
హెచ్‌సీయూ లోపల విద్యార్థుల ధర్నా
ధర్నా చేసేందుకు వచ్చిన సీపీఎం, బీజేవైఎం నాయకులు
సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు.. నిరసనకారుల అరెస్ట్
గచ్చిబౌలి: కంచ గచ్చిబౌలి భూముల వేలానికి నిరసనగా హైదరాబాద్ సెంట్రల్ యూ నివర్సిటీ వద్ద ధర్నాకు వచ్చిన సీపీఎం, బీజేవైఎం కార్యకర్తల ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హెచ్‌సీయూ ప్రధాన ద్వారం బయట నిరసనకా రులు.. వర్సిటీ లోపల విద్యార్థుల ధర్నాతో హెచ్‌సీ యూ అట్టుడికిపోయింది. మంగళవారం హెచ్‌సీయూ విద్యా ర్థులు మహాధర్నాకు పిలుపు ఇవ్వడం, వర్సిటీ భూములను పరిశీలిస్తామని బీజేపీ ఎమ్మెల్యే లు చెప్పిన విషయం తెలిసిందే.
ఉదయం 11 గంటల సమయంలో అటు సీపీఎం, ఇటు బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ ప్రధాన ద్వారం వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి డౌన్‌డౌన్, వర్సిటీ భూములను వేలం వేయొద్దని, విద్యార్థులకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని నినదించారు. అప్పటికే భారీ సంఖ్యలో మోహరించిన పోలీసు బలగాలు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో వారిని అరెస్టు చేసే క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దొరికినవారిని దొరికినట్టే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మహిళా నాయకురాళ్లను అరెస్ట్ చేశారు. నాలుగైదు వాహనాల్లో నిరసన కారులను నార్సింగి, కొల్లూరు, మాదాపూర్, రాజేంద్రనగర్, రాయదుర్గం పీఎస్‌లకు తరలించారు. దాదాపు 68 మందిని అరెస్టు చేసి, వారిపై కేసులు నమోదు చేసి రాత్రి విడుదల చేసినట్టు పోలీసులు తెలిపారు. విద్యార్థులు మహాధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందస్తుగా హౌస్ అరెస్టులు చేశారు. ఆందోళనకు నాయక త్వం వహించిన వారిలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సెవెళ్ల మహేందర్, సీపీఎం నేత శోభన్, ఉస్మానియా యూనివర్సిటీ పీడీఎస్‌యూ అధ్యక్షుడు ఆవుల నాగరాజు తదితరులు ఉన్నారు. ఆందోళనల నేపథ్యంలో మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
⇒ఆందోళన సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సెవెళ్ల మహేందర్ మాట్లాడుతూ వర్సిటీ భూములను కాపాడేందుకు ఎన్ని ఉద్యమాలైనా చేసేందుకైనా సిద్ధంగా ఉన్నామన్నారు. భూముల వేలాన్ని తక్షణమే సీఎం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
⇒ విద్యార్థులపై పోలీసుల ఉక్కుపాదాన్ని నిరసిస్తూ ధర్నాకు వెళితే ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేశారని సీపీఎం నాయకులు వాపోయారు. హెచ్‌సీయూ భూముల వేలాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.