Housing Society
-
జీహెచ్ఎంసీలో హౌజింగ్ సొసైటీలపై సుప్రీం సంచలన తీర్పు
సాక్షి,ఢిల్లీ: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో హౌసింగ్ సొసైటీలపై సుప్రీంకోర్టు సోమవారం(నవంబర్ 25) సంచలన తీర్పిచ్చింది. హౌజింగ్ సొసైటీలకు ఇప్పటికే చేసిన భూ కేటాయింపులను సీజేఐ సంజీవ్‌ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం రద్దు చేసింది. ఇంతేకాకుండా సొసైటీలు చెల్లించిన డబ్బును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది.హౌజింగ్ సొసైటీలకు ప్రభుత్వ భూ కేటాయింపులను సవాలు చేస్తూ రావు బి చెలికాని అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పిచ్చింది. ప్రజా ప్రతినిధులు,ప్రభుత్వ ఉద్యోగులు,జర్నలిస్టుల సొసైటీలకు ప్రభుత్వంలో గతంలో భూ కేటాయింపులు జరిపింది. ఇదీ చదవండి: సోషల్‌మీడియా అండతో తీర్పులను ప్రభావితం చేసే యత్నాలు -
ఫ్యూచర్ సిటీకి జర్నలిస్టుల విజిట్
సాక్షి, హైదరాబాద్: డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్ఎస్) సభ్యులు వందలాది మంది ఆదివారం ఫ్యూచర్ సిటీ (ఫోర్త్ సిటీ)ని ప్రత్యేకంగా సందర్శించారు. ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో డీజేహెచ్ఎస్ సభ్యులు అక్కడ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.నేడు ఫోర్త్ సిటీని సందర్శించిన జర్నలిస్టులు అక్కడి వాతావరణం పట్ల ఆసక్తి చూపించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో డీజేహెచ్ఎస్ అధ్యక్షులు బొల్లోజు రవి, ఉపాధ్యక్షులు మరిపాల శ్రీనివాస్, కోశాధికారి చిలుకూరి అయ్యప్ప, డైరెక్టర్లు దండ రామకృష్ణ, డేగ కుమార్, నాగరాజు మాట్లాడారు. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వీలైనంత త్వరగా ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి నిర్ణయం తమకు ఆమోదయోగ్యమని స్పష్టం చేశారు. ఆరు నెలల్లోగా ఇచ్చేలా కసరత్తు చేయాలని ముఖ్యమంత్రికి డీజేహెచ్ఎస్ అధ్యక్షులు బొల్లోజు రవి సూచించారు. హైదరాబాద్‌కు ఇది నాలుగో సిటీగా అభివృద్ధి అవుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే అక్కడ అమెజాన్ డేటా సెంటర్ ఉందన్నారు.అలాగే.. స్కిల్ యూనివర్సిటీ, వరల్డ్ ట్రేడ్ సెంటర్ రాబోతున్నాయన్నారు. నెట్ జీరో వల్ల కాలుష్య రహిత ప్రాంతంగా ఉంటుందన్నారు. హైటెక్ సిటీ, గచ్చిబౌలి తదితర ప్రాంతాలకు ధీటుగా ఇది అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తుందన్నారు. అందువల్ల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అక్కడ ఇస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు మార్గం కూడా రానున్నందున ప్రయోజనం ఉంటుందన్నారు. ఇళ్ల స్థలాల విషయంలో జర్నలిస్టులంతా ఐకమత్యంతో ఉండాలని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందున దాన్ని సాధించుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఫోర్త్ సిటీలో ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు. అందుకోసం చొరవ చూపిన సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
‘జూబ్లీహిల్స్’.. అక్రమాలు ఫుల్!
సాక్షి, హైదరాబాద్: సహకార హౌసింగ్ సొసైటీలు ఏవైనా.. సొసైటీలో ఇల్లు లేని వారికి తక్కువ ధరతో స్థలం అందేలా చూడటం, సభ్యులు చెల్లించే సొమ్మును, వారి ప్రయోజనాలను పరిరక్షించడం వాటి విధి. కానీ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అందుకు పూర్తి విరుద్ధంగా తయారైంది. 1962లో ఎంతో మంచి ఉద్దేశంతో ఏర్పాటైన ఈ సొసైటీ.. కొన్నేళ్ల నుంచి రూట్ మార్చుకుంది. చట్టాన్ని పట్టించుకునేది లేదు.. నిబంధనలను అమలు చేసేది లేదు.. పాలక వర్గానికి తోచిందే చట్టం, వారు పెట్టిందే నిబంధన అన్నట్టు మారింది.కొందరు వ్యక్తులు స్వలాభాపేక్షతో సొసైటీని ఆర్థిక వనరుగా మార్చుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారు కొన్నేళ్లుగా సొసైటీని తమ చెప్పుచేతల్లో పెట్టుకున్నారని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో పాతవారికి స్థలాలు మంజూరు కాకుండానే కొత్తగా సభ్యులను చేర్చుకునే అక్రమానికి తెరలేపారని మండిపడుతున్నారు. దీనికోసం దశాబ్దాలుగా ఉంటున్న వారిని సొసైటీ నుంచి తొలగించేందుకు ప్రయతి్నంచారని.. సంబంధిత అధికారులు దీన్ని తిరస్కరించారని సమాచారం. తమ పథకం బెడిసికొట్టినా.. కొత్త సభ్యత్వాలను మాత్రం ప్రారంభించడం గమనార్హం. టీవీ–5 చానల్ అధినేత కుమారుడు రవీంద్రనాథ్ అధ్యక్షుడిగా ఉన్న ఈ జూబ్లీహిల్స్ సొసైటీ లీలలు మరెన్నో ఉన్నాయని కొందరు సభ్యులు పేర్కొంటున్నారు. సహకార సూత్రాల మేరకు ఏర్పాటై.. ‘ఆంధ్రప్రదేశ్ కో–ఆపరేటివ్ సొసైటీ చట్టం’కింద 1962 జూలై 7న ‘జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ (జేహెచ్‌సీహెచ్‌బీఎస్)’రిజిస్టర్ అయింది. సొసైటీ ఏర్పడినప్పుడు సభ్యుల సంఖ్య 300 మంది. సహకార సూత్రాలకు అనుగుణంగా సభ్యుల ప్రయోజనాలు కాపాడుతూ.. భూమి కొనుగోలు, అభివృద్ధి చేయాలన్నది నిబంధన. సొసైటీ కోసం 2,500 షేర్లను, ఒక్కో షేర్‌కు రూ.100 చొప్పున నిర్ణయించి.. మొత్తంగా రూ.2.5 లక్షల మూలధనంతో సొసైటీని ప్రారంభించారు. నిబంధనల మేరకు జూబ్లీహిల్స్లోనే ఈ సొసైటీ కార్యకలాపాలు నిర్వహించాలి.సభ్యుల్లో ఎవరైనా తన పేరిట, తన భార్య, పిల్లల పేరు మీద షేర్లు కొనుగోలు చేయవచ్చు. అయితే సొంత ఇల్లు లేనివారే సభ్యుడిగా ఉంటారు. 1964లో ప్రభుత్వం షేక్‌పేట్ సర్వే నంబర్ 403లో 1,195 ఎకరాలు, హకీంపేట్ సర్వే నంబర్ 102లో 203 ఎకరాలు కలిపి మొత్తంగా 1,398 ఎకరాలను కేటాయించింది. ఇందులో.. 1971లో 1,345.40 ఎకరాలను, 1972లో 40.67 ఎకరాలను కలిపి.. 1,386.07 ఎకరాలను సొసైటీకి అందజేసింది. సొసైటీ ఈ భూమిలో 1984 నుంచి 1991 మధ్య 3,035 మంది సభ్యులకు ప్లాట్లను అందజేసింది. సభ్యులకు ఒకసారి ప్లాట్ అందినా, లేదా సభ్యుడయ్యాక హైదరాబాద్ నగరంలో ఇల్లు ఉన్నా వారు మరో ప్లాట్ పొందేందుకు అనర్హులు. విక్రయించడం చట్టవిరుద్ధం ఒకరి ప్లాట్‌ను మరో సభ్యుడికి బదిలీ చేయడంగానీ, అసలు సభ్యత్వమే లేని వారికి విక్రయించడంగానీ చట్టవిరుద్ధం. ఒకవేళ ఏవైనా అనివార్య కారణాలతో సభ్యుడెవరైనా ప్లాట్ బదిలీ చేయాలని భావిస్తే.. దాన్ని సొసైటీకి అప్పగించాలి. ప్లాట్ పొందేటప్పుడు వారు చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా సొసైటీ తిరిగి చెల్లించాలి. ఈ స్థలాన్ని సొసైటీలో సీనియారిటీ ప్రకారం వెయిటింగ్‌లోని లబ్ధిదారులకు మంజూరు చేయాలి. వీరి నుంచి ప్రభుత్వ మార్కెట్ విలువ, ఇతర చార్జీలు వసూలు చేయవచ్చు. మేనేజింగ్ కమిటీ అనుమతి లేకుండా సభ్యుడు స్థలాన్ని విక్రయించడానికి వీలులేదు. అలా ఎవరైనా విక్రయిస్తే అది చట్టవిరుద్ధంగా, కొనుగోలు చేసినవారిని ఆక్రమణదారుగా పరిగణిస్తారు. ఇక సొసైటీలోని సభ్యులందరికీ ఇంటి స్థలం మంజూరుకాకుండా.. కొత్తగా సభ్యులను తీసుకోవద్దని నిబంధన చెబుతోంది. ఉదాహరణకు 90 మందికి స్థలాలు ఇచ్చే అవకాశం ఉంటే 100 మందిని సభ్యులుగా తీసుకోవాలి. లబి్ధపొందని వారు 10 శాతానికి మించి ఉండటానికి వీలులేదు. కానీ జూబ్లీహిల్స్ సొసైటీలో స్థలాలు అందనివారు 30 శాతానికి పైనే.. 800 మందిని తొలగించే ప్రయత్నం.. సొసైటీలో కేవైసీ (పూర్తి చిరునామా, ఇతర వివరాలు) లేదని, జనరల్ బాడీ సమావేశానికి హాజరుకావడం లేదని.. ఎక్కడ ఉంటున్నారో అడ్రస్ కూడా లేదని కారణాలు చూపుతూ దశాబ్దాలకుపైగా ఉన్న 800 మంది సభ్యుల తొలగింపునకు సొసైటీ పాలకవర్గం ఎత్తులు వేసింది. 2024 మార్చి 24లోగా కేవైసీ అందజేయాలంటూ సభ్యులను ఆదేశించింది. అనుకున్నదే తడవుగా వివరాలు ఇవ్వని 800 మందిని తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. జాబితా కూడా సిద్ధం చేసి పంపగా.. హౌసింగ్ అధికారులు దీనికి ససేమిరా అనడంతో తొలగింపు ప్రక్రియకు బ్రేక్ పడింది. అయితే అంగ బలం, ఆర్థిక బలంతో ఈ తొలగింపు జాబితాకు అధికారులు ఆమోదముద్ర వేసేలా తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. సొసైటీ పాలకవర్గం తీరును నిరసిస్తూ కొందరు సభ్యులు కరపత్రాలు వేసి, పంచినా కూడా.. వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. ‘రియల్’దందా కోసమే.. సొసైటీలో అసలు స్థలమే లేనప్పుడు సభ్యులను తొలగించడం ఎందుకు? కొత్త వారిని చేర్చుకోవడం ఎందుకు? అనే ప్రశ్నలూ వస్తున్నాయి. ఇక్కడే సదరు అక్రమార్కులు చక్రం తిప్పడం ప్రారంభించారు. కొత్త సభ్యత్వాల పేర రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టారు. సొసైటీకి సంబంధం లేని వెంచర్లో అమ్మకాలు ప్రారంభించారు. అభివృద్ధి ప్రతిపాదనలకే పరిమితమంటూ అంటగడుతున్న ఆ వెంచర్ ఏంటి? ఎక్కడ ఉంది? ప్లాట్ల అమ్మకాల ‘రియల్’కహానీ రెండో భాగంలో.. ప్రస్తుతం సొసైటీలో మొత్తం సభ్యుల సంఖ్య: 4,962 మంది వీరిలో స్థలం పొందిన లబి్ధదారులు: 3,035 మంది ఇంకా ప్లాట్లు రానివారు: 1,927 మంది మూడు దశాబ్దాలుగా ఎదురుచూపులే.. జూబ్లీహిల్స్ సొసైటీలో స్థలం మంజూరు కోసం మూడు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నవాళ్లు వందల సంఖ్యలో ఉన్నారు. ఇప్పటివరకు వారికి స్థలం అందించే దిశగా ఎలాంటి చర్యలు లేవు. మొత్తం 1,927 మంది ఎదురుచూస్తుండగా.. పలు కారణాలతో 800 మందిని తొలగించారు. వారి స్థానంలో నిబంధనలకు విరుద్ధంగా 800 మందిని తీసుకోవడానికి ప్రయతి్నస్తున్నారు. మిగిలిన 1,145 మందికి స్థలాలు వచ్చే వరకు కొత్త వారిని చేర్చుకోవద్దని డిమాండ్ చేస్తున్నాం. క్లబ్ కోసమంటూ కొత్త వారిని చేర్చుకుంటే ఒత్తిడి పెరిగి, అసౌకర్యంగా మారుతుంది. – ప్రభాకర్‌రావు, సొసైటీ సభ్యుడు10 శాతానికి మించి ఉండొద్దు.. కో–ఆపరేటివ్ చట్టంలోని సెక్షన్–19 ప్రకారం స్థలాలు ఉంటేనే కొత్త సభ్యులను చేర్చుకోవాలి. ప్రస్తుతానికి సొసైటీ వద్ద ఖాళీ స్థలం లేదు. అంతేకాదు స్థలం పొందని సభ్యులు 10శాతానికి మించి ఉండకూడదని హౌసింగ్ సొసైటీ నిబంధన. కొత్తవారి నుంచి షేర్ వ్యాల్యూ కేవలం రూ.300 తీసుకుని దాదాపు రూ.15 వేల కోట్ల విలువైన ఆస్తులపై వారికి కూడా హక్కులు వర్తింపజేస్తున్నారు. క్లబ్, స్కూల్, కమ్యూనిటీ సెంటర్ ఇలా అన్నింటిలో వారిని భాగస్వాములను చేస్తున్నారు. ఇది ఎంత వరకు సమంజసం? – విజయభాస్కర్‌రెడ్డి, సొసైటీ సభ్యుడుసొసైటీది సహాయక పాత్ర మాత్రమే.. వివిధ కారణాలతో సొసైటీ నుంచి 800 మంది వెళ్లిపోయారు. వారికి నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. జనరల్ బాడీ ఆమోదంతోనే వారిని తొలగించాం. కొత్త సభ్యుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. 800 మందికి మించి తీసుకోం. వీరితోపాటు ఇంకా స్థలాలు రానివారు దాదాపు 1,200 మంది ఉన్నారు. ఈ రెండు వేల మంది కలిసి నిర్మించుకుంటున్న వెంచర్ జూబ్లీహిల్స్ ఫేజ్–4. కాస్ట్ టు కాస్ట్ (ఖర్చులు) ధరకే వీరికి ఫ్లాట్లు అందనున్నాయి. వీరంతా సొసైటీ సభ్యులే అయినందున మేం ఫెసిలిటేటర్‌గా ముందుకు వచ్చాం. వెంచర్‌ను నిపుణులైన కమిటీ పర్యవేక్షిస్తుంది. సొసైటీకి సంబంధించి ఒక్క రూపాయి కూడా వెంచర్ కోసం ఖర్చు చేయడం లేదు. చట్టప్రకారం, జనరల్ బాడీ అనుమతితోనే చర్యలు చేపడుతున్నాం. – రవీంద్రనాథ్, సొసైటీ అధ్యక్షుడు సభ్యత్వం తొలగింపుపై చట్టం ఏం చెబుతోంది? చట్టప్రకారం ఎవరి సభ్యత్వమైనా తొలగించాలంటే.. ఎందుకు తీసివేస్తున్నామో కారణాలు వెల్లడిస్తూ వారికి నోటీసులు జారీ చేయాలి. తర్వాత వారి వివరణను పరిశీలించాలి. దానిపై సంతృప్తి చెందకుంటే తీసివేతపై మేనేజ్మెంట్ కమిటీ నిర్ణయం తీసుకోవచ్చు. ఒకవేళ ఈ తొలగింపు చట్ట వ్యతిరేకమని సభ్యుడు భావిస్తే.. ట్రిబ్యునల్‌ను, ఆ తర్వాత కోర్టును ఆశ్రయించవచ్చు. అయితే తొలగింపుపై సొసైటీ నోటీసులు జారీచేసినా అవి చాలా మందికి అందలేదని.. వారి వివరణ కూడా రాకుండానే, తొలగిస్తూ జాబితాను సిద్ధం చేశారని సమాచారం. ఇప్పటివరకు జూబ్లీహిల్స్ సొసైటీ సభ్యత్వం తొలగింపునకు సంబంధించి ఒక ఫిర్యాదు అందినట్టు తెలిసింది. ఇక కొత్తగా సభ్యులను చేర్చుకునే దానిపై కమిటీ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ సొసైటీలో లబి్ధపొందని వారు 10శాతం దాటకుండా ఉండాలి. అలాంటిది స్థలం దక్కనివారు ఇప్పటికే 30శాతం ఉన్నా.. కొత్త వారిని ఎలా తీసుకుంటున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై సొసైటీని వివరణ కోరగా.. వివిధ కారణాలతో 800 మందిని తొలగించామని, ఆ స్థానంలో కొత్తవారిని తీసుకుంటున్నామని వెల్లడించడం గమనార్హం. -
ప్రెస్ క్లబ్ లో ఫైట్...
-
Election commission: హౌసింగ్ సొసైటీల్లోనూ పోలింగ్ బూత్‌లు
లక్నో: కేంద్ర రాజకీయాల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్ పలు చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రాంతాల్లోని హౌసింగ్ సొసైటీల్లో సైతం 200కు పైగా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నవదీప్ రిన్వా పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వివరించారు. ‘యూపీలోని పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం స్వల్పంగా ఉంటోంది. ఈసారి ఎలాగైనా ఓటింగ్ శాతంలో మొదటి స్థానం సంపాదించాలనేదే మా లక్ష్యం’అని ఆయన వివరించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో ఓటింగ్ శాతం 59.11 మాత్రమేనన్నారు. ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ప్రతి రెండు కిలోమీటర్ల పరిధిలో ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ‘‘తక్కువ ఓటింగ్ నమోదయ్యే గేటెడ్ కమ్యూనిటీలు, బహుళ అంతస్తుల హౌసింగ్ సొసైటీల్లో ఈసారి పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేస్తాం. ఇలాంటి మొత్తం 200పైగా బూత్‌లలో ఎక్కువ భాగం నోయిడాలోనే ఉంటాయి. ఆ తర్వాత లక్నో, కాన్పూర్, బరేలీ, మథురలోనూ ఇవి ఉంటాయి. ఈసారి ఓటింగ్ శాతం 60పైగా ఉంటుందన్న నమ్మకముంది’’ అని అన్నారు. -
రూ. 200 కోట్ల భూ దందా..
అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్‌లో అక్రమాలు చోటుచేసుకు న్నాయని అందులోని కొందరు సభ్యులు ఆరోపిస్తు న్నారు. ఈ మేరకు సహకార శాఖకు ఫిర్యా దు చేశారు. సొసైటీ సభ్యుల కోసం కొన్న భూమిలో కొంత వివాదా స్పద స్థలం ఉందని చెప్పి, ఆ మేరకు కోత విధించి ఇళ్ల స్థలాలు కేటాయించారు. చివరకు వివాదా స్పదం అని చెబుతూ వచ్చిన భూమిలో విల్లాలు నిర్మించి అమ్ముకునేందుకు మేనేజ్ మెంట్ కమిటీ సభ్యులు రంగం సిద్ధం చేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ లాభాపేక్ష లేకుండా ఉద్యో గుల కోసం ఏర్పడింది. సాధారణ అటెండర్ మొదలుకొని అకౌంటెంట్ జనరల్ వరకు కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఉద్యో గుల భాగస్వామ్యంతో డబ్బులు సమకూర్చు కొని భూమి కొనుగోలు చేసి దాన్ని లే ఔట్ చేసి సభ్యులకు ఇళ్ల స్థలాలు కేటాయించాల న్నది దీని లక్ష్యం. ఈ సొసైటీ కింద ఇప్పటి వరకు 14 వెంచర్లు వేశారు. సొసైటీలో 5 వేల మంది వరకు సభ్యులున్నారు. అత్తాపూర్, శ్రీనగర్‌కాలనీ, ఆనంద్‌నగర్ కాలనీ, నలందా నగర్, అత్తివెల్లి, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో వెంచర్లు వేశారు. మేనేజింగ్ కమిటీనే ఈ వెంచర్లు, లేఔట్లు వేసే బాధ్యత తీసుకుంది. 13వ వెంచర్‌కు సంబంధించి ఏజీ సొసైటీ మేడ్చల్ మండలం అత్తివెల్లి గ్రామంలో 94.12 ఎకరాలు కొనుగోలు చేసింది. ఈ 13వ వెంచర్లో 1112 మంది సభ్యులు న్నారు. ప్రతి ఒక్కరూ ఎవరి స్థాయిలో వారు కొనుగోలు చేసేలా 67 గజాలు, 150 గజాలు, 200, 267, 333, 400, 500 గజాల చొప్పున వెంచర్లు వేసి వాటికి లేఔట్ వేశారు. వివాదస్పద భూమి ఉందంటూ.. మొత్తం 94.12 ఎకరాల్లో 91 ఎకరాలు క్లియర్‌గా ఉందని 2020లో కోఆపరేటివ్ రిజిస్ట్రార్‌కు రాసిన లేఖలో దాని అధ్యక్షుడు పేర్కొన్నారు. మిగిలిన 3.12 ఎకరాలపై అస్పష్టత నెలకొందని తెలిపారు. అయితే రెండేళ్ల తర్వాత 2022లో కేవలం 79.24 ఎకరాలకు మాత్రమే ఫైనల్ లేఔట్ అనుమతి వచ్చింది. మిగిలిన ఎకరాలకు మాత్రం లేఔట్ తీసుకోలేదు. సర్వే నెంబర్లో భూసంబంధిత వివాదాలున్నాయంటూ పక్కన పెట్టేశారు. ఆ మిగిలిన భూముల్లో ఒకటిన్నర ఎకరా మాజీ ఎమ్మెల్యే కబ్జాలో ఉందనీ, నాలుగు ఎకరాలు రైతుల ఆధీనంలో ఉందన్న వాదనలు వెల్లువెత్తాయి. కాగా, 2022 జూన్, జూలై నెలల్లో కోఆపరేటివ్ కమిటీ విచారణ చేపట్టి భూమి మొత్తం క్లియర్‌గానే ఉందని, భూవివాదాలు, మాజీ ఎమ్మెల్యేతో, రైతులతో ఉన్న వివాదాలను సరి చేసుకున్నామని నివేదికలో పేర్కొంది. కానీ 2022 సెప్టెంబర్‌లో అధ్యక్షుడు కేవలం 79.24 ఎకరాలకు మాత్రమే లేఔట్ తీసుకొచ్చారు. అంతా క్లియర్‌గా ఉన్నప్పుడు కేవలం 79.24 ఎకరాలకే ఎందుకు లేఔట్ తీసుకొచ్చారన్న ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేదు. వివాదాస్పద భూముల్లో విల్లాలు.. మొత్తంగా లేఔట్ భూమిలో 1112 ఫ్లాట్లు ఇచ్చారు. 67, 150 గజాలు లేఔట్ ఉన్న వారికి పక్కాగానే ఇచ్చారు. కానీ 200 గజాలు ఇవ్వాల్సిన వారికి 166 గజాలు, 267 గజాలు ఇవ్వాల్సిన వారికి 200 గజాలు, 333 గజాలు ఇవ్వాల్సిన వారికి 233 గజాలు, 400 గజాలు ఇవ్వాల్సిన వారికి 300 గజాలు, 500 గజాలు ఇవ్వాల్సిన వారికి 350 గజాలు మాత్రమే ఇచ్చారు. అంటే 30 శాతం కోత విధించి ప్లాట్లు కేటాయించారు. వివాదంలో భూమి ఉందని చెప్పి తక్కువ కేటాయించారు. ఇక మిగిలిన 14.88 ఎకరాల్లో అనధికారికంగా విల్లాలు నిర్మించి అమ్ముకుందామని నిర్ణయించారు. ఆ మేరకు 2022లో కోఆపరేటివ్ సొసైటీ పేరు మీదనే విల్లాలు నిర్మిస్తామని బ్రోచర్ కూడా వేశారు. 150 గజాల్లో నిర్మిస్తున్న ఒక్కో విల్లా రూ. 1.08 కోట్లు అంటున్నారు. 14.88 ఎకరాలు ధర మార్కెట్లో రూ. 200 కోట్లు ఉంటుందని అంచనా. విల్లాల వ్యవహారంపై కొందరు సభ్యులు సహకారశాఖలో ఫిర్యాదు చేస్తే, బెదిరింపు కాల్స్, మెంబర్షిప్ క్యాన్సిల్ చేస్తామని బెదిరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఐదుగురు సభ్యుల మేనేజ్మెంట్ కమిటీనే ఈ విల్లాల కుంభకోణానికి పాల్పడిందని సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతా అక్రమాలమయమే.. సొసైటీ పెద్దలదంతా అక్రమాల మయమే. వివాదాస్పద భూమిలో విల్లాలు కడతామని, లేకుంటే వేలం పాడుతామని చెప్తూ, తద్వారా వచ్చిన సొమ్మును అందరికీ ఇస్తామని మేనేజ్మెంట్ కమిటీ చెబుతోంది. కానీ ఆ అధికారం వారికి ఎక్కడిది? 1112 మంది నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు, డాక్యుమెంటేషన్ చార్జీలు, మెంబర్షిప్, వెంచర్ నిర్వహణ, ఆఫీసు ఖర్చులు, అదనపు ఖర్చుల కింద 2022 నవంబర్‌లో రూ.9 కోట్లు వసూలు చేశారు. వాస్తవంగా ఒక్కొక్కరి నుంచి రూ. 9 వేలు తీసుకుంటే సరిపోతుంది. కానీ ఒక్కొక్కరి నుంచి రూ.60 వేలు వసూలు చేశారు. – అరుణ్‌కుమార్, సొసైటీ సభ్యుడు ఎక్కడా అక్రమాలు జరగలేదు 13వ వెంచర్‌కు సంబంధించి మేమే చేస్తున్నాం. 8.4 ఎకరాలకు ఇంకా ఇప్పటివరకు అనుమతి రాలేదు. అనుమతి వస్తే విల్లాలు కడతాం. ఆ మేరకు జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. లేకుంటే భూమిని అమ్మి అందరికీ ఇస్తామని చెప్పాం. అంతేగానీ ఎక్కడా అక్రమాలు జరగలేదు. – నరేంద్రనాథ్, సొసైటీ అధ్యక్షుడు -
పార్కింగ్ కోసం గొడవ.. వీడియో వైరల్..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దారుణం జరిగింది. ఆదివారం రాత్రి ఫ్లోరా హెరిటేజ్ హౌసింగ్ సొసైటీ వద్ద స్థానికులు గొడవకు దిగారు. ఒకరిపై మరొకరు దాడికి దిగి చేతికి దొరికిన వస్తువుతో ఘర్షణకు దిగారు. హౌసింగ్ సొసైటీలో పార్కింగ్ వద్ద వాగ్వాదం కాస్త గొడవకు దారితీసిందని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చొరవ తీసుకున్న పోలీసులపై కూడా నిందితులు దాడి చేశారు. ఈ వీడియో స్థానికంగా వైరల్‌గా మారింది. ఘర్షణకు దిగిన నిందితులను పోలీసు వ్యాన్‌లోకి ఎక్కించడానికి ప్రయత్నించగా.. వారు నిరాకరించారు. పోలీసులు హౌసింగ్ సొసైటీలోకి రాకుండా నిందితులు అడ్డుకున్నారు. మరికొంత మంది స్థానికులు పోలీసులపై దాడికి ప్రయత్నించారు. పోలీసులు కూడా తమపై విచక్షణా రహితంగా దాడి చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ మహిళల మొబైల్ ఫోన్లను కూడా లాక్కెళ్లారని చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. pic.twitter.com/iTA7e29Hu6 — POLICE COMMISSIONERATE GAUTAM BUDDH NAGAR (@noidapolice) August 14, 2023 ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఆరంభంలో ఇలాంటి ఘటనే నోయిడాలో జరిగింది. పార్కింగ్ విషయంలో వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. అప్పట్లో ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఇదీ చదవండి: హిమాచల్ ప్రదేశ్‌లో జల ప్రళయం.. 29 మంది మృతి.. -
బక్రీద్ వేళ మేకలను ఇంటికి తెచ్చాడని.. అపార్ట్‌మెంట్‌వాసుల ఆందోళన..
ముంబయి: బక్రీద్ పండగ వేళ మేకలను అపార్ట్‌మెంట్‌కు తీసుకురావడంపై నిర్వాసితులు నిరసన చేపట్టారు. ముంబయిలోని భయందర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మేకలను అపార్ట్‌మెంట్‌కు తీసుకురాకూడదని స్థానికులు ఆందోళన నిర్వహించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. బక్రీద్ పండగ వేళ ఎవరూ మేకలను అపార్ట్‌మెంట్‌కు తీసుకురాకూడదని రెసిడెన్షియల్ సొసైటీ నిర్ణయించింది. దీంతో బిల్డర్ కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని అందరికీ విన్నవించారు. కానీ అపార్ట్మెంట్లో ఓ వ్యక్తి మేకను ఇంటికి తీసుకువచ్చాడు. దీంతో అపార్ట్మెంట్ వాసులు ఆందోళన నిర్వహించారు. మేకలను ఇంట్లోకి తీసుకురావద్దు.. అపార్ట్మెంట్లో మేకలను వధించవద్దని నినాదాలు చేపట్టారు. Uproar over goats in Mumbai Housing Society. (@pankajcreates)#Mumbai #News #ITVideo #FirstUp pic.twitter.com/ScHHzMsRIz — IndiaToday (@IndiaToday) June 28, 2023 దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. బక్రీద్ పండగకు ఒక రోజు ముందు మేకలను ఇంట్లో ఉంచుకుంటారని.. అపార్ట్మెంట్లో వధించబోరని పోలీసులు తెలిపారు. చివరికి మేకలను అపార్ట్మెంట్లో నుంచి బయటకు పంపడంతో అంతా సద్దుమణిగింది. ఇదీ చదవండి: వేలాది పక్షుల మృతి.. పురుగు మందులే కారణం? -
సుప్రీం కోర్ట్ తీర్పును వెంటనే అమలుపర్చాలిని ప్రభుత్వానికి విజ్ఞప్తి
-
అద్దె ఇళ్ల కోసం వెతుకుతున్నారా? నిబంధనలు వింటే అవాక్ అవ్వాల్సిందే!
సాధారణంగా సొసైటీలు, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్డబ్ల్యూఏ)లు నివసించే వారి సౌకర్యం కోసం నిబంధనలు విధిస్తుంటాయి. అయితే ఇప్పుడు వాటిల్లో కొన్ని విచిత్రమైన రూల్స్ నెటిజన్లను ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. బెంగళూరులోని కుందనపల్లి గేట్ ఏరియా ప్రాంతానికి చెందిన రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టిన కండీషన్స్ ఇలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా.. ►బ్యాచిలర్స్, పెళ్లికాని వాళ్లు ఫ్లాట్లలోకి వచ్చేందుకు అనుమతి లేదు ►గెస్ట్‌లు ఎవరైనా రావాలంటే రాత్రి 10 గంటల తర్వాతే రావాలి ►ఒకవేళ వస్తే కారణాన్ని వివరిస్తూ ఓనర్, మేనేజర్, అసోసియేషన్ ఆఫీస్‌కు ఐడీ ఫ్రూప్‌తో పాటు అతిధులు ఎన్నిగంటలకు వస్తున్నారు. ఎంత సమయం ఉంటారో మెయిల్ పెట్టి అనుమతి తీసుకోవాలి. ►బ్యాచిలర్స్, పెళ్లికాని వాళ్లు తప్పని సరిగా అసోసియేషన్ విధించిన కండీషన్లకు కట్టుబడి ఉండాలి. లేదంటే రూ.వెయ్యి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది ►రాత్రి 10 గంటల తర్వాత పెద్దగా మ్యూజిక్ సౌండ్ వినిపించకూడదు. లేట్ నైట్ పార్టీలు చేసుకోకూడదు. కారిడార్లు, బాల్కనీలల్లో ఫోన్ మాట్లాడకూడదనే కండీషన్లు పెట్టారంటూ బాధితులు వాపోతున్నారు. ఆ కండీషన్ల గురించి రెడ్డిట్‌లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. Marathalli సొసైటీలో అబ్బాయిలు, అమ్మాయిల ఫ్లాట్లలోకి వెళుతున్నారా? లేదా అని బ్యాచిలర్స్ ఫ్లాట్లను పర్యవేక్షిస్తారు. అతిథులు వెళ్లిపోయారా లేదా అని చూడటానికి సెక్యూరిటీ గార్డ్లు బ్యాచిలర్స్ ఫ్లాట్లను చెక్ చేస్తున్నారంటూ ఓ యూజర్ కామెంట్ చేస్తున్నారు. ‘ఇది హాస్టళ్ల కంటే దారుణం. మీరు ఫ్లాట్లలో ఉండేందుకు రెంట్ చెల్లిస్తున్నారు.రెంటల్ అగ్రిమెంట్ల ప్రకారం అద్దెకు తీసుకున్న కాలానికి ఇది మీ ఫ్లాట్. మీ ఫ్లాట్‌కి ఎవరు వస్తారు? బాల్కనీలో ఏం చేస్తారు? అనేది మీ ఇష్టం ఈ రోజుల్లో సొసైటీ నియమాలు అసహ్యంగా మారుతున్నాయి’ ఓ యూజర్ కామెంట్ చేస్తున్నారు. ‘బ్యాచిలర్స్‌కు విధించిన నిబంధనలు మరింత జుగుప్సాకరంగా ఉన్నాయి. అందుకే నేను సొసైటీలలో ఉండడాన్ని ద్వేషిస్తున్నాను! మరొక యూజర్ అన్నాడు. -
పేట్బషీరాబాద్లో రూ.కోట్ల విలువైన భూమికి రెక్కలు
జాతీయ రహదారికి దగ్గరలో ఉంది. ఇక్కడ గజం స్థలం విలువ లక్ష రూపాయల పైమాటే. ఇంకేముంది రాత్రికి రాత్రి నిర్మాణాలు చేపట్టడం.. నోటరీలు అడ్డుపెట్టుకుని విద్యుత్ మీటర్లు తెచ్చుకోవడం..రెవెన్యూ అధికారులు కూల్చివేతకు వస్తే ‘చేతులు తడిపి’ వెళ్లగొట్టడం షరా మామూలుగా మారింది. ఈ కోవలోనే సుమారు రూ.200 కోట్ల విలువ చేసే 8 ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలం కబ్జాకు గురయ్యింది. కబ్జా వాస్తవమేనని నిర్ధారణకు వచ్చినప్పటికీ కోర్టు కేసులు ఉన్నాయంటూ వాటిని రెవెన్యూ యంత్రాంగం తొలగించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కుత్బుల్లాపూర్ మండలం పేట్‌బషీరాబాద్ సర్వే నంబర్.25/1, 25/2 ఆక్రమణలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. కుత్బుల్లాపూర్: పేట్ బషీరాబాద్ సర్వే నంబర్.25/1, 25/2లలో 57.38 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. జాతీయ రహదారికి దగ్గరగా ఉండటంతో ఇక్కడ గజం ఏకంగా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతుంది. ఈ స్థలంపై రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో కబ్జాదారులకు కలిసి వచ్చింది. రాత్రికి రాత్రి బేస్మెంట్లు, గదులు, షెడ్ల నిర్మాణం చేస్తూ కబ్జాకు తెర లేపారు. ఈ క్రమంలో సుమారు 8.06 ఎకరాల స్థలం ఆక్రమణకు గురైందని రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించగా తేలింది. అయితే వాటిని తొలగించాల్సిన అధికారులు కేవలం నోటీసులు జారీ చేసి కబ్జాదారులు కోర్టుకు వెళ్లే విధంగా సహకరించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో అక్కడ నిర్మాణం చేపట్టిన వారు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని కూల్చివేతల జోలికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇలా కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంది. దేవుడు వరమిచ్చినా... 2008 మార్చి 25వ తేదీన జీఓ నంబర్ 424 ద్వారా అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేట్‌బషీరాబాద్ సర్వే నంబర్.25/1, 25/2లలో మొత్తం 38 ఎకరాల స్థలాన్ని జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నాటి నుంచి నేటి వరకు ఇక్కడ ఎన్నో అక్రమ నిర్మాణాలు చోటు చేసుకున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. కోర్టు వివాదంలో ఉన్న ఈ స్థలం విషయంలో 2022 ఆగస్టు 25వ తేదీన సర్వోన్నత న్యాయస్థానం.. సదరు స్థలాన్ని జర్నలిస్టులకు అప్పగించాలని తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ మండల రెవెన్యూ అధికారులు అది తమ పరిధి కాదు అన్నట్లుగా వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇక్కడ జరిగిన అక్రమ నిర్మాణాలపై జర్నలిస్టు ప్రతినిధులు మండల రెవెన్యూ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు రూపంలో అందజేశారు. కాగా మల్కాజిగిరి ఆర్డీఓ మల్లయ్య ఈ స్థలాన్ని సందర్శించి వెళ్లారే తప్ప అక్రమ నిర్మాణాలను చూసి కూల్చివేయకుండా వదిలివేయడం గమనార్హం. ఐదెకరాల స్థలంపై ఆధిపత్యం... ప్రభుత్వ స్థలంపై ఓ వ్యక్తి మాజీ నక్సలైట్‌ని అంటూ కబ్జాకు దిగాడు. అప్పట్లో 60 గజాల్లో ఓ గది నిర్మించుకుని ఉంటూ వచ్చిన అతగాడు ఏకంగా 5 ఎకరాల స్థలం నాదే అంటూ.. ఇప్పుడు అధికారులకే సవాలు విసురుతున్నాడు. కోట్ల రూపాయల విలువ చేసే ఈ స్థలం ప్రభుత్వానిది. గతంలో పలు పర్యాయాలు చుట్టూ కంచె వేస్తే రెవెన్యూ అధికారులు తొలగించారు. ఇలా పలు పర్యాయాలు తొలగించినా.. తిరిగి అదే స్థలంలో కంచె ఏర్పాటు చేయడం జరుగుతూ వస్తోంది. అంతేకాకుండా ఇక్కడ విద్యుత్ మీటర్లు చెట్లకు ఉంటాయి. ముందస్తుగా పథకం ప్రకారం పదులకొద్దీ మీటర్లను తీసుకుని గదులు నిర్మించే లోపు రెవెన్యూ అధికారులు గుర్తిస్తారని తీసుకున్న మీటర్లు చెట్లకు వేలాడుతుండటం విశేషం. ఈ విషయమై ఆర్ఐ రేణుకను సాక్షి వివరణ కోరగా.. రెండు, మూడు రోజుల్లో సర్వే నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. (క్లిక్: మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది!) -
యజమాని ముందే పెంపుడు కుక్క దాడి... బాధతో విలవిల్లాడిన చిన్నారి: వీడియో వైరల్
యజమాని ముందే ఒక పెంపుడు కుక్క చిన్నారిపై దాడి చేసింది. ఈ ఘటన ఘజియాబాద్‌లోని హౌసింగ్ సొసైటి లిఫ్ట్‌లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. ఆ వీడియోలో సదరు పెంపుడు కుక్క యజమాని చూస్తుండగానే ఒక బాలుడిపై కుక్క దాడి చేస్తుంది. దీంతో ఆ చిన్నారి బాధతో విలవిలాడుతూ లిఫ్ట్ ముందుకు వచ్చి నిలబడతాడు. కానీ ఆ యజమాని కనీసం ఆ బాలుడిని ఓదార్చడం గానీ, సాయం చేయడం గానీ చేయకుండా బండరాయిలా నుంచొని ఉంది. పైగా తన కుక్కకు ఏమైన జరిగిందేమోనని చూస్తుందే తప్ప ఆ బాలుడిని ఓదార్చే పని చేయదు. దీంతో ఆకాష్ ఆశోక్ గుప్తా అనే నెటిజన్ ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. ఆ లిఫ్ట్‌లో వారిద్దరే ఉన్నారని, ఎవ్వరూ చూడలేదని ఇంతలా నైతిక విలువలు లేకుండా ప్రవర్తిస్తారా? అని ఆగ్రహంతో ప్రశ్నించారు. దీంతో ఘజియాబాద్ పోలీసులు వెంటనే స్పందించి....ఆ బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తాము కేసు నమోదు చేసినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో నెటిజన్లు ఇలా దయాదాక్షిణ్యం లేకుండా ప్రవర్తించిన మహిళలను వదిలిపెట్టకూడదు...కఠినంగా శిక్షించాలి అంటూ ఫైర్ అయ్యారు. a pet dog bites a kid in the lift while the pet owner keeps watching even while the pet owner the kid is in pain! where is the moral code here just cos no one is looking? . . p.s: @ghaziabadpolice Location: Charms Castle, Rajnagar Extension, Ghaziabad Dtd: 5-Sep-22 | 6:01 PM IST pic.twitter.com/Qyk6jj6u1e — Akassh Ashok Gupta (@peepoye_) September 6, 2022 "दिनांक 05.09.22 को राजनगर एक्सटेंशन स्थित एक सोसाइटी की लिफ्ट में एक कुत्ते द्वारा अपने मालिक की मौजूदगी में बच्चे को काट लेने के वायरल वीडियो के सम्बन्ध में बच्चे के पिता की तहरीर पर थाना नंदग्राम पर अभियोग पंजीकृत करते हुए अग्रिम विधिक कार्यवाही की जा रही हैं" बाइट-सीओ सिटी-2 pic.twitter.com/dvLwBXyUaT — GHAZIABAD POLICE (@ghaziabadpolice) September 6, 2022 (చదవండి: మావగారిపై చేయిజేసుకున్న మహిళా పోలీసు: వీడియో వైరల్) -
సాక్షి పరిశోధన: హౌసింగ్ సొసైటీల్లో రాబందులు
వారంతా ఉద్యోగులు, కళాకారులు.. సమాజానికి ఎంతోకొంత సేవ చేస్తున్న వివిధ రంగాల వారు.. సొంతింటి కలను నిజం చేసుకునేందుకు హౌజింగ్ సొసైటీలుగా ఏర్పడ్డారు.. ప్రభుత్వం నామమాత్రపు ధరకు కొంత భూమి ఇచ్చింది ఇంకేం.. ఇంటి జాగాలో, ఫ్లాట్‌లో వస్తాయని వారంతా సంబరపడ్డారు కానీ కొందరు సొసైటీల పెద్దలు కక్కుర్తి పడ్డారు.. రాజకీయ నేతలు గద్దల్లా వాలిపోయారు.. డబ్బున్న వాళ్లు, ఎన్నారైలు, వ్యాపారవేత్తలూ కన్నేశారు.. అర్హులకు అందాల్సిన స్థలాలు, ఫ్లాట్లు అంగట్లో సరుకైపోయాయి అవసరమున్నోళ్లకు అందకుండా ఎవరెవరి చేతుల్లోకో వెళ్లిపోయాయి ...రాష్ట్రంలో హౌజింగ్ సొసైటీల బాగోతమిది. ఈ అక్రమాలతో ఒకటీ రెండెకరాలు కాదు.. ఐదారు వందల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి, వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి. కొన్నిచోట్ల ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సొసైటీల్లోని కీలక వ్యక్తులు బినామీ పేర్లతో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకోవడం.. తమ బంధుగణం, స్నేహితులు, దగ్గరివారి నుంచి లక్షల రూపాయలు తీసుకొని అమ్మేసుకుంటున్నారు. దీంతో అసలైన లబి్ధదారులు గగ్గోలు పెడుతున్నారు. విచ్చలవిడిగా సాగుతున్న ఈ బాగోతంపై ‘సాక్షి’ప్రత్యేకంగా పరిశీలన చేపట్టింది. హౌజింగ్ సొసైటీల్లో అక్రమాలు, అవకతవకలు, బాధితుల పరిస్థితిపై ఆరా తీసింది. ముఖ్యంగా ఉద్యోగుల హౌసింగ్ సొసైటీల్లో ఎక్కువగా అక్రమాలు జరుగుతున్నట్టు గుర్తించింది. దీనికి సంబంధించి ‘సాక్షి’ప్రత్యేక కథనం.. -బొల్లోజు రవి ►టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీని తన చేతుల్లో పెట్టుకున్న ఒక కీలక వ్యక్తి బినామీ పేర్లతో కొన్ని ప్లాట్లను తన వద్ద పెట్టుకున్నారు. ఫేజ్–1లో కొందరి నుంచి రూ.లక్షలు తీసుకుని రిజిస్ట్రేషన్ చేశారు. ఇక ఫేజ్–2లో కొందరు లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించినా రిజి్రస్టేషన్ చేయలేదు. వేరే వ్యక్తుల వద్ద డబ్బులు తీసుకొని వారికి రిజి్రస్టేషన్ చేశారు. దీనిపై విచారణకు వచ్చిన అధికారుల్లో కొందరికి ప్లాట్లు రాసిచ్చి నోరు మూయించారు. ►హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్న వెంకటేశ్వర కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో మాజీ అధ్యక్షుడు ఒకరు 7ప్లాట్లను తన బినామీల పేరిట రిజి్రస్టేషన్ చేసుకున్నాడు. అలాగే సొసైటీ పక్కనున్న హెచ్ఎండీఏ భూమినీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని తేలింది. ఈ స్థలాల విలువ రూ.70 కోట్లకు పైమాటే.. రాష్ట్రంలోని హౌసింగ్ సొసైటీల్లో జరుగుతున్న అక్రమాల్లో ఈ రెండు ఘటనలు చిన్న ఉదాహరణలే. కీలక సొసైటీల్లో రూ.వందల కోట్ల అవకతవకలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 58 హౌసింగ్ సొసైటీలకు ప్రభుత్వ భూములు ఇచి్చంది. మొత్తం 4,297 ఎకరాలు కేటాయించగా.. అందులో హైదరాబాద్‌లోనే 2,773 ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 1,101 ఎకరాలున్నాయి. ఈ భూముల్లో దాదాపు 500 ఎకరాల మేర ఏదో ఓ రూపంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని.. ఈ అక్రమాల విలువ దాదాపు రూ.3 వేల కోట్లని అంచనా. 1960 నుంచీ ఈ హౌసింగ్ సొసైటీల దందా కొనసాగుతూనే ఉందని ఆయా వర్గాల వారు చెప్తున్నారు. సహజంగా సహకార శాఖ, జీఏడీ, రెవెన్యూ శాఖలతో కూడిన కమిటీ లబి్ధదారులకు ప్లాట్లను కేటాయించాలి. కానీ సొసైటీల్లోని కీలక వ్యక్తులే ప్లాట్లు కేటాయించుకోవడం, అమ్మేసుకోవడం జరుగుతోంది. లబి్ధదారులు కోర్టులకు వెళితే.. స్టేలు తెచ్చుకొని మరీ భూదందాను కొనసాగిస్తున్నారు. విచారణకు వచ్చే అధికారులకు అదే సొసైటీల్లో ప్లాట్లను ఎరగా వేసి నోరు మూయిస్తున్నారు. దందాలకు పాల్పడుతున్న కొందరు రాజకీయాల్లో చేరి కీలక పదవులు పొందారు. భారీ భూదందా.. టీఎన్జీవో సొసైటీదే! ‘తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ’.. అసలు దరఖాస్తు చేసుకోని వారికీ ఇళ్ల స్థలాల కేటాయింపులు, సీనియారిటీని పక్కనపెట్టడం, రికార్డుల్లో అవకతవకలు, నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు, వసూలు చేసిన డబ్బుకు రసీదులు ఇవ్వకపోవడం.. ఒకటారెండా ఎన్నో అక్రమాలు. ప్రభుత్వ విచారణలో ఇవన్నీ బయటపడ్డాయి. రాజకీయ ప్రమేయం, పలుకుబడి కలిగిన వ్యక్తులే దీనికి సూత్రధారులన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో అన్ని హౌసింగ్ సొసైటీలకన్నా భారీగా అక్రమాలు జరిగిన సొసైటీ ఇదేనని ఉద్యోగ వర్గాలు బహిరంగంగానే చెప్తున్నాయి. ఇక్కడ ప్రస్తుతం గజం రూ.50 వేలకుపైనే పలుకుతుండటం గమనార్హం. విచారణలో బయటపడ్డా.. రాష్ట్ర ప్రభుత్వం ఈ సొసైటీకి గచ్చిబౌలీలో 158 ఎకరాలు కేటాయించింది. 1,937 మంది సభ్యులున్నారు. అసలు లేఔట్ లేకుండానే సొసైటీ స్థలాన్ని ప్లాట్లుగా విభజించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యతిరేకంగా డెవలప్మెంట్ చార్జీలను వసూలు చేశారు. రూ.లక్ష, నుంచి రూ.3.50 లక్షల చొప్పున తీసుకున్నారు. దీనికి రశీదులు ఇవ్వలేదు. సీనియారిటీ ప్రాతిపదికన కేటా యించాల్సి ఉండగా.. జంబ్లింగ్ పద్ధతిలో ఇచ్చారు. ఇతర జిల్లాల్లోని టీఎన్జీవోలకూ స్థలాలిచ్చారు. అర్హత కలిగిన ఉద్యోగుల జాబితాను సాధారణ పరిపాలనా శాఖ ఉప కార్యదర్శి నుంచి తీసుకోవాల్సి ఉన్నా సొసైటీ అలా వ్యవహరించలేదు. ఇది అక్రమాలకు మరింతగా అవకాశమిచ్చింది. కొందరు మెంబర్లు తప్పుడు అఫిడవిట్లతో స్థలాలు పొందారు. వీటిని పరిశీలించడంలో సొసైటీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ►సొసైటీలో 2,102 ప్లాట్లకుగాను 1,986 ప్లాట్లను మాత్రమే కేటాయించారు. ఇందులో 124 మందికి సంబంధించిన దరఖాస్తులే లేవు. 166 ప్లాట్లకు వెయిటింగ్ లిస్ట్ కూడా లేదు. ►కొందరు సొసైటీ పెద్దలు కొత్త సభ్యులను చేర్చుకొని నిబంధనలకు విరుద్ధంగా బినామీ పేర్లతో కాజేశారు. తమకు తెలిసిన వారికి అమ్మేసుకున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా సభ్యుల చేరిక ఇంకా కొనసాగుతూనే ఉంది. ►సొసైటీలో అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే అలా విచారణకు వచి్చన అధికారులకు కూడా పప్పుబెల్లాల్లా సొసైటీలో స్థలాలు కట్టబెట్టారు. ఒక కీలక అధికారికి ఉచితంగా 10 ప్లాట్లు ఇచ్చారని సమాచారం. ►ప్రభుత్వం కేటాయించిన స్థలానికి మించి.. పక్కనే ఖాళీగా ఉన్న మరో 8.34 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్లాట్లు వేసి అమ్ముకున్నారన్న ఆరోపణలున్నాయి. లబ్ధిదారులకు తెలియకుండా.. మైలార్‌దేవ్‌పల్లిలో 1960లో ఏర్పాటైన ఎన్జీవోస్ ఎంప్లాయీస్ సొసైటీకి ప్రభుత్వం అప్పట్లో వంద ఎకరాలను కేటాయించింది. అప్పటి సొసైటీ పెద్దలు కొందరు ఉద్యోగులకు ప్లాట్లు కేటాయించినా వారికి చెప్పకుండా దాచిపెట్టారు. కొన్నేళ్లు అలాగే ఉంచేసిన సొసైటీ పెద్దలు, కొందరు స్థానికులతో కలిసి బినామీ పేర్లతో అమ్మేసుకున్నారు. ఇందుకోసం నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. ఈ విషయం తెలిసిన సదరు లబ్ధిదారుల వారసులు కొందరు.. ప్రస్తుతం ఆ ప్లాట్ల కోసం పోరాటం చేస్తున్నట్టు తెలిసింది. సినీ కార్మీకుల స్థలాలు.. దర్జాగా కబ్జా అది హైదరాబాద్ నగరంలోని మణికొండ ప్రాంతంలో ఉన్న చిత్రపురి కాలనీ.. సినీ కార్మికుల కోసం ఏర్పాటైన హౌజింగ్ సొసైటీ. అంటే.. పేద సినీ కళాకారులు, కారి్మకులకు ఇండ్లు, స్థలాలు ఉంటాయని అనుకుంటాం. కానీ అక్కడి ఇళ్లు, అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లలో చాలా వరకు కబ్జాదారుల చేతిలో చిక్కుకున్నాయి. సినీ రంగంతో ఏమాత్రం సంబంధం లేని బయటి వ్యక్తులు, ఎన్నారైలు, సాఫ్ట్వేర్ నిపుణులు, రాజకీయ నాయకులు, మీడియా రంగానికి చెందిన కొందరు సినీ కళాకారుల ముసుగులో, బినామీ పేర్లతో వాటిల్లో తిష్ట వేశారు. చిత్రపురి కాలనీ సొసైటీ నేతలే స్వయంగా సాగించిన ఈ బినామీ దందాలో వందల కోట్ల రూపాయల అక్రమాలు చోటు చేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. సినీ కారి్మకులు అప్పట్లో రూ.1.10 కోట్లు వెచ్చించి కొన్న ఈ స్థలం విలువ ఇప్పుడు రూ.3 వేల కోట్లపైనే ఉంటుందని అంచనా. ఎవరికి దక్కాలి.. ఏమయ్యాయి..? సినిమా రంగానికి చెందిన కళాకారులు, కారి్మకుల కోసం 1994లో రాష్ట్ర ప్రభుత్వం మణికొండ జాగీర్ సర్వే నంబర్ 246/1లో 67.16 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. సినీ కారి్మకులు అప్పట్లో ఏపీ సినీ వర్కర్స్ కో ఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసుకుని.. ఈ భూమిని గజానికి రూ.40 చొప్పున రూ.1.10 కోట్లు చెల్లించి ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశారు. చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సినీ కళాకారులకు 50 శాతం, అప్పటికే హైదరాబాద్‌లో ఉంటున్న వాళ్లకు 50 శాతం చొప్పున ఫ్లాట్లు, ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. తొలుత 4,213 మంది సభ్యులే ఉన్న ఈ సొసైటీలో.. ఏకంగా 9,250 మంది నకిలీలకు సభ్యత్వం కట్టబెట్టారు. అర్హులైన కారి్మకులు, కళాకారులకు ఇవ్వాల్సిన ఫ్లాట్లను బినామీలకు అమ్ముకున్నారు. సీబీసీఐడీ విచారణ జరగాలి హైదరాబాద్‌లో జరిగిన అతిపెద్ద భూకుంభకోణం ఇది. చిత్రపురి సొసైటీలో వేల కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం జరిగింది. దీనిపై సీబీసీఐడీ విచారణ జరిపించాలి. – కస్తూరి శ్రీనివాస్, అధ్యక్షులు, చిత్రపురి సాధన సమితి దారుణంగా మోసపోయాను డబ్బులు కట్టించుకొని మోసం చేశారు. నాకు కేటాయించిన ఫ్లాట్‌ను బయటి వ్యక్తులకు ఇచ్చుకున్నారు. అదేమని అడిగితే బెదిరిస్తున్నారు. నేను రూ.16 లక్షలు చెల్లించాను. నాలాగా ఎందరో మోసపోయారు. – వనజ, జూనియర్ ఆర్టిస్టు డబ్బు కట్టినా ఫ్లాట్ ఇవ్వలే.. 30 ఏళ్ల కిందటే సొసైటీ సభ్యత్వం తీసుకున్నాను. ప్రతి వాయిదా కచి్చతంగా చెల్లించాను. కొద్దిరోజుల్లో గృహ ప్రవేశం చేస్తాననుకున్నాను. కానీ చివరికి నాకు ఫ్లాట్ లేదన్నారు. ముప్పై ఏళ్ల సీనియారిటీని కూడా లెక్క చేయలేదు. – సూరత్ రాంబాబు, కో డైరెక్టర్ హైదరాబాద్ ఉద్యోగుల సొసైటీ.. అక్రమాల అడ్డా అది రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలోని చిన్నస్థాయి ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసుకున్న ‘హైదరాబాద్ ప్రభుత్వ ఉద్యోగుల సహకార హౌజింగ్ సొసైటీ’.. నిబంధనల ప్రకారం నాన్ గెజిటెడ్ ఉద్యోగులకే ఇంటి స్థలాలు కేటాయించాలి. కానీ అర్హులను పక్కనపడేసి అక్రమాలకు దారులు తెరిచారు. డబ్బులు ముట్టజెప్పినవారికి, తాము చెప్పినట్టు వినే ఉద్యోగులకు స్థలాలు ఇచ్చారు. కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఉద్యోగ సంఘాల నేతలు, కొందరు ప్రభుత్వ పెద్దలకూ ఇందులో స్థలాలు కేటాయించారు. సొసైటీలో అక్రమాలపై ఫిర్యాదులు వస్తే.. వాటి నిగ్గు తేల్చేందుకు విచారణకు వచ్చిన అధికారులకు కూడా ఇందులో స్థలాలను కట్టబెట్టడం విస్మయపరుస్తోంది. మరోవైపు అర్హత ఉన్న చిన్న స్థాయి ఉద్యోగులు మాత్రం తమకు తీవ్రంగా అన్యాయం జరిగిందని వాపోతున్నారు. అంతా పెద్దల ఇష్టారాజ్యం ప్రభుత్వం 2003లో మణికొండ జాగీర్ పరిధిలోని సర్వే నంబర్లు 203/పీ, 204, 205, 208, 209లలో 50 ఎకరాల భూమిని ‘హైదరాబాద్ ప్రభుత్వ ఉద్యోగుల సహకార హౌసింగ్ సొసైటీ’కి కేటాయించింది. ఈ సొసైటీలో ఇళ్ల స్థలాల కేటాయింపు మొదటి నుంచీ వివాదాస్పదంగానే మారింది. పాలక కమిటీ సొసైటీ నిబంధనలను తుంగలో తొక్కి అడ్డగోలుగా వ్యవహరించింది. ఉద్యోగుల సీనియారిటీని పరిగణనలోకి తీసుకోకపోవడం, స్థలం కేటాయింపు జరిగిన ఉద్యోగి ఎవరైనా విధి నిర్వహణలో చనిపోతే.. వారి కేటాయింపును రద్దుచేసి వేరేవారికి స్థలాలు ఇవ్వడం, తమ కనుసన్నల్లో పనిచేసిన వారికి, డబ్బులు ముట్టజెప్పినవారికి ప్లాట్లు ఇచ్చుకోవడం వంటి అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. సభ్యుల నుంచి రూ.4 లక్షల చొప్పున వసూలు చేయడం ద్వారా రూ.20 కోట్ల మేర అనధికారికంగా రాబట్టినట్టు ఉద్యోగ వర్గాలే చెప్తున్నాయి. ఈ భూబాగోతం వెనుక పెద్దల హస్తం ఉందని విచారణలో తేలినా చర్యలు శూన్యం. సొసైటీ నియమావళినే మార్చేసి.. ►హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులే ఈ సొసైటీలో ప్లాట్లు పొందేందుకు అర్హులు. కానీ నిబంధనలు, సొసైటీ మార్గదర్శకాలను ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా ఫ్లాట్లు కట్టబెట్టుకున్నారు. అసలు ఈ హౌసింగ్ సొసైటీ ఆవిర్భావ స్ఫూర్తి అయిన ‘ఎన్జీఓలకు ఇళ్లస్థలాల కేటాయింపు’అంశాన్నే పక్కదోవపట్టిస్తూ 2008 నవంబర్ 8న సొసైటీ నియమావళిని మార్చేశారు. ►సొసైటీకి ప్రభుత్వం 2003లో 50 ఎకరాలను కేటాయించగా.. అప్పటినుంచి ఆరేళ్ల పాటు సభ్యులకు ప్లాట్ల కేటాయింపు జరిగింది. హెచ్ఎండీఏ జారీ చేసిన లేఔట్‌కు విరుద్ధంగా.. 22 ప్లాట్లను (బై నంబర్ వేసి) అదనంగా సృష్టించారు. ఒక స్థలాన్ని ఇద్దరికి కేటాయించడం 23 మంది సభ్యుల మధ్య ఘర్షణకు దారితీసింది. ►ఇక 81 మంది అనర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించినట్లు సహకార శాఖ గతంలోనే తేలి్చంది. ఇందులో ఏసీబీ, పోలీసు విభాగాలకు చెందిన 22 మందికి ప్లాట్లు కేటాయించడం గమనార్హం. ►సొసైటీ అక్రమాల నిగ్గుతేల్చేందుకు ని యమించిన అధికారులకు ప్లాట్లు ఇవ్వ డం, అనుమతుల్లేకుండా ఇళ్లు కట్టుకునేందుకు చాన్సిచ్చిన పంచాయతీ కార్యదర్శికి స్థలం కేటాయించడం గమనార్హం. ఖమ్మం టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీలో అక్రమాలు ‘ది ఖమ్మం డి్రస్టిక్ట్ టీఎన్జీవోస్ కో–ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ’పై పలు ఆరోపణలు ఉన్నాయి. కొత్తగా చేరిన 215 మందికి ప్లాట్లు కేటాయించడాన్ని సభ్యులు అభ్యంతర పెట్టారు. వెలుగుమట్లలో సొసైటీకి సంబంధించిన స్థలం ఉండగా, ఇందులో ఖాళీ స్థలాలు కొన్ని లీజుకు ఇస్తున్నారని పలువురు సభ్యులు ఆరోపిస్తున్నా రు. హౌజింగ్ సొసైటీకి ప్రభుత్వం 2005 ఏడాదిలో 103.26 ఎకరాలను కేటాయించింది. సొసైటీలో 3,772 మంది సభ్యులున్నారు. వీరిలో 1905 మందికి స్థలాలు కేటాయించారు. 1901 మందికి పూర్తిగా ఇవ్వగా, నలుగురు వివిధ కారణాలతో వీటిని తీసుకోలేదు. సొసైటీలో సభ్యులు తమ స్థలాలు అమ్ముకోలేదు. అయితే 39 మంది వరకు తమకు కేటాయించిన స్థలాలను పరస్పరం అంగీకారం మేరకు మా ర్చుకున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని కొందరు సభ్యులు పేర్కొంటున్నారు. ఈ అంశాలపై విచారణకు ఫోర్‌మెన్ కమిటీని నియమించారు. ఈ కమిటీ 4.26 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తించింది. ఇందులో దేవాలయాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. హౌజింగ్ సొసైటీలో రాజకీయ ప్రమేయంతోనే ప్రస్తుత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. సొసైటీపై నేతల ఒత్తిళ్లు పెరిగాయి హౌస్ బిల్డింగ్ సొసైటీలో ప్లాట్ల కేటాయింపు, నిర్మాణాలు అన్నీ ప్రభుత్వ నిబంధనలకు లోబడే చేశాం. సొసైటీ భూమి ఎక్కడా ఆక్రమణలకు గురి కాలేదు. భూమి హద్దులు కొలిచి ఆక్రమించినట్లు తేలితే ప్రభుత్వం తీసేసుకోవచ్చని, లేనిపక్షంలో ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం ఉద్యోగులకు కేటాయించాలని ఇప్పటికే కోరాం. హౌజ్ బిల్డింగ్ సొసైటీపై ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లు బాగా పెరిగాయి. దీనివల్ల అనేకమంది అధికారులు ఇబ్బంది పడుతున్నారు. – ఏలూరి శ్రీనివాసరావు, హౌస్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షుడు, ఖమ్మం ప్రభుత్వం భూములు ఎందుకు ఇస్తుంది? ఉద్యోగులు, కళాకారులు, ఇతర రంగాల వారు సొంత ఇళ్లు కట్టుకునేందుకు ప్రభుత్వం నుంచి సాయం పొందవచ్చు. వారు హౌజింగ్ సొసైటీలుగా ఏర్పడి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. అందులో ప్లాట్లుగా వ్యక్తిగత ఇళ్ల కోసంగానీ, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లుగా ఇళ్లు కట్టుకోవడానికి ప్రతిపాదనలను అందజేయాలి. సభ్యుల్లో ఎవరెవరికి, ఎలా కేటాయిస్తారో తెలపాలి. తర్వాత ప్రభు త్వం సొసైటీల దరఖాస్తులను పరిశీలిస్తుంది. ఆయా రంగాల ప్రాధాన్యత, సమాజానికి వారి నుంచి అందు తున్న సేవలను ఆధారంగా చేసుకుని.. నామమాత్రపు ధరకే భూములను కేటాయిస్తుంది. సదరు సొసైటీలు ఆ భూములను ప్లాట్లు, ఇళ్లు, ఫ్లాట్లుగా అభివృద్ధి చేసుకుని సభ్యులకు పంపిణీ చేసుకోవాలి. ఈ విధంగా ఆయా రంగాల వారికి అతి తక్కువ ధరలోనే సొంత ఇల్లు సమకూరే పరిస్థితి ఉంటుందన్న ఉద్దేశంతోనే ప్రభుత్వాలు భూములు కేటాయిస్తూ ఉంటాయి. -
బెదిరించి.. 2 గంటల పాటు గదిలో బంధించి.. ఆపై
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ తనను బెదిరింపులకు గురిచేయడంతో పాటు రెండుగంటల పాటు గదిలో బంధించారంటూ కార్యదర్శి మురళీ ముకుంద్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం జరిగిన పాలకమండలి సమావేశంలో అధ్యక్షుడు రవీంద్రనాథ్‌తో పాటు కొంతమంది సభ్యులు రికార్డు గది తాళాలను చేజిక్కించుకునేందుకు ప్రయత్నించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ► మార్చిలో జరిగిన పాలకమండలి ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో అధ్యక్షుడిగా రవీంద్రనాథ్, కార్యదర్శిగా మురళీ ముకుంద్తో పాటు పాలకమండలి ఏర్పాటైంది. కొన్నిరోజులుగా పాలకమండలిలోని సభ్యుల మధ్య విభేదాలు నడుస్తున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్‌నెం–78లోని స్థలం కేటాయింపు వ్యవహారంలో అధ్యక్షుడు రవీంద్రనాథ్‌తో పాటు కోశాధికారిపై ఆరోపణలు రావడంతోపాటు కేసు నమోదైంది. ► సొసైటీలో గతంలో చేసిన అవకతవకలకు వ్యతిరేకంగా గెలిచిన కొత్త ప్యానెల్‌పై కూడా అవినీతి మరకపడటంతో పాలకమండలి సభ్యుల్లో కొంతమంది మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాలకమండలి సమావేశంలో రసాభాసా చోటు చేసుకుంది. సొసైటీ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌కు, కార్యదర్శి మురళీముకుంద్కు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ► సొసైటీలో జరిగిన వ్యవహారాలపై సాక్ష్యాలుగా ఉండే కొన్ని ఫైళ్లు మాయమైనట్లు ఆరోపణలు రావడంతో ఈ విషయంపై జోరుగా చర్చ నడిచినట్లు తెలుస్తోంది. కాగా సొసైటీ రికార్డు రూమ్ తాళాలను తనకు ఇవ్వాలంటూ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌తో పాటు కొంతమంది సభ్యులు తనను విపరీతమైన ఒత్తిడికి గురిచేశారని, తనను సుమారు 2గంటల పాటు గదిలో బంధించారంటూ గురువారం సాయంత్రం సొసైటీ కార్యదర్శి మురళీ ముకుంద్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ► సొసైటీ బైలాస్ ప్రకారం లాకర్ రూమ్‌లోని ఫైళ్లను కాపాడడం తన బాధ్యత అని, తాళాలను లాక్కోవడం కోసం ప్రయతి్నంచడంతోపాటు తనను బెదిరింపులకు గురిచేసిన సొసైటీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ తదితరులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ► పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రికార్డు గదిని సీజ్ చేశారు. సొసైటీలో గందరగోళ పరిస్థితి నెలకొందని, వెంటనే ప్రత్యేక అధికారిని నియమించి ఫైళ్లను రక్షించాలంటూ కార్యదర్శి మురళీముకుంద్ సహకారశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా మురళీ ముకుంద్ ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. -
నిర్మాణ రంగంలోకి జైళ్ల శాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర జైళ్లశాఖ వినూత్న కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పటికే పలు సంస్కరణలు ప్రవేశపెట్టి సత్ఫలితాలు సాధిస్తోన్న జైళ్లశాఖ.. ఖైదీల సంఖ్యను గణనీయంగా తగ్గించడంలో సఫలీకృతమైంది. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా 17 జైళ్లు మూసివేసింది. 2014లో 80 వేల మంది ఖైదీలు ఉండగా 2018కి 55 వేలకు తగ్గడమే ఇందుకు కారణం. ఇపుడు వాటిని యాచకులు, వృద్ధులకు పునరావాస కేంద్రాలుగా మార్చి పలువురి చేత శభాష్ అనిపించుకుంది. 1.25 లక్షలమందిని విద్యావంతులుగా తీర్చిదిద్దింది. మరో సంచలనం దిశగా ఆ శాఖ త్వరలోనే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతోంది. నిపుణులైన ఖైదీలు, నిష్ణాతులైన జైలు ఉద్యోగులు, మాజీ ఉద్యోగులతో రాష్ట్రంలో రెండు చోట్ల హౌసింగ్ సొసైటీలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. వరంగల్, హైదరాబాద్‌లో ఏర్పాటు రాష్ట్రంలో 2 చోట్ల ఈ హౌసింగ్ సొసైటీలను ఏర్పాటు చేయాలని జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ ప్రతిపాదించారు. మొదటిది వరంగల్‌లో, రెండోది హైదరాబాద్ శివారులో. ఒక్కో హౌసింగ్ సొసైటీకి దాదాపు 20 ఎకరాల స్థలం అవసరమవుతుందని అంచనా వేశారు. దీనికి ఇప్పటికే వరంగల్, హైదరాబాద్‌లోని శంషాబాద్, శ్రీశైలం రోడ్డులో స్థలాలను పరిశీలించారు. అనువైన స్థలం దొరకగానే ఆ భూముల్లో హౌసింగ్ సొసైటీలను నిర్మించనున్నారు. ఇప్పటికే పలువురు ఖైదీలు నిర్మాణరంగం, ఎలక్ట్రిసిటీ, కార్పెంటరీ, పెయింటింగ్, ప్లంబింగ్ పను ల్లో నైపుణ్యం సాధించారు. వీరి నైపుణ్యాలను సద్వినియోగం చేసుకుంటే ఖైదీలకు అనుభవం, మానవ వనరుల వినియోగం 2 విధాలా మంచి ఫలితాలు సాధించాలన్నది యోచన. ఇందుకోసం జైలు ఉన్నతాధికారులు, కొందరు విశ్రాంత ఉద్యోగులతో కలసి ఈ సొసైటీల నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఏం చేస్తారు: పలు భారీ రియల్ ఎస్టేట్ సంస్థలతో ఒప్పందం లేదా ప్రభుత్వ ఆర్డర్ల ప్రకారం.. భారీ నిర్మాణాలను చేపట్టడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణను చేపట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం జైళ్లశాఖ ఓ నివేదిక రూపొందిస్తోంది. అది పూర్తయి, అనుమతి వస్తే, నిర్మాణ రంగంలోకి జైళ్లశాఖ రాక ఇక లాంఛనమే కానుంది. ఖైదీల్లో సత్ప్రవర్తన కోసమే రాష్ట్ర జైళ్లను ఖైదీల రహిత జైళ్లుగా మార్చాలన్న ఉద్దేశంతో చేపడుతున్న సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తుండటం శుభపరిణామం. ఇపుడు మేం నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలనుకుంటున్నాం. ఇప్పటికే జైళ్లలో ఖైదీలకు నిర్మాణం, కార్పెంటరీ, ఎలక్ట్రిక్ పనుల్లో శిక్షణ ఇస్తున్నాం. నేరస్తులను నిపుణులైన ఉద్యోగులుగా మలిచి బయటికి పంపడమే లక్ష్యంగా వీటిని చేపడుతున్నాం. కొత్త ఉపాధి కలిపిస్తే వారి జీవితాల్లో తప్పకుండా పరివర్తన ఉంటుంది. – వీకే సింగ్ డీజీ, జైళ్ల శాఖ -
అక్రమాలపై ధర్మాసనం కన్నెర్ర
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఉద్యోగుల కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అక్రమాలపై హైకోర్టు కన్నెర్ర చేసింది. సొసైటీని గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టింది. ఈ దిశగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏళ్ల తరబడి ఆర్థిక అవకతవకలు.. అవినీతి కేసులు.. వివాదాలు.. విచారణలు ఎదుర్కొంటున్న సొసైటీని తన నియంత్రణలోకి తీసుకుంది. నియంత్రణ బాధ్యతలను హైదరాబాద్ సిటీసివిల్ కోర్టు చీఫ్ జడ్జికి అప్పగించింది. సొసైటీ రోజువారీ నిర్వహణ, ఆస్తులు, ఇతర వ్యవహారాలన్నీ కూడా చీఫ్ జడ్జి ఆధ్వర్యంలోనే జరుగుతాయని తెలిపింది. సొసైటీ కార్యాలయంలోని రికార్డులను, కంప్యూటర్లను స్వాధీనం చేసుకోవాలని సూచించింది. నిర్ణీత కాలవ్యవధి వరకు సొసైటీ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసింది. సొసైటీ ఉద్యోగుల వేతనాల చెల్లింపు నిమిత్తమే బ్యాంకు ఖాతాలను ఉపయోగించుకోవాలని పేర్కొంది. ఈ చెల్లింపులన్నీ కూడా సివిల్‌కోర్టు అడ్మినిస్ట్రేటివ్ అధికారి చేతుల మీదుగా జరగాలని ఆదేశించింది. సొసైటీకి కేటాయించిన భూమిని సైతం స్వాధీనం చేసుకోవాలని చీఫ్ జడ్జికి సూచించింది. సొసైటీ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు దాని ఖాతాలను ఆడిట్ చేయించాలని నిర్ణయించింది. ఇందుకోసం కోఆపరేటివ్ సొసైటీస్ జాయింట్ రిజిస్ట్రార్ సి.సాయప్ప, డిప్యూటీ రిజిస్ట్రార్లు ఆర్.సంగీత, డి.విజయలక్ష్మిలతో ఓ బృందాన్ని నియమించింది. హైకోర్టు న్యాయవాదులు వేదుల శ్రీనివాస్, ఎస్.మమత ఆదేశాల మేరకు ఆడిట్ బాధ్యతలను నిర్వర్తించాలని ఆ బృందానికి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ బృందానికి శ్రీనివాస్‌ను చైర్‌పర్సన్‌గా నియమించింది. ఆడిట్ నిర్వహణకు అవసరమైన ఫైళ్లను, ఖాతా పుస్తకాలను ఈ బృందానికి అందుబాటులో ఉంచాలని చీఫ్ జడ్జికి సూచించింది. ఏ రికార్డులున్నా వెంటనే చీఫ్ జడ్జికి అప్పగించండి... సొసైటీ రికార్డులను వెంటనే చీఫ్ జడ్జికి అప్పగించాలని సహకార శాఖను, సొసైటీ ప్రస్తుత, పూర్వ కార్యవర్గ సభ్యులను హైకోర్టు ఆదేశించింది. ఆడిట్ బృందం కోరిన రికార్డులు ఇవ్వని పక్షంలో ప్రాసిక్యూషన్‌కు సైతం ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఎప్పటికప్పుడు స్పష్టతను తమ నుంచి చీఫ్ జడ్జి లేదా ఆడిట్ బృంద చైర్పర్సన్ పొందవచ్చని హైకోర్టు తెలిపింది. సొసైటీ చేసిన తీర్మానాలు, భూకేటాయింపు, లేఅవుట్ అభివృద్ధి, ఇతర కేటాయింపుల వివరాలను విచారణ నాటికి తమ ముందుంచాలని పిటిషనర్లను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దృష్టి సారించిన ప్రధాన న్యాయమూర్తి హౌసింగ్ సొసైటీ పాలకమండళ్ల తీరు, ప్లాట్ల కేటాయింపులు, ఓటర్ల జాబితా.. బైలాస్ సవరణ.. ఎన్నికలు, సొసైటీ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే నిమిత్తం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు ఉద్యోగులు, సొసైటీ పాలకులు పెద్దసంఖ్యలో పిటిషన్లు దాఖ లు చేశారు. 2014 నుంచి పలు వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయి. చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ వివాదాలపై దృష్టి సారించారు. సొసైటీకి సంబంధించిన పూర్తివివరాలను పాలనాపరంగా తెప్పించుకున్నారు. అనంతరం ఈ వ్యాజ్యాలన్నింటినీ కలిపి విచారించాలని నిర్ణయించారు. అందులో భాగం గా ఇటీవల ఈ వ్యాజ్యాలను జస్టిస్ రాధాకృష్ణన్ నేతృ త్వంలోని ధర్మాసనం విచారించింది. సొసైటీ సభ్యులుగా ఉన్న హైకోర్టు ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టి లో పెట్టుకుని ఈ ఉత్తర్వులు జారీచేస్తున్నట్లు తెలిపింది. ఈ ఉత్తర్వులతో వివాదాలకు ఫుల్స్టాప్ పడుతుందని హైకోర్టు ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
మంత్రి లేఖతో..సొసైటీ కమిటీపై ‘అవిశ్వాసమా’?
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి లేఖ ఆధారంగా జూబ్లీహిల్స్‌లోని విజయ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశానికి అధికారులు నోటీసులు జారీ చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. హౌసింగ్ సొసైటీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని సమావేశం ఎజెండాగా పేర్కొనడం సరికాదంది. సొసైటీ చైర్మన్‌పైనో, వైస్ చైర్మన్‌పైనో అవిశ్వాసం పెడతారేగానీ.. మొత్తం సొసైటీ మేనేజ్మెంట్ కమిటీపైనే అవిశ్వాస తీర్మానమంటూ ఎజెండాలో పేర్కొనడం సముచితంగా లేదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ టి.రజనీల ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమావేశాన్ని నిర్వహించాలని హైదరాబాద్ జిల్లా సహకార అధికారి, సంయుక్త రిజిస్ట్రార్ జారీ చేసిన నోటీసు అమలును నిలిపివేయాలని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యానికి ధర్మాసనం అంగీకరించలేదు. సింగిల్ జడ్జి ఆదేశాల్ని ఎమ్మెల్యే కాలనీ వాస్తవ్యుడు మనోహర్‌రెడ్డి సహా 30 మంది దాఖలు చేసిన వ్యాజ్యాలను గురువారం ధర్మాసనం కొట్టివేసింది. విజయ కోపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించాలని ఈ నెల 5న అధికారులు నోటీసులిచ్చారు. దీన్ని సొసైటీ అధ్యక్షుడు కె.రాంరెడ్డి సవాల్ చేయగా.. జిల్లా సహకార అధికారి నోటీసు అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వులిచ్చారు. ఈ ఆదేశాలను మనోహర్‌రెడ్డి మరో 29 మంది సవాల్ చేయగా హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. -
హౌసింగ్ సొసైటీలో అవకతవకలే ఘర్షణకు కారణం
-
'హౌసింగ్ సొసైటీ' పిటిషన్‌ను అనుమతించని సుప్రీం
ఢిల్లీ : హౌసింగ్ సొసైటీ కేసు పై సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరణ పిటిషన్ వేసింది. దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హౌసింగ్ సొసైటీ తీవ్రంగా వ్యతిరేకించడంతో ఉపసంహరణ పిటిషన్‌ను సుప్రీం కోర్టు అనుమతించలేదు. పాలసీలో మార్పులు చేసుకునేందుకు మాత్రమే కోర్టు అనుమతించింది. దీనికి తెలంగాణ తరఫు న్యాయవాది అంగీకరించారు. ప్రతివాదిగా ఏపీ సర్కార్‌ను కొనసాగించేందుకు ధర్మాసనం అంగీకారం తెలిపింది. -
పెద్దల గుప్పెట్లో సొసైటీ స్థలాలు
ఆక్రమార్కునికి అండ {పతిగా రూ.2 కోట్ల స్థలాల ఫలహారం అధికార పార్టీ కీలక నేత బంధువు యవ్వారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సొసైటీ అక్రమాల బాగోతం విశాఖపట్నం: కేంద్ర ప్రభు త్వ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ భూము ల్లో అధికార పార్టీ పెద్దలు పాగా వేస్తున్నారు. సొసైటీలో బయటపడిన అక్రమాలను అవకాశంగా తీసుకుని విలువైన స్థలాలను తమ గుప్పెట్లోకి తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే కార్యదర్శి డబ్బీరు గౌరీ శంకర్రావు భూ ఆక్రమణల కేసులో అరెస్టయినా ఆక్రమణలకు అడ్డుకట్ట పడలేదు. జీవీ ఎంసీ పరిధిలోని ఓ కీలక నేత సమీప బంధువు ఈవ్యవహారాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని మధురవాడలోని సొసైటీ స్థలాలను కబ్జా చేసేస్తున్నారు. దాదాపు రూ.5 కోట్ల విలువైన దాదాపు ఎకరా విస్తీర్ణంలోని సొసైటీకి చెందిన పలు స్థలాలను వ్యూ హాత్మకంగా ఆక్రమించుకుంటున్నారు. నాడు... కుటుంబ సభ్యులపేరిట కబ్జా సెంట్రల్ ఎక్సైజ్, సెంట్రల్ ఎంప్లాయీస్ హౌసింగ్ ఓనర్స్ వేల్ఫేర్ అసోషియేషన్‌కు మధురవాడలో ఉన్న స్థలాల్లో ఆక్రమణలకు అంతూపొంతూ లేకుండాపోతోంది. ఆ స్థలాలను కబ్జా చేసిన కేసులో కార్యదర్శి డబ్బీరు గౌరీ శంకర్రావును కొన్నిరోజుల క్రితం పోలీసులు అరెస్టు చేశారు. కానీ అతను కబ్జా చేసిన సొసైటీ స్థలాల గుట్టును పూర్తిగా ఛేదించకపోవడం గమనార్హం. అతని ఆక్రమణలో ఉన్నప్పటికీ విచారణ పరిధిలోకి రాని స్థలాలు ఎన్నో ఉన్నాయి. సొసైటీ స్థలాలను డబ్బీరు గౌరీశంకర్రావు తన కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలిసింది. సర్వే నంబర్లు 359లో నాలుగు ప్లాట్లు, 360లో రెండు ప్లాట్లను తన కుటుంబ సభ్యుల పేరున రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ సమీపంలోనే గెడ్డ పోరంబోకు స్థలాన్ని కూడా ఆక్రమించేసి కలిపేసుకున్నారు. అందులో నిర్మాణాలు కూడా ప్రారంభించారు. అదే విధంగా ఇదే సొసైటీకి చెందిన సర్వే నెంబరు. 2, 2పి లలో ఉన్న అన్నంరాజు లే అవుట్, అయోధ్యనగర్, నగరంపాలెంలలో దాదాపు 6 స్థలాలను కొంతకాలం క్రితమే తమవారి పేరిట రిజిస్ట్రేషన్ చేయించేశారు. ఇలా ఆక్రమించి ఇంకా విచారణ పరిధిలోకి రాని స్థలాల మార్కెట్ విలువ దాదాపు రూ.2 కోట్లు వరకు ఉంటుంది. నేడు కీలక నేత బంధువు గుప్పెట్లో..? డబ్బీరు గౌరీ శంకర్రావు అక్రమాలను అధికార పార్టీ నేత తనకు అనుకూలంగా మలచుకుంటున్నారు. జీవీఎంసీ పరిధిలోని కీలక అధికార పార్టీ నేతకు ఆయన సమీప బంధువు కూడా కావడం గమనార్హం. విచారణ పరిధిలోకి రాని ఆక్రమాలను కప్పిపుచ్చుతామని చెబుతూ ఆ స్థలాలను ఆక్రమించేందుకు వ్యూహం పన్నారు. అందుకు ఓ ఉన్నతాధికారి కూడా సహకరిస్తున్నారు. తద్వారా డబ్బీరు గౌరీ శంకర్రావుకు కేసు విచారణ విషయంలో సహకరించేందుకు... ప్రతిగా దాదాపు రూ.2 కోట్ల విలువైన స్థలాలను తనపరం చేసుకోవాలన్నది ఆ కీలక నేత పన్నాగం. దాంతో ఈ కేసులో లోతుగా విచారించకుండా తూతూమంత్రంగా ముగించే దిశగా పావుల కదుపుతున్నారు. అధికార పార్టీ నేతలు తలచుకుంటే కానిదేముంటుంది. -
సమగ్ర వివరాలు సమర్పించండి
హౌసింగ్ సొసైటీల్లో అక్రమాలపై అధికారులకు సభా సంఘం ఆదేశం హైదరాబాద్: హౌసింగ్ సొసైటీల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సమగ్ర వివరాలను తమ ముందు ఉంచాలని శాసనసభా సంఘం అధికారులను ఆదేశించింది. వివిధ హౌసింగ్ సొసైటీల్లో అక్రమాలపై నిగ్గుతేల్చేందుకు ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ నేతృత్వంలో ఏర్పాటైన సభా సంఘం శనివారం శాసనసభ కమిటీ హాల్లో సమావేశమై ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వర్ తదితర సొసైటీల్లో చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ జరిపింది. అసమగ్ర వివరాలతో సమావేశానికి వచ్చిన అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సమావేశంలో ప్రధానంగా పద్మాలయ, జయభేరీ స్టూడియోలలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సభా సంఘం అధికారులను నిలదీసింది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో అక్రమంగా నిర్వహిస్తున్న భారతీ విద్యా భవన్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్ గుర్తింపు గడువు ముగుస్తున్న నేపథ్యంలో మళ్లీ పునరుద్ధరించవద్దని అధికారులకు సూచించింది. హౌసింగ్ సొసైటీల్లో నిబంధనల మేరకు సామాజిక అవసరాలకు కేటాయించిన 10 శాతం స్థలాల్లో సైతం వ్యాపార, వాణిజ్య భవనాలను నిర్మిస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడింది. ఈ సమావేశంలో సభా సంఘం సభ్యులు కర్నె ప్రభాకర్, కె.జనార్దన్‌రెడ్డి, భానుప్రసాదరావు, గువ్వల బాలరాజు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, అహమ్మద్ బలాల, చింతల రామచంద్రారెడ్డి, మాగంటి గోపినాథ్‌తో పాటు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జి గోపాల్, జీహెచ్ఎంసీ ప్రత్యేకాధికారి సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఇకపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు తప్పనిసరి
గుర్గావ్: కొత్తగా నిర్మించే ఇల్లు, భవన సముదాయాలు, హౌసింగ్ సొసైటీలపై సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేయడాన్ని గుర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీజీ) తప్పనిసరి చేసింది. దీర్ఘకాలంగా విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్న నగరవాసుల సమస్యకు ఇదొక్కటే పరిష్కారమని ఎంసీజీ భావిం చి ఈ నిర్ణయం తీసుకుంది. సోలార్ ప్యానల్లు ఏర్పాటు చేసుకునేందుకు స్థలం కేటాయించిన భవనాలకు మాత్రమే నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలనే యోచనలో ఉన్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. అంటే గుర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఏ ప్రాంతంలోనైనా ఇల్లు కొన్నా, కొత్త ఇల్లు కట్టుకున్నా సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకోవడానికి స్థలం కేటాయించినట్లు రుజువులు చూపాల్సి ఉంటుంది. అంతటితోనే కాకుండా సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకుంటున్నట్లు కూడా హామీ పత్రం ఇవ్వాలి. అంటే ఇంటి నిర్మాణానికి సంబంధించిన లేఅవుట్లోనే సోలార్ ప్యానళ్ల ఏర్పాటుకు సంబంధించిన వివరాలుండాలి. అప్పుడే దానికి ఆమోదముద్ర పడుతుంది. అయితే ఇది కేవలం కొత్తగా నిర్మించనున్న ఇళ్లకే కాకుండా ఇప్పటికే నిర్మించిన ఇళ్లకు కూడా వర్తింపజేసే యోచనలో ఉన్నట్లు కూడా ఎంసీజీ అధికారి తెలిపారు. అయితే తమ మొదటి దృష్టి మాత్రం కొత్తగా నిర్మిస్తున్న ఇళ్లపైనే సారిస్తామన్నారు. కాగా ఈ విషయ మై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. ఎంసీ జీ సీనియర్ అధికారి ఒకరు ఈ విషయమై మాట్లాడుతూ... ‘నగరంలో విద్యుత్ కొరత సమస్య రోజు రోజుకు తీవ్రమవుతోంది. సంప్రదాయ విద్యుత్ వనరులు రోజురోజుకు తగ్గుతున్నాయి. తగ్గకుండా మూడు కాలాలపాటు విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలిగేది ఒక్క సోలార్ పవర్‌ను మాత్రమే. -
ఇంటి దొంగలు
రూ.50 కోట్ల విలువైనస్థలాల్లో ఉల్లంఘనలు! సభ్యులుకాని వారి చేతుల్లో సొసైటీ భూములు వాణిజ్య అవసరాలకు ‘బలవంతుల’ కొనుగోలు సహకార శాఖ విచారణతో ‘పెద్దల’ బెంబేలు సాక్షిప్రతినిధి, వరంగల్ : కాజీపేట కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్, చైతన్యపురి కాలనీ, కాజీపేట... ఈ పేరు ఎవరికీ తెలియదు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) సమీపంలోని చైతన్యపురి కాలనీ అంటే అందరికీ తెలుస్తుంది. ఇది.. వరంగల్ నగరంలోనే బాగా ఖరీదైన ప్రాంతం. అక్కడ గజం స్థలం ధర సగటున రూ.30 వేల నుంచి రూ.50 వేలు ఉంది. రోడ్డువైపు అయితే చెప్పాల్సిన పనే లేదు. రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ(ఇప్పుడు నిట్)లోని బోధన సిబ్బంది ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఈ కాలనీ ఏర్పాటైంది. టెక్నాలజీ బోధన సిబ్బంది పేరిట ఏర్పాటైన ఈ కాలనీ ఇప్పుడు అక్రమాలకు నిలయంగా మారింది. మొదట్లో సెంట్రల్ కమర్షియల్ జోన్‌గా ఉన్న ఈ ప్రాంతాన్ని సొసైటీ విజ్ఞప్తితో ప్రభుత్వం నివాసయోగ్యమైన స్థలంగా మార్చింది. సొసైటీలో సభ్యులు కాని కొందరు పెద్దలు ప్రధాన రహదారి వెంట ఉన్న 20 ప్లాట్లను కొనుగోలు చేసి నిబంధనలకు విరుద్ధంగా పూర్తిగా వాణిజ్య ప్రాంతంగా మార్చారు. సొసైటీ మొత్తం భూముల్లోని రూ.50 కోట్ల విలువైన విస్తీర్ణం ఇప్పటికే వాణిజ్య ప్రాంతంగా మారినట్లు స్పష్టమవుతోంది. హౌసింగ్ సొసైటీ ప్రాథమిక నియమాల ఉల్లంఘనపై సహకార శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ సంవత్సరం జనవరి 4 నుంచి విచారణ సాగుతోంది. ప్రాథమిక విచారణకు సంబంధించిన అంశాలను సొసైటీ పాలక మండలికి నోటీసు రూపంలో అందాయి. దీంతో అక్రమార్కుల్లో ఆందోళన మొదలైంది. అసలు కథ ఇదీ.. ఖాజీపేట కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్, చైతన్యపురి కాలనీ, కాజీపేట సహకార సంఘం 1961 మే 25న రిజిస్టర్(295టీకే) అయ్యింది. ఆర్ఈసీ (ప్రస్తుతం నిట్)లో ఉన్న సిబ్బంది ఇంటి నిర్మాణాలకు ఇళ్ల స్థలాలు ప్రధాన ఉద్దేశంగా ఏర్పాటైన ఈ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం 20.32 ఎకరాల భూమి కేటాయించింది. ప్రభుత్వం సొసైటీకి స్థలం కేటాయించినప్పుడు ఈ ప్రాంతం సెంట్రల్ కమర్షియల్ జోన్‌గా ఉండేది. సొసైటీ విజ్ఞప్తితో పురపాలక శాఖలోని 598 ఉత్తర్వుల ప్రకారం ఈ భూములను నివాస ప్రాంతంగా మార్చారు. 1986 అక్టోబరు 5న జరిగిన సొసైటీ పాలక మం డలి సమావేశంలో నిర్ణయం ప్రకారం.. సొసైటీలో అప్పటి వరకు సభ్యులుగా ఉన్న 139 సభ్యులకు ఇళ్ల స్థలాను కేటాయించారు. సుదీర్ఘకాలంగా చైతన్యపురి కాలనీ ప్రాం తంలో నివాసముండే అజ్మీరా విజయలక్ష్మీనాయక్ చైతన్యపురి కాలనీ సొసైటీలో ఖాళీ గా ఉన్న 100 గజాల 47ఎ ప్లాట్‌ను తనకు కేటాయించాలని సొసైటీకి విజ్ఞప్తి చేసుకున్నారు. సొసైటీలో ఇప్పటికే స్థలాలు పొందిన వారిలో గిరిజనులు లేరని... రిజర్వేషన్ల స్ఫూర్తితో గిరిజన మహిళ అయిన తన దరఖాస్తును పరిశీలించాలని, నిబంధనల ప్రకారం ధరను చెల్లిస్తానని పేర్కొన్నారు. హౌసింగ్ సొసైటీ పాలక మండలి నుంచి స్పందన రాకపోవడంతో విజయలక్ష్మీనాయక్ పలువురు ప్రజాప్రతినిధుల ద్వారా సహకార శాఖ కమిషనర్‌కు విజ్ఞప్తి చేసుకున్నారు. ఈ దరఖాస్తు పరిశీలించిన సహకా ర శాఖ కమిషనర్.. చైతన్యపురి కాలనీ సొసైటీ విషయాన్ని పరిశీలించాలని జిల్లా స హకార అధికారిని 2012 డిసెంబరు 12లో ఆదేశించారు. ఈ ఆదేశాలతో జిల్లా సహకార అధికారి సూచనతో డివిజనల్ సహకార అధికారి ప్రాథమిక విచారణ నిర్వహిం చారు. ఈ ప్రాథమిక నివేదిక ప్రకారం సొసైటీలో కొన్ని అక్రమాలు జరిగినట్టు తేల డంతో పూర్తి స్థాయి విచారణ నిర్వహించాలని సహకార శాఖ కమిషనర్ మళ్లీ 2013 సెప్టెంబరు 23న ఆదేశించారు. సొసైటీ కార్యకలాలపై పూర్తి స్థాయి విచారణ అధికారిగా సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ టి.కృష్ణమూర్తిని నియమిస్తూ జిల్లా సహకార అధికారి బి.సంజీవరెడ్డి 2014 జనవరి 4న ఉత్తర్వులు జారీ చేశారు. ‘కాజీపేట కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ చైతన్యపురి కాలనీ, కాజీపేట సహకార సంఘానికి సంబంధించి... రాష్ట్ర సహకార చట్టం, హౌజింగ్ సొసైటీ ప్రాథమిక నిబంధనలు(బైలా) ఉల్లంఘనలపై, సొసైటీ నిధుల అక్రమాలపై సహకార చట్టంలోని 51 సెక్షన్ ప్రకారం విచారణ నిర్వహించాలి. 60 రోజుల్లో విచారణ పూర్తి చేయాలి’ అని ఉత్తర్వు ల్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాలతో సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ టి.కృష్ణమూర్తి విచారణ చేపట్టారు. విచారణ తుది నివేదిక త్వరలోనే వస్తుందని జిల్లా సహకార అధికారి బి.సంజీవరెడ్డి బుధవారం ‘సాక్షిప్రతినిధి’కి తెలిపారు. విచారణ నివేదికలోని అంశాలు ఎలా ఉన్నా అక్రమాలపై కలెక్టర్ దృష్టి పెట్టాలని, అన్యాక్రాంతమైన హౌసిం గ్ సొసైటీ భూములను అర్హులకు అప్పగించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రాథమిక విచారణ నివేదికలోని అంశాలు ఇవీ... సొసైటీ నిబంధనల ప్రకారం కుటుంబానికి ఒక ప్లాటు మాత్రమే కేటాయించాలి. సొసైటీ కార్యదర్శి వి.కృష్ణమూర్తి నిబంధనలకు విరుద్ధంగా తన కుమారుడు వి.నరేందర్‌కు 240 గజాల విస్తీర్ణం ఉన్న 75ఏ ప్లాటును కేటాయించారు. 8 నెంబరు ప్లా ట్లో కొంత భాగాన్ని వి.నరేందర్ తీసుకుని భవనం నిర్మిచారు. పర్యాటక శాఖ కార్యాలయానికి, ప్రైవేటు సంస్థల కార్యాలయాలకు కిరాయికి ఇచ్చారు. అలాగే ఎన్.రామలింగం అనే వ్యక్తికి 250గజాల 122ఏ ప్లాటును ఇలాగే కేటాయించారు. సొసైటీ పాలకమండలి బాధ్యులు నిబంధనలకు విరుద్ధంగా 705 గజాలను సొసైటీలో సభ్యత్వంలేని రామ సరోజనకు విక్రయించారు. మొదట్లో ఈమె సభ్యురాలు కాదు. సొసైటీ సభ్యులకు భూ కేటాయింపు జరిగిన రోజు జాబితాలో ఈమె పేరు లేదు. 2001లో ఈమె పేరును చేర్చారు. ఇప్పుడు ఈ స్థలం నాగరాజు అనే వ్యక్తి ఆధీనంలో ఉంది. చైతన్యపురి కాలనీలోని 740 గజాల స్థలాన్ని సొసైటీలో సభ్యుడుకాని ఎం.నర్సింహారెడ్డికి విక్రయించారు. నర్సింహారెడ్డి పేరును సొసైటీ సభ్యుల జాబితాలో 2000 సంవత్సరంలో చేర్చారు. సొసైటీ పరిధిలోని దాదాపు 10వేల గజాల స్థలాన్ని కొందరు వ్యాపారవేత్తలు, కాం ట్రాక్టర్లు సభ్యుల నుంచి కొనుగోలు చేసి నివాసయోగ్యంగా ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రభుత్వనిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రంగా మార్చారు. మాణిక్‌లాల్ దాగా అనే వ్యాపారవేత్త 1, 8, 17, 18, 25 నంబర్లు గల ప్లాట్లను.. మొదట్లో స్థలం పొందిన వారి నుంచి కొనుగోలు చేశారు. వాణిజ్య భవనాలను నిర్మించారు. జనార్దనరెడ్డి అనే వ్యాపారవేత్త 9, 10, 11, 12, 13, 16 నంబర్లు గల ప్లాట్లు కొనుగోలు చేశారు. ఈ స్థలాల్లో ప్రైవేటు బ్యాంకులు, ఇతర వాణిజ్య సంస్థలు ఉన్నాయి. వి.సత్యమూర్తి అనే కాంట్రాక్టరు 5, 6, 7, 20, 21 నంబరు ప్లాట్లను కొనుగోలు చేసి భవనం నిర్మించారు. బ్యాంకులకు, ఇతర వాణిజ్య అవసరాలకు కిరాయికి ఇచ్చారు. హౌసింగ్ సొసైటీలో సభ్యులు కాని వారు సొసైటీ స్థలాల్లో యూజమాన్య హక్కులు పొందడానికి నిబంధనలు అంగీకరించవు. ఒక సభ్యుడు ఒకటి కంటే ఎక్కువ ప్లాట్లను కలిగి ఉండవద్దు. నగరపాలక సంస్థలో వాణిజ్య సముదాయాల భవన నిర్మాణం కోసం అనుమతులు ఇచ్చినా... ఈ ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధం. ఈ సొసైటీలో ఇలాంటి అక్రమాలన్నీ జరిగాయి. డివిజనల్ సహకార అధికారి అనుమతి లేకుండా సొసైటీ పరిధిలోని ఖాళీ స్థలాలను సొసైటీ పాలకమండలి ఎవరికీ విక్రయించకూడదని నిబంధనలు చెబుతున్నాయి. ఈ సొసైటీలో రూ.3 కోట్ల విలువైన స్థలాలను తక్కువ ధరకు సొసైటీలో సభ్యులు కాని వారికి విక్రయించారు. -
హౌసింగ్ సొసైటీ సమస్యలపై మోడీ స్పందన
ముంబై: ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులకు అనేక మంది సామాన్య ప్రజలు తమ సమస్యలను చెప్పుకొంటారు. అలాగే వాళ్లూ తమ సమస్యలను పరిష్కరించమంటూ ఆ నేతకో లేఖ రాశారు. ఆ సంగతి కూడా మరిచిపోయారు. ఇప్పుడాయన ప్రజా ప్రతినిధిగా ఎన్నికయ్యాడు. వారి సమస్యను గుర్తు పెట్టుకొని పరిష్కరించమంటూ అధికారులకో లేఖ రాశాడు. ఆ రాజకీయ నాయకుడు మోడీ. వినతి పత్రా న్ని సమర్పించింది ముంబై సబర్బన్ హౌసింగ్ సొసైటీవాసులు. తాము చేసిన విజ్ఞాపనను గుర్తుం చుకొని మరీ బీజేపీ నేత నరేంద్ర మోడీ స్పందించడంతో తమ స్థానిక సమస్యలు పరిష్కారమవుతాయనే సబర్బన్ హౌసింగ్ సొసైటీవాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమ కాంప్లెక్స్‌కు వెళ్లే రోడ్లు దారుణంగా ఉన్నాయని, వాటికి మరమ్మతు చేయాలని కోరుతూ ఉత్తర ముంబైలోని ఒబె రాయ్ స్ప్రింగ్స్ కాంప్లెక్స్ వాసులు గతంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి 2010 నుంచి నేటివరకూ 70 లేఖలు రాశారు. రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని, వీధి దీపాలు లేవని, వర్షపు నీరు పోవడానికి కాలువలు కూడా లేవని లేఖల్లో పేర్కొన్నా రు. నాలుగేళ్లుగా తాము ఎన్నిసార్లు వెళ్లినా బీఎంసీ అధికారులు అందుబాటులో కూడా లేరని హౌసింగ్ సొసైటీ మాజీ ఛైర్మన్ ప్రకాష్ మీర్పురి తెలిపారు. తరువాత 2014 ఏప్రిల్ 5న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి లేఖ రాశామని, అదే లేఖను మోడీ కి కూడా పంపామని చెప్పారు. రాహుల్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని, మోడీ సెక్రటేరియెట్‌లోని ప్రకాశ్ మజుందార్ అనే వ్యక్తి మే 5న ‘ఆ కాలనీ వాసుల సమస్యలు పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలంటూ’ తమ లేఖను రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌కు చేరవేశారని మీర్పురి తెలిపారు. ఎట్టకేలకు తమ సమస్య ప్రభుత్వం దృష్టికి రావడం ఆనందంగా ఉందని, ప్రస్తు తం ప్రధాని అభ్యర్థిగా ఎన్నికైన మోడీ స్పందన చూసి పరిపాలన పట్ల ఇప్పుడిప్పుడే ఆశ కలుగుతోందని చెప్పారు. -
హౌసింగ్ సొసైటీ సమావేశం రసాభాస
సచివాలయ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ సమావేశం రసాభాసగా మారింది. అడ్హాక్ కమిటీ ఏర్పాటు చేయాలంటూ ముందుగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే, కోరం లేదు కాబట్టి సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ ప్రాంత ఉద్యోగులు డిమాండ్ చేశారు. అయితే అది కుదరదని సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు అన్నారు. దీంతో తెలంగాణ ప్రాంత ఉద్యోగులు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. వారికి పోటీగా సీమాంధ్ర ఉద్యోగులు జై సమైక్యాంధ్ర అంటూ నినదించారు. పోటాపోటీ నినాదాలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో సమావేశాన్ని వాయిదా వేశారు.