ఆషాఢం తర్వాతే..! కేబినెట్‌ విస్తరణ, పీసీసీ, నామినేటెడ్‌ పదవుల భర్తీ | Congress high command decision on Postponement of cabinet expansion | Sakshi
Sakshi News home page

ఆషాఢం తర్వాతే..! కేబినెట్‌ విస్తరణ, పీసీసీ, నామినేటెడ్‌ పదవుల భర్తీ

Published Thu, Jul 4 2024 12:45 AM | Last Updated on Thu, Jul 4 2024 1:03 AM

బుధవారం ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్‌రెడ్డి, దీపాదాస్‌మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కె. కేశవరావు

బుధవారం ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్‌రెడ్డి, దీపాదాస్‌మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కె. కేశవరావు

కేబినెట్‌ విస్తరణ, పీసీసీ, నామినేటెడ్‌ పదవుల భర్తీ వాయిదా 

సమీకరణలు కుదరకపోవడంతో కాంగ్రెస్‌ హైకమాండ్‌ నిర్ణయం

జిల్లాలు, సామాజిక వర్గాల ప్రాతిపదికపై కుదరని ఏకాభిప్రాయం 

ఖర్గే, రాహుల్, కేసీలతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భేటీలో రాని స్పష్టత 

వారం, పదిరోజుల తర్వాత మరోమారు చర్చించే అవకాశం 

మంత్రివర్గ విస్తరణ తేలిన తర్వాతే పీసీసీ అధ్యక్షుడి నియామకం! 

ఈ రెండూ ముగిసిన తర్వాత ‘నామినేటెడ్‌’పై నజర్‌ 

అన్నీ ఆగస్టులోనే ఉండే అవకాశం ఉందంటున్న ఏఐసీసీ వర్గాలు

సాక్షి, న్యూఢిల్లీ:  సమీకరణలు కుదరలేదు. జిల్లాలు, సామాజిక వర్గాల ప్రాతిపదికపై ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదు. దీంతో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం, నామినేటెడ్‌ పదవుల భర్తీ ఆశలపై కాంగ్రెస్‌ అధిష్టానం తాత్కాలికంగా నీళ్లు చల్లింది. ఆయా అంశాలపై మరో వారం, పదిరోజుల తర్వాత తీరిగ్గా చర్చిద్దామంది. అప్పటివరకు వేచి చూడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సూచించింది. వాస్తవానికి జూలై మొదటి వారంలోనే కీలక పదవుల భర్తీ జరుగుతుందని సీఎం స్వయంగా ప్రకటించారు. ఆ మేరకు ముమ్మర కసరత్తు జరిగినా చివరకు అన్నీ వాయిదా పడ్డాయి. కేబినెట్‌ విస్తరణ సహా పదవుల పంపకాలన్నీ ఆషాఢ మాసం పూర్తయ్యాక ఆగస్టులోనే ఉండే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలంటున్నాయి. 

తాజా భేటీలోనూ తేలని సమీకరణలు 
రాష్ట్ర కేబినెట్‌లో ఖాళీలు పూరించడం, కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, నామినేటెడ్‌ పదవుల భర్తీపై గడిచిన వారం, పది రోజులుగా ముమ్మర కసరత్తు జరుగుతున్న విషయం తెలిసిందే. సీఎం రేవంత్‌రెడ్డి వారం కిందట కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఈ అంశాలపై చర్చలు జరిపారు. అధిష్టానం సైతం ఈ విషయమై రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్‌ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిల అభిప్రాయాన్ని  తీసుకుంది. 

తాజాగా బుధవారం కూడా ఈ అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ వచ్చిన రేవంత్‌రెడ్డి మరోమారు ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాం«దీ, కేసీలతో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు చర్చలు కొనసాగాయి. మంత్రివర్గంలోకి తీసుకునేందుకు పరిగణనలోకి తీసుకుంటున్నవారి పేర్లను మరోమారు పరిశీలించారు. ఇందులో మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి వాకిటి శ్రీహరి, నిజామాబాద్‌ జిల్లా నుంచి పి.సుదర్శన్‌రెడ్డి, నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బాలూనాయక్, రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్‌ రెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ప్రేంసాగర్‌రావు, వివేక్‌ల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఇందులో వాకిటి శ్రీహరి పేరుపై ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ మిగతా పేర్ల విషయంలో పీఠముడి నెలకొంది.  

ఇలాగైతే ఏం చేయాలి..? 
నిజామాబాద్‌ జిల్లా నుంచి పీసీసీ అధ్యక్ష రేసులో మహేశ్‌కుమార్‌ గౌడ్, గతంలో నిజామాబాద్‌ నుంచి ఎంపీగా ఉన్న మధుయాష్కీ గౌడ్‌లు ఉన్న దృష్ట్యా, ఒకవేళ వీరిలో ఒకరికి ఆ పదవి కట్టబెడితే, అదే జిల్లా నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న సుదర్శన్‌రెడ్డిని ఏమి చేయాలన్న దానిపై సందిగ్ధత నెలకొంది. దీనిపై నేతలు తర్జనభర్జన పడుతున్నారు. ఇక నల్లగొండ జిల్లాలో రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తే, ఇదే జిల్లా నుంచి ఇప్పటికే ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో కలిపి మొత్తం ముగ్గురు రెడ్లు మంత్రులవుతారు. 

ఒకవేళ ఆ అంశాన్ని పక్కన పెట్టినా, జిల్లా నుంచి ఎస్టీ ఎమ్మెల్యేగా ఉన్న బాలూనాయక్‌కు మంత్రి పదవి ఇవ్వడం కష్టంగా మారుతుంది. ఇక ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ఇద్దరు సీనియర్‌ నేతలు జి.వివేక్, ప్రేంసాగర్‌ రావుల విషయంలోనూ సందిగ్ధత నెలకొంది. భట్టి సహా ఇతర నేతలు మద్దతిస్తున్న వెలమ సామాజిక వర్గానికి చెందిన ప్రేంసాగర్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటే ఓసీ సామాజికవర్గం నుంచి మంత్రుల సంఖ్య పెరుగుతుంది. 

ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి మల్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి రేసులో ఉండగా, ఇక్కడ ఒక మైనార్టీకి అవకాశం కల్పించాలనే డిమాండ్‌ కూడా గట్టిగా ఉంది. దీంతో వీరి విషయంలోనూ నిర్ణయానికి రాలేకపోయారు. ఇలా పలు పేర్ల విషయంలో పలు సమీకరణాలు ముడిపడి ఉండటంతో నేతలు ఒక నిశి్చతాభిప్రాయానికి రాలేకపోయారు. ఈ దృష్ట్యానే కేబినెట్‌ విస్తరణ అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టాలని, వారం, పదిరోజుల తర్వాత దీనిపై చర్చిద్దామని హైకమాండ్‌ పెద్దలు ముఖ్యమంత్రికి చెప్పినట్లుగా కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.  

పీసీసీ సైతం వాయిదానే.. 
బుధవారం నాటి భేటీలో పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కూడా చర్చించినా, దీన్ని సైతం అధిష్టానం పెద్దలు తేల్చలేకపోయారు. అధ్యక్ష పదవిని బీసీ సామాజిక వరాŠిగ్నకి చెందిన సీనియర్‌ నేతలు మహేశ్, మధుయాష్కీలలో ఒకరికి కట్టబెట్టాలనే ఆలోచన చేసిప్పటికీ సమీకరణలు కుదరని దృష్ట్యా, ఎస్సీ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, సంపత్‌కుమార్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్‌ల పేర్లు కూడా మరోమారు చర్చకు వచ్చినట్లు తెలిసింది. 

దీంతో జిల్లాలు, సామాజిక వర్గాల సమీకరణలు, మంత్రివర్గ విస్తరణ తేలిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోవాలని అధిష్టానం భావించినట్లు తెలిసింది. ఇక కేబినెట్‌ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం పూర్తయ్యాకే ఇతర పదవుల భరీŠత్‌ అంశంపై హైకమాండ్‌ దృష్టి పెట్టే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 

కాంగ్రెస్‌ గూటికి కేకే 
– పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మల్లికార్జున ఖర్గే  
– కేకే అనుభవం కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తుందని వ్యాఖ్య  

సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం కేకేకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ లోక్‌సభా పక్ష నేత రాహుల్‌గాందీ, రా్ర‹Ù్టర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, సీఎం రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

కేకే రాకను స్వాగతించిన ఖర్గే, రాహుల్‌.. రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు పని చేయాలని సూచించారు. కాంగ్రెస్‌లో చేరికతో తిరిగి సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందని కేకే వ్యాఖ్యానించారు. ఈ భేటీ అనంతరం కేకే రాకను స్వాగతిస్తూ ఖర్గే ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. కేకే అనుభవం పార్టీని బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement