సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ కోసం ఏర్పాటు చేయదలచిన ప్రత్యేక యాంటీ నార్కోటిక్ సెల్ అడుగు ముందుకు పడటం లేదు. సీఎం కేసీఆర్ స్వయంగా ఆదేశించినా.. అధికారవర్గాల్లో కదలిక కనిపించడం లేదు. యాంటీ నార్కోటిక్ సెల్‌తోపాటు ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్ ఏర్పాటు చేయాలని రెండు నెలల కింద సీఎం కేసీఆర్ ఆదేశించారు. డ్రగ్స్ నియంత్రణ విషయంగా డీజీపీ నుంచి ఎస్పీస్థాయి వరకు, ఎక్సైజ్ కమిషనర్ నుంచి ఎస్సై వరకు అధికారులతో కీలక సమావేశం కూడా నిర్వహించారు. కానీ ఇప్పటివరకు కూడా ప్రత్యేక సెల్ విషయంగా పోలీస్‌శాఖ నుంచి గానీ, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నుంచిగానీ ఎలాంటి ప్రతిపాదన రాలేదని హోంశాఖ వర్గాలు చెప్తున్నాయి. అసలు ప్రత్యేక విభాగం ఏర్పాటవుతుందా లేదా అన్నదానిపై సీనియర్ పోలీస్ అధికారులకే స్పష్టత లేదని అంటున్నాయి.
ఒక్క హైదరాబాద్‌లో మాత్రమే..
రాష్ట్రంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మాత్రమే హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్–న్యూ), నార్కోటిక్ ఇన్వెస్టిగేషన్ సూపర్‌విజన్ వింగ్ ఏర్పాటు చేశారు. ఇదితప్ప ఏ కమిషనరేట్‌లో గానీ, జిల్లా యూనిట్‌లోగానీ డ్రగ్స్, వ్యవస్థీకృత నేరాల నియంత్రణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటుకాలేదు. అయితే డ్రగ్స్ దందా, వినియోగం చాలా వరకు హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లోనే జరుగుతోంది. గతంలో అరెస్టయిన ఇంటర్నేషనల్ డ్రగ్ పెడ్లర్ టోనీ వ్యవహారం నుంచి.. తాజాగా డ్రగ్స్ మితిమీరి ప్రాణాలు కోల్పోయిన యువకుడి వరకు పరిశీలిస్తే.. డ్రగ్స్ మహమ్మారి ఎంతగా విస్తరించిందో తెలుస్తోంది.
రెండు, మూడు రోజుల హడావుడితో సరి..
సీఎం కేసీఆర్ సమావేశం తర్వాత రెండు మూడు రోజులు హడావుడి చేసిన పోలీస్, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు.. ఆ తర్వాత కనీసం ఒక్కసారి కూడా సమావేశం కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంలో ప్రధాన పాత్ర పోలీస్ శాఖదే అయినా, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో సమన్వయం తప్పనిసరి. కానీ ఆ దిశగా చర్చలు గానీ, యూనిట్ల ఏర్పాటులో భాగస్వామ్యంపై ఎక్కడా అడుగు ముందుకు పడని పరిస్థితి.
రాష్ట్ర స్థాయిలోనా.. జిల్లాకొకటా?
డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక సెల్‌ను రాష్ట్రస్థాయిలో ఏర్పాటుచేయాలా? లేకా ఎక్కడికక్కడ జిల్లా, కమిషనరేట్ల పరిధిలో ఏర్పాటుచేయాలా అన్నదానిపై ఇప్పటికీ ఎలాంటి ప్రతిపాదన కూడా లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని పలువురు జిల్లా పోలీస్ అధికా రులు అంటున్నారు. ఎస్పీలు, కమిషనర్ల పరిధి లో బృందాలను ఏర్పాటు చేసి.. కేసుల తీవ్రతను బట్టి పర్యవేక్షణ కోసం రాష్ట్రస్థాయిలో ఒక సీనియర్ ఐపీ ఎస్‌కు బాధ్యతలు అప్పగిస్తారా అన్నదీ తేల లేదు. అసలు డ్రగ్స్ నియంత్రణపై ఏం చర్యలు చేపడుతున్నారో కూడా కమిషనర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం లేదని పోలీసువర్గాలే చెప్తుండటం గమనార్హం.
సిటీ చుట్టుపక్కల
కేవలం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే కాదు, శివార్లు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఇంజనీరింగ్, మెడిసిన్, ఇతర కాలేజీల్లోనూ డ్రగ్స్ మాఫియా దందా సాగుతోందని ఇటీవలి ఘటనల్లో బయటపడింది. అయినా.. సైబరాబాద్, రాచకొండ, సంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం లాంటి ప్రాంతాల్లో యాంటీ నార్కోటిక్ సెల్ ఏర్పాటుకు ఎలాంటి చర్యలూ చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment