డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధుల ప్రత్యేక సందర్శన.
అక్కడ ఇంటి స్థలానికి ఆసక్తి చూపిన పాత్రికేయులు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు.
ఆరు నెలల్లో ఇవ్వాలని విన్నపం
సాక్షి, హైదరాబాద్: డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్ఎస్) సభ్యులు వందలాది మంది ఆదివారం ఫ్యూచర్ సిటీ (ఫోర్త్ సిటీ)ని ప్రత్యేకంగా సందర్శించారు. ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో డీజేహెచ్ఎస్ సభ్యులు అక్కడ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
నేడు ఫోర్త్ సిటీని సందర్శించిన జర్నలిస్టులు అక్కడి వాతావరణం పట్ల ఆసక్తి చూపించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో డీజేహెచ్ఎస్ అధ్యక్షులు బొల్లోజు రవి, ఉపాధ్యక్షులు మరిపాల శ్రీనివాస్, కోశాధికారి చిలుకూరి అయ్యప్ప, డైరెక్టర్లు దండ రామకృష్ణ, డేగ కుమార్, నాగరాజు మాట్లాడారు. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వీలైనంత త్వరగా ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి నిర్ణయం తమకు ఆమోదయోగ్యమని స్పష్టం చేశారు. ఆరు నెలల్లోగా ఇచ్చేలా కసరత్తు చేయాలని ముఖ్యమంత్రికి డీజేహెచ్ఎస్ అధ్యక్షులు బొల్లోజు రవి సూచించారు. హైదరాబాద్‌కు ఇది నాలుగో సిటీగా అభివృద్ధి అవుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే అక్కడ అమెజాన్ డేటా సెంటర్ ఉందన్నారు.
అలాగే.. స్కిల్ యూనివర్సిటీ, వరల్డ్ ట్రేడ్ సెంటర్ రాబోతున్నాయన్నారు. నెట్ జీరో వల్ల కాలుష్య రహిత ప్రాంతంగా ఉంటుందన్నారు. హైటెక్ సిటీ, గచ్చిబౌలి తదితర ప్రాంతాలకు ధీటుగా ఇది అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తుందన్నారు. అందువల్ల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అక్కడ ఇస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు మార్గం కూడా రానున్నందున ప్రయోజనం ఉంటుందన్నారు. ఇళ్ల స్థలాల విషయంలో జర్నలిస్టులంతా ఐకమత్యంతో ఉండాలని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందున దాన్ని సాధించుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఫోర్త్ సిటీలో ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు. అందుకోసం చొరవ చూపిన సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment