సాక్షి, గుంటూరు: ఓటర్ల తుది జాబితా ప్రచురణకు గడువు కోరడంతో ఎన్నికల కమిషన్ ఈ నెల 31న ప్రచురణకు ఆదేశాలిచ్చిందని, 17వరకు ఓటర్ల చేర్పులు, మార్పులు, తొలగింపులపై విచారణ జరుగుతుందని జిల్లా కలెకర్ ఎస్.సురేశ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండు రోజుల్లో యంత్రాంగమంతా భౌతిక పరిశీలన పూర్తిచేయాలని, 18 నుంచి 30 వరకు కంప్యూటరైజేషన్, డేటా ఎంట్రీ పూర్తిచేసి తుది జాబితా ఎన్నికల కమిషన్ అనుమతి మేరకు ప్రచురిస్తామన్నారు.
జిల్లావ్యాప్తంగా 3.25 లక్షల వరకు క్లెయిమ్స్ వచ్చాయని, ఇప్పటికే 80 శాతం వరకు పరిశీలన పూర్తయిందన్నారు. సుమోటో కింద 39 వేల బోగస్ ఓట్లు తొలగించడం జరుగుతుందని, ఏవైనా అభ్యంతరాలు, తొలగింపులు ఉంటే 17 లోపే జరగాలన్నారు. తుది జాబితా ప్రచురించిన తర్వాత తొలగింపులు కుదరవని స్పష్టం చేశారు. ఈ నెల 18న జిల్లాలోని ఆరు పంచాయతీలు, 45వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉందని, అయి తే నామినేషన్ల ఘట్టం పూర్తయిన తర్వాత నాలుగు పంచాయతీల సర్పంచ్‌లు, 29 వార్డులకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయని వివరించారు.
పెదకూరపాడు మండలం ముస్సాపురం, ముప్పాళ్ళ మండలం కుందూరివారిపాలెం, పొన్నూరు మండలం కసుకర్రు, మంగళగిరి మండలం బేతపూడి గ్రామాల్లో సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈ నాలుగు సర్పంచ్ స్థానాలకు పది మంది, 29 వార్డులకు 38 మంది బరిలో ఉన్నారన్నారు. ముత్తాయపాలెం, రామచంద్రపురం సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదన్నారు. వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టులు కేవలం మెరిట్ ఆధారంగానే ఎంపిక జరుగుతుందని, సిఫార్సులతో జరగవని స్పష్టంచేశారు. పోస్టులు ఇప్పిస్తామనే ప్రచారం తన దృష్టికి వచ్చిందని, అభ్యర్థులు ఎవరూ మోసపోవద్దని కలెక్టరు చెప్పారు.
ఇక ప్రజాదర్బార్..ఇకపై డివిజన్ స్థాయిలో ప్రజావాణి నిర్వహిస్తామని, ప్రజాదర్బార్ పేరుతో ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ నెల 20న గురజాల రెవెన్యూ డివిజన్‌లో జిల్లాస్థాయి అధికారులంతా హాజరై పథకాలపై సమీక్ష చేస్తారన్నారు. డయల్ యువర్ ఆఫీసర్ కార్యక్రమం ప్రతిరోజూ జరుగుతుందని, 9.30 గంటల నుంచి 10.30 వరకు సెల్ నంబరు 98669 92627కు ఫిర్యాదిదారులు ఫోన్ చేయవచ్చన్నారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్‌గా తాను అన్ని అంశాలపై ఈ కార్యక్రమంలో పాల్గొంటానని, ఒకటవ, మూడవ మంగళవారాల్లో జాయింట్ కలెక్టర్ రెవెన్యూ అంశాలు, సివిల్ సప్లయిస్, ఆధార్, మీ సేవ, లీగల్ మెట్రాలజీ, సినిమాటోగ్రఫీపై హాజరవుతారని, ఫిర్యాదులు చేయవచ్చన్నారు.
31న ఓటర్ల తుదిజాబితా
Published Sat, Jan 11 2014 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM
Advertisement
Advertisement