Municipal Corporation of Gurgaon
-
ఎంసీజీ డిప్యూటీ మేయర్‌పై రేప్ కేసు
ప్రతిష్ఠాత్మక గుర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీజీ) లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, ఏళ్లుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఎంసీజీ డిప్యూటీ మేయర్ పై కేసు నమోదయింది. గుర్గావ్ పోలీస్ కమిషనర్ నవదీప్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏంసీజే డిప్యూటీ మేయర్ పర్మీందర్ కటారియా ఇంటిపక్కనే ఓ మహిళ నివసిస్తున్నది. భర్తకు దూరంగా ఉంటున్న ఆమె తన ఇద్దరు పిల్లల పోషణార్థం ఉద్యోగం అవసరమైంది. ఆ మేరకు పొరుగింట్లోనే ఉంటోన్న మేయర్ వద్దకెళ్లి అవసరాన్ని వివరించింది. అలా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం చనువుగామారిందని, ఎంసీజీలో ఉద్యోగం ఆశచూపి కటారియా తనను లొంగదీసుకున్నాడని, గడిచిన రెండేళ్లలో చాలాసార్లు తనపై లైంగికదాడి చేశాడని బాధిత మహిళ ఆరోపిస్తున్నది. ఫిర్యాదు మేరకు పర్మీందర్ కటారియాపై అత్యాచార చట్టం కింద కేసు నమోదు చేసినట్లు కమిషనర్ సింగ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందినవారైనప్పటికీ గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొంది, డిప్యూటీ మేయర్ అయ్యారు పర్మీందర్ కటారియా. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల శివారులను కలుపుతూ ఏర్పాటయిన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గుర్గావ్ (ఎంసీజీ) అత్యధిక బడ్జెట్ కలిగిన కార్పొరేషన్లలో ఒకటి. -
గుర్గావ్లో త్వరలో సైకిల్ షేరింగ్ విధానం
మోటార్ లేని వాహనాల వినియోగానికి కేంద్రం చొరవ గుర్గావ్: నగరంలో మోటారేతర వాహనాల వినియోగాన్ని పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఇందులోభాగంగా పబ్లిక్ బైసికిల్ షేరింగ్ విధానాన్ని అభివృద్ధి చేయాలంటూ హర్యానా ప్రభుత్వానికి ఇటీవల ఓ లేఖ రాసింది. నానాటికీ వాహనాల సంఖ్య పెరగడం, తత్ఫలితంగా నగరవాసులు ట్రాఫిక్ జామ్లలో చిక్కుకుపోవడం నిత్యకృత్యంగా మారింది. దీంతో స్థానికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో నగరవాసులను ఇటువంటి సమస్యలనుంచి విముక్తి కల్పించేందుకు కేంద్రం చొరవ తీసుకుంది. ఇందులోభాగంగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేయాలంటూ హర్యానా పట్టణ వికాసమంత్రిత్వ శాఖకు కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ ఇటీవల ఓ లేఖ రాసింది. ఇందుకోసం రెండు కన్సల్టెన్సీలను గుర్తించాలంటూ సదరు లేఖలో కోరింది. సైకిళ్ల వాడకాన్ని పెంచేందుకే: కమిషనర్ ఈ విషయమై గుర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీజీ) మిషనర్ వికాస్ యాదవ్ మాట్లాడుతూ సైకిళ్ల వినియోగాన్ని పెంచడమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఇందులోభాగంగానే కార్లు, ద్విచక్ర వాహనాల వాడకాన్ని తగ్గించే అంశంపై దృష్టి సారించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నగరంలో ప్రత్యేక సైకిల్ ట్రాక్‌లు, వాటికి పార్కింగ్ వసతులను కల్పిస్తామన్నారు. కనీసం వెయ్యి సైకిళ్లను నిలిపి ఉంచేందుకు అనువుగా మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. త్వరలో ఇందుకు అవసరమైన స్థలాలను గుర్తిస్తామన్నారు. -
విచ్చలవిడిగా బాణసంచా దుకాణాలు
గుర్గావ్: ఫరీదాబాద్‌లో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన బాణసంచా మార్కెట్లో మంగళవారం సంభవించిన అగ్నిప్రమాదం ఘటన అనుమతి లేకుండా దుకాణాలు ఏర్పాటుచేస్తే ఏమి జరుగుతుందనే విషయాన్ని చెప్పకనే చెప్పింది. అయినప్పటికీ నగరంలోని అనేక ప్రాంతాల్లో అనుమతి లేకుండా అనేక బాణసంచా విక్రయ దుకాణాలు వెలిశాయి. వాస్తవానికి నగరంలోని ఐదు ప్రాంతాల్లో మాత్రమే వీటి విక్రయానికి గుర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీజీ) అనుమతి ఇచ్చింది. లీజర్ వ్యాలీ గ్రౌండ్స్, సెక్టార్ -5 హుడా గ్రౌండ్స్, గౌశాల మైదానం, తావ్దేవి లాల్పార్కు, పటౌడీ ప్రాంతంలోని రాంలీలా మైదానంలో మాత్రమే బాణసంచాను విక్రయించేందుకు అనుమతించారు. అయినప్పటికీ నగరంలో విచ్చలవిడిగా దుకాణాలు వెలిశాయి. లీజర్ వ్యాలీ గ్రౌండ్స్‌లో 350 దుకాణాలు వెలిశాయి. ఇదిలాఉంచితే కాగా ఢిల్లీకి సరిహద్దులోని ఫరీదాబాద్‌లో మంగళవారం సాయంత్రం సంభవించిన అగ్ని ప్రమాదంలో 230కి పైగా బాణసంచా దుకాణాలు అగ్నికి ఆహుతైన సంగతి విదితమే. ఇక్కడి దసరా మైదానంలో ప్రతిఏటా దీపావళి సందర్భంగా బాణసంచా దుకాణాలు పెట్టుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తుంది. దాదాపు 200 దుకాణాలకు లెసైన్సులు ఇచ్చామని అగ్ని మాపక శాఖ అధికారి రామ్ మెహర్ చెప్పారు. కొంతమంది దుకాణాలను అలంకరించుకుంటుండగా, మరి కొందరు బాణసంచాను రవాణా చేస్తున్న సమయంలోనే భారీ అగ్నిప్రమాదం సంభవించిందన్నారు. ఈ ఘటనలో కొన్ని ప్రైవేటు వాహనాలు కూడా కాలి బూడిదయ్యాయని చెప్పారు. -
ఇకపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు తప్పనిసరి
గుర్గావ్: కొత్తగా నిర్మించే ఇల్లు, భవన సముదాయాలు, హౌసింగ్ సొసైటీలపై సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేయడాన్ని గుర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీజీ) తప్పనిసరి చేసింది. దీర్ఘకాలంగా విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్న నగరవాసుల సమస్యకు ఇదొక్కటే పరిష్కారమని ఎంసీజీ భావిం చి ఈ నిర్ణయం తీసుకుంది. సోలార్ ప్యానల్లు ఏర్పాటు చేసుకునేందుకు స్థలం కేటాయించిన భవనాలకు మాత్రమే నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలనే యోచనలో ఉన్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. అంటే గుర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఏ ప్రాంతంలోనైనా ఇల్లు కొన్నా, కొత్త ఇల్లు కట్టుకున్నా సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకోవడానికి స్థలం కేటాయించినట్లు రుజువులు చూపాల్సి ఉంటుంది. అంతటితోనే కాకుండా సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకుంటున్నట్లు కూడా హామీ పత్రం ఇవ్వాలి. అంటే ఇంటి నిర్మాణానికి సంబంధించిన లేఅవుట్లోనే సోలార్ ప్యానళ్ల ఏర్పాటుకు సంబంధించిన వివరాలుండాలి. అప్పుడే దానికి ఆమోదముద్ర పడుతుంది. అయితే ఇది కేవలం కొత్తగా నిర్మించనున్న ఇళ్లకే కాకుండా ఇప్పటికే నిర్మించిన ఇళ్లకు కూడా వర్తింపజేసే యోచనలో ఉన్నట్లు కూడా ఎంసీజీ అధికారి తెలిపారు. అయితే తమ మొదటి దృష్టి మాత్రం కొత్తగా నిర్మిస్తున్న ఇళ్లపైనే సారిస్తామన్నారు. కాగా ఈ విషయ మై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. ఎంసీ జీ సీనియర్ అధికారి ఒకరు ఈ విషయమై మాట్లాడుతూ... ‘నగరంలో విద్యుత్ కొరత సమస్య రోజు రోజుకు తీవ్రమవుతోంది. సంప్రదాయ విద్యుత్ వనరులు రోజురోజుకు తగ్గుతున్నాయి. తగ్గకుండా మూడు కాలాలపాటు విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలిగేది ఒక్క సోలార్ పవర్‌ను మాత్రమే.