొటీన్‌కు భిన్నంగా ఉంది. ఇక్కడ ఒక డైరెక్టర్, ఇద్దరు ఎస్పీలతో పాటు 15 మంది ఏసీపీ, 19 మంది ఇన్‌స్పెక్టర్లు ఉండటం వరకు బాగానే ఉంది. క్షేత్రస్థాయిలో కీలకమైన ఎస్సైలు 8, కానిస్టేబుళ్లు 23 మంది మాత్రమే ఉన్నారు. ప్రతిష్టాత్మకమైన ఈ విభాగంలో క్షేత్రస్థాయి సిబ్బంది కంటే అధికారుల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. 

కానరాని మౌలిక వసతులు.. 
టీఎస్‌ నాబ్‌ను ఏర్పాటు చేస్తూ గత ప్రభుత్వం పోయినేడాది ఏప్రిల్‌ 30న ఉత్తర్వులు జారీ చేయగా.. అదే ఏడాది మే 31న ఆవిష్కారమైంది. ప్రాథమికంగా ఈ విభాగానికి 300 పోస్టులు కేటాయించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలతో పాటు వరంగల్‌ల్లో నార్కోటిక్స్‌ ఠాణాలు, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, సంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లతో పాటు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోనూ రీజినల్‌ నార్కోటిక్స్‌ సెల్స్‌ ఏర్పాటు చేయాలి. పోలీసు స్టేషన్లకు డీఎస్పీ స్థాయి అధికారి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌గా (ఎస్‌హెచ్‌ఓ) ఉంటారు. బంజారాహిల్స్‌లోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో ఇచ్చిన కార్యాలయం తప్ప... రాష్ట్రంలో మరెక్కడా చిన్న గది కూడా ఈ విభాగానికి కేటాయించలేదు. డైరెక్టర్‌ సహా ఇప్పటి వరకు ఈ వింగ్‌కు రిపోర్టు చేసిన వారి సంఖ్య కేవలం 68 మాత్రమే. ఉన్నతాధికారులు మినహా మరెవరూ సంచరించడానికి వాహనాలు సహా ఏ ఇతర సదుపాయం లేదు.  

ప్రోత్సాహకం మాటే మరిచారు..   
ఏసీబీ, సీఐడీ, ఇంటెలిజెన్స్‌ విభాగాల మాదిరిగా టీఎస్‌ నాబ్‌కూ డైరెక్టు రిక్రూట్‌మెంట్‌ లేదు. ఇందులోని పోస్టుల్ని అపోర్షన్‌మెంట్‌గా పిలిచే డిప్యుటేషన్‌ విధానంలో భర్తీ చేస్తారు. ఆసక్తి ఉన్న వాళ్లు దరఖాస్తు చేసుకోవాలంటూ గతంలోనే  పోలీసు విభాగం అంతర్గతంగా ప్రకటన ఇచి్చంది. దీంతో అనేక మంది ఆసక్తి చూపుతూ ముందుకు కూడా వచ్చారు. ఎస్సైలను రేంజ్‌ డీఐజీలు, ఇన్‌స్పెక్టర్లను జోన్‌ ఐజీలు, కానిస్టేబుళ్లను యూనిట్‌ ఆఫీసర్లు రిలీవ్‌ చేసి పంపాల్సి ఉంది. వీళ్లల్లో ఎవరూ స్పందించకపోవడంతో అనేక ఖాళీలతో టీఎస్‌ నాబ్‌ ఆపసోపాలు పడుతోంది. ఈ విభాగంలో పని చేసే వారికి ప్రత్యేక ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు గతంలో ఉన్నతాధికారులు చెప్పారు. సాధారణంగా రిస్‌్కతో కూడిన ఉద్యోగాలు చేసే వింగ్స్‌కు వేతనంపై 60 శాతం అదనంగా ఇస్తారు. ఇప్పటి వరకు చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో టీఎస్‌ నాబ్‌లో పని కూడా రిస్‌్కతో కూడిన వ్యవహారంగా తేలింది. అయినప్పటికీ ఈ ప్రోత్సాహకం విషయం ఇప్పుడు ఎవరూ పట్టించుకోవట్లేదు.  

వీటి ఊసెత్తేవారే లేరు..  
టీఎస్‌ నాబ్‌ రాష్ట్ర స్థాయిలో, ఇతర విభాగాలు, రాష్ట్రాలతో సమన్వయంతో పని చేయాల్సి ఉంది. మాదకద్రవ్యాల ఉత్పత్తి, రవాణా, విక్రయం, వినియోగం సహా అన్ని అంశాల పైనా ఈ బ్యూరో కన్నేసి ఉంచి సూత్రధారులకు చెక్‌ చెప్పాలి. దీని డైరెక్టర్‌ ఆ«దీనంలో ఠాణాలు, రీజినల్‌ నార్కోటిక్‌ కంట్రోల్‌ సెల్స్‌తో పాటు 26 నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్స్‌ పని చేయాలి. ఇన్వెస్టిగేషన్‌ మానిటరింగ్‌ అండ్‌ లీగల్‌ వింగ్‌లో ఠాణాలు, డాక్యుమెంటేషన్‌ ట్రైనింగ్‌ అండ్‌ అవేర్‌సెస్‌ వింగ్‌లో డ్రగ్‌ డిస్పోజల్‌ అండ్‌ అవేర్‌నెస్‌ కమిటీలతో పాటు వివిధ రాష్ట్ర, కేంద్ర విభాగాలు, అడ్మిన్‌ అండ్‌ లాజిస్టిక్‌ వింగ్‌లో ట్రాన్స్‌పోర్టు, కంట్రోల్‌ రూమ్‌ తదితరాలు, టెక్నికల్‌ వింగ్‌లో డేటా ఎనాలసిస్, డార్క్‌ వెబ్, సోషల్‌ మీడియా మానిటరింగ్, ఫైనాన్షియల్‌ ఎనాలసిస్, డిజిటల్‌ ఫోరెన్సిక్, అఫెండర్స్‌ మానిటరింగ్‌ విభాగాలు, స్టేట్‌ టాస్‌్కఫోర్స్‌లో నార్కోటిక్స్‌ డిటెక్షన్‌ డాగ్స్‌ విభాగం ఏర్పాటు కావాల్సి ఉంది. ఇవి ఎప్పటికి సాకారమవుతా యన్నది ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement