ఎంసీజీ డిప్యూటీ మేయర్ పర్మీందర్ కటారియా (ఫైల్ ఫొటో)
ప్రతిష్ఠాత్మక గుర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీజీ) లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, ఏళ్లుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఎంసీజీ డిప్యూటీ మేయర్ పై కేసు నమోదయింది. గుర్గావ్ పోలీస్ కమిషనర్ నవదీప్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం..
ఏంసీజే డిప్యూటీ మేయర్ పర్మీందర్ కటారియా ఇంటిపక్కనే ఓ మహిళ నివసిస్తున్నది. భర్తకు దూరంగా ఉంటున్న ఆమె తన ఇద్దరు పిల్లల పోషణార్థం ఉద్యోగం అవసరమైంది. ఆ మేరకు పొరుగింట్లోనే ఉంటోన్న మేయర్ వద్దకెళ్లి అవసరాన్ని వివరించింది. అలా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం చనువుగామారిందని, ఎంసీజీలో ఉద్యోగం ఆశచూపి కటారియా తనను లొంగదీసుకున్నాడని, గడిచిన రెండేళ్లలో చాలాసార్లు తనపై లైంగికదాడి చేశాడని బాధిత మహిళ ఆరోపిస్తున్నది.
ఫిర్యాదు మేరకు పర్మీందర్ కటారియాపై అత్యాచార చట్టం కింద కేసు నమోదు చేసినట్లు కమిషనర్ సింగ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందినవారైనప్పటికీ గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొంది, డిప్యూటీ మేయర్ అయ్యారు పర్మీందర్ కటారియా. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల శివారులను కలుపుతూ ఏర్పాటయిన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గుర్గావ్ (ఎంసీజీ) అత్యధిక బడ్జెట్ కలిగిన కార్పొరేషన్లలో ఒకటి.