- ప్రతీ ఎన్నికలో 80 శాతం చేరని పోలింగ్
- ఓటు నమోదు, పోలింగ్ శాతాల మధ్య భారీ తేడా
- తెలంగాణలో మూడు పర్యాయాలు ఎన్నికలు
- అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకూ భారీ తేడా
- నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం
ప్రతీ పౌరుడు ఓటు హక్కును ప్రాథమిక బాధ్యతగా స్వీకరించాలి. మొత్తం ఓటర్లలో కనీసం 90 శాతం మంది ఓటుహక్కును వినియోగించుకోవాలి. 90 శాతం ఓటింగ్ జరిగితే దేశం ఎప్పుడూ అభివృద్ధి పథంలో పురోగమిస్తుంది.
– అబ్దుల్ కలాం, మాజీ రాష్ట్రపతి
సాక్షి ప్రతినిధి, వరంగల్: భారత రాజ్యాంగంలోని 326 ఆర్టికల్ ప్రకారం 18 ఏళ్లు నిండిన జాతీయ పౌరులకు వయోజన ఓటుహక్కు(National Voters Day) కల్పించారు. కుల, మత, లింగ, ప్రాంత, ధనిక, పేద, వివక్ష లేకుండా అక్షరాస్యులకు నిరక్షరాస్యులకు సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించి.. ప్రపంచ రాజకీయ చరిత్రలో గొప్ప విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. అభివృద్ధి చెందిన దేశాల కంటే ముందే మనదేశంలో వయోజన ఓటింగ్ హక్కు కల్పించి, ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వేసింది. అయితే ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ.. అవినీతిని పారదోలే వజ్రాయుధం.. రాజ్యాంగం ప్రసాదించిన హక్కు.. ఇలా ఎన్ని విశ్లేషణలు జోడించినా.. ఓటు వేస్తున్న వారి సంఖ్య ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లేందుకు వీలుగా.. వరసలో నిలబడి ఓటు వేయడానికి ఇంకా చాలామంది ఆసక్తి చూపడం లేదు. ఓటు వేసే విషయంలో గ్రామీణ ఓటర్లు మొగ్గు చూపుతున్నా.. పట్టణ, నగర ఓటర్లే తడబడుతున్నారు. ఓటర్ల నమోదు పెరుగుతున్నా.. ఓటింగ్ శాతం మాత్రం పెరగడం లేదు.
తెలంగాణలో మూడు ఎన్నికలు.. 80 శాతం చేరని వైనం..
1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో 45 శాతం ఓటర్లు మాత్రమే ఓటు(Vote) హక్కును వినియోగించారు. 2019 నాటికి 17వ లోకసభ ఎన్నికల్లో 66.4 శాతం మంది ఓటు వేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడు పర్యాయాలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఏటా 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకుల ఓటు నమోదు కోసం జిల్లాల అధికార యంత్రాంగం విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఎన్నికల సమయంలోనూ ఓటింగ్ శాతం పెరిగేలా చర్యలు చేపడుతోంది. కానీ.. ఈ ఎన్నికల్లో మొత్తం ఓట్లు.. పోలైన ఓట్లు.. ఓటింగ్ శాతాలు పరిశీలిస్తే 80 శాతం చేరుకున్న దాఖలాలు లేవు. కేంద్ర ఎన్నికల సంఘం నివేదికల ప్రకారం.. తెలంగాణ ఏర్పడిన తొలి శాసనసభ (2014) ఎన్నికల్లో 2,81,65,885 మంది ఓటర్లకు 1,94,43,411 మంది (69.0 శాతం) ఓటు వేశారు. 2018లో 79.67 శాతం ఓట్లు పోల్ కాగా, 2023లో 71.37 శాతంగా నమోదైంది.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు భారీ వ్యత్యాసం..
తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌లో భారీ వ్యత్యాసం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసినంతమంది కూడా పార్లమెంట్ ఎన్నికలకు ముందుకు రాలేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 2,81,65,885 మంది ఓటర్లకు 1,94,43,411 మంది (69.0శాతం) ఓటు వేయగా.. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 2,81,75,651 ఓట్లకు 1,94,31,99 (68.97 శాతం) ఓట్లు పోలయ్యాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 2,56,94,443 ఓట్లకు, 2,04,70,749 (79.67 శాతం) ఓట్లు పోలవగా, ఆ తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 2,80,65,876 ఓట్లకు 1,86,42,895 (66.4 శాతం) ఓట్లు పోలయ్యాయి. అలాగే 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 3,26,02,799 ఓటర్లకు 2,32,67,914 మంది ఓటర్లు (71.37 శాతం) తమ ఓటుహక్కును వినియోగించుకోగా, 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల నాటికి ఓటు న మోదు పెరిగినా 5.11 శాతం తగ్గింది. మొత్తం 3,32,16,348 మంది ఓటర్లకు 2,20,08,373 మంది (66.26 శాతం) ఓట్లేశారు.
ఓటు హక్కుపై అవగాహన
ఓటు హక్కు వినియోగంపై ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌కు తోడు పౌరసమాజం, యువత మహిళా సంఘాలు, స్వచ్ఛంద సామాజిక సేవా సంస్థలు చైతన్యం కలిగించాలి. అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం ఓటుహక్కు చాలా కీలకం. ఓటు హక్కు వినియోగం మీద అందరినీ మరింత చైతన్య పరచాల్సిన బాధ్యత పౌరసమాజంపై ఉంది. ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా సమర్ధులైన అభ్యర్థులకు ఓటువేసేలా చూడాలి.
– డాక్టర్ కేశవులు, చైర్మన్, తెలంగాణ యాంటీ కరప్షన్ ఫోరం
Comments
Please login to add a commentAdd a comment