విజయ్ మద్దూరిపై పోలీసుల ప్రశ్నల వర్షం..
శంకర్‌పల్లి: విజయ్ మద్దూరిపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలిసింది. కొకైన్ ఎక్కడ తీసుకున్నావ్? ఫోన్ ఎక్కడ దాచావ్? విదేశీ మద్యం ఎక్కడ నుంచి తెచ్చారు? పార్టీలో ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు అంటూ ప్రశ్నించనట్టు సమాచారం.
మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల కేసులో డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చిన విజయ్ మద్దూరి హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం మోకిల పోలీస్‌స్టేషన్‌లో తన న్యాయవాది అవినాష్‌తో కలిసి విచారణకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా నార్సింగి ఏసీపీ రమణగౌడ్ సమక్షంలో మోకిల సీఐ వీరబాబు విచారణ చేపట్టారు. రెండుసార్లు నోటీసులు ఇచ్చిన తర్వాత విజయ్ పోలీస్‌స్టేషన్‌కు రావడంతో పోలీసులు ఆయన్ను పలుకోణాల్లో ప్రశ్నించినట్టు తెలిసింది.
తాను అక్టోబర్ 10 నుంచి 14 వరకు నెదర్లాండ్స్‌లో రోజూ కొకైన్ తీసుకున్నానని..రాజ్ పాకాల ఇంట్లో పార్టీలో తీసుకోలేదని సమాధానం ఇచ్చారు. పార్టీ సమయంలో తన ఫోన్‌లో చార్జింగ్ లేక అక్కడే చార్జింగ్ పెట్టానన్నాడు. ఎవరైనా తీసుకున్నట్టు తెలిస్తే అప్పగిస్తానని పోలీసులకు చెప్పాడు. సుమారు మూడు గంటల పాటు విచారించిన పోలీసులు, మళ్లీ అవసరమైతే పిలుస్తామని పంపించారు. ఇంటికి వెళ్లే సమయంలో విజయ్ మద్దూరితో మీడియా ప్రతినిధులు మాట్లాడే ప్రయత్నం చేయగా, ఆయన నిరాకరించారు.
Comments
Please login to add a commentAdd a comment