గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్:ఓటు హక్కు ప్రాధాన్యం గుర్తించి ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ సూచించారు. అమరావతిరోడ్డులో నగరాలులోని నవీన విద్యాలయంలో సోమవారం ఓటర్ల అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో నగరాల్లో 65 శాతం మంది ప్రజలే ఓటింగ్‌లో పాల్గొన్నారని, గ్రామీణ ప్రాంతాల్లో 80 శాతం పోలింగ్ నమోదు కాగా, నగరానికి చేరువలో ఉన్నా ఇక్కడ తక్కువ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం విచారకరమని తెలిపారు.
ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎవ్వరూ నచ్చని పక్షంలో దానిని వ్యక్తపరిచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలపై ప్రత్యేక బటన్ కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. సాధారణ ఎన్నికలకు వారం రోజుల ముందుగానే బూత్ స్థాయి అధికారులు ఇంటిం టికీ తిరిగి ఓటర్లకు స్లిప్పులు అందజేయాలని ఆదేశించారు.
పోలింగ్ జరిగే రోజున వచ్చే వారికి పోలింగ్ కేంద్రం వద్ద స్లిప్పులు అందజేయాలన్నారు. నగరాలులోని బూత్ స్థాయి అధికారి ఓ బూత్‌లో 1200 మంది ఓటర్లు ఉండగా, వారిలో 200 మంది వేసవి సెలవుల కారణంగా వివిధ ప్రాంతాలకు వెళ్లారని కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
కలెక్టర్ మాట్లాడుతూ వారి పూర్తి వివరాలు సేకరించి, ఓటు వేసేందుకు వచ్చిన సమయంలో తగిన ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాలని సూచించారు. సదస్సుకు హాజరైన బూత్ స్థాయి అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, రిటైర్డు ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గుంటూరు చౌత్రా సెంట ర్లోని చలమయ్య జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో డీఆర్వో కె. నాగబాబు, ఆర్డీవో బి.రామమూర్తి, నగరపాలక సంస్థ కమిషనర్ పి.నాగవేణి పాల్గొన్నారు.
లాడ్జి సెంటర్‌లో ...
పటిష్ట రాజ్యాంగ రూపకల్పనతో దేశానికి సార్వభౌమాధికారం కల్పించిన అంబేద్కర్ స్ఫూర్తితో సమ సమాజ స్థాపనకు నడుం బిగించాలని జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ పిలుపునిచ్చారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం లాడ్జి సెంటర్లోని ఆయన విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో పౌరులందరికీ సమాన హక్కులు దక్కాలని ఆశించిన అంబేద్కర్ ఆశయాలు అనుసరణీయమన్నారు. కార్యక్రమంలో డీఆర్వో కె. నాగబాబు, ఆర్డీవో బి.రామమూర్తి పాల్గొని అంబేద్కర్‌కు నివాళులర్పించారు.
ఓటు హక్కు ప్రాధాన్యం గుర్తించాలి
Published Tue, Apr 15 2014 12:54 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement
Advertisement