National Voters Day
-
ప్రజాస్వామ్యంలో ఓటే బలమైన ఆయుధం
సాక్షి, అమరావతి: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన ఓటర్ల అవగాహన, ప్రతిజ్ఞ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా బలమైన ఆయుధమన్నారు. సమావేశానికి హాజరైన వారితో ఓటు హక్కును తెలియజేసే విధంగా గవర్నర్ ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ..రాష్ట్రంలో పురుష ఓటర్లు కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారని చెప్పారు. గతేడాదిగా ఓటు నమోదు, స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు చేసిన విశేష కృషి ఫలితంగా ఇటీవల ప్రకటించిన తుది జాబితాలో ఓటర్ల సంఖ్య 4.08 కోట్లుగా ఉందని చెప్పారు. తుది జాబితా ప్రచురణకు ముందు 2 నెలల పాటు ప్రధానంగా 18–19 ఏళ్ల వయసున్న వారు ఓటరుగా నమోదు చేయించుకునేందుకు ప్రత్యేకంగా కృషి చేయడంతో 5.3 లక్షల ఓటర్లు అదనంగా నమోదయ్యారని చెప్పారు. యువ ఓటర్ల నమోదు కార్యక్రమం ఎన్నికల ముందు వరకు నిరంతరం కొనసాగుతుందని, యువ ఓటర్ల నమోదుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. నూతనంగా ఓటర్లుగా నమోదైన యువతకు ఎపిక్ కార్డులను గవర్నర్ అందజేశారు. ఎన్నికల జాబితా నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలలక్ష్మి, ఎనీ్టఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీ రావులకు పురస్కారాలను అందజేశారు. ఈఆర్వోలైన నెల్లూరు మునిసిపల్ కమిషనర్ వికాస్ మర్మత్, సింహాచలం దేవస్థానం ఎస్డీసీ రామలలక్ష్మి, భీమునిపట్నం ఆర్డీవో భాస్కర్ రెడ్డి, ఏఈఆర్వోలైన కోడుమూరు మండలం తహశీల్దార్ జయన్న, మైదుకూరు తహశీల్దార్ అనురాధ, గిద్దలూరు తహశీల్దార్ సీతారామయ్య, మరో 23 మంది బీఎల్వోలను, సీఈవో కార్యాలయానికి చెందిన ఎస్వో శ్రీనివాసరావు, ఏఎస్వో సుధాకర్ తో పాటు మరో ఐదుగురు సిబ్బందిని గవర్నర్ సత్కరించారు. దేశ సర్వతోముఖాభివృద్ధికి పునరంకితం కావాలి గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో అందరం దేశ సర్వతోముఖాభివృద్ధికి పునరంకితం కావాలని గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, అహింస, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు పాటుపడాలని గవర్నర్ ఆకాంక్షించినట్లు రాజ్‌భవన్‌వర్గాలు గురువారం తెలిపాయి. -
ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం..
-
ఓటు వేయకుంటే ఆత్మహత్య చేసుకుంటా.. తమిళిసై సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కౌశిక్ రెడ్డి ప్రచారంలో ఓట్లు అడిగిన విధానంపై తాజాగా తమిళిసై స్పందించారు. ఈ క్రమంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈరోజు హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఈవో వికాస్‌రాజ్, రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారధి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్‌రాస్ విచ్చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ..‘ఓటు వేయడం మన హక్కు. స్టేట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్‌కు మధ్య వారధిగా ఉండటం నా బాధ్యత. జనరల్ ఎన్నికలను విజయవంతంగా జరిపినందుకు శుభాకాంక్షలు. మొదటిసారి ఇంటి నుంచే ఓటు వేయడం అనేది మంచి పరిణామం. ఓటింగ్ రోజు సెలవు అనేది సరదా కోసం కాదని యువత గుర్తుంచుకోవాలి. ఓటు హక్కు వినియోగం అనేది యుద్ధంలో పాల్గొన్నట్టు అనుకోవాలి. ఓటు వేసిన మార్క్ చూసి గర్వంగా ఫీలవ్వాలి. నేను నోటాకు వ్యతిరేకం. ఎన్నికల బరిలో ఉన్న ఎవరో ఒకరిని యువత ఎన్నుకోవాలన్నారు. పాడి కౌశిక్ రెడ్డిపై ఫైర్.. ఇదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో ఓ అభ్యర్థి ఓట్లు అడిగిన అంశాన్ని తమిళిసై ప్రస్తావించారు. ఎన్నికల్లో తనకు ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా అని ఓ అభ్యర్థి అన్నారు. ఎన్నికల కమిషన్ అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి. కాగా, సదరు అభ్యర్థి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిగా తెలుస్తోంది. ఓటర్లను ఎవరూ బెదిరించకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. ఓటు శాతం పెరగడానికి ప్రకటనలు ఒక్కటే ఉపయోగపడవు అనేది ఈసీ ఆలోచన. ఓటు అనేది మోస్ట్ పవర్ ఫుల్ ఆయుధం. ప్రజాస్వామ్యం బ్రతకాలంటే ఓటు వేయాలి. మంచి అభ్యర్థిని ఓటర్ ఎన్నుకుంటే మంచి పాలన అందుతుంది. ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలి’ అని కామెంట్స్ చేశారు. అనంతరం, 18 ఏళ్లు పూర్తి చేసుకొని కొత్తగా ఓటును పొందిన మనీషా అనే యువతికి గవర్నర్ తమిళిసై ఓటర్ ఐడీని అందించారు. అలాగే, జనరల్ ఎన్నికల్లో మెరుగైన పనితీరు కనబరిచిన పలువురు ఐఏఎస్ , ఐపీఎస్, వలంటీర్లకు గవర్నర్ సర్టిఫికేట్ అందించారు. -
చెయ్యి తోని చెయ్యి ఎప్పుడు గల్పుతరు?
పొద్దు మీకింది. ఎప్పటి తీర్గనే చౌరస్తల ఉన్న పాన్ డబ్బ కాడ్కి బోయిన. పాన్ డబ్బ మా అడ్డ. దినాం పొద్దు మీకంగనే మా దోస్తు లందరు గాడ జమైతరు. నాత్రి తొమ్మిది గొట్టె దాంక ముచ్చట బెడ్తం. నేను బోకముందు మా దోస్తులు ఏం మాట్లాడుకుండ్రో నా కెర్క లేదు. గని నేను బోయినంక గీ తీర్గ ముచ్చట బెట్టిండ్రు. ‘‘మొన్న ఓటర్ల దినాన మా వాడ కట్టు ఓటర్లు మీటింగ్ బెట్టిండ్రు’’ అని యాద్గిరి అన్నడు. ‘‘మీటింగ్ బెట్టి ఏం జేసిండ్రు’’ అని సత్నారి అడిగిండు. ‘‘తీర్మానాలు జేసిండ్రు’’ ‘‘గయేంటియో జర జెప్పు’’ ‘‘గ్యాస్ బండ దర బెంచిండ్రు. బస్ చార్జిలు బెంచిండ్రు. కరెంటు చార్జిలు గుడ్క బెంచిండ్రు. మనం గుడ్క ఓటు దర బెంచాలె. ఓటును అగ్వ దరకు అమ్మే సవాల్ లేదు. ఉద్దెర నడ్వదు. అంత నగతే. గిట్ల నగతిస్తె గట్ల ఓటేస్త మనాలె. గుండు గుత్త ఓట్ల కోసం కుల పెద్దకు రూపాయ లిచ్చినమని లీడర్లు జెప్తె నమ్మొద్దు. ఓటరు అంటె ఎవడు. దేవునసుంటోడు. దేవునికి ఏ తీర్గ పూజలు జేస్తరో గదే తీర్గ లీడర్లు ఓటర్‌కు పూజలు జెయ్యాలె’’ అని యాద్గిరి ఇంకేమొ జెప్పబోతుంటె ఇస్తారి అడ్డం దల్గి – ‘‘నోటుకు ఓటు గాకుంట ఇంకేమన్న తీర్మానాలు జేసిండ్రా?’’ అని అడిగిండు. ‘‘చేసిండ్రు. ఓటు ఏసెతంద్కు బోయెటోల్లని మోటర్ల దీస్క బోవాలె. లైన్ల శానసేపు నిలబడే పనిబడ్తె కాల్లు నొవ్వకుంట తలా ఒక కుర్సి ఏసి కూసుండ బెట్టాలె. ఎండ దాకకుంట షామియానాలు ఎయ్యాలె. షామియాన ఏసేటి మోక లేకుంటె తలకొక ఛత్రి బట్టే సౌలత్ బెట్టాలె. ఎండ కాలంల ఓట్లేసే పని బడ్తె సల్లటి సోడలు తాపియ్యాలె. గదే సలికాలమైతె ఛాయ్, కాఫి ఇయ్యాలె’’ అని యాద్గిరి జెప్పిండు. ‘‘కూట్లె రాయి దీయనోడు ఏట్లె రాయెట్ల దీస్తడు అని బీఆర్ఎస్ లీడర్లు అంటుంటరు. గని గాల్లే గురువింద ఇత్తు అసుంటోల్లన్న సంగతిని యాది మరుస్తున్నరు’’ అని ఇస్తారి అన్నడు. ‘‘గా సంగతేందో జెర జెప్పు’’ అని సత్నారి అన్నడు. ‘‘హుజూరాబాద్ బై ఎలచ్చన్ల ముంగట దలిత బందు పద్కం బెట్టిండ్రు. ఎట్లన్న జేసి గెల్వాలని గా నియోజక వర్గంల అమలు జేసిండ్రు. వాసాల మర్రిల 75 మంది దళితులకు గీ పద్కం కింద తలా పది లచ్చల రూపాయ లిచ్చిండ్రు. అటెంకల నియోజక వర్గంకు 500 మందికి దలిత బందు పద్కం కింద తలా పది లచ్చలు ఇస్తమన్నరు. మల్ల గిప్పుడు 200 మందికే ఇస్తమంటున్నరు. బడ్జెట్ బెట్టి యాడాదైంది. గని పోయిన పది నెలలల్ల ఒక్కడంటె ఒక్క నికి గుడ్క ఈ పద్కం కింద రూపాయలియ్య లేదు. బీఆర్ఎస్ సర్కారొస్తె దేసమంత దలిత బందు పద్కం బెడ్త మని కేసీఆర్ అన్నడు. రాస్ట్రంలనే అమలు జెయ్యనోడు దేసంల అమలెట్ల జేస్తడు’’ అని ఇస్తారి అన్నడు. ‘‘హాత్ సే హాత్ యాత్ర సంగతేంది?’’ ‘‘వొచ్చె నెల ఆరో తారీకు కెల్లి రాస్ట్రంల హాత్ సే హాత్ జోడో యాత్ర జేస్తమని కాంగ్రెస్ లీడర్లు అంటున్నరు. ముందుగాల చబ్బీస్ జన్వరి కెల్లి గీ పాదయాత్ర జేద్దామను కున్నరు. రాహుల్ గాంది బారత్ జోడో పాదయాత్ర కశ్మిర్లకు బోయింది. గని జమ్ముల చబ్బీస్ జన్వరి దినాన గాకుంట ముప్పై తారీకు రాహుల్ జెండ ఎగిరేస్తడట. బారత్ జోడో కతమైన చబ్బీస్ జన్వరి దినాన్నే హాత్ సే హాత్ జోడో పాదయాత్ర షురువు జేద్దామని కాంగ్రెస్ లీడర్లు అను కున్నరు. గని జమ్ముల రాహుల్ పబ్లిక్ మీటింగ్ వాయిద బడ బట్కె తెలంగానల పాదయాత్ర గుడ్క వాయిద బడ్డది. యథా లీడర్ తథా క్యాడర్.’’ ‘‘హాత్ సే హాత్ జోడో అంటె చెయ్యితోని చెయ్యి గల్పుడు. చెయ్యి తోని చెయ్యి ఎప్పుడు గల్పుతరు. కుస్తి పట్టేటి ముంగట గల్పుతరు. చెయ్యి తోని చెయ్యి గల్పుడు అంటె చెయ్యిచ్చుడు. గీ రొండిట్ల ఏం జేస్తమని కాంగ్రెస్ జెప్తున్నది’’ అని సత్నారి అడిగిండు. ‘‘కోడి గుడ్డు మీద బూరు బీక్తున్నవు. పస్కలొచ్చినోనికి దునియంత పచ్చగనే కండ్ల బడ్తదట’’ అని ఇస్తారి అన్నడు. ‘‘గాంది బవన్కు వొచ్చేటి సవాల్ లేదన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గీనడ్మ గాంది బవన్కు వొచ్చిండు. రేవంత్ రెడ్డిని గల్సిండు. ఇద్దరం గల్సి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర జేద్దామన్నడు. మునుగోడు బై ఎలచ్చన్లప్పుడు కాంగ్రెస్ కిలాఫ్ మాట్లాడిన వెంకట్ రెడ్డి మీద డిసిప్లినరీ యాక్షన్ దీస్కోవాలెనని కొండా సురేక అంటున్నది. ముందుగాల్ల లీడర్ సే లీడర్ జోడో అయినంకనే హాత్ సే హాత్ జోడో అంటె బాగుంటది’’ అని సత్నారి అన్నడు. ‘‘ఆది శంకరాచార్య అందరి కన్న ఫస్టు కన్యాకుమారి కెల్లి కశ్మీర్ దాంక పాదయాత్ర జేసిండ్రు. మల్ల గిప్పుడు శంకరాచార్య తీర్గనే రాహుల్ గాంది గుడ్క కన్యాకుమారి కెల్లి కశ్మీర్ దాంక పాదయాత్ర జేసిండని కశ్మీర్ మాజి ముక్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఒక్క తీర్గ తారీఫ్ జేసిండు. గాయిన శంకరాచార్య అనంగనే రాహుల్‌కు ముగ్గురు దేవులల్ల ఒక్కడైన శంకరుడు యాది కొచ్చిండు. యాదికి రాంగనే గాయిన చెయ్యి సూబెట్టిండు. బారత్ జోడో యాత్ర అనేటి తపస్సు జేసిన. చేసినంకనే మీకు అరచెయ్యి అంటె అభయ ముద్ర సూబెడ్తున్న అని రాహుల్ గాంది అన్నడు’’ అని యాద్గిరి జెప్పిండు. నాత్రి తొమ్మిది గొట్టినంక ఎవలింటికి గాల్లు బోయినం. (క్లిక్ చేయండి: మామా రాహుల్ గాంది పెండ్లెందుకు జేస్కోలేదే?) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
National Voters Day 2023: ప్రజల చేతిలోని పాశుపతాస్త్రం
ఈ రోజు భారత ఎన్నికల సంఘాన్ని స్థాపించిన రోజు. 2011 నుండి జాతీయ ఓటర్ల దినోత్సవంగా కూడా జనవరి 25ను జరుపు కొంటున్నాం. దీని ఉద్దేశం ఓటర్లుగా భారత పౌరులకు ఉన్న హక్కులు, బాధ్యతల గురించి అవగాహన కల్పించడమే. ఎన్నిల సంఘం (ఈసీ) పనితీరు, నిర్ణయం తీసుకునే స్వతంత్రతను నిర్ధారించడానికి రాజ్యాంగ సభ ఆర్టికల్ 324 ద్వారా రాజ్యాంగ హెూదాను ఇచ్చింది. తక్కువ అక్షరాస్యత, ఉనికిలో లేని ఓటర్ల జాబితా యుగంలో వయోజన ఓటు హక్కు ఆధారంగా ఎన్నికలను నిర్వహించడానికి శాశ్వతమైన స్వయంప్రతిపత్తి గల కమిషన్‌ను ఏర్పాటు చేయడం రాజ్యాంగ సభ దూరదృష్టికి ప్రతీక. ఈసీ నిష్పాక్షికత, విశ్వసనీయత ఆధారంగా ఇప్పటివరకు 17 లోక్‌సభ ఎన్నికలు; రాష్ట్రపతి ఎన్నికలు 16 సార్లు, అదే విధంగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి మరో 16 సార్లు ఎన్నికలు నిర్వహించింది. అలాగే 399 సార్లు శాసనసభ ఎన్నికలు నిర్వహించింది. 400వ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. చాలావరకు రాజకీయపార్టీల, ప్రజల విశ్వాసాన్ని ఎన్నికల సంఘం చూరగొన్నదనే చెప్పాలి. పటిష్ఠమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి బలమైన, సమ్మిళిత ఎన్నికల భాగస్వామ్యం చాలా కీలకం. శక్తిమంతమైన ప్రజాస్వామ్యంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, సక్రమంగా, విశ్వసనీయంగా ఉండాలి. అదే సమయంలో ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈ సందర్భంగా ‘మనం విధులను నిర్వర్తించ కుండా వదిలేస్తే, హక్కుల కోసం పరుగు తీయాల్సి ఉంటుంది. అవి మనల్ని ఇష్టానుసారంగా తప్పించుకుంటాయి’ అన్న మహాత్మాగాంధీ మాటలు గుర్తు కొస్తున్నాయి. 94 కోట్లకు పైగా నమోదిత ఓటర్లను కలిగి ఉన్న భారత్... ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. గత సార్వత్రిక ఎన్నికలలో (2019) 67.4 శాతం ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. మిగిలిన 30 కోట్ల మంది ఓటర్లను పోలింగ్ బూత్‌కు తీసుకురావడం ఇప్పుడు మనముందున్న పెద్ద సవాల్. యువత లోనూ, పట్టణ ఓటర్లలోనూ ఉన్న ఉదాసీనత; బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వలసపోవడం వంటి అనేక కారణాల వల్ల ఇంతమంది ఓటింగ్‌లో పాల్గొనలేదని చెప్పవచ్చు. 2022 నవంబర్ 5న హిమాచల్‌ప్రదేశ్ కల్పాలో మరణించిన మొట్టమొదటి భారత ఓటర్ శ్యామ్ శరణ్ నేగీకి నివాళులు అర్పించే గౌరవం నాకు లభించింది. ఆయన తన 106వ ఏట మరణించే ముందు కూడా ఓటు హక్కును ఉపయోగించుకుని ఓటు వేయకుండా ఉండే ఉదాసీన పౌరులకు తమ విధి ఏమిటో తెలియచేశారు. ఆయన స్ఫూర్తిని అందరూ అందుకోవాలి. యువ ఓటర్లే భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్తు. 2000 సంవత్సరం తర్వాత జన్మించిన తరం మన ఓటర్ల జాబితాలో చేరడం ప్రారంభించింది. ఓటర్లుగా వారి భాగస్వామ్యం మొత్తం శతాబ్దమంతా ప్రజాస్వామ్య భవిష్యత్తును రూపుదిద్దబోతోంది. అందువల్ల ఓటు వేసే వయస్సు వచ్చేలోపు పాఠశాల స్థాయిలోనే ప్రజాస్వామ్య బీజం విద్యార్థుల్లో నాటడం అత్యంత క్లిష్టమైనదే కాదు, ముఖ్యమైనది కూడా. ప్రజాస్వామ్యంలో, ఓటర్లకు తాము ఓటు వేసే అభ్యర్థి నేపథ్యం గురించి తెలుసుకునే హక్కు ఉంది. ఈ కారణంగానే అభ్యర్థులపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల గురించి వార్తాపత్రికల్లో తెలియ జేయాలి. ఇప్పటికీ ఎన్నికల్లో కండబలాన్ని ఉపయోగించడానికి ప్రయత్నించేవారు కొన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం ఉండకూడదు. ఎన్నికల్లో ధనబలాన్ని అరి కట్టడం పెద్ద సవాల్‌గా మిగిలిపోయింది. చట్టాన్ని అమలు చేసే సంస్థల కఠినమైన నిఘా కారణంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో చాలా వరకు ఇటువంటి విపరీత ధోరణులకు అడ్డుకట్ట పడింది. ఎన్నికలను ప్రభావితం చేయగల స్థాయిలో ఇవ్వాళ సోషల్ మీడియా ఉంది. అందులో నకిలీ వార్తల ప్రచారం జరగకుండా చూడాల్సి ఉంది. ఎన్నికలను అన్ని జాగ్రత్తలతో నిర్వహించడం ఎన్నికల సంఘం విధి. ఎన్నికల ప్రక్రియలో ఓటరే ప్రధాన భాగస్వామి. అందుకే ఓటు వేయడానికి కావలసిన స్నేహపూర్వక, సుహృద్భావ వాతావరణాన్ని కల్పించడం ద్వారా ఓటర్లు అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనేలా ఈసీ తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడానికి కంకణబద్ధమై ఉంది. పౌరులు ఓటరుగా తన కర్తవ్యాన్ని నిర్వహించడానికి గర్వపడగలిగితే అది వారు ఎన్నుకున్న ప్రభుత్వ పాలనా స్థాయి మీద కూడా ప్రభావం చూపుతుంది. పౌరు లందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు! (క్లిక్ చేయండి: నిర్లక్ష్యానికి గురవుతున్న బాలికా విద్య) - రాజీవ్ కుమార్ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం) -
నేడు 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం
సాక్షి, న్యూఢిల్లీ: ‘నేను కచ్చితంగా నేడు 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం వేస్తాను’అనే ఇతివృత్తంతో నేడు 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం జరుగనుంది. 2011లో ప్రారంభమైన జాతీయ ఓటర్ల దినోత్సవం ఏటా జనవరి 25న కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. ఈ ఏడాది ఢిల్లీలో జరుగనున్న ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా 2022 ఎన్నికల సమయంలో ఐటీ, భద్రత, ఓటరు జాబితా, ఓటర్లకు అవగాహన వంటి అంశాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులకు రాష్ట్రపతి జాతీయ అవార్డులను ప్రదానం చేయనున్నారు. -
ఓటుహక్కు శక్తివంతమైన ఆయుధం
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుహక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. 12వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో మంగళవారం రాష్ట్రస్థాయి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజ్‌భవన్ నుంచి వెబినార్ ద్వారా హాజరైన గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ.. అర్హత గల ప్రతి పౌరుడు ఓటరుగా పేరు నమోదు చేసుకుని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని సూచించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా భారతదేశం ఉన్నందుకు మనమంతా గర్వించాల్సిన విషయమన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ బాధ్యత ప్రధానంగా యువతపై ఉందని, వారంతా ఓటరు నమోదు ప్రక్రియలో క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. పౌరులు ఓటరుగా పేరు నమోదు చేసుకునే ప్రక్రియలో భారత ఎన్నికల సంఘం పారదర్శకంగా ఉంటూ.. దీనిని మరింత సులభతరం చేసేందుకు అనేక రకాల వినూత్న చర్యలను చేపట్టడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆధార్‌తో ఫొటో ఓటరు గుర్తింపు కార్డును అనుసంధానించడం ద్వారా పేరు నమోదు ప్రక్రియను సులభతరం చేయడంతోపాటు ఒకే వ్యక్తి పేరు రెండుసార్లు నమోదు కాకుండా నివారించేందుకు అవకాశం కలిగిందన్నారు. రాష్ట్రంలో ఈ నెల 5వ తేదీ నాటికి 4.07 కోట్ల మంది ఓటర్లుగా నమోదయ్యేందుకు నిర్వహించిన విస్తృత ప్రచార అవగాహనా కార్యక్రమాల్లో భాగస్వాములైన రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలకు గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు. ఓటర్లలో 50 శాతం మంది యువతే ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ మాట్లాడుతూ.. ఓటర్లలో 50 శాతం మంది యువత ఉండటం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో అర్హత గల ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేసేందుకు పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు. ముఖ్యంగా విద్యాసంస్థల్లో ఎలక్టోరల్ లిట్రసీ క్లబ్‌లు ఏర్పాటు చేసి అర్హత గల వారందరికీ అవగాహన కల్పించి ఓటర్లుగా నమోదు చేశారని అన్నారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం వ్యవస్థాపక దినోత్సవంలో భాగంగా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని 2011 నుంచి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 45,950 ప్రాంతాల్లో ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా భారత ప్రధాన ఎన్నికల అధికారి సుశీల్ చంద్ర పంపిన వీడియో సందేశాన్ని సమావేశంలో ప్రదర్శించారు. తొలుత కార్యక్రమంలో పాల్గొన్న అందరితో గవర్నర్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఓటర్ల నమోదు, ఎన్నికల నిర్వహణ, పోలింగ్ కేంద్రం స్థాయి నుంచి జిల్లా కేంద్రం వరకూ వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనపర్చిన వివిధ జిల్లాల ఎన్నికల అధికారులు కార్తికేయ మిశ్రా, ఎ.సూర్యకుమారి, నాగలక్ష్మి, నెల్లూరు ఎన్నికల అధికారి కేవీఎన్ చక్రధరబాబు, వైఎస్సార్ జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్, విధాన పరిషత్ ద్వైవార్షిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీవీ సుబ్బారెడ్డిలకు సీఈవో విజయానంద్ ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందించారు. జిల్లాకు ఒకరు చొప్పున 13 మంది ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, 13 మంది ఏఈఆర్వోలు, 13 మంది బూత్ స్థాయి అధికారులకు, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు సెక్షన్ అధికారులకు, విజయనగరం, ప్రకాశం జిల్లాలకు చెందిన ఇద్దరు ఎస్ఎల్ఏ టీం సిబ్బందికి ప్రశంసా పత్రాలను, జ్ఞాపికలను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి విజయానంద్ అందించారు. -
కొత్త ఓటర్లకు భారత ఎన్నికల సంఘం శుభవార్త..!
Election Commission of India: 2021లో ఓటర్ల జాబితాలో కొత్తగా పేరు నమోదు చేసుకున్న ఓటర్లకు భారత ఎన్నికల సంఘం శుభవార్త తెలిపింది. ఈ ఏడాది కొత్తగా జాబితాలో తమ పేరు నమోదు చేసుకున్న ఓటర్లకు ఎలక్టర్ ఫోటో ఐడెంటిటీ కార్డు(EPIC)లను పోస్ట్ ద్వారా పంపాలని నిర్ణయించినట్లు భారత ఎన్నికల సంఘం సీనియర్ అధికారి ఒకరు నేడు తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకునే జనవరి 25న ఈ కొత్త సేవలను ప్రారంభించనున్నట్లు అధికారి తెలిపారు. "మేము ఓటరు కార్డులను నేరుగా గ్రహీతలకు పోస్ట్ ద్వారా పంపిణీ చేయడం ప్రారంభిస్తాము. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ సేవలను అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు' అని ఆయన తెలిపారు. ఈ కొత్త ఓటర్లకు EPIC గుర్తింపు కార్డులతో పాటు ఒక ప్యాకెట్ కూడా పంపుతున్నట్లు అధికారి తెలిపారు. ఈ ప్యాకెట్లో ఈవీఎం, ఓటింగ్ విధానంతో సహా మొత్తం సమాచారం ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే, భారత ఎన్నికల సంఘానికి చెందిన పోర్టల్ ద్వారా కూడా కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. భారత ఎన్నికల సంఘాన్ని 25 జనవరి 1950న స్థాపించడం జరిగింది. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఎన్నికల సంఘం స్థాపన రోజున జాతీయ ఓటరు దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున ఓటర్లకు ఓటుపై అవగాహన కల్పించేందుకు 18 ఏళ్లు నిండిన యువకులకు గుర్తింపు కార్డులను అందజేసి ప్రతి సంవత్సరం ఓటర్లను ఓటు వేయమని ఎన్నికల సంఘం ప్రోత్సహిస్తుంది. ప్రతి సంవత్సరం ఓటరు దినోత్సవం సందర్భంగా ఒక థీమ్ ఎంచుకుంటారు. ఈ ఏడాది ఓటర్ల దినోత్సవం ఇతివృత్తం 'సాధికారత, జాగరూకత, రక్షణ'. (చదవండి: మీరు ధరలు పెంచుతూ పోతే.. మేం చూస్తూ ఊరుకుంటామా ?) -
National Voters' Day: తొలి ఓటు హక్కు కల్పించింది ఎప్పుడో తెలుసా?
ఓటు అందరి హక్కు.. ప్రజాస్వామ్య దేశంలో పాలకులను మార్చే వజ్రాయుధం ఓటు. రాజ్యాంగం దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతీ పౌరుడికీ ఈ హక్కు కల్పించింది. ఓటుతోనే అవినీతిని పారదోలే అవకాశం ఉంటుంది. ప్రశ్నించే అధికారం లభిస్తుంది. పాలకులను సీట్లో కూర్చోబెట్టాలా? దింపాలా? అనేది నిర్ణయిస్తుంది. నేడు జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. సాక్షి, ఆదిలాబాద్/మంచిర్యాల: ఓటు హక్కు అనేది పౌరుడికి రాజ్యాంగం కల్పించిన గొప్ప అవకాశం. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు భారత ఎన్నికల సంఘం ప్రతి ఏడాది దేశ వ్యాప్తంగా ఓటరు నమోదు కార్యక్రమం చేపడుతోంది. ఓటరు జాబితా తయారీ నుంచి తొలగించే వరకు ఆయా జిల్లాల్లో ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంది. కానీ ఓటరు నమోదుపై యువతకు అవగాహన లేకపోవడంతో చాలామంది ఓటుహక్కు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని తెలుస్తోంది. జిల్లాలో గత ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు, రెండోసారి డిసెంబర్ నెల మొత్తం ఓటు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో ఉమ్మడి జిల్లాలో వేల మంది యువత జాబితాలో చేరారు. ఉమ్మడి జిల్లాలో ఓటర్లు.. 2022 జనవరి 5న విడుదల చేసిన తుది జాబితా ప్రకారం ఉమ్మడి జిల్లాలో 21,06,626 మంది ఓటర్లు ఉ న్నారు. పురుషులు 10,41,006 మంది, మహిళలు 10,65,500 మంది, ఇతరులు 120 మంది, నాన్ రెసిడెన్షీ ఇండియా (ఎన్నారై) ఓటర్లు 61 మంది ఉన్నారు. గతేడాదిలో నాలుగు నెలలు సాగిన ఓటరు నమోదు కార్యక్రమం ద్వారా ఉమ్మడి జిల్లాలో 31,712 మంది యువత ఓటు నమోదు చేసుకున్నారు. ఓటరు దినోత్సవ లక్ష్యం భారత ఎన్నికల కమిషన్ ఆవిర్భవించిన రోజు జనవరి 25న కేంద్ర ప్రభుత్వం జాతీయ ఓటరు దినోత్సవంగా ఏటా నిర్వహిస్తోంది. 18 ఏళ్లు నిండిన దేశపౌరుడిని ఓటరు జాబితాలో చేర్పించి గుర్తింపు కార్డు అందజేసి హక్కును కల్పిస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో బూత్‌స్థాయి అధికారులు అందుబాటులో ఉంటూ విద్యార్థులతో ర్యాలీలు చేపట్టి ఓటు హక్కు ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం.. విద్యార్థులకు ఆటపాటలు, వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేయడం ఓటరు దినోత్సవ లక్ష్యం. ఇంటి నుంచే ఓటు నమోదు మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నికల సంఘం ఓటు నమోదు ప్రక్రియలో మార్పులు చేసింది. ఒకప్పుడు తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు వెళ్లి నమోదు ఫారం తీసుకొని అందులో వివరాలు పొందుపర్చి ధ్రువీకరణ పత్రాలు జత చేస్తూ దరఖాస్తు చేసేవారు. కానీ ఇప్పుడలా కాకుండా ఆన్లైన్ ద్వారా ఇంటి నుంచే ఓటు హక్కు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఎన్నికల సంఘం వెబ్సైట్ (www.ceo.telangana.gov.in), ఓటర్ హెల్ప్‌లైన్ మొబైల్ యాప్, మీసేవ, ఈసేవ, స్వీప్, సీఎస్సీ కేంద్రాల ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఏ దరఖాస్తు దేనికి.? ► ఫారం–6 : కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు.. ► ఫారం–6ఏ: విదేశాల్లో ఉన్నవారు ఓటు నమోదు చేసుకునేందుకు.. ► ఫారం–7 : జాబితా నుంచి ఓటుహక్కును తొలగించేందుకు.. ► ఫారం–8 : ఓటరు కార్డులో మార్పులు, చేర్పులకోసం ► ఫారం–8ఏ: ఒక పోలింగ్ స్టేషన్ నుంచి మరో పీఎస్‌కు మార్చుకునేందుకు.. ఓటరు కార్డుతో ప్రయోజనాలు ► భారతదేశ పౌరుడిగా గుర్తింపు ఉంటుంది. ► ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. ► వయస్సు, నివాస ధృవీకరణ గుర్తించవచ్చు. తొలి ఓటు హక్కు 1950 జనవరి 25న మొదటి సారిగా దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పౌరుడికి ఓటు హక్కు కల్పించారు. 1952లో తొలిసారి నిర్వహించిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటరు జాబితా ఆధారంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1992 వరకు ఎలక్ట్రోరల్ ఫొటో గుర్తింపు కార్డు లేదు. 1993లో భారత ఎన్నికల సంఘం కమిషనర్‌గా ఉన్న టీఎన్.శేషన్ ఓటరు గుర్తింపు కార్డుల ప్రక్రియను ప్రారంభించారు. అది ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది. నేడు ప్రతిజ్ఞ జాతీయ 12వ ఓటరు దినోత్సవం సందర్భంగా మంగళవారం అన్ని జిల్లాల కలెక్టరేట్ సమావేశ మందిరాల్లో కొత్తగా ఓటు హక్కు పొందిన ఓటర్లచే కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించనున్నారు. -
వేలికి బ్లూ మార్క్ లేకుంటే..నొసటన బ్లాక్ మార్కే
గన్‌ఫౌండ్రి: ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటును వినియోగించుకోవాలని పోలింగ్ రోజున వేలికి బ్లూ ఇంక్ లేకుంటే.. వారంతా తమ నొసటన బ్లాక్‌మార్క్ వేసుకున్నట్లే అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీ సంయుక్తంగా రవీంద్రభారతిలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం తమిళిసై ప్రసంగిస్తూ.. ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలన్నా. ఓటర్ల దినోత్సవాన్ని ప్రజాస్వామ్య దినోత్సవంగా జరుపుకోవాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీల కంటే ప్రజలే పవర్ఫుల్ అన్నారు. అభ్యర్ధుల గుణగణాలను బేరీజు వేసి ఓటు వేయాలని, సరైన వారెవరూ లేరనుకున్నప్పుడు నోటా ఉందంటూ.. అదే ప్రజాస్వామ్యం బ్యూటీ అని అభివర్ణించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రయోగాత్మకంగా కొంపల్లిలో నిర్వహించిన ఓటర్ ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని ప్రశంసించారు. కుల, మత, భాష, ప్రాంతం, వర్గాలకు అతీతంగా ఓటు వేస్తామని సభికులతో గవర్నర్ ప్రతిజ్ఞ చేయించారు. అవార్డుల అందజేత... ప్రభుత్వ నిర్మాణం, నిర్వహణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడమే ప్రజా స్వామ్య వ్యవస్థ మౌలిక సూత్రమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి వివరించారు. రాష్ట్రంలో పార్లమెంట్, శాసన సభ, స్థానిక సంస్థల ఎన్నికలను రీపోలింగ్‌కు తావులేకుండా ప్రశాంతంగా నిర్వహించుకున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్‌అరోరా సందేశం వీడియోక్లిప్ ప్రదర్శించారు. ఎన్నికల ప్రక్రియలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఇతర సిబ్బందికి, వ్యాసరచన, ఉపన్యాస పోటీల విజేతలకు రాష్ట్ర స్థాయి అవార్డులను గవర్నర్ అందజేశారు. రెగ్యులర్‌గా ఓటు వేస్తున్న సీనియర్ సిటిజన్లకు, ఓటర్‌గా నమోదు చేసుకున్న యువ ఓటర్లకు కొత్త ఫొటో ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ పాల్గొన్నారు. అవార్డులకు ఎంపికైన జిల్లా కలెక్టర్లలో ఎంఆర్ఎం.రావు(నిజామాబాద్), ఎం.హనుమంతరావు (సంగారెడ్డి), రోనాల్డ్‌రాస్(మహబూబ్‌నగర్), మస్రత్ ఖానమ్ ఆయేషా (వికారాబాద్), ఖమ్మం పోలీస్ కమిషనర్ తవుఫ్‌సీర్ ఇక్బాల్, వరంగల్ (అర్బన్) కమిషనర్ డా.వి.రవీందర్ తదితరులున్నారు. ఎం.హనుమంతరావు తరఫున ఆ జిల్లా డీఆర్ఓ రాధికా రమణి, రోనాల్డ్ రాస్ తరఫున ఏఓ. ప్రేమ్‌రాజ్, మస్రత్ ఖానమ్ ఆయేషా తరఫున డీటీడీఓ కాటాజి, కరీంనగర్ డీఆర్ఓ పి.ప్రావిణ్య తరఫున మార్కెటింగ్ ఏడీ వి.పద్మావతి, ‘సీఎస్ఓ–లెట్జ్ ఓట్’ నుంచి రాఘవేంద్ర, ఆల్ ఇండియా రేడియో నుంచి డా.రాహుల్ అవార్డులు అందుకున్నారు. -
ఓటు హక్కు బలమైన ఆయుధం: గవర్నర్
సాక్షి, విజయవాడ: సమాజంలో ఓటు హక్కు ఒక బలమైన ఆయుధమని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. అర్హత ఉన్నవారంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. 10వ జాతీయ ఓటర్ల దినోత్సం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యాక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. నూతనంగా ఓటు హక్కు పొందినవారికి ఆయన ఓటరు కార్డులు అందచేశారు. అలాగే 2019 సార్వత్నిక ఎన్నికల నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన 13 జిల్లాలకు చెందిన అధికారులకు అవార్డులు అందచేశారు. ‘రాజ్యాంగంలో ఆర్టికల్ 14 అందరికీ సమాన హక్కుల గురించి తెలుపుతుంది. ఓటు హక్కు ఉన్నా వినియోగించుకోకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కోల్పోతారు. మీరు ఓటు వేసి మీ స్నేహితులకు కూడా అవగాహన కల్పించి ఓటు వేయించండి’ అని గవర్నర్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ... ‘కొన్ని సంవత్సరాల క్రితం సామాన్య మనిషికి తన హక్కులు పొందే వ్యవస్థ లేదు. ప్రజా పోరాటాల ఫలితంగా హక్కులు వచ్చాయి. వందేళ్ల పెనుమార్పుల ఫలితంగా ఈ వ్యవస్థ ఏర్పడింది. 28 దేశాలలో ఓటు వేయడం హక్కుగానే కాక ఓటు వేయకుంటే పెనాల్టీ వేసే విధానం ఉంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ మనది. మన ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో అన్ని దేశాల కంటే మెరుగైనది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే నిబద్ధతతో ఉండాలి. పట్టణాలలో గ్రామీణ ప్రాంతాల కన్నా ఓటు హక్కును తక్కువ శాతం వినియోగించుకుంటున్నారు. ముందు తరాలకు మనం ఇచ్చే వారసత్వపు హక్కు ఓటు హక్కు’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీ డాక్టర్ రవిశంకర్, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పాల్గొన్నారు. -
ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే ఓటేయాలి
సాక్షి, హైదరాబాద్: ఓటు భవిష్యత్తును నిర్ణయించే ఆయుధమని, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలని గవర్నర్ నరసింహన్ ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం రవీంద్రభారతిలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమానికి ఆయనతోపాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రజత్‌కుమార్, ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో 90 శాతానికి ఓటింగ్ పెరగాలని ఆకాం క్షించారు. ‘ఓటు అనేది చాలా శక్తిమంతమైనది. ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పాల్గొనాలి. సెలవున్నా పోలింగ్‌లో పాల్గొనకపోవడం ప్రజా స్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటింది. యథా రాజా తథా ప్రజాలాగా కాకుండా.. యథా ప్రజా తథా రాజా అన్న చందంగా మారాలి. యువత తప్పక ఓటింగ్‌లో పాల్గొనాలి..’అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించారని రజత్‌కుమార్‌ను గవర్నర్ ప్రశంసించారు. దివ్యాంగులు, వృద్ధులు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారని అభినందించారు. లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఓటింగ్ పెరిగేలా ప్రయత్నించాలని ఆయన సూచించారు. ఓటును నమోదు చేసుకోవాలి: సీఈఓ అసెంబ్లీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించామని.. పోలింగ్ శాతం పెంచామని సీఈఓ రజత్‌కుమార్ చెప్పారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని.. రిపోలింగ్ జరపాల్సిన పరిస్థితి రాలేదని తెలిపారు. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 4 వరకు ఓటును నమోదు చేసుకోవాలన్నారు. గ్రామాల్లో ఏకంగా 90 శాతం ఓట్లు పోలవుతుంటే.. జీహెచ్ఎంసీలో కనీసం 50 శాతం కూడా పోలవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నగరాల్లో అన్ని సౌకర్యాలున్నప్పటికీ జనాలు ఓటు వేయడానికి ముందుకు రాకపోవడం విచారకరమన్నారు. ఈ సందర్భంగా గవర్నర్.. అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినందుకు ఆబ్కారీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేశ్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్, అదనపు సీఈఓ బుద్ధ ప్రకాశ్, జాయింట్ సీఈఓ అమ్రపాలికి అవార్డులను ప్రదానం చేశారు. -
స్వేచ్ఛను లొంగదీసే దొంగాట!
ప్రజాస్వామ్య ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే ‘ఓటరు’ స్వేచ్ఛను ఆట వస్తువు చేస్తున్నారు. కోరిన రీతిన వంచుతున్నారు. ఓటు విలువను పలుచన చేస్తున్నారు. ప్రజా స్వామ్యంలో తనకిష్టమైన పాలకులను నిర్ణయించుకునేందుకు, తన మనోగతాన్ని వెల్లడి చేసేందుకు బలమైన ఆయుధం ‘ఓటు’. లాటిన్ అమెరికా సాహితీ ప్రపంచంలో వేగుచుక్క అనదగ్గ కవి, రచయిత, జర్నలిస్టు, సామాజిక వేత్త అయిన జోస్ మార్టి (క్యూబా) మాటల్లో చెప్పాలంటే.. ‘‘అన్నింటి కన్నా ఓటు అత్యంత సున్నితమైన విశ్వాసం. ఓటరు ప్రయోజనం మాత్రమే కాదు అతని జీవితం, పరువు, భవిష్యత్తు కూడా ఓటుతో ముడివడి ఉన్నాయి’’ ‘‘పైసల్ తీస్కొని ఓటేసుడా..? థూ... ఓటుకు పైసల్ తీస్కునుడంటే, పానం (జీవితం) అమ్ము కున్నట్టు లెక్క పటేలా! ఇజ్జత్ (పరువు) అమ్ము కున్నట్టు’’ సరిగ్గా ముఫ్ఫై ఏళ్ల కింద... 1989లో జరిగిన ఎన్నికలప్పుడు మెదక్ జిల్లా మారుమూల గ్రామం యెనగండ్ల (మా ఊరు)లో 42 ఏళ్ల వయసున్న ఒక వ్యవసాయ దినకూలీ అన్నమాటలివి. దాన్ని అవగాహన అనాలో, చైతన్యం అనాలో, నైతికత అనాలో, మరేమనాలో తెలియదు. నాటి పరిస్థితిని నేటితో పోలిస్తే... ఎన్నో రెట్లు అవగాహన పెరిగింది. చైతన్యం రగిలింది. నైతికతే దిగజారింది. ఓటుకింత అనే లెక్కలో తమకు తక్కువ డబ్బులిచ్చారని ఒక వార్డు వాసులు ఓ రాజకీయ పార్టీ కార్యాలయం ముందు ధర్నాకు దిగే పరిస్థితులు నేడు నెలకొన్నాయి. ‘ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో నాకు 11 కోట్ల రూపాయలు ఖర్చయింది’ అని రాజ్యాంగ హోదా అనుభవిస్తున్న ఓ బడా నేత నిర్భయంగా ప్రకటించుకునే పరి స్థితి! ఓటర్ల జాబితా సవరించాకా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి పేరిటే హైదరాబాద్‌లో రెండు ఓట్లున్న దుస్థితి! ప్రజాస్వామ్యంలో ఓటు విలువ గురించి ఎంతగా ప్రచారం చేస్తున్నామో, దాని విలువను దిగజార్చే పరి స్థితులు, పరిణామాలే అంతకు పలు రెట్లు అధికమవుతున్నాయి. తిలా పాపం తలా పిడికెడన్నట్టు ఆ పాతకానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యక్తులే కాక వ్యవస్థలూ కారణమవుతున్నాయి. ఏదో రీతిన ఓట్లు దండు కొని గద్దె నెక్కాలనే నాయకులు, ఓటరు జాబితాలు తారుమారు చేసే పార్టీ గణాలు, ఎన్నికల ప్రక్రియను ప్రహసనం చేసే అధికార యంత్రాం గం, ఓటు హక్కునే విస్మరిస్తున్న ‘నాగరికులు’, విడిగా–ఉమ్మడిగా వెల కట్టి అమ్ముకుంటున్న ఓటర్లు... ఇలా అన్ని వైపుల నుంచీ ఓటు విలువను దిగజారుస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థనే నవ్వుల పాల్జేస్తున్నారు. ప్రజాస్వామ్యం మీద, ఓటు విలువపైన విశ్వాసమున్న వారి నమ్మకం రోజు రోజుకు సడలిపోయేలా పరిస్థితులు విషమిస్తున్నాయి. దీనికి తోడు ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లపై తెలెత్తిన వివాదం గోటిచుట్టపై రోకటి పోటులా తయారయింది. మళ్లీ బ్యాలెట్‌కు వెళ దామా? అనే చర్చ–మీమాంస పుట్టుకొస్తోంది. ఎన్నిసార్లు సవరణ ప్రక్రియ చేపట్టినా... తప్పుల తడిక ఓటరు జాబితాలు సగటు ఓటరును వెక్కిరిస్తున్నాయి. వ్యవస్థల్ని చెరబట్టిన రాజకీయ దళారీలు ఈ జాబి తాల్ని కలుషితం చేస్తున్నారు. లక్షల దొంగ ఓట్లను చేర్చడం ద్వారానో, తమకు ఓటేయరనే భయంతో లక్షలాది అసలు పేర్లను తొలగిస్తూనో అరాచకం సృష్టిస్తున్నారు. ఈ నేర ప్రక్రియ క్రమంగా ప్రమాదకర స్థాయిలో వ్యవస్థీకృతమవుతోంది. ఎన్నికల సంఘం వైపు వేలు ప్రక్షాళన పేరిట రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓటర్ల జాబితాలను అత్యంత కలుషితం చేశారు. నిన్నటికి నిన్న అసెంబ్లీ ఎన్నికల ముంగిట తెలంగాణలో లక్షలాది ఓట్లు గల్లంతయ్యాయి. రేపు ఎన్నికలు జరగా ల్సిన ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది దొంగ, నకిలీ ఓట్లొచ్చి జాబితాలో తిష్ట వేశాయి. ప్రక్షాళనకోసం వాడుతున్న సాఫ్ట్వేర్ లోపభూయిష్టమే కాకుండా నిర్వహణ ప్రక్రియలోనూ అనేక లోపాలున్నాయి. వివిధ స్థాయిల్లో అధికార యంత్రాంగం అత్యంత నిర్లక్ష్యంగా, బాధ్యతారహి తంగా వ్యవహరించింది. జవాబుదారితనం లేకుండా యథేచ్ఛగా వ్యవ హరించి ఓటరును నిమిత్తమాత్రుడిని చేసింది. ఓటు నమోదు, తొల గింపు ద్వారా సవరణ, ప్రక్షాళన ప్రక్రియల్లో ప్రజాప్రాతినిధ్య చట్టం కింద పౌరుల (ఓటర్లుగా)కున్న హక్కుల్ని నిర్దాక్షిణ్యంగా కాలరాసింది. తెలిసి కొంత, తెలియక ఇంకొంత నేడున్న దురుద్దేశపు రాజకీయ వ్యవ స్థకు ఊడిగం చేస్తోంది. తెలంగాణలో చాలా చోట్ల జాబితాను ఓటర్లు తనిఖీ చేసినపుడు తమ పేరుంది, నంబరుంది... దాన్ని ఆధారం చేసుకొని తగిన గుర్తింపు కార్డుతో పోలింగ్ స్టేషన్‌కు వెళితే పేరు లేదు, ఓటే లేదు. ఓటేయకుండానే ఉస్సురంటూ వెనక్కి రావలసి వచ్చింది. ‘అవును 22 లక్షల ఓట్లను తొలగించామ’ని ఎన్నికల ప్రధానాధికారే అంగీకరించిన వాస్తవం. వివాదమిప్పుడు న్యాయస్థానం పరిధికి చేరింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 52 లక్షల దొంగ/నకిలీ ఓట్లు రాష్ట్ర ఓటర్ల జాబితాలో చేరినట్టు ఓ నిపుణుల బృందం శాస్త్రీయంగా నిరూపించింది. ఎన్నికల సంఘం దీన్ని పాక్షికంగా అంగీకరించి, తిరిగి సవరణ చేప డితే... పెనంలోంచి పొయిలో పడ్డట్టు, ఇప్పుడు మరో 6 లక్షలు నకిలీ ఓట్లు అదనంగా వచ్చి చేరాయి. దాదాపు 25 లక్షల నకిలీ ఓట్లున్న మాట నిజమే అని రాష్ట్ర ఎన్నికల (కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల తప్పించిన) ముఖ్యాధికారే స్వయంగా అంగీకరించి ఆమేరకు ప్రకటన వెలువరిం చారు. ప్రపంచమే అచ్చెరువొందేలా ఓ పెద్ద ఎన్నికల ప్రక్రియని దశా బ్దాల తరబడి నిర్విఘ్నంగా, ప్రశాంతంగా కొనసాస్తూ కీర్తి కిరీటం దక్కిం చుకున్న భారత ఎన్నికల సంఘం ఈ వైఫల్యాలకు జవాబు చెప్పు కోవాల్సి వస్తోంది. సగటు ఓటరు ముందు దోషిగా నిలబడింది. ఓటరు జాబితాలోంచి పేర్లు తొలగిస్తున్నపుడు పాటించాల్సిన చట్టబద్ద ప్రక్రి యను తూతూ మంత్రంగా నిర్వహించారు. అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం కల్పించకపోగా, ఎవరికి వారు ఆన్లైన్లో తనిఖీ చేసుకొని పేరు లేకుంటే, సంప్రదించి చేర్పించుకోవచ్చని బాధ్యతని ఓటరుపైకి నెట్టారు. వివిధ దశల్లో పాటించాల్సిన పారదర్శకతను మంటగలిపారు. రాజ్యాం గం కల్పించిన హక్కును హరించి అదనపు బాధ్యతను పౌరుల నెత్తిన రుద్దారు. సవరించిన జాబితాల్లోనూ తప్పులా! తప్పుడు, అక్రమ, రిపీట్, చెల్లని, దొంగ, బహుళ.... ఇలా వివిధ రూపాల్లో ఉన్న నకిలీ ఓట్లను తొలగించడానికి ఎన్నికల సంఘం అధికారులు వినియోగిస్తున్న సాఫ్ట్వేర్ సమగ్రంగా లేదు. ఫలితంగా ఒకే వ్యక్తికి వివిధ పోలింగ్ స్టేషన్ల పరిధిలో పలు ఓట్లుంటున్నాయి. తండ్రి/ భర్త పేరు మార్పుతో, ఇంటి నంబరు మార్పుతో, మగ–ఆడ అన్న లింగవైవిధ్యంతో ఒకరికే వేర్వేరు చోట్ల ఓట్లుంటున్నాయి. ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉండగలిగిన చిన్న ఇళ్లల్లో కూడా వందలాది ఓట్లుం టున్నాయి. ధ్రువీకరించడం తేలిగ్గా సాధ్యపడే కొన్ని తప్పిదాల్ని కూడా ఆధికార యంత్రాంగం ఇప్పుడు ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్ పట్టుకోలేక పోతోంది. అది దుస్సాధ్యమైందేమి కాదు, ప్రయివేటు వ్యక్తులు, సంస్థల వద్ద కూడా లభ్యమయ్యే సాధారణ సాఫ్ట్వేర్ అని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. రెండు రాష్ట్రాల్లో ఓటర్లుగా ఉన్న ఒకే వ్యక్తిని కూడా ఇప్పుడు అధికారులు వాడుతున్న సాఫ్ట్వేర్ పట్టుకోలేకపోతోంది. ఫలి తంగా రెండు, ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాష్ట్రాల్లో ఓటున్న వారి సంఖ్య 18.5 లక్షలున్నట్టు ప్రయివేటు నిపుణుల సంస్థ తేల్చింది. ఓటరు ఐడి, ఓటరు పేరు, తండ్రి/భర్త పేరు, ఇంటి నంబరు, వయసు, జెండర్, పేరు వెనుక–ముందు... ఇలా పలు అంశాల్ని పరిగణనలోకి తీసుకొని లెక్కిం చినపుడు ఏపీలో పెద్ద సంఖ్య నకిలీ ఓట్లు దొరికాయి. 13 జిల్లాలు, 175 నియోజకవర్గాలు, 45,920 పోలింగ్ బూత్‌ల పరిధిలోఉన్న 3.6 కోట్ల ఓటర్ల సమాచారాన్ని తీసుకొని శాస్త్రీయంగా తనిఖీ–విశ్లేషణ చేసి మరో 34.17 లక్షల (వెరసి 52.67 లక్షల) నకిలీ ఓట్లున్నట్టు తేల్చారు. ఇదంతా బట్టబయలై జరిపిన తాజా సవరణ తర్వాత కూడా జాబితా తప్పుల తడికే! మళ్లీ ఒకే వ్యక్తి పేరిట నాలుగేసి ఓటరు కార్డులు కూడా జారీ చేశారు. సవరణ తర్వాత... అసలు ఇంటి నంబరు, నిజమైన వయసు, వాస్తవిక జెండర్‌తో సవరించిన పేర్లు జాబితాలోకి వచ్చాయి. అదే సమయంలో, పాత (నకిలీ) పేర్లూ తుది జాబితాలో కొనసాగుతు న్నాయి. మీ ఇంట్లో, మీకు తెలియకుండా అయిదారుగురు పైశాచి (గోస్ట్) ఓటర్లుంటారు. ఇలాంటి ‘బోగస్’ ఓట్లు ఇంకెన్నో! మొత్తమ్మీద ఇదీ తెలుగునాట నెలకొన్న దుస్థితి! పెత్తనం కోసం సంపద వికృత రూపం అన్ని వ్యవస్థల మీద రాజకీయ పెత్తందారీతనం పెరిగి అటువైపు ఆకర్షణ అధికమైంది. ఏదో రూపంలో రాజకీయాధికారం దక్కించుకో వాలి. సంపద కలిగిన వారికి ఇదింకా మోజయింది. అడ్డదారి సంపాదన ఉన్న వారు వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసైనా అధికారం చేజిక్కించుకోవా లని ఆరాటపడుతున్నారు. ఓటరు జాబితాల్లో కూడికలు, తీసివేతలు చేస్తూ తమ ఓట్ల పంట పండించుకుంటున్నారు. లేదంటే, ప్రత్యర్థులకు ఓట్ల కరువు తీసుకువస్తున్నారు. మధ్యలో ‘ఓటర్’ను బలిపశువు చేస్తు న్నారు. పెరుగుతున్న ఆర్థిక అంతరాలు ఈ పరిస్థితులకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. నిన్న ముగిసిన శాసనసభ ఎన్నికల్లో డబ్బు ఎంతగా ఖర్చ యిందో అందరికీ తెలుసు. ఈ రోజు జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీలో ఎవరున్నా, తెరవెనుక ఆట నడుపుతున్న ఈ ‘నికృష్ట సంపదే’ వారిని ఆడిస్తోంది. పట్టణాలు, నగరాలు, పారిశ్రామిక వాడల నుంచి వనరులు గ్రామానికి వరదై పారుతున్నాయి. ఎక్కడికక్కడ డబ్బు, మధ్యం ఏరులై ప్రవహిస్తోంది. ఓటుకింతని డబ్బు పెట్టి కొంటున్నారు. ఓటర్లనే కాదు, గంపగుత్తగా కుటుంబాలను, వాడలను వశపరచుకుంటు న్నారు. ఏదో రూపంలో ప్రలోభపెడుతున్నారు. లొంగని చోట బయ పెడుతున్నారు. పై స్థాయి నుంచే, ఓటర్లయిన పౌరుల చేతికి నికరంగా డబ్బు వచ్చేలా ‘పథకాలు’ పన్ని వేర్వేరు స్కీముల్లో వారిని ఇరికిస్తు న్నారు. ప్రజాస్వామ్య ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే ‘ఓటరు’ స్వేచ్ఛను ఆట వస్తువు చేస్తున్నారు. కోరిన రీతిన వంచుతున్నారు. ఓటు విలువను పలుచన చేస్తున్నారు. ఓటరు చైతన్యమొకటే దీనికి విరుగుడు. ఓటరు గట్టిగా నిలబడాలి. డబ్బు పంచినా, ప్రలోభపెట్టినా తన ‘ఓటు’ హక్కు భంగపోకుండా స్వతంత్రంగా వ్యవహరించాలి. స్వేచ్ఛగా ఓటేయాలి. బాహ్య ప్రేరకాలెలా ఉన్నా... స్వేచ్ఛగా ఓటేసే తన హక్కుని అవి ప్రభా వితం చేయకుండా చూసుకోవాలి. ఎందుకంటే, ప్రజాస్వామ్యంలో తన కిష్టమైన పాలకులను నిర్ణ యించుకునేందుకు, తన మనోగతాన్ని వెల్లడి చేసేందుకు బలమైన ఆయుధం ‘ఓటు’. లాటిన్ అమెరికా సాహితీ ప్రపంచంలో వేగుచుక్క అనదగ్గ కవి, రచయిత, జర్నలిస్టు, సామాజిక వేత్త అయిన జోస్ మార్టి (క్యూబా) మాటలతో ముగిస్తా. ‘‘అన్నింటి కన్నా ఓటు అత్యంత సున్నితమైన విశ్వాసం. ఓటరు ప్రయోజనం మాత్రమే కాదు అతని జీవితం, పరువు, భవిష్యత్తు కూడా ఓటుతో ముడివడి ఉన్నాయి’’ (నేడు జాతీయ ఓటరు దినోత్సవం) దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
గీతమ్లో ఘనంగా వేడుకలు
సాక్షి, హైదరాబాద్ : గీతమ్ యూనివర్సిటీ విద్యార్ధులు గురువారం సంప్రదాయ వస్త్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులందరూ విభిన్న సంస్కృతులు ప్రతిబింబించేలా వస్త్రధారణతో కనువిందు చేశారు. విద్యార్ధులు లుంగీలు, పంచెలతో అలరించగా, విద్యార్ధినులు చీరకట్టుతో ఆకట్టుకున్నారు. ఈ వేడుకలో మెహిందీ, వంటలు, రంగవల్లి పోటీలు నిర్వహించారు. అందరూ ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన క్యాట్‌వాక్, నృత్యాలు, ఫోటో సెషన్లు, సెల్ఫీలతో ఆ ప్రాంగణం అంతా కోలాహలంగా మారింది. జాతీయ ఓటరు దినోత్సవ సందర్భంగా జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో గీతం యూనివర్సిటీ అదనపు ఉపకులపతి ర్యాలీని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ...బుల్లెట్ కంటే బ్యాలెట్ ప్రభావవంతమైనదని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించి, విద్యార్థులందరితో ప్రతిజ్ఞ చేయించారు. -
'నీ ఒక్కడి ఓటూ చరిత్రను మార్చగలదు..'
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా గురువారం రవీంద్రభారతిలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు గవర్నర్ నరసింహన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ముఖ్యంగా యువత తప్పనిసరిగా ఓటు వేయాలన్నారు. 'నువ్వొక్కడివి ఓటు వేయకపోతే వచ్చే నష్టమేమీ ఉండదని అనుకోవద్దు.. నీ స్వరం వినిపించినా పెద్దగా ఉపయోగం ఉండదని ఎవరైనా అంటే నమ్మవద్దు.. నీ ఒక్కడి ఓటూ చరిత్రను మార్చగలదు.. నీ స్వరం కొన్నిలక్షల మంది ఆలోచనల్ని ప్రభావితం చేయగలదు..' అని గవర్నర్ వ్యాఖ్యానించారు. -
‘ఓటు’ అందరి హక్కు..!
పాలనలో మార్పునకు ‘వజ్రాయుధం’ ప్రజాస్వామ్య దేశంలో ఇది కీలకం 18 ఏళ్లు నిండితే తప్పనిసరి యువత అవగాహన కల్గి ఉండాలి నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం భారతదేశంలో ఓటు వజ్రాయుధం.. దేశపాలనలో దీనిపాత్ర కీలకం..ఓటుహక్కుతో అవినీతి పారద్రోలడానికి వీలుంటుంది. ఓరాజకీయ నాయకుడిని గద్దెనెక్కించాలన్నా.. గద్దె దించాలన్నా దేశపౌరుడికి ఓటుహక్కు తప్పనిసరి.ఓటుహక్కుతో ప్రశ్నించే అధికారం ఉంటుంది.దేశభవిష్యత్ యుతవ చేతుల్లో ఉన్నందున యువత ఓటు హక్కును గురించి అవగాహన కలిగి ఉండాలి. ఓటు విలువను ప్రజలకు చాటిచెప్పాలి.. నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. – ఆదిలాబాద్ అర్బన్, మంచిర్యాల టౌన్ ప్రజాస్వామ్య దేశంలో మనల్ని మనం పరిపాలించుకునేందుకు రాజ్యాంగం కల్పించిన ఒక గొప్ప అవకాశం ‘ఓటు’. పాలనలో మార్పునకు ఓటు వజ్రాయుధం. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటుహక్కును నమోదు చేసుకోవాలని భారత ఎన్నికల సంఘం సూచిస్తోంది.కానీ అవగాహన లేక చాలామంది ఓటుహక్కును వినియోగించుకోలేకపోతున్నారు. జిల్లాలో గతేడాది ఓటరు జాబితాలో నమోదు చేసుకున్న వారికి గుర్తింపు కార్డులు వచ్చాయి. వీటిని ఆయా తహసీల్దార్ కార్యాలయాల్లో జాతీయ ఓటరు దినోత్సవం అందిస్తారు. వీరితో పాటు సీనియర్ సిటిజన్లను బ్యాడ్జీలతో సత్కరిస్తారు. ఉమ్మడి జిల్లాల్లో ఓటర్లు.. ఓటర్ల జాబితా లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో మొత్తం 16,89,790 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 8,46,989 మంది, మహిళలు 8,42,594 మంది ఉన్నారు. ఇతరులు 207 మంది ఉన్నారు. జనాభా ప్రకారం చూస్తే మహిళలు 62శాతం, పురుషులు 65శాతం ఉన్నారు. 2016 జూన్ నుంచి నవంబర్ వరకు ఉమ్మడి జిల్లాల్లో సుమారు 10 వేల మంది ఓటు హక్కు కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే ప్రతి ఏడాది నిర్వహించే ఓటరు నమోదు కార్యక్రమం గతేడాదిలో చేపట్టలేదు.దీంతో ఓటుహక్కుపై యువతకు ఓటుహక్కుపై అవగాహన లేకుండా పోయింది. ఓటరు దినోత్సవమే లక్ష్యం జనవరి 25న భారత ఎన్నికల కమిషన్ ఆవి ర్భవించింది. రోజును ఓటర్ల దినోత్సవం గా ప్రతిఏటా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ రోజున ఈ యేడాది జనవరికి ఒక టో తేదీనాటికి 18ఏళ్లు నిండిన దేశపౌరుడిని ఓటరు జాబితాలో చేర్పించి వారికి ఓటరు గుర్తింపు కార్డులు అందజేసి ఓటు హక్కును కల్పిస్తుంది. పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులను అందుబాటులో ఉంచుతారు. గ్రామాల్లో ర్యాలీలు చేపడుతారు. ఊరూరా ఓటుహక్కు ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తారు. నేడు మరో అవకాశం ఓటర్ల దినోత్సవం సందర్భంగా నాలుగు జిల్లాల పరిధిలోని 2,322 పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం చేపడుతారు. పోలింగ్ స్టేషన్లలో బీఎల్వోలు అందుబాటులో ఉండి ఓటు నమోదుకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దీంతో పాటు అన్ని మండల తహసీల్దార్ కార్యాలయాల్లో, ఆర్డీవో, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచుతారు. ఈరోజు ఓటరు కార్డులో తప్పులు సవరించడం, ఫొటోను సరి చేసుకోవడానికి వీలుంటుంది. తొలి ఓటు హక్కు 1950 జనవరి 25న మొట్టమొదటిసారిగా దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పౌరుడికి తొలిసారిగా ఓటు హక్కు కల్పించారు. 1952లో మొట్ట మొదటిసారి నిర్వహించిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటరు జాబితా ఆధారంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1992 వరకు ఎలక్ట్రో ఫోటో ఐడెంటిటీ కార్డు ఉండేది కాదు. 1993లో భారత ఎన్నికల సంఘం కమిషనర్‌గా ఉన్న టీఎన్ శేషన్ ఓటర్ల గుర్తింపు కార్డుల ప్రక్రియను ప్రారంభించారు. -
2017 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ
జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలో 2017 మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా సుమారు 5వేల మంది విద్యార్థులతో సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి ఖిల్లా వరకు ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్, జాయింట్ కలెక్టర్ నాగేంద్ర, పీడీ అరుణశ్రీ, తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయాలంటే భయమేస్తోంది-మండలి బుద్ధప్రసాద్
-నేటి పార్టీలకు సిద్ధాంతాలు లేవు -రాజకీయాలంటే భయమేస్తోంది -ఉపసభాపతి బుద్ధప్రసాద్ ఆవేదన అవనిగడ్డ(కృష్ణా జిల్లా) : కులాలు, మతాల వారీగా ప్రజలను విభజిస్తూ సమాజాన్ని కలుషితం చేస్తున్న నేటి రాజకీయాలంటే భయమేస్తోందని ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ తహశీల్దార్ కార్యాలయం రచ్చబండపై సోమవారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. ఒకప్పుడు రాజకీయ పార్టీలకు సిద్ధాంతాలు ఉండేవని, కార్యకర్తలు నిబద్ధతతో పనిచేసేవారని చెప్పారు. నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. కులమతాలను ప్రోత్సహించకుండా రాజకీయాలు లేవని, అన్ని పార్టీలూ వీటిని ప్రోత్సహిస్తూ అశాంతికి కారణమవుతున్నాయని చెప్పారు. ఒకప్పుడు అభివృద్ధి, పనిచేసే నాయకుడిని చూసి ప్రజలు ఓటేసేవారని, నేడు డబ్బులు పంచకపోతే ఓటేసే పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేటి పార్టీలకు సిద్ధాంతాలు లేవని, అధికారమే పరమావధిగా ఎదుటి పార్టీలను దూషించడానికే ప్రాధాన్యతనిస్తున్నాయని అన్నారు. రాజకీయాలు పూర్తిగా కలుషితమైపోయాయని, ప్రజల బాగోగులను పట్టించుకునే తీరిక లేదని చెప్పారు. ఓటర్లను ఎలా బుట్టలో వేసుకోవాలా అనే ఆలోచనలతోనే పనిచేస్తున్నాయని, మారిన ఈ రాజకీయాలంటేనే భయమేస్తోందని తెలిపారు. యువతపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని, జాతిని జాగృతం చేసేలా మంచి వ్యక్తులను ఎన్నికల్లో ఎన్నుకోవాలని యువతకు సూచించారు. తహశీల్దార్ వెన్నెల శ్రీను అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఖాదర్ బాషా, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆన్‌లైన్‌కే మా ‘ఓటు’
నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం ఈ-రిజిస్ట్రేషన్‌తో ఓటు ఈజీ ఇక నిరంతరం ఆన్లైన్ ఓటరు నమోదు ఇంటి వద్ద నుంచే ఓటరు నమోదుకు అవకాశం విజయనగరం కంటోన్మెంట్: ఫారాలు నింపడం, అధికారుల చుట్టూ తిరగ డం, కార్డు వచ్చేంతవరకు టెన్షన్ పడ డం వంటి వాటికి ఇక చెక్ పడనుంది. ఓటరు నమోదు ఆన్లైన్ ప్రక్రియ ద్వా రా మరింత సులభతరం చేస్తూ ఎన్నికల కమీషన్ నిర్ణయం తీసుకుంది. ఇం టి వద్ద నుంచే ఓటరుగా నమోదు కావడానికి వీలు కల్పించింది. దీనికి కేవలం స్థానికతను ధ్రువీకరిస్తూ ఓ ఫొటోను జత చేయడమే పని. ఈఆర్‌ఎంఎస్ అం టే ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇందుకోసం కొత్త సాఫ్ట్‌వేర్‌ను తీసుకురావడంతో జిల్లాలో ఇటీవలే సుమారు లక్ష మంది నకిలీ ఓటర్లను తొలగిం చారు. ఏటా జనవరి 25న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీ య ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. తద్వారా ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీ సేవ కేంద్రాలు, పోస్టాఫీసు, బ్యాంకుల్లో దరఖాస్తులు అందుబాటులో ఉంచుతారు. అంతేకాకుండా ఆన్లైన్లో కూడా ఈ-రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కొత్త ఓటర్లుగా చేరేవారు ఫారం6ను సవివరంగా నింపినా కొన్ని తిరస్కరణకు గురైన సందర్భాలుంటాయి. ఓటరు కార్డు కావాలని మరోసారి దరఖాస్తు చేసేందుకు సమయాన్ని వెచ్చించినా వచ్చేంత వరకు అనుమానమే. దీన్ని అధిగమించేందుకు ఉన్న ఏకైక అస్త్రం ఈ-రిజిస్ట్రేషన్. నెట్ ద్వారా నమోదు చేసుకునే వెసులుబాటును ఎన్నికలసంఘం కల్పిం చింది. ఆన్‌లైన్‌ద్వారా పదిహేను నిమిషాల్లోనే దరఖాస్తు ఎన్నికల సంఘానికి పంపించవచ్చు. నమోదు చేసుకున్న తర్వాత ఎన్నికల సంఘం నుంచి వచ్చే ఐడీ నంబర్ ద్వారా దరఖాస్తు పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. సందేహాలుంటే 1950కి ఫోన్‌చేయవచ్చు. ఎన్నికలసంఘం వెబ్‌పేజీ కోసం ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్‌ను వాడుకోవచ్చు. నమోదు ఇలా.... వెబ్‌పేజీ ఓపెన్ చేసి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సిఈఓఆంధ్రా.ఎన్ఐసి.ఇన్ వెబ్ అడ్రస్ టైప్ చేయగానే ఎన్నికల సంఘం హోంపేజీ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత పైన వరుసలో కనిపించే బార్లో ఈ-రిజిస్ట్రేషన్ ఉంటుంది. దానిపై మౌస్తో క్లిక్ చేయగానే నాలుగు రకాల ఫారాలు కనిపిస్తాయి. అందులో ఫారం-6 (న్యూ ఎన్రోల్మెంట్) కొత్త ఓటరు నమోదును ఎంచుకోవాలి. అనంతరం మరో విండోలో రిజిస్ట్రేషన్ చేసుకునేందకు ఫారం-6 ఓపెన్అవుతుంది. అంతకుముందే పాస్‌పోర్ట్ ఫోటోను స్కాన్‌చేసి కంప్యూటర్లో భద్రపరుచుకోవాలి. ఫోటో వెడల్పు, పొడవులు 240, 320గా పెట్టుకుని 100 కేబీ మించకుండా చూసుకోవాలి. ఫోటో బ్రౌజ్ అన్న చోట క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి పేరు, చిరునామా, ఇతరత్రా వివరాలు ఫారంలో ఇంగ్లిష్‌లో నమోదు చేయాలి. అన్ని పూర్తయ్యాక ఫారం చివరిలో ఉన్న ట్రాన్స్‌లేట్ బట న్ను క్లిక్ చేయగానే ఫారంలో మనం ఇంగ్లీషులో నమోదు చేసి న వివరాల కింత తెలుగు పదాలు వస్తాయి. ఆ తర్వాత సబ్మిట్ బటన్‌పై ప్రెస్ చేయాలి. సబ్మిట్ చేసిన తరువాత మీకో ఫోటోతో సహా వివరాలతో కూడిన ఐడీ నంబర్ వస్తుంది. దా న్ని ప్రింట్ తీసుకోవచ్చు. ఐడీ నంబర్‌తో ఎప్పటికప్పుడు కార్డు స్టేటస్ తెలుసుకోవచ్చు. ఇంకొన్ని... ఓటరు ఐడెంటిటీ కార్డు పొందాలంటే మీ సేవలో రూ.10 చెల్లిస్తే సరిపోతుంది. ధృడమైన మెటల్‌తో తయారు చేసిన కలర్ కార్డు కావాలంటే రూ.25 చెల్లించి మీ సేవలో పొందవచ్చు. తగ్గిన ఓటర్లు : జిల్లాలో ఓటర్ల సంఖ్య గతంలో కంటే గణనీయంగా తగ్గింది. గతంలో జిల్లాలోని ఓటర్ల సంఖ్య 17,31,610 మంది ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 16,61,593 కు తగ్గింది. వీరిలో మహిళలు 8,41,605మంది ఉండగా పురుషులు 8,19,988 మంది ఉన్నారు. థర్డ్ జెం డర్ ఓటర్లుగా 138 ఉన్నారు. ఓటర్లలో రెండేసి, మూడేసి ఉండ డంతో ఇప్పుడు ఆ ఓటర్లను ఎన్నికల సంఘం గుర్తించి ఓటరు జాబితాల్లోంచి తగ్గించింది. ఇందుకోసం సరి కొత్త సాఫ్ట్‌వేర్‌ను వినియోగించింది. రెండేళ్ల నుంచి హిజ్రాలకు ప్రాధాన్యం... జిల్లాలో హిజ్రాలకు ఓటర్లుగా గుర్తింపునివ్వడం రెండేళ్ల నుంచి ప్రారంభమైంది. అప్పటి కలెక్టర్ కాంతి లాల్ దండే దీనిపై దృష్టి సారించి జిల్లాలో వంద మందికి పైగా హిజ్రాలకు ఓటరు నమోదు చేయించారు. అంతే కాకుం డా వారికి జాతీయ ఓటరు దినోత్సవం రోజున ఓటరు గుర్తింపు కార్డులిచ్చారు. అంతే కాకుండా వారు కూడా ఓటరు నమోదు ప్రాధాన్యతను తెలియజేస్తూ ర్యాలీలు నిర్వహించి చైతన్య పరిచే కార్యక్రమాన్ని చేపట్టడం గొప్పవిషయం. ప్రస్తుతం జిల్లాలో 138 మంది హిజ్రా ఓటర్లున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు నిత్యం అవకాశం జిల్లాలో ఉన్న యువత ఓటరుగా నమోదు చే యించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎన్నికల సంఘం కూడా ఇందుకు మంచి అ వకాశాన్ని కల్పించింది. ఆన్‌లైన్‌తో ఓటరు న మోదుకు ఇక ఎల్లప్పుడూ అవకాశం ఉం టుంది కనుక అర్హత కలిగిన యువత వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అదే సమయం లో చనిపోయిన, వలస పోయిన, రెండేసి ఓట్లున్న వారి ఓట్లు తొలగించేందుకు ముందుకు రావాలి. - వై.రాధాకృష్ణ వాణి, సూపరింటెండెంట్, ఎన్నికల సెల్ -
ఓటుతో దేశ స్థితిగతుల్లో మార్పు: గవర్నర్
సాక్షి, హైదరాబాద్: ఓటు వేయడం ద్వారా దేశ స్థితిగతుల్లో మార్పుతేవచ్చని గవర్నర్ నరసింహన్ అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో ఆదివారం జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కు వినియోగించుకోవడం పౌరుల ప్రాథమిక హక్కుగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదన్నారు. ఇంట్లో కూర్చొని విమర్శలు చేయడం కంటే ఓటు హక్కు వినియోగించుకొని సమర్థులను పాలకులుగా ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. కులం, మతం, జాతి, వర్గం, భాష తేడాలు లేకుండా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీ జీపీ అనురాగ్‌శర్మ, అదనపు ముఖ్య ఎన్నికల అధికారి అనూప్‌సింగ్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, అదనపు కమిషనర్ నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2014 సాధారణ ఎన్నికల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు గవర్నర్ అవార్డులు అందజేశారు. అవార్డులు అందుకున్నవారిలో డీజీపీ అనురాగ్‌శర్మ, ఎ.బాబు (ఆదిలాబాద్), డీఎస్ లోకేశ్‌కుమార్ (అనంతపురం), జి.కిషన్ (వరంగల్), కాంతిలాల్ దండే (విజయనగరం), జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ (ప్రకాశం), బి.శ్రీనివాస్ (పోలీసు కమిషనర్-విజయవాడ), డి.నాగేంద్రకుమార్ (మహబూబ్‌నగర్), నవదీప్‌సింగ్(నెల్లూరు), వీఎస్కే కౌముది (అదనపు డీఐజీ-ఎల్ఆర్), హరీశ్‌గుప్తా (ఐజీ), ఎం.రమేశ్ (ఏఐజీ) తదితరులున్నారు. -
మేల్కొంటేనే మేలు
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అతి కీలకమైంది. ప్రజల చేతిలో వజ్రాయుధం వంటిది. మంచి పాలకులను ఎన్నుకోవడానికి, అవినీతిపరులను గద్దె దింపడానికి ఓటుహక్కు సామాన్యుడి చేతిలో పాశుపతాస్త్రం లాంటిది. ఇంతటి ప్రాధాన్యమున్న ఓటుహక్కుపై పలువురు అశ్రద్ధ కనబరుస్తున్నారు. ఓటర్ నమోదులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అత్యంతప్రాధాన్యమున్న దీని విలువను గుర్తించలేకపోతున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణాల్లోనే ఓటుహక్కు వినియోగించుకుంటున్నవారి సంఖ్య తక్కువగా ఉండడం ఆందోళన కలిగించే అంశం. ప్రతిఒక్కరూ ఓటు విలువను వివరించి.. దీన్ని వినియోగించుకునేలా చైతన్యపరిచే ఉద్దేశంతో ప్రభుత్వం జనవరి 25నుజాతీయ ఓటరు దినోత్సవంగా ప్రకటించింది. ఆదివారం ఓటుహక్కుపై అవగా హన కల్గించేందుకు అధికారులు జిల్లావ్యాప్తంగా పలు కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఓటుహక్కుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ⇒ ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు నడుం కట్టాలి ⇒ యువతరం.. భావితరాలకు మార్గదర్శకం కావాలి ⇒ 18 ఏళ్లు నిండినవాళ్లంతా ఓటర్‌గా పేరు నమోదు చేసుకోండి ⇒ నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సమాజానికే చేటు ⇒ రండి.. ఓటుహక్కు కోసం చైతన్యవంతులు కండి ⇒ నేడు జాతీయ ఓటరు దినోత్సవం ⇒ జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు యువతరం ముందుకు రావాలి చదువు, భవిష్యత్ కోసం నిరంతరం ఆలోచిస్తున్న యువత పౌరులుగా తమ బాధ్యతలను పూర్తిస్థాయిలో నెరవేర్చడం లేదనే విమర్శలున్నాయి. చాలామంది యువతీయువకులు.. ఎవరికి ఓటేసినా తమకు ఒరిగేదేముందనే భావనతో ఓటు విలును గుర్తించలేకపోతున్నారు. కనీసం ఓటరుగా కూడా నమోదు చేసుకోవడంలోనూ అనాసక్తి కనబరుస్తున్నారు. యువత సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా ఆ స్థాయిలో ఓటర్ల సంఖ్య పెరగకపోవడమే ఇందుకు నిదర్శనం.ఈ కారణంగానే ఓటు హక్కు విలువను తెలియజేసి ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం పలు ప్ర త్యేక కార్యక్రమాలను చేపడుతోంది. స్పెషల్ కాంపెయిన్ల పేరుతో ఆయా గ్రామాలు, కళాశాలల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఓటరు నమోదు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఓటరు నమోదుకు అర్హత.. 18 సంవత్సరాలు నిండి దేశ పౌరసత్వం కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవడానికి అర్హులే. మానసిక వికలాంగులకు, ఎన్నికల నేరాల్లో పాల్పడి నిర్ణీత నేరాల్లో శిక్ష అనుభవించిన వారు మాత్రమే ఓటరు నమోదుకు అనర్హులు. అయితే ఓటరు కేవలం ఒక్క పోలింగ్ బూత్ పరిధిలోనే ఓటుహక్కును పొందాలి. ఒకటి కన్నా ఎక్కువ చోట్ల పొందడం చ ట్టరీత్యా నేరం. ఎలా పొందాలంటే.. ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదు చేసుకోవాలంటే దరఖాస్తుదారుడు ఫార్మ్ 6 ఫారాన్ని నింపి నిర్ణీత ప్రదేశంలో ఫొటో అంటించి, వయసు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలతో కలిపి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌కు అందజేయాలి. విదేశాల్లో నివసించే ప్రవాస భారతీయులు కూడా ఫార్మ్ 6ఏ నింపి సంబంధిత అధికారికి అందజేయాల్సి ఉంటుంది. అభ్యంతరాలు తెలిపేందుకు.. పోలింగ్ బూత్ పరిధిలో ఓటరుగా నమోదైన వ్యక్తి ఏవైనా అభ్యంతరాలుంటే ఫార్మ్ 7ను నింపి ఈఆర్ఓకు అందజేయాలి. రెండు చోట్లా ఓటు హక్కు కలిగి ఉండడం, తప్పుడు వివరాల నమోదు వంటి విషయాలను పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటారు. ఇతర ప్రాంతాల్లో ఓటు హక్కు నమోదు చేయదల్చుకుంటే ఫార్మ 7 ద్వారా ఇప్పటికే ఉన్న ఓటు హక్కును రద్దు చేసుకునే వీలు ఉంటుంది. సవరణల కోసం.. తమ వివరాలు ఎన్నికల జాబితాలో నమోదైన తర్వాత వాటిలో తప్పులు ఉన్నట్లు గమనిస్తే ఫార్మ్ 8 ద్వారా వాటిని సరిదిద్దుకోవచ చ్చు. పేరు, ఇంటి పేరు, తండ్రి పేరు, చిరునామా తదితర అంశాల్లో తప్పొప్పులను సరిదిదిద్దుకునే వీలుంది. ఆన్‌లైన్‌లోనూ ఓటరు నమోదు ఆన్లైన్లోనే సంబంధిత ఫారాలను నింపి అధికారులకు సమర్పించే వీలు కూడా ఉంది. నెట్లోనే సంబంధిత వివరాలన్నీ పూర్తి చేసి ఫొటో, ఇతర డాక్యుమెంట్లను స్కాన్‌చేసి పంపిస్తే అధికారులు నిర్ణీత వ్యవధిలో ఓటు హక్కును కల్పిస్తారు. ఈ సేవ కేంద్రానికి వెళ్లి అధికారులు ఇచ్చే ఎపిక్ నంబరును చెప్పి ఓటరు గుర్తింపు కార్డును పొందవచ్చు. -
పవిత్రమైనది ఓటు హక్కు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఓటు హక్కుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, దీన్ని పవిత్రంగా వాడుకోవాలని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనరసింహాం అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం కలెక్టర్ కార్యాలయంలో ఆధికారులు, ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటు మహా ఆయుధమన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటును పొందాలని, ఎన్నికల్లో వినియోగించు కోవాలన్నారు. ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. అలాగే శ్రీకాకుళం బాపూజీ కళామందిరంలో జిల్లాస్థాయి ఓటర్ల దినోత్సవాన్ని ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జేసీ వివేక్ యాదవ్, ఏజేసీ పి.రజనీకాంతారావు, జెడ్పీ సీఈవో జె.వ సంతరావు, మెప్మా పీడీ మునికోటి సత్యనారాయణ, డ్వామా పీడీ ఆర్.కూర్మనాథ్, డివిజినల్ అటవీ శాఖ ఆధికారి షెక్ షలాం పాల్గొన్నారు. -
ఓటరుకూ ఓ రోజు!
విజయనగరం మున్సిపాలిటీ: ‘ఓటరు మహాశయులారా...’ అని ఐదేళ్లకు ఓ మారే నాయకులు పిలుస్తుంటారని ప్రజలు తెగ బాధపడిపోతుంటారు. కానీ ఓటరు మహాశయులకూ ఓ రోజుంది. ఏటా జనవరి 25నభారత ఎన్నికల సంఘం జాతీయ ఓ టరు దినోత్సవం ఘనంగా నిర్వహిస్తోంది. ఏ టా 18 ఏళ్ల నిండిన యువతను ఓటరుగా న మోదు చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలను కూ డా చేపడుతోంది. తొలి ఓటు హక్కు... 1950 జనవరి 25 మొట్టమొదటి సారిగా దేశం లో ప్రజాస్వామ్య పద్ధతిలో పౌరుడికి తొలి సారి గా ఓటు హక్కు కల్పించారు. 1952 మొట్ట మొ దటి సారి నిర్వహించిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట రు జాబితా ఆధారంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1992 వరకు ఎలక్ట్రో ఫోటో ఐ డెంటిటీ కార్డు ఉండేది కాదు. 1993లో భారత ఎన్నికల సంఘం కమిషనర్‌గా ఉన్న టీఎన్ శేషన్ ఓటర్ల గుర్తింపు కార్డుల ప్రక్రియను ప్రారంభించారు. ఓటరు దినోత్సవం వచ్చిందిలా... 1950 జనవరి 25న భారత ఎన్నికల సంఘం ఏర్పడింది. 2010 నాటికి ఎన్నికల సంఘం 60 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా 2011 జనవరి 25వ తేదీన తొలి జాతీయ ఓటరు దినోత్సవంగా నిర్వహించాలని భారత ఎ న్నికల సంఘం ప్రకటించింది. తర్వాత 2012లో రెండో జాతీయ ఓటర్ల దినోత్సవం, 2013, 2014 సంవత్సరాల్లో మూడు, నాల్గవ జాతీయ ఓటర్ల దినోత్సవాలు జరుపుకున్నాం. ఓటు ‘ఇ’లా ఈజీ! విజయనగరం మున్సిపాలిటీ : ఓటు... ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి విలువైన, బ ల మైన ఆయుధం. ఓటు హక్కు పొందడానికి ఎన్నికల కమిషన్ విస్తృత మార్గాల ను చూపిస్తోంది. మీ సేవా కేంద్రా లు, పోస్టాఫీసు, బ్యాంకుల్లో దరఖాస్తులు అందుబాటులో ఉంచుతున్నారు. ఓటు కోసం ఆన్లైన్లో కూ డా ఈ-రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది చాలా సులభమైన పద్ధతి. కొత్త ఓటర్లు గా చేరేవారు ఫారం6ను సవివరంగా నింపినా కొన్ని తిరస్కరణకు గురైన సం దర్భాలుంటాయి. ఓటరు కార్డు కావాల ని మరోసారి దరఖాస్తు చేసేందుకు సయమాన్ని వెచ్చించినా వచ్చేంత వరకు అనుమానమే. దీన్ని అధిగమించేందుకు ఉన్న ఏకైక అస్త్రం ఈ-రిజిస్ట్రేషన్. నెట్‌ద్వారా నమోదు చేసుకునే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించింది. ఆన్లైన్ ద్వారా పది హేను నిమిషాల్లోనే దరఖా స్తు ఎన్నికల సంఘానికి పంపించవచ్చు. నమోదు చేసుకున్న తర్వాత ఎన్నికల సంఘం నుంచి వచ్చే ఐడీ నెంబర్ ద్వారా దరఖాస్తు పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. సందేహాలుంటే 1950కి ఫోన్ చేయవచ్చు. నమోదు ఇలా.... ఊ వెబ్‌పేజీ ఓపెన్ చేసి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సిఈఓఆంధ్రా.ఎన్ఐసి.ఇన్ వెబ్ అడ్రస్ టైప్ చేస్తే ఎన్నికల సంఘం హోంపేజీ ఓపెన్ అవుతుంది. ఊ ఆ తర్వాత పైన వరుసలో కనిపించే బార్లో ఈ-రిజిస్ట్రేషన్ ఉంటుంది. దానిపై మౌస్తో క్లిక్ చేయగానే నాలుగు రకాల ఫారాలు కనిపిస్తాయి. అందులో ఫారం-6 (న్యూ ఎన్రోల్మెంట్) కొత్త ఓటరు నమోదును ఎంచుకోవాలి. ఊ అనంతరం మరో విండోలో రిజిస్ట్రేషన్ చేసుకునేందకు ఫారం-6 ఓపెన్ అవుతుంది. ఊ అంతకుముందే పాస్‌పోర్ట్ ఫోటోను స్కాన్‌చేసి కంప్యూటర్లో భద్రపరుచుకోవాలి. ఫోటో వెడ ల్పు, పొడవులు 240, 320గా పెట్టుకుని 100 కేబీ మించకుండా చూసుకోవాలి. ఫోటో బ్రౌజ్ అన్న చోటక్లిక్ చేసి అప్లోడ్ చేయాలి ఊ పేరు, చిరునామా, ఇతరత్రా వివరాలు ఫారం లో ఇంగ్లిష్‌లో నమోదు చేయాలి. అన్నీ పూర్తయ్యాక ఫారం చివరిలో ఉన్న ట్రాన్స్‌లేట్ బట న్ను క్లిక్ చేస్తే ఫారంలో మనం ఇంగ్లీషులో నమో దు చేసిన వివరాల కింద తెలుగు పదాలు వస్తా యి. ఆ తరువాత సబ్మిట్ బటన్‌పై ప్రెస్ చేయాలి. ఊ సబ్మిట్ చేసిన తరువాత మీకు ఫొటోతో సహా వివరాలతో కూడిన ఐడీ నంబర్ వస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు. మెయిల్లో సేవ్ చేసుకోవచ్చు. ఐడీ నంబర్‌తో ఎప్పటికప్పుడు కార్డు స్టేట స్ తెలుసుకోవచ్చు. ఇవీ వివరాలు... విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో ఈ ఏడాది 17,410 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నా రు. ఇందులో మహిళలు 9307 మంది ఉండగా పురుషులు 8093 మంది ఉన్నారు. వీరితో పాటు ఇతరులు పది మంది నమోదయ్యారు. దీంతో జిల్లాలోని కొత్తగా నమోదైన వారితో కలిపి ఓటర్ల సంఖ్య 17,31,610కు చేరింది. గత ఏడాది నుంచీ హిజ్రాలకు ప్రాధాన్యం... జిల్లాలో హిజ్రాలకు ఓటర్లుగా గుర్తింపునివ్వడం గత ఏడాది నుంచి ప్రారంభమైంది. అప్పటి కలెక్టర్ కాంతిలాల్ దండే దీనిపై దృష్టి సారించి జిల్లాలో వంద మందికి పైగా హిజ్రాలకు ఓటరు నమోదు చేయించారు. అంతే కాకుండా వారికి జాతీయ ఓటరు దినోత్సవం రోజున ఓటరు గుర్తింపు కార్డులిచ్చారు. అంతే కాకుండా వారు కూడా ఓటరు నమోదు ప్రాధాన్యతను తెలియజేస్తూ ర్యాలీలు నిర్వహించి చైతన్య పరిచే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం జిల్లాలో 143 మంది హిజ్రా ఓటర్లున్నారు. ఏ దరఖాస్తు దేనికంటే.... ఫారం 6: చేర్పులు ఫారం 6ఏ: ఎన్నారైల చేర్పులు ఫారం7: తొలగింపులు ఫారం 8: సవరణలు ఫారం8ఏ: బదిలీలు జనాభా నిష్పత్తిని దాటిపోయిన ఓటర్లు: జిల్లాలో ఓటర్లు జనాభా నిష్పత్తిని దాటిపోయారు. వాస్తవానికి ఏ ప్రాంతంలోనైనా అక్కడ ఉన్న జనాభాకు 65 శాతం మాత్రమే ఓటర్లుండాలి. అంటే ప్రతి వెయ్యి మంది జనాభాకూ 650 మంది ఉండాలి. కానీ జిల్లాలో మాత్రం ప్రతి వెయ్యి మంది జనాభాకూ 726.5 మంది ఓటర్లున్నారు. చాలా ప్రాంతాల్లో వయసు తక్కువ వారిని కూడా ఓటర్లుగా స్థానిక రాజకీయ లబ్ధి కోసం చేర్చడంతో పాటు చనిపోయిన, వలస పోయిన వారి ఓట్లను తొలగించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీనిపై ఎన్నికల సంఘానికి జిల్లా అధికారులు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులున్నాయి. జిల్లా జనాభా 2015 అంచనాల ప్రకారం 23,83,505 మంది ఉంటే ఓటర్లు 17,31,610 మంది ఉన్నారు. ఓటరు ఐడెంటిటీ కార్డు పొందాలంటే మీ సేవలో రూ.10 చెల్లిస్తే సరిపోతుంది. మెటల్‌తో తయారు చేసిన కలర్ కార్డు కావాలంటే రూ.25 చెల్లించి మీ సేవలో పొందవచ్చు. యువత ఆసక్తి చూపుతున్నారు జిల్లాలో ఉన్న యువత ఓటరుగా నమోదు చేయించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆ న్లైన్లో ఎక్కువగా దరఖాస్తు చేసుకుంటున్నా రు. నమోదుకు ఎల్లప్పుడూ అవకాశం ఉంటుం ది కనుక అర్హత కలిగిన యువత నిరంతరం ఓటరు నమోదుకు తగిన వయసు రాగానే రి జిస్ట్రేషన్ చేయించుకోవాలి. అదే సమయంలో చనిపోయిన, వలస పోయిన వారి ఓట్లు తొ లగించేందుకు ముందుకు రావాలి. తిరిగి వచ్చి న వారి ఓట్లు నమోదుకు కూడా సహకరించాలి - వై.రాధాకృష్ణ వాణి, సూపరింటెండెంట్, ఎన్నికల సెల్, విజయనగరం కలెక్టరేట్ ప్రత్యేక డ్రైవ్‌లు... జిల్లాలో ఓటరు నమోదుకు ఎలాగైతే ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తామో ఎన్నికల సమయంలో కూడా అదేవిధంగా డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాం. దీని వల్ల మంచి నాయకులను ఓటర్లు ఎన్నుకునే అవకాశం లభిస్తుంది. ఓటరుగా నమోదు చేయించుకోవడం ఎంత బాధ్యతో మంచి నీ తివంతమయిన పాలకుడ్ని ఎంచుకోవడం కూడా అంతే బాధ్యతగా ప్రతి ఓటరూ గుర్తెరగాలి. ఓటు నమోదు చేసుకోవడానికి అర్హులు ముందుకు రావాలి. - వై.నరసింహారావు, డీఆర్వో, విజయనగరం ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటే కీలకం భారత ప్రజాస్వామ్య ప్రభుత్వ వ్యవస్థకు కీల కం ఓటు హక్కు. దీన్ని ప్రతి పౌరుడూ గుర్తించాలి. వయోజనుడైన ప్రతి ఒక్క ఓటరూ తన ఓటు హక్కును సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి. ఓటర్లు స్వేచ్ఛగా తమ నాయకుడిని ఎన్నుకునే అవకాశాన్ని అధికార యంత్రాంగం తప్పకుండా కల్పిస్తుంది. నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి దోహదపడే ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని విజ్ఙప్తి. - బి.రామారావు, జాయింట్ కలెక్టర్, విజయనగరం -
ప్రలోభాలకు లొంగవద్దు
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత ప్రధానమైన ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దనికలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ కోరారు. శనివారం జాతీ య ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిల్లాపరి షత్ సమావేశ మందిరంలో జరిగిన వేడుకలనుద్దేశించి ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో జిల్లాలో 70 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నట్టు చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 19.72లక్షల మంది ఓటర్లు నమోదైనట్టు చెప్పా రు. జిల్లాలో ఓటరునమోదు ప్రత్యేక డ్రైవ్ ద్వారా 45వేల మంది ఓటు హక్కు పొందారని తెలి పారు. 18,19సంవత్సరాల వయసుగల యువత జిల్లాలో 40వేల మంది ఉన్నారని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఈ దిశ గా రాజకీయ పక్షాలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా క్రియాశీల పాత్ర పోషించాలని కోరారు. ఎస్పీఎవి.రంగనాథ్ మాట్లాడుతూ.. డబ్బు ఖర్చు లేకుండా అభ్యర్థులు గెలిస్తే ప్రజాస్వామ్యం విలువ పెరుగుతుందని అన్నారు. యువ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే మంచి వ్యక్తులు ఎన్నికయ్యే అవకాశముంటుందన్నారు. ఓటర్లు ఓటు వినియోగాన్ని హక్కుగా మాత్రమే కాకుండా బాధ్యతగా కూడా భావించాలని కోరారు. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీసు శాఖ తన బాధ్యతను నిర్వర్తిస్తుందన్నా రు. ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ ప్రభావం లేకుండా చూస్తుందన్నారు. హాజరైన వారితో కలెక్టర్ ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. సీనియర్ ఓటర్లకు సన్మానం క్రమం తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకుంటున్న పదిమంది సీనియర్ సిటిజన్లను కలెక్టర్ శాలువాలతో సన్మానించారు. జాతీయ ఓట రు దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన క్విజ్, డ్రాయింగ్, వక్తృత్వ పోటీల విజేతలకు మెమెంటోలను కలెక్టర్, ఎస్పీ ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లాపరిషత్ సీఈఓ జయప్రకాష్ నారాయణ్, డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ భానుప్రకాష్, డీఈఓ రవీంద్రనాథ్, డీడీ ఎస్డబ్ల్యూ లక్ష్మిదేవి, డీపీఆర్ఓ వై.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. భారీ ప్రదర్శన, మానవహారం జాతీయ ఓటరుదినోత్సవం సందర్భంగా నగరం లో భారీ ప్రదర్శన జరిగింది. తొలుత, ఈ ప్రదర్శనను పెవిలియన్ గ్రౌండ్లో కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్, ఎస్పీ ఎవి.రంగనాథ్, అడిషనల్ జాయింట్ కలెక్టర్ బాబురావు, జిల్లా రెవెన్యూ అధికారి శివశ్రీనివాస్ ప్రారంభించారు. పెవిలి యన్ గ్రౌండ్ నుంచి మయూరిసెంటర్, బస్టాం డ్, వైరారోడ్, జడ్పీసెంటర్ కు ప్రదర్శన సాగింది. అక్కడప్రదర్శకులు మానవహారంగా ఏర్పడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి సందేశాన్ని జిల్లా రెవెన్యూ అధికారి శివశ్రీనివాస్ చదివి వినిపించారు. ఓటర్ల ప్రతిజ్ఞ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లాపరిషత్ ఆవరణలోని పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్ల ప్రతిజ్ఞ కార్యక్రమం జరిగింది. ‘భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో.. ప్రజాస్వామ్య సాంప్రదాయాలను నిలబెడతాం. మతం, జాతి,కులం, వర్గం, భాష తదితర ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తాం’ అని ప్రతిజ్ఞ చేశారు. నూతన ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులకు దరఖాస్తులను ఇక్కడి సిబ్బంది స్వీకరించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పోలింగ్ బూత్‌లలో బీఎల్ఓలు అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు చేశారు. -
ప్రజాస్వామ్యంలో ఓటు కీలకం
ఆదిలాబాద్ అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : ప్రజాస్వామ్యం దేశంలో ఓటు హక్కు ఎంతో కీలకమైందని, ప్రతీ ఒక్కరు ఓటుహక్కును వినియోగించుకొని మంచి ప్రజా నాయకులను ఎన్నుకొని దేశాభివృద్ధికి పాటుపడాలని జిల్లా కలెక్టర్ అహ్మద్‌బాబు అన్నారు. జాతీయ ఓటర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజాస్వామ్యంలో ప్రపంచంలోనే భారతదేశం మొట్టమొదటిదని తెలిపారు. జిల్లాలో రెండు నెల లుగా జిల్లా యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సం ఘాలు, మీడియా ప్రతినిధుల కృషితో 2 లక్షల పదివేల మంది నూతన ఓటర్లను నమోదు చేసినట్లు వివరించారు. గతంలో 16 లక్షల ఓటర్లు ఉండగా.. ఆ సంఖ్య ప్రస్తుతం 19 లక్షలకు చేరుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికీ నమోదు కాకుండా మిగిలిపోయిన వారు కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఓటర్లుగా నమోదు చేసుకోవాలలని సూచించారు. ఓటు విలువ ఎనలేనిది : ఎస్పీ జిల్లా ఎస్పీ గజరావ్‌భూపాల్ మాట్లాడుతూ, ఓటు హక్కు ఎంతో గొప్ప ఆయుధమని, దాని విలువ ఎనలేనిదని అన్నారు. కొంతమంది దాని విలువ తెలియక వినియోగించుకోవడం లేదని, ప్రతి ఒక్కరు తప్పక ఓటు వేయాలని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఎన్నికల ప్రభావా న్ని నిలబెడతామని, కుల, మతం, భాష, వర్గాలకు ప్రభావితం కాకుండా ప్రతి ఒక్కరు నిర్భయంగా ఓటు చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. వృద్ధ మహిళా ఓటర్లు అయిన లక్ష్మీబాయి(96), సుభద్ర(85)లను జిల్లా కలెక్టర్, ఎస్పీ సన్మానించారు. ఓటర్ల దినోత్సవం సందర్భంగా పది నియోజకవర్గాల్లో ఉపన్యాసాలు, డ్రాయింగ్, పెయింటింగ్, క్విజ్ పోటీలు నిర్వహించి జిల్లాస్థాయిలో గెలుపొందిన వారికి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. జిల్లాస్థాయిలో ప్రథమ స్థానంలో గెలుపొందిన వారిని హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. డీఆర్వో ఎస్ఎస్ రాజ్, డబ్ల్యూఎస్‌డీ పనసారెడ్డి, డీఎస్పీ లతామాధురి, ఏఎస్పీ సృజన, ఆర్డీఓ ఎన్. సుధాకర్‌రెడ్డి, ఎన్సీసీ బెటాలియన్ కమాండెంట్, ఇతర అధికారులు, యువజన సంఘాలు, విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. ఓటు విలువను తెలుసుకో అంటూ... ఆదిలాబాద్ అగ్రికల్చర్ : ఓటు విలువను ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలంటూ యువజన సంఘాలు, విద్యార్థులు, 32 ఆంధ్రప్రదేశ్ బెటాలియన్ ఎన్సీసీ క్యాడెట్లు శనివారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ అహ్మద్‌బాబు, ఎస్పీ గజరావ్‌భూపాల్ జెండా ఊపి ప్రారంభించారు. డైట్ మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా జెడ్పీ కార్యాలయం వరకు చేరుకుంది. ఓటర్లుగా నమోదుకండి.. ఓటరు గుర్తింపుకార్డు పొందండి.. ఓటు విలువను తెలుసుకోండి అనే నినాదాలతో ర్యాలీ కొనసాగించారు. కలెక్టర్‌చౌక్‌లో మానవహారంగా ఏర్పడి విద్యార్థులు, ఇతర అధికారులతో జిల్లా కలెక్టర్, ఎస్పీ ఓటు హక్కు ప్రాముఖ్యతపై నినాదాలు చేయించారు. ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, తహశీల్దార్ సిడాం దత్తు, ఎన్నికల పర్యవేక్షకులు ప్రభాకర్‌స్వామి, ఇతర అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.