s.suresh kumar
-
పేపర్ లీక్ వదంతులు నమ్మొద్దు
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని వస్తున్న వదంతులను నమ్మొద్దని, భయపడొద్దని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ సూచించారు. ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయంటూ కొన్ని వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా, టీవీ చానళ్లలో వస్తున్న వదంతులు అసత్యమన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో గందరగోళం, భయాందోళనలను రేకెత్తించడానికి కొందరు ఇటువంటివి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు గురువారం సురేష్ కుమార్ సర్క్యులర్ విడుదల చేశారు. పదో తరగతి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహిస్తున్నామని.. ఇప్పటివరకు లీకేజీకి సంబంధించి ఎలాంటి కేసులు నమోదు కాలేదని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎవరూ మొబైల్ ఫోన్లు తీసుకెళ్లకుండా నిషేధించామన్నారు. అంతేకాకుండా పరీక్షల విధులతో సంబంధం లేని ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం లేదని చెప్పారు. వీటిలో ఏదైనా ఉల్లంఘన జరిగితే వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవన్నారు. ప్రశ్నపత్రాలను, సమాధాన పత్రాలను సురక్షితంగా భద్రపరుస్తున్నామన్నారు. ఏప్రిల్ 27న కర్నూలులో పరీక్షలు ప్రారంభమయ్యాక ప్రశ్నపత్రాన్ని సర్క్యులేట్ చేసిన ఘటనలో తక్షణమే చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ దుశ్చర్యకు కారణమైన వ్యక్తులను అరెస్టు చేశామన్నారు. మీడియా కూడా వదంతులను ప్రసారం చేయొద్దని విన్నవించారు. -
కొత్త సారధి కొలువుదీరే వేళ..
సాక్షి, గుంటూరు : జిల్లా పరిషత్ పీఠాన్ని నేడు కొత్త సార ధి అధిరోహించనున్నారు. శనివారం జెడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక జరగనుంది. దీంతో సుమారు మూడేళ్ల పాటు సాగిన ప్రత్యేక అధికారుల పాలనకు తెర పడనుంది. ఉదయం 10 గంటలకు తొలుత కోఆప్షన్ సభ్యుల నామినేషన్‌తో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ వ్యవహరిస్తారు. జిల్లా పరిషత్ పాలక వర్గం గడువు 2011 జూలై 22వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి జిల్లాలో ప్రత్యేకాధికారుల పాలనే సాగుతోంది. జూలై 23, 2011 నుంచి జూలై 15, 2012 వరకు అప్పటి కలెక్టర్ వి.ఎన్ విష్ణు ప్రత్యేకాధికారిగా వ్యవహరించారు. ఆయన బదిలీ నేపథ్యంలో కలెక్టర్‌గా వచ్చిన ఎస్.సురేశ్ కుమార్ జూలై 16 నుంచి ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలు నిర్వహించకుండా వాయిదాలు వేస్తూ కాలయాపన చేసిన గత కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో విధి లేని పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ చేపట్టింది. ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల తరువాత సాధారణ ఎన్నికలు జరుగుతుండటంతో ఫలితాలను నిలుపుదల చేశారు. మే 13న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటించారు. రాష్ట్ర విభజనతో పాటు, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికల్లో జాప్యం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికలు జరిగిన రెండు నెలలకు కొత్త పాలక వర్గాలు కొలువు తీరుతున్నాయి. అధికారులు ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జెడ్పీ కార్యాలయానికి రంగులు వేసి ముస్తాబు చేశారు. కొత్త పాలక వర్గానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. జెడ్పీ క్యాంపు కార్యాలయం, అతిథి గృహానికి మరమ్మతులు చేపట్టారు. జెడ్పీ పీఠంపై ముస్లిం మహిళ... జిల్లాలో మొత్తం 57 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. ఇందులో 34 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. వైఎస్సార్ సీపీ 23 స్థానాలు దక్కించుకుంది. దీంతో అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలు టీడీపీ ఖాతాలోకి వెళ్లనున్నాయి. జిల్లా పరిషత్ అధ్యక్ష పదవిని టీడీపీ మొదటి రెండున్నరేళ్లు ముస్లింలకు, మరో రెండున్నరేళ్లు బీసీలకు కేటాయించింది. కాకుమాను జెడ్పీటీసీ సభ్యురాలు షేక్ జానీమూన్‌కు అధ్యక్ష పదవి వరించనుంది. ఉపాధ్యక్షుడిగా తాడికొండ జెడ్పీటీసీ పభ్యుడు వడ్లపూడి పూర్ణచంద్రరావును ఎంపిక చేశారు. బాపట్ల, మాచర్ల నియోజకవర్గాల నుంచి కోప్షన్ సభ్యులుగా ఎన్నకోవాలని నిర్ణయించారు. ఎన్నిక ప్రక్రియ జరిగేదిలా.. ఉదయం 10 గంటలకు కో ఆప్షన్ సభ్యుల ఎన్నికతో ప్రక్రియ ప్రారంభమవుతుంది. సభ్యులు నామినేషన్ వేసేటప్పుడు ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులు ప్రతిపాదించాలి. తొలుత వీరిద్దరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అధ్యక్ష, ఉపాధ్యక్షుల బి ఫారాల వివరాలను ఆయా పార్టీల అధ్యక్షులు సమర్పిస్తారు. 10 గంటల తరువాత కో-ఆప్షన్ సభ్యులుగా నామినేషన్ వేసిన వారి జాబితా ప్రకటిస్తారు. 10 గంటల నుంచి 12 వరకు నామినేషన్ల పరిశీలన, అనంతరం అర్హులైన అభ్యర్థుల జాబితా ప్రకటన. మధ్యాహ్నం 1 గంటకు ప్రిసైడింగ్ అధికారి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జెడ్పీటీసీల సర్వ సభ్యసమావేశం నిర్వహిస్తారు. సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 50 శాతం మంది సభ్యులు హాజరైతేనే ఎన్నికను నిర్వహిస్తారు. అధ్యక్ష, ఉపాధ్యక్షుల స్థానానికి ఒకే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేస్తే వారిని ఎన్నికైనట్లుగా ప్రిసైడింగ్ అధికారి ప్రకటిస్తారు. ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైతే మధ్యాహ్నం 3గంటలకు ఎన్నిక జరుగుతుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సమావేశానికి అనుమతిస్తారు. రిటర్నింగ్ అధికారులు జెడ్పీటీసీ సభ్యులుగా ఎన్నికైనట్లు ఇచ్చిన ధ్రువపత్రాలను చూపిన తరువాత పోలీసులు సభ్యులను అనుమతిస్తారు. -
ఏర్పాట్లు ముమ్మరం
మంగళగిరి రూరల్, న్యూస్‌లైన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ తెలిపారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట గతంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన యువగర్జన సభ జరిగిన మైదానంలోనే ఈ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్, ఐజీ పీవీ సునీల్ కుమార్, రూరల్ ఎస్పీ జె.సత్యనారాయణ ఆయా శాఖల అధికారులతో కలసి శుక్రవారం ఆయన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట మైదానాన్ని పరిశీలించి ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 70 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 50 ఎకరాల్లో సమావేశం, 20 ఎకరాల్లో హెలిప్యాడ్‌ను ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 5 లక్షల మంది తరలి వచ్చే అవకాశం వుండడంతో వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. టోల్గేట్ సమీపంలో గతంలో హిందూ చైతన్య శిబిరం నిర్వహించిన ప్రాంతంలోనూ, కొప్పురావూరు కేశవరెడ్డి స్కూల్ వెనుక ప్రాంతంలో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 5 వేల మంది పోలీసులతో గట్టి భద్రతా చర్యలను తీసుకుంటున్నామని చెప్పారు. సమావేశంలో ఎటువంటి తొక్కిసలాటలు జరుగకుండా ఇనుప బారికేడ్లను ఏర్పాటు చేయాలని, మైదానాన్ని చదును చేయించాలని కలెక్టర్ ఆర్అండ్బీ ఎస్ఈని ఆదేశించారు. మైదానంలో వేదిక ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై ఆయన అధికారులతో చర్చించారు. మైదానంలో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులు, పార్టీ ముఖ్య నేతలు ఏర్పాట్లను పరిశీలించేందుకు రానున్నారని, వారిచ్చే సూచనల మేరకు ఏర్పాట్లను పూర్తి చేస్తామని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో రామ్మూర్తి, అర్భన్ అదనపు ఎస్పీ ధరావత్ జానకి, రూరల్ అదనపు ఎస్పీ డి.కోటేశ్వరరావు, అర్బన్ ఎస్బీ డీఎస్పీ ప్రసన్నకుమార్, నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ ఎం మధుసూదనరావు, ట్రాఫిక్ డీఎస్పీ తిరుపాల్, ఎస్బీ సీఐ బండారు రాజశేఖర్ రూరల్ సీఐ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వైద్యాధికారుల్లో వేటు భయం
బాపట్లటౌన్, న్యూస్‌లైన్: గర్భిణికి వైద్యం అందించేందుకు నిరాకరించిన స్థానిక ఏరియా వైద్యశాల వైద్యాధికారుల్లో గుబులు మొదలైంది. అందరినీ వేటు భయం వెంటాడుతోంది. పిట్టలవానిపాలెం మండలం మండేవారిపాలెం గ్రామానికి చెందిన నిరుపేద గర్భిణి ఇందిరకు ఈ నెల 25న పురిటి నొప్పులు వచ్చాయి. బంధువులు బాపట్ల ఏరియావైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు వైద్యం చేయలేదు. దీనిపై సోమవారం సాక్షిలో కథనం ప్రచురితమైంది. కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ స్పందించారు. విచారణ చేపట్టాల్సిందిగా జిల్లా ఆరోగ్యశాఖ కోఆర్డినేటర్‌ను ఆదేశించారు. డీసీ శ్రీదేవి మంగళవారం ఏరియా వైద్యశాలకు వచ్చారు. వివరాలు సేకరించారు. 25న ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్యూటీలో ఎవరున్నారు.. గర్భిణికి ఎలాంటి వైద్యం అందించారు.. కేసును ఎందుకు రిఫర్ చేయాల్సి వచ్చింది.. అనేదానిపై దర్యాప్తు చేపట్టారు. రికార్డులు పరిశీలించాక సిబ్బంది అందరినీ దశలవారీగా విచారించారు. అందరి లోపం ఉంది అనంతరం ఆమె‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ ఘటనలో అందరి లోపం ఉందని, డ్యూటీలో ఉన్న డాక్టర్ ఆర్.విజయలక్ష్మి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కేసుకు సంబంధించి డాక్టర్ ఆర్.విజయలక్ష్మి, ఇద్దరు స్టాఫ్ నర్సులు, లేబర్ రూమ్ నర్సు, ఏఎన్ఎం, నర్సింగ్ సూపరింటెండెంట్, మెడికల్ సూపరింటెండెంట్ల నుంచి లిఖితపూర్వకంగా లెటర్లు తీసుకున్నామని, వాటిని కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని పేర్కొన్నారు. వేటుపైనే సర్వత్రా చర్చ ఈ కేసుకు సంబంధించి ఎవరిపై వేటు పడుతుందోనన్న భయం ఇప్పుడు వైద్యశాల సిబ్బందిని వెంటాడుతోంది. ఆస్పత్రిలో ఇదే పెద్ద చర్చనీయాంశంగా మారింది. వైద్యాధికారి చేసిన తప్పుకు తాము ఏం చేస్తామంటూ కొందరు స్టాఫ్‌నర్సులు జిల్లా కోఆర్డినేటర్ ముందు బహిరంగంగానే వాపోయారు. విషయాలన్నీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని డీసీ చెప్పడంతో అటు నర్సులు, ఇటు వైద్యుల్లో కలవరం మొదలైంది. బాధ్యులపై వేటుపడితేనే వైద్యశాలకు మహార్దశ పడుతుందని రోగులు స్పష్టంచేస్తున్నారు. ఉద్యోగమంటే సంతకాలు చేసి వెళ్లడమా: డీసీ ఆగ్రహం ‘వచ్చినప్పుడల్లా వాగుతూనే ఉన్నా. మీలో మార్పు లేదు. జిల్లాలోనే బాపట్లలాంటి అధ్వానసెంటర్ను నేనెక్కడా చూడలేదు. కనీసం నెలలో నాలుగైదు సార్లు వస్తున్నా. మాకేం పనుల్లేక వస్తున్నారనుకుంటున్నారా. చెప్పిన వాటిలో ఒక్కపనినైనా కచ్చితంగా చేస్తున్నారా. ఉద్యోగం అంటే సంతకాలు చేసి వెళ్లిపోవడమా.’ అని శ్రీదేవి ఆస్పత్రి సిబ్బందిపై మండిపడ్డారు. ఆమె ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టాక ఆగ్రహం వ్యక్తంచేశారు. పది రోజుల కిందట తాను వచ్చినప్పుడు స్కానింగ్ సకాలంలో తీసేలా చూడాలని, ఫ్యాన్లకు మరమ్మతులు చేయించాలని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న కేసులు మినహా మిగిలిన అన్ని కేసులకు ఇక్కడే వైద్యసేవలు అందించాలని ఆదేశించినా.. ఒక్కటీ ఎందుకు అమలవడంలేదని సిబ్బందిని నిలదీశారు. నెలరోజులుగా ఆస్పత్రిలో ఎన్ని ఆపరేషన్లు చేశారు.. ఎన్ని కేసులు రిఫర్ చేశారనే విషయాలను రికార్డుల్లో రాశారా అని ప్రశ్నించారు. -
ఓటు హక్కు ప్రాధాన్యం గుర్తించాలి
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్:ఓటు హక్కు ప్రాధాన్యం గుర్తించి ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ సూచించారు. అమరావతిరోడ్డులో నగరాలులోని నవీన విద్యాలయంలో సోమవారం ఓటర్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో నగరాల్లో 65 శాతం మంది ప్రజలే ఓటింగ్‌లో పాల్గొన్నారని, గ్రామీణ ప్రాంతాల్లో 80 శాతం పోలింగ్ నమోదు కాగా, నగరానికి చేరువలో ఉన్నా ఇక్కడ తక్కువ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం విచారకరమని తెలిపారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎవ్వరూ నచ్చని పక్షంలో దానిని వ్యక్తపరిచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలపై ప్రత్యేక బటన్ కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. సాధారణ ఎన్నికలకు వారం రోజుల ముందుగానే బూత్ స్థాయి అధికారులు ఇంటిం టికీ తిరిగి ఓటర్లకు స్లిప్పులు అందజేయాలని ఆదేశించారు. పోలింగ్ జరిగే రోజున వచ్చే వారికి పోలింగ్ కేంద్రం వద్ద స్లిప్పులు అందజేయాలన్నారు. నగరాలులోని బూత్ స్థాయి అధికారి ఓ బూత్‌లో 1200 మంది ఓటర్లు ఉండగా, వారిలో 200 మంది వేసవి సెలవుల కారణంగా వివిధ ప్రాంతాలకు వెళ్లారని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ వారి పూర్తి వివరాలు సేకరించి, ఓటు వేసేందుకు వచ్చిన సమయంలో తగిన ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాలని సూచించారు. సదస్సుకు హాజరైన బూత్ స్థాయి అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, రిటైర్డు ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గుంటూరు చౌత్రా సెంట ర్లోని చలమయ్య జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో డీఆర్వో కె. నాగబాబు, ఆర్డీవో బి.రామమూర్తి, నగరపాలక సంస్థ కమిషనర్ పి.నాగవేణి పాల్గొన్నారు. లాడ్జి సెంటర్లో ... పటిష్ట రాజ్యాంగ రూపకల్పనతో దేశానికి సార్వభౌమాధికారం కల్పించిన అంబేద్కర్ స్ఫూర్తితో సమ సమాజ స్థాపనకు నడుం బిగించాలని జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ పిలుపునిచ్చారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం లాడ్జి సెంటర్లోని ఆయన విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో పౌరులందరికీ సమాన హక్కులు దక్కాలని ఆశించిన అంబేద్కర్ ఆశయాలు అనుసరణీయమన్నారు. కార్యక్రమంలో డీఆర్వో కె. నాగబాబు, ఆర్డీవో బి.రామమూర్తి పాల్గొని అంబేద్కర్‌కు నివాళులర్పించారు. -
మలిదశలో మరింత జోరు
సాక్షి, గుంటూరు: మలి విడత పరిషత్తు ఎన్నికల్లో ఓటర్లు మరింత చైతన్యం కనబరిచారు. ఎండ తీవ్రతను కూడా లెక్క చేయకుండా ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. తొలిదశలో 85.10 శాతం పోలింగ్ నమోదు కాగా శుక్రవారం జరిగిన రెండో విడత ఎన్నికల్లో సగటున 85.79 శాతం నమోదైంది. గుంటూరు డివిజన్లో 87.01 శాతం, గురజాల డివిజన్లో 83.26 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 28 మండలాల్లో జరిగిన రెండో దశ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తుళ్ళూరు మండలంలో అత్యధికంగా 91.18 శాతం నమోదు కాగా, అత్యల్పంగా గురజాల మండలంలో 80.34 శాతం నమోదైంది. ఈ రెండు డివిజన్లలో మొత్తం 11,30,636 మంది ఓటర్లుంటే, 9,69,979 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ సరళిని పరిశీలించిన అధికారులు.. సత్తెనపల్లి నియోజకవర్గంలోని కంటెపూడి, ధూళిపాళ్లలో పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టరు ఎస్.సురేశ్‌కుమార్ పరిశీలించి పోలింగ్ సరళి తెలుసుకున్నారు. పల్నాడు ప్రాంతమైన మాచర్లలో జిల్లా కలెక్టరు, రూరల్ ఎస్పీలు మకాం వేసి పర్యవేక్షించారు. మంగళగిరి రూరల్ మండలంలో పోలింగ్ సరళిని అర్బన్ ఎస్పీ గోపీనాథ్, జేసీ వివేక్‌యాదవ్‌లు పరిశీలించారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కండ్లకుంటలోను, వైఎస్సార్ సీపీ గుంటూరు, కృష్ణా జిల్లాల సమన్వయకర్త ఆళ్ళ రామకృష్ణారెడ్డి స్వగ్రామం పెదకాకానిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీ, వైఎస్సార్ సీపీ శ్రేణుల ఘర్షణ.. శుక్రవారం నాటి ఎన్నికలు కొన్ని చోట్ల ప్రశాంతంగానే జరిగినా మరికొన్ని చోట్ల ఉద్రిక్తతకు దారితీశాయి. గుంటూరు రూరల్ మండలం లాలుపురంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మూకుమ్మడిగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై రాళ్ళ దాడి చేశారు. ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో పోలింగ్ బూత్ వద్ద టీడీపీ, వైఎస్సార్ సీపీ శ్రేణులు ఘర్షణకు దిగారు. పెదకూరపాడు నియోజకవర్గంలోని అచ్చంపేట మండలం గ్రంధశిరిలోనూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి. ఇక్కడ దాడులకు పాల్పడిన టీడీపీ కార్యకర్తలే ఆందోళనలు నిర్వహించడ ం గమనార్హం. తాడేపల్లి మండలం గుండిమెడలో టీడీపీ సర్పంచి కాసరనేని లలిత ఓటర్లను పోలింగ్ కేంద్రం వద్దే అభ్యర్థించడంపై వైఎస్సార్ సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ నేతలతో ఘర్షణకు దిగారు. పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఇదే మండలంలో చిర్రావూరులో చెట్టు కింద నిలబడి ఉన్న వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థి ధనేకుల బ్రహ్మానందంను పోలీసులు అకారణంగా లాక్కెళ్లి జీపెక్కించారు. స్థానికులు పోలీసుల్ని అడ్డగించి నినాదాలు చేయడంతో బ్రహ్మానందంను వదిలి అతని వద్ద ఉన్న డబ్బు రూ.12 వేలు తీసుకెళ్లారు. పెనుమాకలో టీడీపీ నేతలు డబ్బు పంచుతూ పోలీసులకు చిక్కారు. మంగళగిరి రూరల్ మండలం కురగల్లులో టీడీపీ నేతలు పోలీసులపై దాడికి యత్నించారు. మాచర్లలో నేతల గృహ నిర్బంధం.. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ళలో పోలింగ్ అధికారుల వద్ద తొలగించిన జాబితా లేకపోవడంతో ఆ జాబితాలోని ఓటర్లు కూడా ఓట్లు వేశారు. ముప్పాళ్ల మండలం తురకపాలెంలో బ్యాలెట్ బాక్సులో నీళ్లు పోసేందుకు కొందరు ప్రయత్నించారు. మాచర్ల నియోజకవర్గంలో అన్ని పార్టీల నేతల్ని గృహ నిర్భంధం చేశారు. దుర్గి మండలం శ్యామరాజుపురం, ఆత్మకూరు గ్రామాలకు సంబంధించి బ్యాలెట్ పేపర్లు తారుమారు కావడంతో శ్యామరాజు పురంలో రాత్రి 8 గంటల వరకు పోలింగ్ సాగింది. తాడికొండలో టీడీపీకి చెందిన కొందరు దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డగించారు. -
రేపే సార్వత్రిక సైరన్
సాక్షి, గుంటూరు: జమిలి ఎన్నికలకు శనివారం సైరన్ మోగనుంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు ఎస్.సురేశ్‌కుమార్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అనంతరం అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అసెంబ్లీకి ఆయా నియోజకవర్గాల్లోని రిటర్నింగ్ అధికారుల వద్ద, పార్లమెంటు అభ్యర్థులు జిల్లా కేంద్రంలో నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. గుంటూరు పార్లమెంటు స్థానానికి కలెక్టరు, నరసరావుపేటకు జాయింట్ కలెక్టరు వివేక్‌యాదవ్‌లు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. గుంటూరు పార్లమెంటు అభ్యర్థులు గుంటూరులోని కలెక్టరు చాంబర్లో, నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థులు జేసీ చాంబర్లోనూ నామినేషన్లు దాఖలు చేయాలి. బాపట్ల పార్లమెంట్ నామినేషన్లు మాత్రం ఒంగోలులో దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐదు రోజులే అవకాశ ం.. నామినేషన్ల దాఖలుకు ఐదు రోజులు మాత్రమే అవకాశం ఉంది. 13, 14, 18 తేదీల్లో ప్రభుత్వం సెలవు రోజులు కావడంతో ఈ రోజుల్లో నామినేషన్లు స్వీకరించేది లేదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. దీంతో 12, 15, 16, 17, 19 తేదీల్లో మాత్రమే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ముగుస్తుంది. 21న నామినేషన్ల పరిశీలన, 23న ఉపసంహరణ ఉంటుంది. పోటీలో ఉండే అభ్యర్థులకు ఈ దఫా ఈసీ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అభ్యర్థులు తమ నామినేషన్లుతో పాటు అఫిడవిట్లు సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ దాఖలు చేసే సమయంలోనే తమ ఓటు ఎక్కడుందో తెలిపే ఓటరు జాబితా డూప్లికేట్ కాపీని అందించాలి. అఫిడవిట్లలో ప్రతి కాలమ్ పూరించాలని, లేకపోతే రిటర్నింగ్ అధికారి పరిశీలన సమయంలో తిరస్కరించే అధికారం ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ సురేశ్‌కుమార్ రిటర్నింగ్ అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు, తదితర అంశాలపై స్పష్టత ఇచ్చారు. వరుసగా మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్ని విజయవంతంగా నిర్వహించిన అధికార గణం సార్వత్రిక ఎన్నికల్ని సమర్ధవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. -
ఇద్దరు మున్సిపల్ కమిషనర్లపై వేటు
నరసరావుపేట, మాచర్ల మున్సిపల్ కమిషనర్లు వీరభద్రరావు, గిరికుమార్‌లను ఎన్నికల విధుల నుంచి తొలగిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ బుధవారం తెలిపారు. పురపాలక సంఘాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల పరిశీలనలో అవకతవకలకు పాల్పడినట్లు రుజువు కావడంతో వీరిపై వేటు పడినట్లు సమాచారం. నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలోని 11 వార్డులో మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి అనుచరుడు వేలూరి సుబ్బారెడ్డి నామినేషన్‌ను తొలుత తిరస్కరించినట్లు ప్రకటించిన కమిషనర్ వీరభద్రరావు ఒత్తిడులకు తలొగ్గి తిరిగి అనుమతించేందుకు ప్రయత్నించిన విషయం విధితమే. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్ధి ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్ధి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు అర్ధరాత్రి వరకూ మున్సిపల్ కార్యాలయంలో ఆందోళన చేపట్టడంతో చివరకు తిరస్కరించినట్లు ప్రకటించారు. ఈ విషయంపై సీరియస్ అయిన ఎన్నికల సంఘం వీరభద్రరావును ఎన్నికల విధుల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా మాచర్ల మున్సిపాలిటీ పరిధిలోని 21, 22 వార్డుల్లో అన్నీ పార్టీల అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించడంతో అన్నీ పార్టీల నాయకులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. దీనికితోడు 28వ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్ధి నామినేషన్‌ను తిరస్కరించడంపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వీటన్నింటినీ విచారించిన ఎన్నికల సంఘం మాచర్ల మున్సిపల్ కమిషనర్ గిరికుమార్‌ను ఎన్నికల విధుల నుంచి తొలగించారు. ఈ రెండు చోట్ల కొత్త కమిషనర్లను ఎన్నికల అధికారులుగా నియమించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఒక ప్రభుత్వ వైద్యునితోపాటు నలుగురు అంగన్వాడీలపై సస్పెన్షన్ వేటు మాచర్ల పట్టణంలో ఈ నెల 14వ తేదీన ఓపార్టీ అభ్యర్ధి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారని ‘సాక్షి’ ఫోటోతో కథనాన్ని ప్రచురించింది. దీంతో విచారణ జరిపిన ఎన్నికల సంఘం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అతిక్రమించినందుకు మాచర్ల కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ నల్లూరి కుమారస్వామిని విధుల నుంచి సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా ఈ నెల 14వ తేదీన తెనాలిలో జరిగిన కాంగ్రెస్‌పార్టీ అభ్యర్ధి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న నలుగురు అంగన్వాడీ కార్యకర్తలపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అంగన్వాడీ కార్యకర్తలు డి.అనూష, ఆర్.మధులత, ఎ.అరుణశ్రీ, వై.రాజేశ్వరిలను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. -
ఓటెత్తిన చైతన్యం
సాక్షి, గుంటూరు: ఈ ఏడాది 4వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని శనివారం జిల్లాలో ఘనంగా నిర్వహించనున్నారు. 2013 జనవరి 15న ప్రచురించిన తుది జాబితాలో జిల్లాలో 33,61,476 మంది ఓటర్లు వున్నారు. శుక్రవారం నాటికి మొత్తం ఓటర్లు 35,32,241 మంది వున్నారు. వీరందరికీ ఫొటో గుర్తింపు కార్డు ఇవ్వడంతో పాటు ఫొటో ఓటరు జాబితా రూపకల్పన ఎన్నికల కమిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లాలో ఇప్పటికే 34 లక్షల మందికి ఫొటో గుర్తింపు కార్డులు (ఎపిక్ కార్డులు) ఉన్నాయి. కొత్తగా చేరే వారికీ ఫొటో గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం రోజైన శనివారం పోలింగ్ బూత్‌కు ఐదుగురికి పాన్ కార్డు తరహాలో ప్లాస్టిక్ కోటెడ్ ఫొటో ఓటరు గుర్తింపు కార్డులను పంపిణీ చేయనున్నారు. హైదరాబాదు నుంచి ప్రత్యేకంగా ఈ కార్డులు తెప్పించనున్నారు. వీటిని ఓటర్లకు అందించడంతో పాటు వృద్ధులైన ఓటర్లను, సమర్థంగా పనిచేసిన బూత్ లెవల్ అధికారులను సన్మానించనున్నారు.ఇందుకోసం నియోజకవర్గంలో ఇరువురు బీఎల్ఓలను ఎంపిక చేశారు. నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని శనివారం గుంటూరులో జిల్లా కలెక్టరు ఎస్.సురేశ్‌కుమార్ ఆర్భాటంగా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఉదయం 7 గంటలకే పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి పాతబస్టాండ్ వద్ద ఉన్న ఉర్దూ స్కూల్ వరకు 2 కే రన్ నిర్వహించనున్నారు. అనంతరం మానవహారంతో పాటు వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రంగోలి, వివిధ రకాల పోటీలు జరపను న్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఓటరు చైతన్య రథాలు పర్యటించాయి. 31న ఓటర్ల తుది జాబితా ప్రచురించనున్నారు. మొత్తం ఓటర్ల సంఖ్యతో పోల్చితే జిల్లా రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉంది. ఓటర్ల జాబితాకు తుదిమెరుగులు ఓటర్ల తుది జాబితా ప్రచురణకు అధికార యంత్రాంగం తుది మెరుగులు దిద్దుతున్నారు. తుది జాబితా ప్రచురించిన వెంటనే ఓటరుగా నమోదు చేసుకున్న వారు ఓటరు గుర్తింపు కార్డు పొందేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఓటరుగా నమోదు చేసుకున్న పేరును పోస్టాఫీసు/రేషన్ దుకాణాలు/పంచాయతీ/వార్డు/మండల/మున్సిపల్ ఆఫీసుల్లో లేదా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ www.ceoandhra.nic.in లో పరిశీలించుకోవచ్చు. గుర్తింపు కార్డు కోసం రెండు పాస్ పోర్టు సైజు ఫొటోలతో పాటు వయస్సు ధ్రువీకరణ పత్రం కానీ స్కూల్/కాలేజీ సర్టిఫికెట్, తల్లిదండ్రుల అఫిడవిట్ జతచేసి పొందే వీలుంది. జిల్లా కలెక్టరేట్ నుంచి అందిన సమాచారం మేరకు తుది జాబితాలో చేరనున్న వివరాలివే... జిల్లాలో ఈ-రిజిస్ట్రేషన్, మాన్యువల్ కలిపి చేర్పులకు 2,71,960 దరఖాస్తులు అందాయి. 2,70,908 దరఖాస్తుల్ని అప్డేట్ చేసి వీటిలో 1,89,168 దరఖాస్తులకు జాబితాలో చోటు కల్పించి 73,762 దరఖాస్తుల్ని తిరస్కరించారు. ఓట్ల తొలగింపులకు 94,384 దరఖాస్తులు అందగా, 94,306 దరఖాస్తుల్ని అప్డేట్ చేసి 73,659 దరఖాస్తులు అంగీకరించి, 16,882 దరఖాస్తుల్ని తిరస్కరించారు. సవరణలకు 30,801 దరఖాస్తులు అందితే, ఇప్పటివరకు 26,490 డేటా అప్డేట్ చేసి 18,696 అంగీకరించి, 7,391 తిరస్కరించారు. మార్పులకు 8,365 దరఖాస్తులు అందగా, 7,463 దరఖాస్తుల్ని అప్డేట్ చేశారు. వీటిలో 6,334 అంగీకరించి, 1,098 తిరస్కరించారు. -
31న ఓటర్ల తుదిజాబితా
సాక్షి, గుంటూరు: ఓటర్ల తుది జాబితా ప్రచురణకు గడువు కోరడంతో ఎన్నికల కమిషన్ ఈ నెల 31న ప్రచురణకు ఆదేశాలిచ్చిందని, 17వరకు ఓటర్ల చేర్పులు, మార్పులు, తొలగింపులపై విచారణ జరుగుతుందని జిల్లా కలెకర్ ఎస్.సురేశ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండు రోజుల్లో యంత్రాంగమంతా భౌతిక పరిశీలన పూర్తిచేయాలని, 18 నుంచి 30 వరకు కంప్యూటరైజేషన్, డేటా ఎంట్రీ పూర్తిచేసి తుది జాబితా ఎన్నికల కమిషన్ అనుమతి మేరకు ప్రచురిస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా 3.25 లక్షల వరకు క్లెయిమ్స్ వచ్చాయని, ఇప్పటికే 80 శాతం వరకు పరిశీలన పూర్తయిందన్నారు. సుమోటో కింద 39 వేల బోగస్ ఓట్లు తొలగించడం జరుగుతుందని, ఏవైనా అభ్యంతరాలు, తొలగింపులు ఉంటే 17 లోపే జరగాలన్నారు. తుది జాబితా ప్రచురించిన తర్వాత తొలగింపులు కుదరవని స్పష్టం చేశారు. ఈ నెల 18న జిల్లాలోని ఆరు పంచాయతీలు, 45వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉందని, అయి తే నామినేషన్ల ఘట్టం పూర్తయిన తర్వాత నాలుగు పంచాయతీల సర్పంచ్‌లు, 29 వార్డులకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయని వివరించారు. పెదకూరపాడు మండలం ముస్సాపురం, ముప్పాళ్ళ మండలం కుందూరివారిపాలెం, పొన్నూరు మండలం కసుకర్రు, మంగళగిరి మండలం బేతపూడి గ్రామాల్లో సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈ నాలుగు సర్పంచ్ స్థానాలకు పది మంది, 29 వార్డులకు 38 మంది బరిలో ఉన్నారన్నారు. ముత్తాయపాలెం, రామచంద్రపురం సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదన్నారు. వీఆర్వో, వీఆర్ఏ పోస్టులు కేవలం మెరిట్ ఆధారంగానే ఎంపిక జరుగుతుందని, సిఫార్సులతో జరగవని స్పష్టంచేశారు. పోస్టులు ఇప్పిస్తామనే ప్రచారం తన దృష్టికి వచ్చిందని, అభ్యర్థులు ఎవరూ మోసపోవద్దని కలెక్టరు చెప్పారు. ఇక ప్రజాదర్బార్..ఇకపై డివిజన్ స్థాయిలో ప్రజావాణి నిర్వహిస్తామని, ప్రజాదర్బార్ పేరుతో ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ నెల 20న గురజాల రెవెన్యూ డివిజన్లో జిల్లాస్థాయి అధికారులంతా హాజరై పథకాలపై సమీక్ష చేస్తారన్నారు. డయల్ యువర్ ఆఫీసర్ కార్యక్రమం ప్రతిరోజూ జరుగుతుందని, 9.30 గంటల నుంచి 10.30 వరకు సెల్ నంబరు 98669 92627కు ఫిర్యాదిదారులు ఫోన్ చేయవచ్చన్నారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్‌గా తాను అన్ని అంశాలపై ఈ కార్యక్రమంలో పాల్గొంటానని, ఒకటవ, మూడవ మంగళవారాల్లో జాయింట్ కలెక్టర్ రెవెన్యూ అంశాలు, సివిల్ సప్లయిస్, ఆధార్, మీ సేవ, లీగల్ మెట్రాలజీ, సినిమాటోగ్రఫీపై హాజరవుతారని, ఫిర్యాదులు చేయవచ్చన్నారు. -
ఓటరు దరఖాస్తులకు 10లోగా పరిష్కారం
గుంటూరుసిటీ, న్యూస్‌లైన్: జిల్లాలోని ఓటరు నమోదు, మార్పులకు సంబంధించి స్వీకరించిన దరఖాస్తులను ఈనెల 10వ తేదీలోగా పరిష్కరించాలని ఎన్నికల సంఘం నియమించిన ఓటరు నమోదు పరిశీలకురాలు అనితా రాజేంద్ర అధికారులకు స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో జరిగిన సమావేశంలో ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో ఆమె మాట్లాడారు. దరఖాస్తులను కూలంకషంగా పరిశీలించాలని, బీఎల్వోలను, వీఆర్వోలను, పంచాయతీ కార్యదర్శులను ఇంటింటికి ఓటరు తనిఖీకి పంపాలన్నారు. ఏవిధమైన పొరపాట్లు జరిగినా అందుకు ఎన్నికల సంఘం తీసుకునే చర్యలకు అందరూ బాధ్యులు కావలసి ఉంటుందన్నారు. పదేళ్ల కిందట ఓటరు నమోదు ప్రక్రియలో జరిగిన పొరపాటుకు ఒక జిల్లా కలెక్టరుపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలను ఆమె అధికారులకు గుర్తు చేశారు. ఓటరు నమోదు ప్రక్రియలో నియమించిన ప్రతీ అధికారి ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తున్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇదేనెల 16వ తేదీన ఓటర్లు తుది జాబితాను ప్రకటించాలని, కొత్తగా నమోదు చేసుకున్న వారికి ఈనెల 25న జరిగే ‘జాతీయ ఓటర్ల దినోత్సవం’ రోజున ఫొటో గుర్తింపు కార్డులను పంపిణీ చేయవలసి ఉంటుందని తెలిపారు. ఇప్పటికే ఎన్నికల సంఘం వివిధ కారణాల వల్ల రెండు సార్లు పరిశీలించి పరిష్కరించేగడువును పొడిగించిందని, ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగింపు ఉండదని ఆమె స్పష్టం చేశారు. అభ్యంతరాల పరిశీలన పూర్తికాగానే డేటా అప్డేషన్ జరగాలన్నారు. ఓటరు నివాసం ఉన్నచోటే ఓటుహక్కు కల్పించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ మాట్లాడుతూ స్వీకరించిన క్లెయింలను, అభ్యంతరాలను ఈనెల 10వ తేదీన పరిశీలన, పరిష్కారం పూర్తిచేసి డేటా అప్డేట్ చేయిస్తామని చెప్పారు. 16వ తేదీన ఓటర్ల తుదిజాబితా విడుదలకు సిద్ధం చేస్తామన్నారు. కళాశాల లేదా ప్రైవేటు వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థుల విషయంలో వారు కోరుకున్న చోట అంటే వారి తల్లిదండ్రులు ఉన్నచోటగాని,చదువుకుంటున్న ప్రాంతాల్లోగానీ ఓటుహక్కు కల్పించాలన్నారు. పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితుల విషయంలో కొత్త కాలనీలకు తమ కుటుంబంతో సహా పూర్తిగా తరలిన వారికే ఆ కాలనీలో ఓటు హక్కు కల్పించాలని చెప్పారు. సమావేశంలో జేసీ వివేక్‌యాదవ్, అదనపు జేసీ కె.నాగేశ్వరరావు, డీఆర్వో కె.నాగబాబు, 17 నియోజకవర్గాల ఈఆర్వోవోలు, సహాయ ఈఆర్వోవోలు తదితరులు పాల్గొన్నారు. అవకతవకలపై విచారణ జరిపించండి.. కొరిటెపాడు: ఓటర్ల నమోదు, తొలగింపుల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని టీడీపీ నాయకులు శుక్రవారం ఆర్ అండ్ బి అతిథి గృహంలో జిల్లా ఎన్నికల పరిశీలకురాలు అనితా రాజేందర్, కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్‌లను కలసి వినతి పత్రం సమర్పించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ కింది స్థాయి రెవెన్యూ అధికారుల అవినీతి, పక్షపాత వైఖరి కారణంగా ఓటర్ల నమోదు కార్యక్రమం పక్కదారి పడుతోందని, అధికార పార్టీ నాయకుల ఒత్తిడిలకు లొంగి టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. వేమూరు, వట్టిచెరుకూరు, నాదెండ్ల, సత్తెనపల్లి, పొన్నూరు, దుగ్గిరాల తదితర మండలాల్లో అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయని, తగు విచారణ జరిపించాలని కోరారు. అనిత రాజేందర్ స్పందిస్తూ విచారణ జరిపించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మన్నవ వెంట ఆ పార్టీ నాయకులు కనగాల చిట్టిబాబు, సగ్గెల రూబెన్, జి.దయారత్నం తదితరులు ఉన్నారు.