మాయదారి మందులు.. ఔషధం నుంచి డ్రగ్‌గా అవతారం! | Hyderabad: Narcotics Dept Focused On Medicines Turns To Drugs | Sakshi
Sakshi News home page

మాయదారి మందులు.. ఔషధం నుంచి డ్రగ్‌గా అవతారం!

Published Mon, Mar 13 2023 2:01 PM | Last Updated on Mon, Mar 13 2023 2:01 PM

Hyderabad: Narcotics Dept Focused On Medicines Turns To Drugs - Sakshi

టాస్క్‌ఫోర్స్‌ స్వాధీనం చేసుకున్న ఔషధాలు (ఫైల్‌)

సాక్షి, హైదరాబాద్‌: ఇప్పటి వరకు కేవలం మాదకద్రవ్యాల పైనే దృష్టి పెట్టిన హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌–న్యూ), టాస్‌్కఫోర్స్‌ అధికారులు తమ పంథా మార్చారు. పక్కదారి పడుతున్న పలు ఔషధాలపైనా కన్నేయాలని నిర్ణయించారు. డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు నగర వ్యాప్తంగా నిఘా ముమ్మరం చేశారు. ఫలితంగానే కోడిన్‌ ఫాస్పేట్‌ సిరప్, ఆల్ఫాజోలం, స్టామ్‌బేర్, ఏర్‌క్లెన్, డెబొలాన్‌ టాబ్లెట్లు... డ్యురాడెక్స్, సీ–జెక్ట్‌ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ముఠాలు చిక్కాయి. ఈ నిఘా, దాడులు కొనసాగించాలని నిర్ణయించిన అధికారులు ఇలాంటి ఔషధాల వినియోగాన్ని అధ్యయనం చేస్తున్నారు.  

కీటమైన్‌... ఔషధం నుంచి డ్రగ్‌గా..
శస్త్రచికిత్స చేసే సందర్భాల్లో రోగులకు మత్తు కలిగించడం కోసం ఇచ్చే కీటమైన్‌ హైడ్రోక్లోరైడ్‌ మార్కెట్‌లో విచ్చలవిడిగా లభిస్తుండటంతో అనేక మంది మత్తుకు బానిసైన వారు ఈ ఇంజెక్షన్‌ను వినియోగించడం మొదలెట్టారు. దీంతో స్పందించిన ప్రభుత్వం 1969లో దీన్ని ‘యంత్రణ జాబితాలోని మందు’గా మార్చింది. కీటమైన్‌ నుంచి పొడిని తయారు చేసి నిషా కోసం వాడుతుండటంతో 2011లో కేంద్రం ఈ పొడిని నిషేధిత మాదకద్రవ్యాల జాబితాలో చేర్చింది. ఇప్పుడు ఈ పొడిని ఇంట్లోనే తయారు చేసి విక్రయిస్తున్న, వినియోగిస్తున్న వారు పుట్టుకువచ్చారని అధికారులు గుర్తించారు.  

గంజాయికి ప్రత్యామ్నాయంగా నెట్రావిట్‌..
కేవలం ఇదొక్కటే కాదు మాదకద్రవ్యాలు కాని ఇలాంటి మత్తు ‘మందులు’ అనేకం నగరంలో చెలామణి అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి వారికి బ్లాక్‌మార్కెట్‌లో ఆ మత్తు ‘మందుల్ని’ సరఫరా చేయడానికి అనేక వ్యవస్థీకృత ముఠాలు సైతం పుట్టుకువచ్చాయి. ఇతర రాష్ట్రాల్లో అక్రమంగా తయారైనవి, మందుల దుకాణాలు, డీలర్ల నుంచి బయటకు వచ్చినవి బానిసలకు చేరుతున్నాయని హెచ్‌–న్యూ గుర్తించింది. గంజాయికి బానిసైన యువత ప్రస్తుతం నెట్రావిట్‌ టాబ్లెట్స్‌ వినియోగిస్తున్నారు. వీరికి బ్లాక్‌లో విక్రయించడానికి ఈ మాత్రలను మహారాష్ట్ర నుంచి అక్రమ రవాణా చేసి తీసుకువస్తున్నారు.  

దగ్గు మందులే ఎక్కువ దుర్వినియోగం..
మత్తు కోసం వినియోగిస్తున్న ఔషధాల్లో దగ్గు మందులే ప్రధానమైనవి. కొన్ని రకాలైన ఔషధాలను సేకరించడం కష్టసాధ్యం. అలాగే వైట్నర్‌ను ఖరీదు చేయడం తేలికే అయినప్పటికీ వినియోగించేప్పుడు ఇతరుల దృష్టిలో పడే అవకాశాలు ఉంటాయి. ఈ కారణాల నేపథ్యంలో దగ్గు మందు ఎక్కువగా వినియోగిస్తున్నారు. అత్యధిక శాతం దగ్గు మందుల్ని డెక్స్‌ట్రోమెథారి్ఫన్, కోడైన్‌లతో తయారు చేస్తారు. కోడైన్‌తో కూడిన ఈ రసాయనం నియంత్రిత జాబితాలో ఉన్న మాదకద్రవ్యం. మత్తును కలిగించే దీన్ని కేవలం ఔషధాత తయారీకి మాత్రమే వినియోగిస్తుంటారు. ప్రధానంగా డెక్స్‌ట్రోమెథారి్ఫన్‌ కారణంగానే అనేక మంది దగ్గు మందులకు బానిసలు అవుతున్నారని పోలీసులు గుర్తించారు. 

స్టెరాయిడ్స్‌ గానూ కొన్ని..
ఇలా ఔషధాలను కేవలం మత్తు కోసమే కాదు... కండల కోసమూ వినియోగించడం ఆందోళన కలిగించే అంశం. అత్యవసర సమయాల్లో వినియోగించే మెఫన్‌టెరై్మన్‌ సల్ఫేట్‌ ఇంజెక్షన్‌ను నగర యువత స్టెరాయిడ్‌గా వినియోగిస్తోంది. జిమ్‌ల్లో ఎక్కువ సమయం గడిపి, కండలు పెంచడానికి ఈ సూది మందు తీసుకుంటోంది. ఈ ఇంజెక్షన్‌ను అక్రమంగా యువతకు విక్రయిస్తున్న ముఠాలను గతంలో టాస్‌్కఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. మెఫన్‌టెర్మైన్‌ సల్ఫేట్, డ్యురాడెక్స్, సీ–జెక్ట్‌ ఇంజెక్షన్లు, స్టామ్‌బేర్, ఏర్‌క్లెన్, డెలాన్‌ టాబ్లెట్లు ఉ్రత్పేరకాలుగా పని చేస్తాయని చెప్తున్నారు. ఈ టాబ్లెట్లు, ఇంజెక్షన్‌లను అథ్లెట్స్‌ స్టెరాయిడ్‌గానూ వాడుతున్నారు.  

మెడికల్‌ షాపులపై డేగకన్ను... 
ఇలాంటి ఔషధాలను నిబంధనల ప్రకారం వైద్యుడి చీటీ లేనిదే అమ్మడానికి వీలులేదు. ఇలా చేస్తున్న మెడికల్‌ షాపులపై డ్రగ్‌ కంట్రోల్‌ అ«ధికారులతో పాటు హెచ్‌–న్యూ నిఘా ఉంచింది. ఒక్క టాబ్లెట్‌/ఇంజెక్షన్‌/టానిక్‌ దుర్వినియోగమైనా చర్యలు తప్ప వని స్పష్టం చేస్తోంది. యజమానుల అరెస్టు, దుకాణాల సీజ్‌ వంటి తీవ్రమైన చర్యలు తక్షణం, లైసెన్సు రద్దుకు సిఫార్సు ఉంటుందని హెచ్చరిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement