మంగళగిరి రూరల్, న్యూస్‌లైన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ తెలిపారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట గతంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన యువగర్జన సభ జరిగిన మైదానంలోనే ఈ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్, ఐజీ పీవీ సునీల్ కుమార్, రూరల్ ఎస్పీ జె.సత్యనారాయణ ఆయా శాఖల అధికారులతో కలసి శుక్రవారం ఆయన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట మైదానాన్ని పరిశీలించి ఏర్పాట్లపై చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 70 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 50 ఎకరాల్లో సమావేశం, 20 ఎకరాల్లో హెలిప్యాడ్‌ను ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 5 లక్షల మంది తరలి వచ్చే అవకాశం వుండడంతో వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. టోల్‌గేట్ సమీపంలో గతంలో హిందూ చైతన్య శిబిరం నిర్వహించిన ప్రాంతంలోనూ, కొప్పురావూరు కేశవరెడ్డి స్కూల్ వెనుక ప్రాంతంలో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 5 వేల మంది పోలీసులతో గట్టి భద్రతా చర్యలను తీసుకుంటున్నామని చెప్పారు. సమావేశంలో ఎటువంటి తొక్కిసలాటలు జరుగకుండా ఇనుప బారికేడ్లను ఏర్పాటు చేయాలని, మైదానాన్ని చదును చేయించాలని కలెక్టర్ ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈని ఆదేశించారు. మైదానంలో వేదిక ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై ఆయన అధికారులతో చర్చించారు.
మైదానంలో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులు, పార్టీ ముఖ్య నేతలు ఏర్పాట్లను పరిశీలించేందుకు రానున్నారని, వారిచ్చే సూచనల మేరకు ఏర్పాట్లను పూర్తి చేస్తామని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో రామ్మూర్తి, అర్భన్ అదనపు ఎస్పీ ధరావత్ జానకి, రూరల్ అదనపు ఎస్పీ డి.కోటేశ్వరరావు, అర్బన్ ఎస్‌బీ డీఎస్పీ ప్రసన్నకుమార్, నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ ఎం మధుసూదనరావు, ట్రాఫిక్ డీఎస్పీ తిరుపాల్, ఎస్బీ సీఐ బండారు రాజశేఖర్ రూరల్ సీఐ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఏర్పాట్లు ముమ్మరం
Published Sat, May 31 2014 12:09 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement
Advertisement