సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పలువురు సీనియర్ ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఒకేసారి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లకు సీపీలను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాస రెడ్డి నియమితులయ్యారు. సైబరాబాద్ జాయింట్ సీపీ అడ్మిన్‌గా పనిచేస్తున్న 2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అవినాశ్ మహంతికి సైబరాబాద్ సీపీగా బాధ్యతలు అప్పగించారు.
హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్‌గా పనిచేసిన 2001 బ్యాచ్ ఐపీఎస్ అధికారి జి సు«దీర్‌బాబు రాచకొండ సీపీగా నియమితులయ్యారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సందీప్ శాండిల్యను తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్‌గా బదిలీ చేశారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మాదక ద్రవ్యాల నియంత్రణ అంశంపై నిర్వహించిన సమీక్షలో తీసుకున్న నిర్ణయం మేరకు పూర్తి స్థాయి డైరెక్టర్‌ను నియమించారు.
ఇప్పటి వరకు సైబరాబాద్, రాచకొండ సీపీలుగా పనిచేసిన స్టీఫెన్ రవీంద్ర, దేవేంద్రసింగ్ చౌహాన్‌లను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని సీఎస్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం మల్టీజోన్–2 ఐజీ షానవాజ్ ఖాసీం ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం మరో ఉత్తర్వును జారీ చేశారు.
ఒకేసారి భారీ మార్పులపై సీఎం కసరత్తు!
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మంగళవారం జరిగిన ఐపీఎస్‌ల బదిలీలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భారీ కసరత్తే చేసినట్టు తెలుస్తోంది. గతానికి భిన్నంగా అత్యంత కీలకమైన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లను ఒకేసారి బదిలీ చేయడం అందులో భాగమని చర్చ జరుగుతోంది. మొత్తంగా సీఎం రేవంత్‌రెడ్డి తన మార్క్ టీంను సెట్ చేస్తున్నారు. త్వరలోనే పలు జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు సహా భారీ సంఖ్యలో ఐపీఎస్‌ల బదిలీలు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
కొత్తకోటకు చాలాకాలం తర్వాత కీలక పోస్టింగ్
హైదరాబాద్ సీపీగా నియమితులైన సీనియర్ ఐపీఎస్ అధికారి, అడిషనల్ డీజీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డికి చాలా ఏళ్ల తర్వాత అత్యంత కీలక పోస్టింగ్ దక్కింది. గతంలో ఆపరేషన్స్ అడిషనల్ డీజీగా పనిచేసిన ఆయన తర్వాత అడిషనల్ డీజీ ఆర్గనైజేషన్స్, లీగల్‌గా బదిలీ అయ్యారు. గత కొన్ని నెలలుగా అక్కడ పనిచేస్తున్న ఆయనను ప్రభుత్వం అత్యంత కీలక పోస్టింగ్‌లోకి బదిలీ చేసింది.
సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్న స్టీఫెన్ రవీంద్రను తప్పించిన సర్కార్ ఆయన స్థానంలో అవినాశ్ మహంతికి బాధ్యతలు అప్పగించింది. సైబరాబాద్ సీపీ పోస్టు ఐజీ ర్యాంకు అయినా..డీఐజీ ర్యాంకులో ఉన్న అవినాశ్ మహంతికి అనూహ్యంగా ఆ బాధ్యతలు అప్పగించడం గమనార్హం. ఇక రాచకొండ పోలీస్ కమిషనర్‌గా డిసెంబర్ 2022లో బాధ్యతలు తీసుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహాన్ కేవలం పదకొండు నెలలకే బదిలీ అయ్యారు. ఇదే కమిషనరేట్‌లో గతంలో సుదీర్ఘ కా లంపాటు పనిచేసిన సు«దీర్‌బాబుకు కొత్త ప్రభు త్వం పోలీస్ కమిషనర్‌గా అవకాశం కలి్పంచింది.
శాండిల్యకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ బాధ్యతలు
ఎన్నికల కమిషన్ అనూహ్య నిర్ణయంతో హైదరాబాద్ సీపీగా అసెంబ్లీ ఎన్నికల ముందు బాధ్యతలు చేపట్టిన సందీప్‌శాండిల్యను సైతం ప్రభుత్వం తప్పించింది. సమర్థవంతమైన అధికారిగా పేరున్న సందీప్‌శాండిల్యకు తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ బాధ్యతలు అప్పగించింది. మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి దృఢ నిశ్చయంతో ఉండడంతో నిక్కచ్చిగా వ్యవహరించే సందీప్‌శాండిల్యకు నార్కోటిక్స్ బ్యూరో బాధ్యతలు అప్పగించినట్టు చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment