విద్యుత్‌ వాడుతూ.. మిగిలింది అమ్ముతూ.. | Pure Power Energy Solutions introduce products of specialized renewable energy solar power and battery storage solutions | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ వాడుతూ.. మిగిలింది అమ్ముతూ..

Published Tue, Mar 25 2025 4:35 PM | Last Updated on Tue, Mar 25 2025 4:53 PM

Pure Power Energy Solutions introduce products of specialized renewable energy solar power and battery storage solutions

ఉగ్నే హువాన్‌, రోహిత్‌ వడేరా, వి.కె.సారస్వత్‌, నిశాంత్‌ దొంగరి

మార్కెట్‌లోకి ‘ప్యూర్‌’ ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్స్‌ ఉత్పత్తులు

సాక్షి, హైదరాబాద్‌: ఎలక్ట్రిక్‌ టూవీలర్స్‌ తయారీ సంస్థ ప్యూర్‌(Pure) సరికొత్త రంగంలోకి అడుగుపెట్టింది. ఇళ్లతోపాటు, వాణిజ్య, గ్రిడ్‌స్థాయిలో ఉపయోగపడే ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్స్‌ (విద్యుత్తును నిల్వ చేసుకుని అవసరానికి తగ్గట్టుగా వాడుకునేందుకు వీలు కల్పించే) ఉత్పత్తులను ‘ప్యూర్‌-పవర్‌(Pure-Power)’ పేరుతో మార్కెట్‌లోకి తెచ్చింది. ఇవి సాధారణ యూపీఎస్‌లలో మాదిరిగా వీటిల్లో లెడ్‌ ఆక్సైడ్‌ బ్యాటరీలు కాకుండా.. అత్యాధునిక లిథియం-అయాన్‌ బ్యాటరీలు ఉండటం ఒక ప్రత్యేకతైతే.. సౌర విద్యుత్తు లాంటి సంప్రదాయేతర ఇంధన వనరులతో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును కూడా ఎటువంటి అదనపు పరికరాల అవసరం లేకుండా నిల్వ చేసుకోగలగడం ఇంకో ప్రత్యేకత. కొంచెం సులువుగా చెప్పుకోవాలంటే.. మీ ఇంటిపైకప్పుపై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేసుకుని ‘ప్యూర్‌-పవర్‌: హోం’ను వాడటం మొదలుపెట్టారనుకోండి.. మీ ఇంటికి కావాల్సిన విద్యుత్తును అక్కడికక్కడ ఉత్పత్తి చేసుకుని వాడుకోవడమే కాకుండా.. మిగిలిపోయిన విద్యుత్తును నేరుగా ప్రభుత్వానికి అమ్ముకోవచ్చునన్నమాట. నీతీఆయోగ్‌ సభ్యుడు, డీఆర్‌డీవో మాజీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ వి.కె.సారస్వత్‌ మంగళవారం హైదరాబాద్‌లోని నోవోటెల్‌లో ప్యూర్-పవర్‌ ఉత్పత్తులను లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్యూర్‌ సంస్థ వ్యవస్థాపకుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నిశాంత్‌ దొంగరి మాట్లాడుతూ  ‘‘దేశం మొత్తమ్మీద రానున్న 18 నెలల్లో 300 మంది డీలర్ల ద్వారా ‘ప్యూర్‌-పవర్‌’ ఉత్పత్తులను మార్కెట్‌ చేయనున్నాము’’ అని తెలిపారు. యూపీఎస్‌లతో పోలిస్తే ప్యూర్‌-పవర్‌ ఎన్నో విధాలుగా ప్రత్యేకమైనవని, నానో పీసీఎం మెటీరియల్‌ ద్వారా భద్రతకు పెద్దపీట వేశామని ఆయన తెలిపారు. ప్యూర్‌-పవర్‌లో ప్రస్తుతం రెండు రకాలను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నామని, గ్రిడ్‌ స్థాయిలో విద్యుత్తును నిల్వ చేసే ‘ప్యూర్‌-పవర్‌: గ్రిడ్‌’ను వచ్చే ఏడాది లాంచ్‌ చేస్తామన్నారు. ఇళ్లల్లో, అపార్ట్‌మెంట్లలో వాడుకోగలిగిన ‘ప్యూర్‌-పవర్‌:హోం’ 3 కిలోవోల్ట్‌ ఆంపియర్‌ (కేవీఏ), 5కేవీఏ, 15కేవీఏ సామర్థ్యాల్లో లభిస్తాయని ధర రూ.74,999తో ప్రారంభమవుతాయని చెప్పారు.

దుకాణాలు, కార్యాలయాలు, టెలికాం టవర్స్‌ వంటి వాటి కోసం 25 కేవీఏ నుంచి 100 కేవీఏల సామర్థ్యం గల ‘ప్యూర్‌-పవర్‌’ కమర్షియల్‌ను అందుబాటులోకి తెస్తున్నామని నిశాంత్‌ వివరించారు. వీటి వాడకం ద్వారా డీజిల్‌ జనరేటర్ల అవసరాన్ని లేకుండా చేసుకోవచ్చునని తెలిపారు. ప్యూర్‌-పవర్‌ మూడో ఉత్పత్తి గ్రిడ్‌ స్థాయిలో విద్యుత్తును నిల్వ చేసుకునేదని, 20 అడుగుల పొడవైన కంటెయినర్‌లోకి ఇమిడిపోయే ‘ప్యూర్‌-పవర్‌: గ్రిడ్‌’లో ఏకంగా నాలుగు మెగావాట్ల విద్యుత్తును నిల్వ చేసుకోవచ్చునని ఆయన వివరించారు. సోలార్‌ పార్కుల్లో వీటిని ఏర్పాటు చేసుకుంటే.. విద్యుత్తు డిమాండ్‌ తక్కువగా ఉన్న సమయంలో ఉత్పత్తి చేసిన విద్యుత్తును ఎక్కువ ఉన్న సమయంలో సరఫరా చేసేందుకు వీలేర్పడుతుందన్నారు. ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి ఈ ఉత్పత్తులను బుక్‌ చేసకోవచ్చునని, నెలాఖరు నుంచి డెలివరీ మొదలవుతుందని తెలిపారు.

ఇదీ చదవండి: రూ.కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త.. ఏం జరిగిందంటే..

దేశ అభివృద్ధికి కీలకం..

2070 నాటికి కర‍్బన్‌ ఉద్గారాలను సున్నాస్థాయికి తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో విద్యుత్తు వాహనాలతోపాటు ప్యూర్‌-పవర్‌ లాంటి ఉత్పత్తులు ఎంతో ఉపయోగపడతాయని నీతి ఆయోగ్‌ సభ్యులు వీకే సారస్వత్‌ స్పష్టం చేశారు. ప్యూర్‌-పవర్‌ ఉత్పత్తుల ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2030 నాటికి వాహనాల్లో 40 శాతం విద్యుత్తుతో నడిచేవిగా చేయాలని ప్రభుత్వం తీర్మానించిందని, కోటి ఇళ్ల పైకప్పులపై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటుకు సంకల్పించిందని వివరించారు. అయితే ప్రస్తుతం దేశం మొత్తమ్మీద ఉన్న విద్యుత్తు వాహనాల సంఖ్య (అన్ని రకాలు కలుపుకుని) ఇరవై లక్షలకు మించడం లేదని తెలిపారు. విద్యుత్తు వాహనాల ఛార్జింగ్‌ కోసం గ్రిడ్‌ను వాడటం మొదలుపెడితే గ్రిడ్‌పై అధిక భారం పడుతుందని, ఈ నేపథ్యంలోనే ప్యూర్‌-పవర్‌ వంటి ఉత్పత్తులకు ప్రాధాన్యం ఏర్పడుతోందని అన్నారు. బ్యాటరీల ధరలు తగ్గించేందుకు, మరింత సమర్థమైన వాటిని తయారు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఫలితస్తే మరింత మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్యూర్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడు రోహిత్‌ వడేరా తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement