కొత్త సారధి కొలువుదీరే వేళ..
సాక్షి, గుంటూరు : జిల్లా పరిషత్ పీఠాన్ని నేడు కొత్త సార ధి అధిరోహించనున్నారు. శనివారం జెడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక జరగనుంది. దీంతో సుమారు మూడేళ్ల పాటు సాగిన ప్రత్యేక అధికారుల పాలనకు తెర పడనుంది. ఉదయం 10 గంటలకు తొలుత కోఆప్షన్ సభ్యుల నామినేషన్‌తో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ వ్యవహరిస్తారు. జిల్లా పరిషత్ పాలక వర్గం గడువు 2011 జూలై 22వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి జిల్లాలో ప్రత్యేకాధికారుల పాలనే సాగుతోంది. జూలై 23, 2011 నుంచి జూలై 15, 2012 వరకు అప్పటి కలెక్టర్ వి.ఎన్ విష్ణు ప్రత్యేకాధికారిగా వ్యవహరించారు.
ఆయన బదిలీ నేపథ్యంలో కలెక్టర్‌గా వచ్చిన ఎస్.సురేశ్ కుమార్ జూలై 16 నుంచి ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలు నిర్వహించకుండా వాయిదాలు వేస్తూ కాలయాపన చేసిన గత కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో విధి లేని పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ చేపట్టింది. ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల తరువాత సాధారణ ఎన్నికలు జరుగుతుండటంతో ఫలితాలను నిలుపుదల చేశారు.
మే 13న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటించారు. రాష్ట్ర విభజనతో పాటు, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికల్లో జాప్యం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికలు జరిగిన రెండు నెలలకు కొత్త పాలక వర్గాలు కొలువు తీరుతున్నాయి. అధికారులు ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జెడ్పీ కార్యాలయానికి రంగులు వేసి ముస్తాబు చేశారు. కొత్త పాలక వర్గానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. జెడ్పీ క్యాంపు కార్యాలయం, అతిథి గృహానికి మరమ్మతులు చేపట్టారు.
జెడ్పీ పీఠంపై ముస్లిం మహిళ...
జిల్లాలో మొత్తం 57 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. ఇందులో 34 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. వైఎస్సార్ సీపీ 23 స్థానాలు దక్కించుకుంది. దీంతో అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలు టీడీపీ ఖాతాలోకి వెళ్లనున్నాయి. జిల్లా పరిషత్ అధ్యక్ష పదవిని టీడీపీ మొదటి రెండున్నరేళ్లు ముస్లింలకు, మరో రెండున్నరేళ్లు బీసీలకు కేటాయించింది. కాకుమాను జెడ్పీటీసీ సభ్యురాలు షేక్ జానీమూన్‌కు అధ్యక్ష పదవి వరించనుంది. ఉపాధ్యక్షుడిగా తాడికొండ జెడ్పీటీసీ పభ్యుడు వడ్లపూడి పూర్ణచంద్రరావును ఎంపిక చేశారు. బాపట్ల, మాచర్ల నియోజకవర్గాల నుంచి కోప్షన్ సభ్యులుగా ఎన్నకోవాలని నిర్ణయించారు.
ఎన్నిక ప్రక్రియ జరిగేదిలా..
ఉదయం 10 గంటలకు కో ఆప్షన్ సభ్యుల ఎన్నికతో ప్రక్రియ ప్రారంభమవుతుంది. సభ్యులు నామినేషన్ వేసేటప్పుడు ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులు ప్రతిపాదించాలి. తొలుత వీరిద్దరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అధ్యక్ష, ఉపాధ్యక్షుల బి ఫారాల వివరాలను ఆయా పార్టీల అధ్యక్షులు సమర్పిస్తారు.
10 గంటల తరువాత కో-ఆప్షన్ సభ్యులుగా నామినేషన్ వేసిన వారి జాబితా ప్రకటిస్తారు.
10 గంటల నుంచి 12 వరకు నామినేషన్ల పరిశీలన, అనంతరం అర్హులైన అభ్యర్థుల జాబితా ప్రకటన.
మధ్యాహ్నం 1 గంటకు ప్రిసైడింగ్ అధికారి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జెడ్పీటీసీల సర్వ సభ్యసమావేశం నిర్వహిస్తారు. సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 50 శాతం మంది సభ్యులు హాజరైతేనే ఎన్నికను నిర్వహిస్తారు.
అధ్యక్ష, ఉపాధ్యక్షుల స్థానానికి ఒకే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేస్తే వారిని ఎన్నికైనట్లుగా ప్రిసైడింగ్ అధికారి ప్రకటిస్తారు.
ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైతే మధ్యాహ్నం 3గంటలకు ఎన్నిక జరుగుతుంది.
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సమావేశానికి అనుమతిస్తారు.
రిటర్నింగ్ అధికారులు జెడ్పీటీసీ సభ్యులుగా ఎన్నికైనట్లు ఇచ్చిన ధ్రువపత్రాలను చూపిన తరువాత పోలీసులు సభ్యులను అనుమతిస్తారు.