సాక్షి, గుంటూరు: జమిలి ఎన్నికలకు శనివారం సైరన్ మోగనుంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు ఎస్.సురేశ్‌కుమార్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అనంతరం అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అసెంబ్లీకి ఆయా నియోజకవర్గాల్లోని రిటర్నింగ్ అధికారుల వద్ద, పార్లమెంటు అభ్యర్థులు జిల్లా కేంద్రంలో నామినేషన్లు వేయాల్సి ఉంటుంది.
గుంటూరు పార్లమెంటు స్థానానికి కలెక్టరు, నరసరావుపేటకు జాయింట్ కలెక్టరు వివేక్‌యాదవ్‌లు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. గుంటూరు పార్లమెంటు అభ్యర్థులు గుంటూరులోని కలెక్టరు చాంబర్‌లో, నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థులు జేసీ చాంబర్‌లోనూ నామినేషన్లు దాఖలు చేయాలి. బాపట్ల పార్లమెంట్ నామినేషన్లు మాత్రం ఒంగోలులో దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఐదు రోజులే అవకాశ ం.. నామినేషన్ల దాఖలుకు ఐదు రోజులు మాత్రమే అవకాశం ఉంది. 13, 14, 18 తేదీల్లో ప్రభుత్వం సెలవు రోజులు కావడంతో ఈ రోజుల్లో నామినేషన్లు స్వీకరించేది లేదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. దీంతో 12, 15, 16, 17, 19 తేదీల్లో మాత్రమే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ముగుస్తుంది. 21న నామినేషన్ల పరిశీలన, 23న ఉపసంహరణ ఉంటుంది. పోటీలో ఉండే అభ్యర్థులకు ఈ దఫా ఈసీ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
అభ్యర్థులు తమ నామినేషన్లుతో పాటు అఫిడవిట్లు సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ దాఖలు చేసే సమయంలోనే తమ ఓటు ఎక్కడుందో తెలిపే ఓటరు జాబితా డూప్లికేట్ కాపీని అందించాలి. అఫిడవిట్లలో ప్రతి కాలమ్ పూరించాలని, లేకపోతే రిటర్నింగ్ అధికారి పరిశీలన సమయంలో తిరస్కరించే అధికారం ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది.
ఇప్పటికే జిల్లా కలెక్టర్ సురేశ్‌కుమార్ రిటర్నింగ్ అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు, తదితర అంశాలపై స్పష్టత ఇచ్చారు. వరుసగా మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్ని విజయవంతంగా నిర్వహించిన అధికార గణం సార్వత్రిక ఎన్నికల్ని సమర్ధవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
రేపే సార్వత్రిక సైరన్
Published Fri, Apr 11 2014 12:19 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement
Advertisement