నరేందర్‌రెడ్డి, షబ్బీర్ అలీ, వేణుగోపాల్, మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: నామినేటెడ్ పోస్టుల భర్తీకి అధికార కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. ఇటీవల ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన ఆ పార్టీ, తాజాగా నలుగురు ముఖ్య కాంగ్రెస్ నేతలకు కేబినెట్ హోదా కల్పించింది. సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్‌రెడ్డిని సీఎం సలహాదారుడిగా (ప్రజా వ్యవహారాలు) నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
షబ్బీర్‌అలీ (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు), హర్కర వేణుగోపాల్ (ప్రొటోకాల్, ప్రజాసంబంధాలు)లను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా, మాజీ ఎంపీ మల్లు రవిని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. ఈ నలుగురికి కేబినెట్ హోదా కల్పిస్తూ విడివిడిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఎం రేవంత్ దావోస్ నుంచి రాగానే నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తారని కాంగ్రెస్ నేతల్లో చర్చ జరిగింది. అయితే సీఎం విదేశీ పర్యటన ముగించుకొని వస్తున్న ముందు రోజే ఈ ఉత్తర్వులు వెలువడడం గమనార్హం.
త్వరలోనే మాకు కూడా...! : మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా త్వరలోనే ఉంటుదన్న ఉత్సాహం కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. సీఎం దావోస్ నుంచి వచ్చిన తర్వాత ఒకట్రెండు రోజుల్లోనే పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను ప్రకటిస్తారని గాం«దీభవన్ వర్గాలంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా ఉండే ముఖ్యమైన కార్పొరేషన్లతో పాటు మొత్తం 9 లేదా 18 కార్పొరేషన్ పదవులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘రాష్ట్రంలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాం. చాలాకాలంగా అధికారిక పదవుల కోసం ఎదురుచూస్తున్నాం.
ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుల నియామకంతో మాకు కూడా త్వరలోనే పదవులు వస్తాయనే ఆశ చిగురించింది. నామినేటెడ్ జాబితా ఎప్పుడొస్తుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నాం.’అని కార్పొరేషన్ పదవుల ఆశావహుల లిస్టులో ముందు వరుసలో ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం గమనార్హం. రాష్ట్రస్థాయి పదవులతో పాటు నియోజకవర్గాల్లో ఎక్కువగా ప్రభావం ఉండే మార్కెట్ కమిటీల పదవులపై కూడా కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో కసరత్తు ప్రారంభించింది.
పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతకు జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ అయిన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నియమించిన మార్కెట్ కమిటీలను రద్దు చేస్తానని, కొత్త పాలకవర్గాల నియామకంపై ఎమ్మెల్యేలు, మంత్రులు కసరత్తు చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలోని కీలక పదవులైన మార్కెట్ కమిటీ నియామకాలు కూడా త్వరలోనే జరుగుతాయనే చర్చ కాంగ్రెస్ శ్రేణుల్లో జరుగుతోంది.
పలువురి అభినందనలు
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన వేం నరేందర్‌రెడ్డి, షబ్బీర్‌లీ, హర్కర వేణుగోపాల్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన మల్లురవిలకు పలువురు అభినందనలు తెలిపారు. ఆదివారం ఉదయం నుంచే వారి నివాసాలకు కాంగ్రెస్ నేతలు క్యూ కట్టారు. పలువురు మంత్రులు కూడా వేర్వేరు ప్రకటనల్లో వీరికి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ అధిష్టానం, సీఎం రేవంత్‌రెడ్డిలకు వేం, షబ్బీర్, హర్కర, మల్లురవిలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి రాష్ట్ర ప్రజలకు మేలు కలిగేలా ప్రయత్నిస్తామని వారు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment