సాక్షి హైదరాబాద్: రాజధానిలో డ్రగ్ అనే మాట వినపడకూడదంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను అమలు పెట్టడంలో భాగంగా నగర కొత్వాల్ సీవీ ఆనంద్ ప్రత్యేక విభాగానికి అంకురార్పణ చేశారు. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌గా (హెచ్–న్యూ) పిలిచే దీంతో పాటు డ్రగ్స్‌పై పోరు కోసం ప్రత్యేకంగా నార్కోటిక్స్ ఇన్వెస్టిగేషన్ సూపర్‌వైజింగ్ వింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండింటినీ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి బుధవారం ఆవిష్కరించనున్నారు.
బషీర్‌బాగ్‌లోని నగర పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. హెచ్–న్యూకు డీసీపీ స్థాయి అధికారి అధిపతిగా ఉండనున్నారు. తాత్కాలికంగా ఈ బాధ్యతల్ని ప్రస్తుత టాస్క్‌ఫోర్స్ డీసీపీ చక్రవర్తి గుమ్మికి అప్పగిస్తున్నారు. ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, నలుగురు సబ్–ఇన్‌స్పెక్టర్లతో పాటు 20 మంది కానిస్టేబుళ్లతో పని చేసే ఈ విభాగం గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం సేకరించడం, దాడులు చేయడం, నిందితులను పట్టుకోవడం వంటి విధులు నిర్వర్తిస్తూ ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్ మాదిరిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌గా కొనసాగుతుంది.
వీటికి సంబంధించిన కేసులు మాత్రం స్థానికంగా ఆయా పోలీసుస్టేషన్లలోనే నమోదు అవుతాయి. ఈ కేసుల దర్యాప్తు పక్కాగా సాగి, నిందితులు కోర్టులో దోషులుగా నిరూపితమై శిక్షలు పడితేనే పూర్తి స్థాయి ఫలితాలు ఉంటాయని పోలీసు కమిషనర్ ఆనంద్ భావిస్తున్నారు. దీనికోసమే ప్రత్యేకంగా నార్కోటిక్స్ ఇన్వెస్టిగేషన్ సూపర్‌వైజింగ్ వింగ్‌ను ఏర్పాటు చేశారు. అదనపు సీపీ (సిట్, నేరాలు) ఏఆర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో పని చేసే దీనికి సీసీఎస్ ఏసీపీ కందుకూరి నర్సింగ్‌రావు నేతృత్వం వహించనున్నారు. ఇన్‌స్పెక్టర్, ఎస్సైతో పాటు ఆరుగురు కానిస్టేబుళ్లు ఇందులో ఉంటారు. డ్రగ్స్ కేసుల్లో ఎఫ్‌ఐఆర్ నమోదు నుంచి కోర్టుల్లో విచారణ పూర్తయ్యే వరకు ఈ విభా గం పర్యవేక్షిస్తుంది. దీనిపై బుధవారం ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment