సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర జైళ్లశాఖ వినూత్న కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పటికే పలు సంస్కరణలు ప్రవేశపెట్టి సత్ఫలితాలు సాధిస్తోన్న జైళ్లశాఖ.. ఖైదీల సంఖ్యను గణనీయంగా తగ్గించడంలో సఫలీకృతమైంది. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా 17 జైళ్లు మూసివేసింది. 2014లో 80 వేల మంది ఖైదీలు ఉండగా 2018కి 55 వేలకు తగ్గడమే ఇందుకు కారణం. ఇపుడు వాటిని యాచకులు, వృద్ధులకు పునరావాస కేంద్రాలుగా మార్చి పలువురి చేత శభాష్ అనిపించుకుంది. 1.25 లక్షలమందిని విద్యావంతులుగా తీర్చిదిద్దింది. మరో సంచలనం దిశగా ఆ శాఖ త్వరలోనే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతోంది. నిపుణులైన ఖైదీలు, నిష్ణాతులైన జైలు ఉద్యోగులు, మాజీ ఉద్యోగులతో రాష్ట్రంలో రెండు చోట్ల హౌసింగ్ సొసైటీలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.
వరంగల్, హైదరాబాద్‌లో ఏర్పాటు
రాష్ట్రంలో 2 చోట్ల ఈ హౌసింగ్ సొసైటీలను ఏర్పాటు చేయాలని జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ ప్రతిపాదించారు. మొదటిది వరంగల్‌లో, రెండోది హైదరాబాద్ శివారులో. ఒక్కో హౌసింగ్ సొసైటీకి దాదాపు 20 ఎకరాల స్థలం అవసరమవుతుందని అంచనా వేశారు. దీనికి ఇప్పటికే వరంగల్, హైదరాబాద్‌లోని శంషాబాద్, శ్రీశైలం రోడ్డులో స్థలాలను పరిశీలించారు. అనువైన స్థలం దొరకగానే ఆ భూముల్లో హౌసింగ్ సొసైటీలను నిర్మించనున్నారు. ఇప్పటికే పలువురు ఖైదీలు నిర్మాణరంగం, ఎలక్ట్రిసిటీ, కార్పెంటరీ, పెయింటింగ్, ప్లంబింగ్ పను ల్లో నైపుణ్యం సాధించారు. వీరి నైపుణ్యాలను సద్వినియోగం చేసుకుంటే ఖైదీలకు అనుభవం, మానవ వనరుల వినియోగం 2 విధాలా మంచి ఫలితాలు సాధించాలన్నది యోచన. ఇందుకోసం జైలు ఉన్నతాధికారులు, కొందరు విశ్రాంత ఉద్యోగులతో కలసి ఈ సొసైటీల నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఏం చేస్తారు: పలు భారీ రియల్ ఎస్టేట్ సంస్థలతో ఒప్పందం లేదా ప్రభుత్వ ఆర్డర్ల ప్రకారం.. భారీ నిర్మాణాలను చేపట్టడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణను చేపట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం జైళ్లశాఖ ఓ నివేదిక రూపొందిస్తోంది. అది పూర్తయి, అనుమతి వస్తే, నిర్మాణ రంగంలోకి జైళ్లశాఖ రాక ఇక లాంఛనమే కానుంది.
ఖైదీల్లో సత్ప్రవర్తన కోసమే
రాష్ట్ర జైళ్లను ఖైదీల రహిత జైళ్లుగా మార్చాలన్న ఉద్దేశంతో చేపడుతున్న సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తుండటం శుభపరిణామం. ఇపుడు మేం నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలనుకుంటున్నాం. ఇప్పటికే జైళ్లలో ఖైదీలకు నిర్మాణం, కార్పెంటరీ, ఎలక్ట్రిక్ పనుల్లో శిక్షణ ఇస్తున్నాం. నేరస్తులను నిపుణులైన ఉద్యోగులుగా మలిచి బయటికి పంపడమే లక్ష్యంగా వీటిని చేపడుతున్నాం. కొత్త ఉపాధి కలిపిస్తే వారి జీవితాల్లో తప్పకుండా పరివర్తన ఉంటుంది.
– వీకే సింగ్ డీజీ, జైళ్ల శాఖ
Comments
Please login to add a commentAdd a comment