అత్యుత్సాహం తగ్గించుకోండి.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడండి
సరిహద్దులో సైన్యంలా రాష్ట్రంలోకి డ్రగ్స్ రాకుండా పహారా కాయండి
సైనిక స్కూళ్ల మాదిరే పోలీసు పిల్లలకు ప్రత్యేక స్కూల్ ఏర్పాటు చేస్తాం
పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘రాజకీయ వ్యవస్థపై నిఘా తగ్గించి నేరాలపై నిఘా పెట్టి నేరస్తులను పట్టు కోవాలి. ప్రజలు ఎన్నుకుంటే ప్రజాప్రతినిధులుగా వచ్చాము. మాకు మితిమీరిన సెక్యూరిటీ అవసరం లేదు. ఎవరికి ఎంత అవసరమో అంతే భద్రత ఇవ్వాలి. భద్రత విషయంలో నాతో సహా ఎవరికీ అధిక ప్రాధాన్యం ఇవ్వా ల్సిన అవసరం లేదు. భద్రత, ఇతర విషయాల్లో కొన్నిసార్లు పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారు.
ఆ ఉత్సాహాన్ని నేరాల నియంత్రణపై చూపాలి’ అని ముఖ్యమంత్రి డీజీపీ సహా పోలీసు ఉన్నతాధికారులకు హితవు పలికారు. మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల అధికారులు, సిబ్బందితో నగరంలో శాంతిభద్రతలపై సీఎం సమీక్షించారు. వారికి కీలక సూచనలు చేశారు.
డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి సామర్థ్యాలు పెంచుకోవాలి
తెలంగాణకు ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏవోబీ) నుంచి గంజాయి వస్తోందనే సమాచారం ఉందని సీఎం రేవంత్ చెప్పారు. దేశ సరిహద్దుల్లో సైన్యం ఎలా అప్రమత్తంగా ఉంటూ ఉగ్రమూకలు చొరబడకుండా పహారా కాస్తోందో.. రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు అలా పహారా కాసి తెలంగాణలోకి గంజాయి, డ్రగ్స్ రాకుండా చూడాలని సూచించారు.
డ్రగ్స్, సైబర్ నేరాలను అరికట్టేందుకు అవసరమైన సామర్థ్యాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. సింగరేణి కాలనీలో ఒక బాధితుని కుటుంబాన్ని, ఔటర్ రింగ్‌రోడ్డులో ఒక బాధితుడైన డాక్టర్‌ను పరామర్శించడానికి వెళ్తే వారంతా గంజాయికి అలవాటుపడిన వ్యక్తుల వల్లే బాధితులుగా మారామని చెప్పారన్నారు.
తమ పిల్లలు డ్రగ్స్‌కు అలవాటుపడ్డారని.. తాము రూ. వందల కోట్లు సంపాదించినా ఉపయోగం లేకుండాపోయిందంటూ పలువురు తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేశారన్నారు. ఇందుకు ప్రధాన కారణం పోలీసు వ్యవస్థ రాజకీయ నిఘాపై శ్రద్ధపెట్టి నేరస్తులను వదిలేయడమేనని సీఎం అభిప్రాయపడ్డారు.
పోలీసు కుటుంబం నుంచే వచ్చా
పోలీసుల పిల్లలు తాము పోలీసుల కుటుంబాల నుంచి వచ్చామని చెప్పుకొనేందుకు ఇబ్బంది పడతారని, అందుకు కారణం పోలీసు శాఖపై సమాజంలో ఉన్న దురభిప్రాయ మేనని సీఎం రేవంత్ అన్నారు. ఆ అభిప్రాయం మారాలని, తన తండ్రి, తన అన్న పోలీసు అని గర్వంగా చెప్పుకునేలా పోలీసుల ప్రవర్తన ఉండాలని ఆయన సూచించారు.
తన సోదరుడు భూపాల్‌రెడ్డి వనపర్తిలో కానిస్టేబుల్‌గా పనిచేసి తనను చదివించారని, తన అన్న పెంపకం వల్లే తాను సీఎం స్థాయికి ఎదిగానని రేవంత్ వెల్లడించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు పోలీసు శాఖ సమస్యలు పరిష్కరించుకోకుంటే ఇక జీవితకాలంలో ఎప్పటికీ పరిష్కారం కావన్నారు.
పోలీసుల పిల్లలకు ఉచిత విద్య
సైనిక స్కూళ్ల మాదిరే పోలీసు పిల్లల కోసం పోలీసు స్కూళ్లు ఏర్పాటు చేస్తామని సీఎం వెల్లడించారు. గ్రేహౌండ్స్‌కు చెందిన 50 ఎకరాల స్థలంలో పోలీసు స్కూల్ ఏర్పాటు చేస్తామని, ఆరో తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందులో ఉంటుందని, హోంగార్డు నుంచి డీజీపీ పిల్లల వరకు చదువుకోవచ్చని చెప్పారు.
సామర్థ్యం, పనితీరుతోనే బదిలీలు కోరుకోవాలని సీఎం సూచించారు. సామర్థ్యం ఉన్నవారిని తమ ప్రభుత్వం గుర్తిస్తుందని, అందుకు రిటైర్డ్ ఐపీఎస్ సందీప్ శాండిల్య ఉదాహరణ అని పేర్కొన్నారు. రిటైరైనప్పటికీ సందీప్ శాండిల్యకు మాత్రమే ప్రభుత్వం పదవీకాలం పొడిగించిన విషయం గుర్తించాలన్నారు.
పైసలతో పోస్టింగ్‌లు కుదరదు!
‘పైసలతో పోస్టింగ్‌లు తెచ్చుకుందామంటే కుదరదు. పనితీరు ఆధారంగానే బదిలీలు ఉంటాయి. డబ్బు పెట్టి పోస్టింగ్‌లు తెచ్చుకొని మళ్లీ డబ్బు దండుకోవాలంటే ఏసీబీ వెంటపడుతుంది’ అని సీఎం రేవంత్ పోలీసు అధికారులను హెచ్చరించినట్లు సమాచారం.
తెలంగాణ బ్రాండ్ హైదరాబాద్..
తెలంగాణ బ్రాండే హైదరాబాద్ అని, హైదరాబాద్ పోలీ సులంటే తెలంగాణకు గుండె లాంటి వారని సీఎం రేవంత్ అన్నారు. హైదరాబాద్‌లో నేరాలను, అరాచకాలను అరికట్టకపోతే రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు. అందుకే హైదరాబాద్ ఇమేజ్‌ను కాపాడాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment