మహిళ నుంచి రూ. 7.4 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
ముంబై: ముంబై ఎయిర్పోర్ట్లో బుధవారం భారీ ఎత్తున మత్తు మందులను స్వాధీనం చేసుకున్నారు. దోహా మీదుగా దార్-ఇ-సలామ్కు భారీ ఎత్తున మెథాక్విలోన్ అక్రమంగా తరలిస్తుండగా స్నిఫర్ డాగ్స్ పట్టేశాయి. 74 కేజీల మెథాక్విలోన్ ను తరలిస్తున్న టాంజానియా మహిళ చాంబో ఫాత్మా బాసిల్ ఎయిర్ ఇంటిలిజెన్స్ విభాగానికి చిక్కింది. ఈ డ్రగ్స్ విలువ 7.4 కోట్ల రూపాయలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు.
సాధారణ తనిఖీల్లో భాగంగా స్నిఫర్ డాగ్స్ మత్తు మందుల బ్యాగ్ ను గుర్తించాయని ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ఎత్తున మత్తుమందులను పట్టుకోవడం ఇదే మొదటిసారని కస్టమ్స్ ఎడిషనల్ కమిషనర్ మిలింద్ లాంజేవార్ తెలిపారు. తక్షణమే బాసిల్ను అదుపులోకి తీసుకున్నామని తదుపరి విచారణ కొనసాగుతుందని తెలిపారు. గతంలో జింబాబ్వే మహిళ 13 కేజీలు ,ఇపుడు టాంజానియా మహిళ74 కేజీల అక్రమంగా రవాణా చేస్తున్న మత్తుమందులను పట్టుకోవడంలో కూడా తమ స్నిఫర్ డాగ్స్ టీమ్ ప్రముఖ పాత్ర వహించాయని అధికారులు వెల్లడించారు.