సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో నియమితులైన బీఆర్‌ఎస్ నేతలు రాజీనామా బాట పట్టారు. తమ పదవులనుంచి వైదొలగుతూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు సంబందిత శాఖల కార్యదర్శులకు రాజీనామా లేఖలు పంపిస్తున్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ పదవికి బోయినపల్లి వినోద్ కుమార్, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వైస్ చైర్మన్ పదవికి జ్వాల నరసింహరావు వనం సోమవారం రాజీనామా చేశారు.
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు పదవికి రిటైర్డు ఐఏఎస్ అధికారి రమణాచారి, తెలంగాణ గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ తమ పదవులకు రాజీనామా చేశారు. వీరితో పాటు బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పలు ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లుగా నామినేటైన నేతలు కూడా వైదొలగుతున్నారు. డాక్టర్ ఆంజనేయగౌడ్ (స్పోర్ట్స్ అథారిటీ), సోమ భరత్‌కుమార్ (డెయిరీ డెవలప్‌మెంట్), జూలూరి గౌరీశంకర్ (తెలంగాణ సాహిత్య అకాడమీ), పల్లె రవికుమార్‌గౌడ్ (కల్లుగీత కార్పొరేషన్), మేడె రాజీవ్‌సాగర్ (టీఎస్ ఫుడ్స్), డాక్టర్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ (గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ), గూడూరు ప్రవీణ్ (టెక్స్‌టైల్), గజ్జెల నగేష్ (బేవరేజెస్), అనిల్ కూర్మాచలం (ఫిలిం డెవలప్‌మెంట్), రామచంద్ర నాయక్ (ట్రైకార్), వలియా నాయక్ (గిరిజన ఆర్థిక సహకార సంస్థ), వై.సతీష్ రెడ్డి (రెడ్‌కో), డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ (రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ), సర్దార్ రవీందర్‌సింగ్ (పౌర సరఫరాలు), జగన్మోహన్‌రావు (టెక్నాలజికల్ సరీ్వసెస్), మన్నె క్రిశాంక్ (మినరల్ డెవలప్‌మెంట్) రాజీనామా చేసిన వారిలో ఉన్నారు.
వైదొలిగిన ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు, టాస్క్‌ఫోర్స్ ఓఎస్‌డీ రాధాకిషన్‌రావు
మావోయిస్టు ఆపరేషన్స్‌లో కీలకమైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ) చీఫ్‌గా పనిచేస్తున్న ఓఎస్‌డీ టి.ప్రభాకర్‌రావు సోమవారం తన పోస్టుకు రాజీనామా చేశారు. అలాగే, హైదరాబాద్ టాస్క్ఫోర్స్ ఓఎస్‌డీగా పనిచేసిన రాధాకిషన్‌రావు సైతం తన పోస్టుకు రాజీనామా చేశారు.
ఏఏజీ రామచంద్రరావు రాజీనామా
రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు తన పదవికి రాజీనామా చేశారు. శాసనసభ ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఆయన తన రాజీనామాను సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు. తొలిసారి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఆయన అదనపు ఏజీగా పనిచేశారు. అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కూడా రాజీనామా చేయనున్నట్లు సమాచారం.
ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ కూడా..
తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు రాజీనామా చేస్తున్నట్టు రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదిర్శకి పంపిన లేఖలో తెలిపారు. కొత్త సీఎండీలను నియమించే వరకు..జెన్‌కో సీఎండీగా ఆ సంస్థ డైరెక్టర్ ఎ.అజయ్‌కు, ట్రాన్స్‌కో సీఎండీగా సంస్థ జేఎండీ సి.శ్రీనివాసరావుకు అదనపు బాధ్యతలు అప్పగించాలని ఆయన సిఫారసు చేశారు. అయితే ప్రభాకర్ రావు రాజీనామాను ఇంకా ఇంధన శాఖ ఆమోదించలేదని తెలిసింది.
కాగా, ఏపీ నుంచి వచ్చిన విద్యుత్ ఉద్యోగులకు పోస్టింగ్‌లు ఇవ్వాల్సి రావడంతో ఏడాది కింద రివర్షన్లు పొందిన తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు ఎన్నికలైన వెంటనే పదోన్నతులు కల్చిస్తామని ప్రభాకర్‌రావు హామీనిచ్చారనీ, ఇప్పుడు ఆయన రాజీనామాతో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని బాధిత ఉద్యోగులు ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అయినా తమకు న్యాయం చేయాలంటూ సోమవారం ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment