ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని వస్తున్న వదంతులను నమ్మొద్దని, భయపడొద్దని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ సూచించారు. ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయంటూ కొన్ని వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా, టీవీ చానళ్లలో వస్తున్న వదంతులు అసత్యమన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో గందరగోళం, భయాందోళనలను రేకెత్తించడానికి కొందరు ఇటువంటివి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు గురువారం సురేష్ కుమార్ సర్క్యులర్ విడుదల చేశారు. పదో తరగతి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహిస్తున్నామని.. ఇప్పటివరకు లీకేజీకి సంబంధించి ఎలాంటి కేసులు నమోదు కాలేదని తెలిపారు.
పరీక్ష కేంద్రాల్లోకి ఎవరూ మొబైల్ ఫోన్లు తీసుకెళ్లకుండా నిషేధించామన్నారు. అంతేకాకుండా పరీక్షల విధులతో సంబంధం లేని ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం లేదని చెప్పారు. వీటిలో ఏదైనా ఉల్లంఘన జరిగితే వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవన్నారు. ప్రశ్నపత్రాలను, సమాధాన పత్రాలను సురక్షితంగా భద్రపరుస్తున్నామన్నారు. ఏప్రిల్ 27న కర్నూలులో పరీక్షలు ప్రారంభమయ్యాక ప్రశ్నపత్రాన్ని సర్క్యులేట్ చేసిన ఘటనలో తక్షణమే చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ దుశ్చర్యకు కారణమైన వ్యక్తులను అరెస్టు చేశామన్నారు. మీడియా కూడా వదంతులను ప్రసారం చేయొద్దని విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment