ఓటెత్తిన చైతన్యం | today national voters day | Sakshi
Sakshi News home page

ఓటెత్తిన చైతన్యం

Published Sat, Jan 25 2014 1:01 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM

today national voters day

సాక్షి, గుంటూరు: ఈ ఏడాది 4వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని శనివారం జిల్లాలో ఘనంగా నిర్వహించనున్నారు. 2013 జనవరి 15న ప్రచురించిన తుది జాబితాలో జిల్లాలో 33,61,476 మంది ఓటర్లు వున్నారు. శుక్రవారం నాటికి మొత్తం ఓటర్లు  35,32,241 మంది వున్నారు.  వీరందరికీ ఫొటో గుర్తింపు కార్డు ఇవ్వడంతో పాటు ఫొటో ఓటరు జాబితా రూపకల్పన ఎన్నికల కమిషన్ లక్ష్యంగా పెట్టుకుంది.

జిల్లాలో ఇప్పటికే 34 లక్షల మందికి ఫొటో గుర్తింపు కార్డులు (ఎపిక్ కార్డులు) ఉన్నాయి. కొత్తగా చేరే వారికీ ఫొటో గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు.  జాతీయ ఓటర్ల దినోత్సవం రోజైన శనివారం పోలింగ్ బూత్‌కు ఐదుగురికి పాన్ కార్డు తరహాలో ప్లాస్టిక్ కోటెడ్ ఫొటో ఓటరు గుర్తింపు కార్డులను పంపిణీ చేయనున్నారు. హైదరాబాదు నుంచి ప్రత్యేకంగా ఈ కార్డులు తెప్పించనున్నారు. వీటిని ఓటర్లకు అందించడంతో పాటు వృద్ధులైన ఓటర్లను, సమర్థంగా పనిచేసిన బూత్ లెవల్ అధికారులను సన్మానించనున్నారు.ఇందుకోసం నియోజకవర్గంలో ఇరువురు బీఎల్‌ఓలను ఎంపిక చేశారు.

 నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం
 జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని శనివారం గుంటూరులో జిల్లా కలెక్టరు ఎస్.సురేశ్‌కుమార్ ఆర్భాటంగా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఉదయం 7 గంటలకే పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి పాతబస్టాండ్ వద్ద ఉన్న ఉర్దూ స్కూల్ వరకు 2 కే రన్ నిర్వహించనున్నారు. అనంతరం మానవహారంతో పాటు వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రంగోలి, వివిధ రకాల పోటీలు జరపను న్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఓటరు చైతన్య రథాలు పర్యటించాయి. 31న ఓటర్ల తుది జాబితా ప్రచురించనున్నారు. మొత్తం ఓటర్ల సంఖ్యతో పోల్చితే జిల్లా రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉంది.

 ఓటర్ల జాబితాకు తుదిమెరుగులు
 ఓటర్ల తుది జాబితా ప్రచురణకు అధికార యంత్రాంగం తుది మెరుగులు దిద్దుతున్నారు. తుది జాబితా ప్రచురించిన వెంటనే ఓటరుగా నమోదు చేసుకున్న వారు ఓటరు గుర్తింపు కార్డు పొందేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఓటరుగా నమోదు చేసుకున్న పేరును పోస్టాఫీసు/రేషన్ దుకాణాలు/పంచాయతీ/వార్డు/మండల/మున్సిపల్ ఆఫీసుల్లో లేదా ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్ www.ceoandhra.nic.in లో పరిశీలించుకోవచ్చు. గుర్తింపు కార్డు కోసం రెండు పాస్ పోర్టు సైజు ఫొటోలతో పాటు వయస్సు ధ్రువీకరణ పత్రం కానీ స్కూల్/కాలేజీ సర్టిఫికెట్, తల్లిదండ్రుల అఫిడవిట్ జతచేసి పొందే వీలుంది.
 
 జిల్లా కలెక్టరేట్ నుంచి అందిన సమాచారం మేరకు

 తుది జాబితాలో చేరనున్న వివరాలివే...
     జిల్లాలో ఈ-రిజిస్ట్రేషన్, మాన్యువల్ కలిపి చేర్పులకు 2,71,960 దరఖాస్తులు అందాయి. 2,70,908 దరఖాస్తుల్ని అప్‌డేట్ చేసి వీటిలో 1,89,168 దరఖాస్తులకు జాబితాలో చోటు కల్పించి 73,762 దరఖాస్తుల్ని తిరస్కరించారు.
 
     ఓట్ల తొలగింపులకు 94,384 దరఖాస్తులు అందగా, 94,306 దరఖాస్తుల్ని అప్‌డేట్ చేసి 73,659 దరఖాస్తులు అంగీకరించి, 16,882 దరఖాస్తుల్ని తిరస్కరించారు.
 
     సవరణలకు 30,801 దరఖాస్తులు అందితే, ఇప్పటివరకు 26,490 డేటా అప్‌డేట్ చేసి 18,696 అంగీకరించి, 7,391 తిరస్కరించారు.
 
     మార్పులకు 8,365 దరఖాస్తులు అందగా, 7,463 దరఖాస్తుల్ని అప్‌డేట్ చేశారు. వీటిలో 6,334 అంగీకరించి, 1,098 తిరస్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement