ఇకపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు తప్పనిసరి
గుర్గావ్: కొత్తగా నిర్మించే ఇల్లు, భవన సముదాయాలు, హౌసింగ్ సొసైటీలపై సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేయడాన్ని గుర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీజీ) తప్పనిసరి చేసింది. దీర్ఘకాలంగా విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్న నగరవాసుల సమస్యకు ఇదొక్కటే పరిష్కారమని ఎంసీజీ భావిం చి ఈ నిర్ణయం తీసుకుంది.
సోలార్ ప్యానల్‌లు ఏర్పాటు చేసుకునేందుకు స్థలం కేటాయించిన భవనాలకు మాత్రమే నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలనే యోచనలో ఉన్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. అంటే గుర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఏ ప్రాంతంలోనైనా ఇల్లు కొన్నా, కొత్త ఇల్లు కట్టుకున్నా సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకోవడానికి స్థలం కేటాయించినట్లు రుజువులు చూపాల్సి ఉంటుంది. అంతటితోనే కాకుండా సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకుంటున్నట్లు కూడా హామీ పత్రం ఇవ్వాలి. అంటే ఇంటి నిర్మాణానికి సంబంధించిన లేఅవుట్‌లోనే సోలార్ ప్యానళ్ల ఏర్పాటుకు సంబంధించిన వివరాలుండాలి.
అప్పుడే దానికి ఆమోదముద్ర పడుతుంది. అయితే ఇది కేవలం కొత్తగా నిర్మించనున్న ఇళ్లకే కాకుండా ఇప్పటికే నిర్మించిన ఇళ్లకు కూడా వర్తింపజేసే యోచనలో ఉన్నట్లు కూడా ఎంసీజీ అధికారి తెలిపారు. అయితే తమ మొదటి దృష్టి మాత్రం కొత్తగా నిర్మిస్తున్న ఇళ్లపైనే సారిస్తామన్నారు. కాగా ఈ విషయ మై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. ఎంసీ జీ సీనియర్ అధికారి ఒకరు ఈ విషయమై మాట్లాడుతూ... ‘నగరంలో విద్యుత్ కొరత సమస్య రోజు రోజుకు తీవ్రమవుతోంది. సంప్రదాయ విద్యుత్ వనరులు రోజురోజుకు తగ్గుతున్నాయి. తగ్గకుండా మూడు కాలాలపాటు విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలిగేది ఒక్క సోలార్ పవర్‌ను మాత్రమే.