ఇంటి దొంగలు
- రూ.50 కోట్ల విలువైనస్థలాల్లో ఉల్లంఘనలు!
- సభ్యులుకాని వారి చేతుల్లో సొసైటీ భూములు
- వాణిజ్య అవసరాలకు ‘బలవంతుల’ కొనుగోలు
- సహకార శాఖ విచారణతో ‘పెద్దల’ బెంబేలు
సాక్షిప్రతినిధి, వరంగల్ : కాజీపేట కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్, చైతన్యపురి కాలనీ, కాజీపేట... ఈ పేరు ఎవరికీ తెలియదు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) సమీపంలోని చైతన్యపురి కాలనీ అంటే అందరికీ తెలుస్తుంది. ఇది.. వరంగల్ నగరంలోనే బాగా ఖరీదైన ప్రాంతం. అక్కడ గజం స్థలం ధర సగటున రూ.30 వేల నుంచి రూ.50 వేలు ఉంది. రోడ్డువైపు అయితే చెప్పాల్సిన పనే లేదు. రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ(ఇప్పుడు నిట్)లోని బోధన సిబ్బంది ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఈ కాలనీ ఏర్పాటైంది.
టెక్నాలజీ బోధన సిబ్బంది పేరిట ఏర్పాటైన ఈ కాలనీ ఇప్పుడు అక్రమాలకు నిలయంగా మారింది. మొదట్లో సెంట్రల్ కమర్షియల్ జోన్‌గా ఉన్న ఈ ప్రాంతాన్ని సొసైటీ విజ్ఞప్తితో ప్రభుత్వం నివాసయోగ్యమైన స్థలంగా మార్చింది. సొసైటీలో సభ్యులు కాని కొందరు పెద్దలు ప్రధాన రహదారి వెంట ఉన్న 20 ప్లాట్లను కొనుగోలు చేసి నిబంధనలకు విరుద్ధంగా పూర్తిగా వాణిజ్య ప్రాంతంగా మార్చారు.
సొసైటీ మొత్తం భూముల్లోని రూ.50 కోట్ల విలువైన విస్తీర్ణం ఇప్పటికే వాణిజ్య ప్రాంతంగా మారినట్లు స్పష్టమవుతోంది. హౌసింగ్ సొసైటీ ప్రాథమిక నియమాల ఉల్లంఘనపై సహకార శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ సంవత్సరం జనవరి 4 నుంచి విచారణ సాగుతోంది. ప్రాథమిక విచారణకు సంబంధించిన అంశాలను సొసైటీ పాలక మండలికి నోటీసు రూపంలో అందాయి. దీంతో అక్రమార్కుల్లో ఆందోళన మొదలైంది.
అసలు కథ ఇదీ..
ఖాజీపేట కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్, చైతన్యపురి కాలనీ, కాజీపేట సహకార సంఘం 1961 మే 25న రిజిస్టర్(295టీకే) అయ్యింది. ఆర్‌ఈసీ (ప్రస్తుతం నిట్)లో ఉన్న సిబ్బంది ఇంటి నిర్మాణాలకు ఇళ్ల స్థలాలు ప్రధాన ఉద్దేశంగా ఏర్పాటైన ఈ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం 20.32 ఎకరాల భూమి కేటాయించింది. ప్రభుత్వం సొసైటీకి స్థలం కేటాయించినప్పుడు ఈ ప్రాంతం సెంట్రల్ కమర్షియల్ జోన్‌గా ఉండేది. సొసైటీ విజ్ఞప్తితో పురపాలక శాఖలోని 598 ఉత్తర్వుల ప్రకారం ఈ భూములను నివాస ప్రాంతంగా మార్చారు.
1986 అక్టోబరు 5న జరిగిన సొసైటీ పాలక మం డలి సమావేశంలో నిర్ణయం ప్రకారం.. సొసైటీలో అప్పటి వరకు సభ్యులుగా ఉన్న 139 సభ్యులకు ఇళ్ల స్థలాను కేటాయించారు. సుదీర్ఘకాలంగా చైతన్యపురి కాలనీ ప్రాం తంలో నివాసముండే అజ్మీరా విజయలక్ష్మీనాయక్ చైతన్యపురి కాలనీ సొసైటీలో ఖాళీ గా ఉన్న 100 గజాల 47ఎ ప్లాట్‌ను తనకు కేటాయించాలని సొసైటీకి విజ్ఞప్తి చేసుకున్నారు. సొసైటీలో ఇప్పటికే స్థలాలు పొందిన వారిలో గిరిజనులు లేరని... రిజర్వేషన్ల స్ఫూర్తితో గిరిజన మహిళ అయిన తన దరఖాస్తును పరిశీలించాలని, నిబంధనల ప్రకారం ధరను చెల్లిస్తానని పేర్కొన్నారు.
హౌసింగ్ సొసైటీ పాలక మండలి నుంచి స్పందన రాకపోవడంతో విజయలక్ష్మీనాయక్ పలువురు ప్రజాప్రతినిధుల ద్వారా సహకార శాఖ కమిషనర్‌కు విజ్ఞప్తి చేసుకున్నారు. ఈ దరఖాస్తు పరిశీలించిన సహకా ర శాఖ కమిషనర్.. చైతన్యపురి కాలనీ సొసైటీ విషయాన్ని పరిశీలించాలని జిల్లా స హకార అధికారిని 2012 డిసెంబరు 12లో ఆదేశించారు. ఈ ఆదేశాలతో జిల్లా సహకార అధికారి సూచనతో డివిజనల్ సహకార అధికారి ప్రాథమిక విచారణ నిర్వహిం చారు.
ఈ ప్రాథమిక నివేదిక ప్రకారం సొసైటీలో కొన్ని అక్రమాలు జరిగినట్టు తేల డంతో పూర్తి స్థాయి విచారణ నిర్వహించాలని సహకార శాఖ కమిషనర్ మళ్లీ 2013 సెప్టెంబరు 23న ఆదేశించారు. సొసైటీ కార్యకలాలపై పూర్తి స్థాయి విచారణ అధికారిగా సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ టి.కృష్ణమూర్తిని నియమిస్తూ జిల్లా సహకార అధికారి బి.సంజీవరెడ్డి 2014 జనవరి 4న ఉత్తర్వులు జారీ చేశారు.
‘కాజీపేట కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ చైతన్యపురి కాలనీ, కాజీపేట సహకార సంఘానికి సంబంధించి... రాష్ట్ర సహకార చట్టం, హౌజింగ్ సొసైటీ ప్రాథమిక నిబంధనలు(బైలా) ఉల్లంఘనలపై, సొసైటీ నిధుల అక్రమాలపై సహకార చట్టంలోని 51 సెక్షన్ ప్రకారం విచారణ నిర్వహించాలి. 60 రోజుల్లో విచారణ పూర్తి చేయాలి’ అని ఉత్తర్వు ల్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాలతో సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ టి.కృష్ణమూర్తి విచారణ చేపట్టారు. విచారణ తుది నివేదిక త్వరలోనే వస్తుందని జిల్లా సహకార అధికారి బి.సంజీవరెడ్డి బుధవారం ‘సాక్షిప్రతినిధి’కి తెలిపారు. విచారణ నివేదికలోని అంశాలు ఎలా ఉన్నా అక్రమాలపై కలెక్టర్ దృష్టి పెట్టాలని, అన్యాక్రాంతమైన హౌసిం గ్ సొసైటీ భూములను అర్హులకు అప్పగించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రాథమిక విచారణ నివేదికలోని అంశాలు ఇవీ...
సొసైటీ నిబంధనల ప్రకారం కుటుంబానికి ఒక ప్లాటు మాత్రమే కేటాయించాలి. సొసైటీ కార్యదర్శి వి.కృష్ణమూర్తి నిబంధనలకు విరుద్ధంగా తన కుమారుడు వి.నరేందర్‌కు 240 గజాల విస్తీర్ణం ఉన్న 75ఏ ప్లాటును కేటాయించారు. 8 నెంబరు ప్లా ట్‌లో కొంత భాగాన్ని వి.నరేందర్ తీసుకుని భవనం నిర్మిచారు. పర్యాటక శాఖ కార్యాలయానికి, ప్రైవేటు సంస్థల కార్యాలయాలకు కిరాయికి ఇచ్చారు. అలాగే ఎన్.రామలింగం అనే వ్యక్తికి 250గజాల 122ఏ ప్లాటును ఇలాగే కేటాయించారు.
సొసైటీ పాలకమండలి బాధ్యులు నిబంధనలకు విరుద్ధంగా 705 గజాలను సొసైటీలో సభ్యత్వంలేని రామ సరోజనకు విక్రయించారు. మొదట్లో ఈమె సభ్యురాలు కాదు. సొసైటీ సభ్యులకు భూ కేటాయింపు జరిగిన రోజు జాబితాలో ఈమె పేరు లేదు. 2001లో ఈమె పేరును చేర్చారు. ఇప్పుడు ఈ స్థలం నాగరాజు అనే వ్యక్తి ఆధీనంలో ఉంది.
చైతన్యపురి కాలనీలోని 740 గజాల స్థలాన్ని సొసైటీలో సభ్యుడుకాని ఎం.నర్సింహారెడ్డికి విక్రయించారు. నర్సింహారెడ్డి పేరును సొసైటీ సభ్యుల జాబితాలో 2000 సంవత్సరంలో చేర్చారు.
సొసైటీ పరిధిలోని దాదాపు 10వేల గజాల స్థలాన్ని కొందరు వ్యాపారవేత్తలు, కాం ట్రాక్టర్లు సభ్యుల నుంచి కొనుగోలు చేసి నివాసయోగ్యంగా ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రభుత్వనిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రంగా మార్చారు.
మాణిక్‌లాల్ దాగా అనే వ్యాపారవేత్త 1, 8, 17, 18, 25 నంబర్లు గల ప్లాట్లను.. మొదట్లో స్థలం పొందిన వారి నుంచి కొనుగోలు చేశారు. వాణిజ్య భవనాలను నిర్మించారు.
జనార్దనరెడ్డి అనే వ్యాపారవేత్త 9, 10, 11, 12, 13, 16 నంబర్లు గల ప్లాట్లు కొనుగోలు చేశారు. ఈ స్థలాల్లో ప్రైవేటు బ్యాంకులు, ఇతర వాణిజ్య సంస్థలు ఉన్నాయి.
వి.సత్యమూర్తి అనే కాంట్రాక్టరు 5, 6, 7, 20, 21 నంబరు ప్లాట్లను కొనుగోలు చేసి భవనం నిర్మించారు. బ్యాంకులకు, ఇతర వాణిజ్య అవసరాలకు కిరాయికి ఇచ్చారు.
హౌసింగ్ సొసైటీలో సభ్యులు కాని వారు సొసైటీ స్థలాల్లో యూజమాన్య హక్కులు పొందడానికి నిబంధనలు అంగీకరించవు. ఒక సభ్యుడు ఒకటి కంటే ఎక్కువ ప్లాట్లను కలిగి ఉండవద్దు. నగరపాలక సంస్థలో వాణిజ్య సముదాయాల భవన నిర్మాణం కోసం అనుమతులు ఇచ్చినా... ఈ ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధం. ఈ సొసైటీలో ఇలాంటి అక్రమాలన్నీ జరిగాయి.
డివిజనల్ సహకార అధికారి అనుమతి లేకుండా సొసైటీ పరిధిలోని ఖాళీ స్థలాలను సొసైటీ పాలకమండలి ఎవరికీ విక్రయించకూడదని నిబంధనలు చెబుతున్నాయి. ఈ సొసైటీలో రూ.3 కోట్ల విలువైన స్థలాలను తక్కువ ధరకు సొసైటీలో సభ్యులు కాని వారికి విక్రయించారు.