సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అదే స్పీడ్.. అదే జోష్.. పల్లెసీమల్లో ఎక్కడ చూసినా ఫ్యాన్ గాలే.. వైఎస్‌ఆర్‌సీపీ జెండా రెపరెపలే. తొలివిడతలో పోలింగ్ సీనే.. తుది విడతలోనూ రిపీట్ అయ్యింది. ప్రాదేశిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అత్యధిక స్థానాలు సాధించడం దాదాపు ఖాయమైంది.
రెండు విడతల్లో జరిగిన జెడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఎన్నికల ఓటింగ్ సరళి ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. తొలిసారి తలపడుతున్న ప్రాదేశిక ఎన్నికల పోరులోనే పార్టీ జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోనుంది. సార్వత్రిక ఎన్నికలకు నెలరోజుల ముందు జరిగిన ప్రాదేశిక పోరులో ప్రజాతీర్పు అధికారికంగా వెల్లడికాకపోయినా.. ఆ సంకేతాలు స్పష్టంగా కనిపించాయి. దాంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో కీలకమైన సార్వత్రిక సమరానికి సిద్ధమవుతున్నాయి.
తిరుగులేని ఆధిక్యం
ప్రాదేశిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. జిల్లాలోని అత్యధిక మండలాల్లో తన ప్రధాన ప్రత్యర్థి టీడీపీ కంటే తిరుగులేని ముందంజలో ఉంది. సాంకేతిక కారణాలతో నరసన్నపేట జెడ్పీటీసీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైనా పార్టీ నిరుత్సాహ పడలేదు. పైగా రెట్టించిన పోరాట పటిమతో ఎన్నికల రణరంగంలోకి దూకింది. ఈ నెల 6న మొదటి విడతలో పోలింగ్ జరిగిన 17న జెడ్పీటీసీ స్థానాల్లో అత్యధికం ఫ్యాన్ ఖాతాలోకి వెళ్లనున్నాయి. కనీసం 12 జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ గెలుచుకోనుంది. టీడీపీకి 4 స్థానాల్లోనే విజయావకాశాలు ఉన్నాయి.
మరో స్థానంలో రెండు పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఇక రెండో విడతగా శుక్రవారం 20 జెడ్పీటీసీలకు జరిగిన ఎన్నికల్లోనూ అదే పునరావృతమైంది. కనీసం 13 జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ విజయభేరి మోగించనుందని స్పష్టమైంది. టీడీపీకి 3 జెడ్పీటీసీ స్థానాల్లోనే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. మరో 4 స్థానాల్లో ఇరుపార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. వెరసి జిల్లాలో కనీసం 25 జెడ్పీటీసీ స్థానాలను సాధించడం ద్వారా వైఎస్‌ఆర్‌సీపీ జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవడం ఖాయమైంది. టీడీపీ సింగిల్ డిజిట్ మార్క్ దాటడం గగనంగా కనిపిస్తోంది.
సార్వత్రిక ఎన్నికల జోష్!
సార్వత్రిక ఎన్నికలకు నెలరోజుల ముందు జరిగిన ప్రాదేశిక ఎన్నికలు వైఎస్సార్‌సీపీలో జోష్‌ను అమాంతంగా పెంచాయి. ప్రధానంగా మారుమూల పల్లెలకు కూడా పార్టీ గుర్తు ఫ్యాన్ సుపరిచితమైంది. ఇంతకాలం పార్టీపట్ల ప్రజల్లో తిరుగులేని ఆదరణ ఉందని తెలిసినప్పటికీ గుర్తుపై ఎంతవరకు ఆవగాహన ఉందోనన్న సందేహం వెంటాడేది. కానీ ప్రాదేశిక ఎన్నికల పుణ్యమా అని మారుమూల పల్లె ఓటర్లకు కూడా వైఎస్సార్‌సీపీ గుర్తు ఫ్యాన్ అని పూర్తి అవగాహన వచ్చేసింది. ఇక ప్రాదేశిక ఎన్నికలతో చేకూరిన మరో ప్రధాన ప్రయోజనం.. బూత్‌స్థాయిలో పటిష్ట నాయకత్వం ఏర్పడటం.
తొలిసారి సార్వత్రిక ఎన్నికలు ఎదుర్కొంటున్నందున బూత్‌స్థాయిలో నాయకత్వంపై కొంతవరకు సందిగ్ధత ఉండేది. కానీ ఎమ్పీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో జిల్లావ్యాప్తంగా అన్ని బూత్‌స్థాయిల్లోనూ పార్టీ కమిటీలు పటిష్టమయ్యాయి. వచ్చే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవడం పార్టీకి సులభతరం కానుంది. ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆదరణను ఓట్లరూపంలోకి మార్చగల యంత్రాంగం రూపొందింది. దాంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో సార్వత్రిక ఎన్నికల సమరానికి కదంతొక్కుతున్నాయి.
పల్లెల్లో ఫ్యాన్ గాలి
Published Sat, Apr 12 2014 3:26 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement
Advertisement