అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్‌లో అక్రమాలు చోటుచేసుకు న్నాయని అందులోని కొందరు సభ్యులు ఆరోపిస్తు న్నారు. ఈ మేరకు సహకార శాఖకు ఫిర్యా దు చేశారు. సొసైటీ సభ్యుల కోసం కొన్న భూమిలో కొంత వివాదా స్పద స్థలం ఉందని చెప్పి, ఆ మేరకు కోత విధించి ఇళ్ల స్థలాలు కేటాయించారు. చివరకు వివాదా స్పదం అని చెబుతూ వచ్చిన భూమిలో విల్లాలు నిర్మించి అమ్ముకునేందుకు మేనేజ్ మెంట్ కమిటీ సభ్యులు రంగం సిద్ధం చేస్తున్నారు.
సాక్షి, హైదరాబాద్: అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ లాభాపేక్ష లేకుండా ఉద్యో గుల కోసం ఏర్పడింది. సాధారణ అటెండర్ మొదలుకొని అకౌంటెంట్ జనరల్ వరకు కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఉద్యో గుల భాగస్వామ్యంతో డబ్బులు సమకూర్చు కొని భూమి కొనుగోలు చేసి దాన్ని లే ఔట్ చేసి సభ్యులకు ఇళ్ల స్థలాలు కేటాయించాల న్నది దీని లక్ష్యం.
ఈ సొసైటీ కింద ఇప్పటి వరకు 14 వెంచర్లు వేశారు. సొసైటీలో 5 వేల మంది వరకు సభ్యులున్నారు. అత్తాపూర్, శ్రీనగర్‌కాలనీ, ఆనంద్‌నగర్ కాలనీ, నలందా నగర్, అత్తివెల్లి, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో వెంచర్లు వేశారు. మేనేజింగ్ కమిటీనే ఈ వెంచర్లు, లేఔట్లు వేసే బాధ్యత తీసుకుంది.
13వ వెంచర్‌కు సంబంధించి ఏజీ సొసైటీ మేడ్చల్ మండలం అత్తివెల్లి గ్రామంలో 94.12 ఎకరాలు కొనుగోలు చేసింది. ఈ 13వ వెంచర్‌లో 1112 మంది సభ్యులు న్నారు. ప్రతి ఒక్కరూ ఎవరి స్థాయిలో వారు కొనుగోలు చేసేలా 67 గజాలు, 150 గజాలు, 200, 267, 333, 400, 500 గజాల చొప్పున వెంచర్లు వేసి వాటికి లేఔట్ వేశారు.
వివాదస్పద భూమి ఉందంటూ..
మొత్తం 94.12 ఎకరాల్లో 91 ఎకరాలు క్లియర్‌గా ఉందని 2020లో కోఆపరేటివ్ రిజిస్ట్రార్‌కు రాసిన లేఖలో దాని అధ్యక్షుడు పేర్కొన్నారు. మిగిలిన 3.12 ఎకరాలపై అస్పష్టత నెలకొందని తెలిపారు. అయితే రెండేళ్ల తర్వాత 2022లో కేవలం 79.24 ఎకరాలకు మాత్రమే ఫైనల్ లేఔట్ అనుమతి వచ్చింది. మిగిలిన ఎకరాలకు మాత్రం లేఔట్ తీసుకోలేదు. సర్వే నెంబర్‌లో భూసంబంధిత వివాదాలున్నాయంటూ పక్కన పెట్టేశారు.
ఆ మిగిలిన భూముల్లో ఒకటిన్నర ఎకరా మాజీ ఎమ్మెల్యే కబ్జాలో ఉందనీ, నాలుగు ఎకరాలు రైతుల ఆధీనంలో ఉందన్న వాదనలు వెల్లువెత్తాయి. కాగా, 2022 జూన్, జూలై నెలల్లో కోఆపరేటివ్ కమిటీ విచారణ చేపట్టి భూమి మొత్తం క్లియర్‌గానే ఉందని, భూవివాదాలు, మాజీ ఎమ్మెల్యేతో, రైతులతో ఉన్న వివాదాలను సరి చేసుకున్నామని నివేదికలో పేర్కొంది. కానీ 2022 సెప్టెంబర్‌లో అధ్యక్షుడు కేవలం 79.24 ఎకరాలకు మాత్రమే లేఔట్ తీసుకొచ్చారు. అంతా క్లియర్‌గా ఉన్నప్పుడు కేవలం 79.24 ఎకరాలకే ఎందుకు లేఔట్ తీసుకొచ్చారన్న ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేదు.
వివాదాస్పద భూముల్లో విల్లాలు..
మొత్తంగా లేఔట్ భూమిలో 1112 ఫ్లాట్లు ఇచ్చారు. 67, 150 గజాలు లేఔట్ ఉన్న వారికి పక్కాగానే ఇచ్చారు. కానీ 200 గజాలు ఇవ్వాల్సిన వారికి 166 గజాలు, 267 గజాలు ఇవ్వాల్సిన వారికి 200 గజాలు, 333 గజాలు ఇవ్వాల్సిన వారికి 233 గజాలు, 400 గజాలు ఇవ్వాల్సిన వారికి 300 గజాలు, 500 గజాలు ఇవ్వాల్సిన వారికి 350 గజాలు మాత్రమే ఇచ్చారు. అంటే 30 శాతం కోత విధించి ప్లాట్లు కేటాయించారు. వివాదంలో భూమి ఉందని చెప్పి తక్కువ కేటాయించారు. ఇక మిగిలిన 14.88 ఎకరాల్లో అనధికారికంగా విల్లాలు నిర్మించి అమ్ముకుందామని నిర్ణయించారు.
ఆ మేరకు 2022లో కోఆపరేటివ్ సొసైటీ పేరు మీదనే విల్లాలు నిర్మిస్తామని బ్రోచర్ కూడా వేశారు. 150 గజాల్లో నిర్మిస్తున్న ఒక్కో విల్లా రూ. 1.08 కోట్లు అంటున్నారు. 14.88 ఎకరాలు ధర మార్కెట్లో రూ. 200 కోట్లు ఉంటుందని అంచనా. విల్లాల వ్యవహారంపై కొందరు సభ్యులు సహకారశాఖలో ఫిర్యాదు చేస్తే, బెదిరింపు కాల్స్, మెంబర్‌షిప్ క్యాన్సిల్ చేస్తామని బెదిరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఐదుగురు సభ్యుల మేనేజ్‌మెంట్ కమిటీనే ఈ విల్లాల కుంభకోణానికి పాల్పడిందని సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు.
అంతా అక్రమాలమయమే..
సొసైటీ పెద్దలదంతా అక్రమాల మయమే. వివాదాస్పద భూమిలో విల్లాలు కడతామని, లేకుంటే వేలం పాడుతామని చెప్తూ, తద్వారా వచ్చిన సొమ్మును అందరికీ ఇస్తామని మేనేజ్‌మెంట్ కమిటీ చెబుతోంది. కానీ ఆ అధికారం వారికి ఎక్కడిది? 1112 మంది నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు, డాక్యుమెంటేషన్ చార్జీలు, మెంబర్‌షిప్, వెంచర్ నిర్వహణ, ఆఫీసు ఖర్చులు, అదనపు ఖర్చుల కింద 2022 నవంబర్‌లో రూ.9 కోట్లు వసూలు చేశారు. వాస్తవంగా ఒక్కొక్కరి నుంచి రూ. 9 వేలు తీసుకుంటే సరిపోతుంది. కానీ ఒక్కొక్కరి నుంచి రూ.60 వేలు వసూలు చేశారు. – అరుణ్‌కుమార్, సొసైటీ సభ్యుడు
ఎక్కడా అక్రమాలు జరగలేదు
13వ వెంచర్‌కు సంబంధించి మేమే చేస్తున్నాం. 8.4 ఎకరాలకు ఇంకా ఇప్పటివరకు అనుమతి రాలేదు. అనుమతి వస్తే విల్లాలు కడతాం. ఆ మేరకు జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. లేకుంటే భూమిని అమ్మి అందరికీ ఇస్తామని చెప్పాం. అంతేగానీ ఎక్కడా అక్రమాలు జరగలేదు.
– నరేంద్రనాథ్, సొసైటీ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment