సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి లేఖ ఆధారంగా జూబ్లీహిల్స్‌లోని విజయ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశానికి అధికారులు నోటీసులు జారీ చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. హౌసింగ్ సొసైటీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని సమావేశం ఎజెండాగా పేర్కొనడం సరికాదంది. సొసైటీ చైర్మన్‌పైనో, వైస్ చైర్మన్‌పైనో అవిశ్వాసం పెడతారేగానీ.. మొత్తం సొసైటీ మేనేజ్‌మెంట్ కమిటీపైనే అవిశ్వాస తీర్మానమంటూ ఎజెండాలో పేర్కొనడం సముచితంగా లేదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ టి.రజనీల ధర్మాసనం వ్యాఖ్యానించింది.
సమావేశాన్ని నిర్వహించాలని హైదరాబాద్ జిల్లా సహకార అధికారి, సంయుక్త రిజిస్ట్రార్ జారీ చేసిన నోటీసు అమలును నిలిపివేయాలని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యానికి ధర్మాసనం అంగీకరించలేదు. సింగిల్ జడ్జి ఆదేశాల్ని ఎమ్మెల్యే కాలనీ వాస్తవ్యుడు మనోహర్‌రెడ్డి సహా 30 మంది దాఖలు చేసిన వ్యాజ్యాలను గురువారం ధర్మాసనం కొట్టివేసింది. విజయ కోపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించాలని ఈ నెల 5న అధికారులు నోటీసులిచ్చారు. దీన్ని సొసైటీ అధ్యక్షుడు కె.రాంరెడ్డి సవాల్ చేయగా.. జిల్లా సహకార అధికారి నోటీసు అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వులిచ్చారు. ఈ ఆదేశాలను మనోహర్‌రెడ్డి మరో 29 మంది సవాల్ చేయగా హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.
Comments
Please login to add a commentAdd a comment