tenth class public examinations
-
10న పదో తరగతి పరీక్షల ఫలితాలు
చిత్తూరు కలెక్టరేట్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు జూన్ 10న వెల్లడించేందుకు కసరత్తు చేస్తున్నట్టు పాఠశాల విద్య రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి వెల్లడించారు. ఆయన సోమవారం చిత్తూరు జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి మూల్యాంకన ప్రక్రియను తనిఖీ చేశారు. అనంతరం ‘సాక్షి’తో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యాసంవత్సరం 6,22,537 మంది పరీక్షలు రాసినట్టు తెలిపారు. ఈ నెల 13 నుంచి పేపర్ వాల్యుయేషన్ జరుగుతోందని, ఇప్పటికే దాదాపు 25 శాతం పేపర్ల వాల్యుయేషన్ పూర్తయిందన్నారు. అన్ని జిల్లాల్లో ఉమ్మడి జిల్లా డీఈవోలు క్యాంప్ ఆఫీసర్లుగా మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అనంతరం విజయవాడలోని రాష్ట్ర పరీక్షల విభాగం కార్యాలయంలో డీ కోడింగ్ ప్రక్రియ నిర్వహించి.. జూన్ 10న ఫలితాల వెల్లడికి చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 26 జిల్లాలను యూనిట్‌గా తీసుకుని పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని దేవానందరెడ్డి వివరించారు. -
‘నో ఫోన్’ జోన్లుగా టెన్త్ పరీక్ష కేంద్రాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న అన్ని కేంద్రాలను పాఠశాల విద్యాశాఖ ‘నో ఫోన్’ జోన్లుగా ప్రకటించింది. దీంతో పాటు టెన్త్ పరీక్షలను సజావుగా పూర్తి చేసేందుకు జాగ్రత్తలు సూచిస్తూ డీఈవోలకు ఆదేశాలు జారీచేసింది. గతంలో జారీ చేసిన సూచనలకు కొనసాగింపుగా.. ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలను శాంతియుతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ఈ సూచనలు అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ మంగళవారం సర్క్యులర్ జారీ చేశారు. కొత్త నిబంధనలివీ.. ► పరీక్షల విధుల్లో ఉన్న ఇన్విజిలేటర్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, నాన్ టీచింగ్, ఇతర శాఖల సిబ్బంది (ఏఎన్ఎంలు, చీఫ్ సూపరింటెండెంట్లు సహా పోలీసు సిబ్బంది) పరీక్ష కేంద్రాలకు మొబైల్ ఫోన్లు తీసుకురాకూడదు. ► స్మార్ట్ వాచ్‌లు, డిజిటల్ వాచ్‌లు, కెమెరాలు, బ్లూటూత్ పరికరాలు, ఇయర్ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఫిట్నెస్ ట్రాకర్లు మొదలైన ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించకూడదు. ఈ నియమాన్ని కచ్చితంగా అమలు చేయాలి. సిబ్బంది లేదా అభ్యర్థుల వద్ద పరీక్ష కేంద్రం ప్రాంగణంలో ఏదైనా ఫోన్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరం గుర్తిస్తే వెంటనే జప్తు చేయాలి. ► మిగిలిన పరీక్షల కోసం అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు ఇన్విజిలేటర్ల జంబ్లింగ్‌ను సమీక్ష చేయాలి. వారు పనిచేసే పాఠశాల విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే కేంద్రాలలో ఇన్విజిలేటర్లుగా ఉండకుండా చూసుకోవాలి. ► పరీక్ష కేంద్రంలోని మిగిలిన అన్ని ప్రశ్న పత్రాలను సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్, డీవో, ఇద్దరు ఇన్విజిలేటర్లు సంతకం చేసిన పేపర్ సీల్‌తో సీలు చేసి రికార్డుల్లో నమోదు చేయాలి. ► పరీక్ష హాల్లో ప్రశ్నపత్రాన్ని పంపిణీ చేసిన వెంటనే అందులోని అన్ని పేజీలలో రోల్ నంబర్, పరీక్ష కేంద్రం నంబర్‌ను అభ్యర్థులతో రాయించేలా ఇన్విజిలేటర్లందరికీ సూచించాలి. ఇన్విజిలేటర్లు పరీక్ష ప్రారంభానికి ముందు ప్రశ్నపత్రంలోని అన్ని పేజీలలో రోల్ నంబర్, సెంటర్ నంబర్ తప్పనిసరిగా రాసేలా విద్యార్థులందరి ప్రశ్నపత్రాలను తనిఖీ చేయాలి. ► పరీక్షలలో అక్రమాల నిరోధానికి ఏపీ పబ్లిక్ పరీక్షలను (మాల్ ప్రాక్టీస్ నివారణ) చట్టం 25/1997ను దుష్ప్రవర్తనకు పాల్పడిన వ్యక్తులందరిపై కఠినంగా అమలు చేయాలి. చట్టంలోని కఠినమైన నిబంధనలపై విస్తృత ప్రచారం చేయాలి. -
పేపర్ లీక్ వదంతులు నమ్మొద్దు
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని వస్తున్న వదంతులను నమ్మొద్దని, భయపడొద్దని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ సూచించారు. ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయంటూ కొన్ని వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా, టీవీ చానళ్లలో వస్తున్న వదంతులు అసత్యమన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో గందరగోళం, భయాందోళనలను రేకెత్తించడానికి కొందరు ఇటువంటివి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు గురువారం సురేష్ కుమార్ సర్క్యులర్ విడుదల చేశారు. పదో తరగతి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహిస్తున్నామని.. ఇప్పటివరకు లీకేజీకి సంబంధించి ఎలాంటి కేసులు నమోదు కాలేదని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎవరూ మొబైల్ ఫోన్లు తీసుకెళ్లకుండా నిషేధించామన్నారు. అంతేకాకుండా పరీక్షల విధులతో సంబంధం లేని ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం లేదని చెప్పారు. వీటిలో ఏదైనా ఉల్లంఘన జరిగితే వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవన్నారు. ప్రశ్నపత్రాలను, సమాధాన పత్రాలను సురక్షితంగా భద్రపరుస్తున్నామన్నారు. ఏప్రిల్ 27న కర్నూలులో పరీక్షలు ప్రారంభమయ్యాక ప్రశ్నపత్రాన్ని సర్క్యులేట్ చేసిన ఘటనలో తక్షణమే చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ దుశ్చర్యకు కారణమైన వ్యక్తులను అరెస్టు చేశామన్నారు. మీడియా కూడా వదంతులను ప్రసారం చేయొద్దని విన్నవించారు. -
టెన్త్ పరీక్షలు.. ఏప్రిల్ చివర లేదా మేలో
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ చివర లేదా మేలో జరిగే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగా ఎస్ఎస్సీ బోర్డు షెడ్యూల్‌పై కసరత్తు చేస్తోంది. కోవిడ్ కారణంగా 2021–22 విద్యాసంవత్సరంలో పాఠశాలలు చాలా ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. జూన్ 12 నుంచి తరగతులు ఆరంభం కావలసి ఉండగా కోవిడ్ కారణంగా అక్టోబర్ వరకు పాఠశాలలు తెరచుకోలేదు. ఈ నేపథ్యంలో విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను పాఠశాల విద్యాశాఖ సవరించింది. అకడమిక్ ఇయర్‌ను ఏప్రిల్ 30 వరకు కొనసాగించేలా క్యాలెండర్‌ను ప్రకటించింది. అందుబాటులో ఉండే పనిదినాలకు అనుగుణంగా సిలబస్‌ను పూర్తి చేసేలా కొంతమేర పాఠ్యాంశాలను తగ్గించింది. టెన్త్ సిలబస్‌ను మార్చి 31 కల్లా పూర్తి చేసేలా ప్రణాళిక ఇచ్చింది. టెన్త్ విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేసేలా రివిజన్ చేయించనున్నారు. ప్రీఫైనల్ పరీక్షలను నిర్వహించి అనంతరం ఏప్రిల్ ఆఖరు, లేదా మే తొలివారంలో టెన్త్ పరీక్షలను చేపట్టే అవకాశాలున్నాయి. మరోపక్క ఇంటర్మీడియెట్ పరీక్షలు ఏప్రిల్‌లో జరగనున్నందున వాటి అనంతరం టెన్త్ పరీక్షలు మొదలు కానున్నాయి. ఇలా ఉండగా, పరీక్షల ఫీజు గడువును ఎస్సెస్సీ బోర్డు మరోసారి పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి మంగళవారం ప్రకటన జారీ చేశారు. ఫిబ్రవరి 5 వరకు ఇదివరకు తుది గడువుగా నిర్ణయించగా తాజాగా దాన్ని ఫిబ్రవరి 11వ తేదీ వరకు పొడిగించారు. -
టెన్త్ పరీక్షలపై హెచ్ఎంలకు సూచనలు
సాక్షి, అమరావతి: ఈ ఏడాది జూన్‌లో జరగనున్న పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ప్యాట్రన్‌లో మార్పులు, గ్రూప్ కాంబినేషన్లు, నామినల్ రోల్స్, ఇతర అంశాలకు సంబంధించి ప్రధానోపాధ్యాయులకు సవివర సూచనలను చేస్తూ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి బుధవారం సర్క్యులర్ విడుదల చేశారు. పరీక్ష పేపర్లు, సమయం, మార్కులు తదితర అంశాలను అందులో వివరించారు. ఈ సర్క్యులర్ ప్రకారం.. ► ఈ పరీక్షలకు తొలిసారి హాజరయ్యే రెగ్యులర్ విద్యార్థులంతా తెలుగు భాషను ఫస్ట్ లాంగ్వేజ్ లేదా సెకండ్ లాంగ్వేజ్ కింద తప్పనిసరిగా రాయాలి. ► తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్‌గా ఉన్న విద్యార్థులు సెకండ్ లాంగ్వేజ్ కింద హిందీ తప్పనిసరిగా రాయాలి. ► ఆంగ్ల మాధ్యమ అభ్యర్థులు ఫస్ట్ లాంగ్వేజ్‌గా తెలుగును ఎంచుకుంటే సెకండ్ లాంగ్వేజ్ పేపర్‌గా హిందీని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ► తమిళం, కన్నడ, ఒరియా తదితర మాతృభాషలను ఫస్ట్ లాంగ్వేజ్‌గా ఎంచుకున్న విద్యార్థులు రెండో పేపర్‌గా తెలుగును తప్పనిసరిగా రాయాలి. పబ్లిక్ పరీక్షల్లో.. ఇంటర్నల్ మార్కులకు వెయిటేజీ ఉండదు. ► ఏడు పేపర్లలో çఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్, మేథమెటిక్స్, సోషల్ స్టడీస్ పరీక్షలు ఒక్కొక్కటి 100 మార్కులకు ఉంటాయి. ఫిజికల్ సైన్సు, బయోలాజికల్ సైన్సు పరీక్షలు 50 మార్కుల చొప్పున వేర్వేరుగా ఉంటాయి. ► ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ పేపర్–1.. 70 మార్కులకు, పేపర్–2.. 30 మార్కులకు ఉంటాయి. ► లాంగ్వేజ్ పరీక్షలు, మేథమెటిక్స్, సోషల్ స్టడీస్ పరీక్షలు రాసేందుకు ఒక్కో పేపర్‌కు 3 గంటలు, ప్రశ్నపత్రం చదువుకునేందుకు 15 నిమిషాల (మొత్తం 3 గంటల 15 నిమిషాలు) సమయం ఇస్తారు. ► ఫిజికల్ సైన్సు, బయోలాజికల్ సైన్సు పరీక్షలు రాసేందుకు 2.30 గంటలు, ప్రశ్నపత్రం చదువుకునేందుకు 15 నిమిషాలు (మొత్తం 2 గంటల 45 నిమిషాలు) ఇస్తారు. ► 2017 మార్చిలో మొదటిసారి టెన్త్ పరీక్షలకు హాజరై 2019 జూన్ వరకు ఆ పరీక్షలను పూర్తిచేయనివారు కొత్త స్కీమ్‌లో ప్రస్తుతం నిర్వహించే పరీక్షలకు రిజిష్టర్ కావచ్చు. ► ఇంటిపేరుతో సహా అభ్యర్థి పూర్తిపేరు, తండ్రి, తల్లి పూర్తి పేర్లు నమోదు చేయాలి. అనాథలకు సంరక్షకుల పేరు నమోదు చేయాలి. ► స్కూలు రికార్డుల్లో నమోదైన వారిని మాత్రమే రెగ్యులర్ అభ్యర్థులుగా పరిగణిస్తారు. ► గుర్తింపు ఉన్న స్కూలు నామినల్ రోల్స్ మాత్రమే రెగ్యులర్ అభ్యర్థులుగా అప్లోడ్ చేయాలి. ► చెవిటి, మూగ, అంధత్వం తదితర బహుళ దివ్యాంగులకు రెండు లాంగ్వేజ్‌లకు బదులు ఒక్కటే ఎంచుకోవచ్చు. వీరికి ప్రతి సబ్జెక్టులో పాస్ మార్కులు 20 మాత్రమే. -
ఫలితాలు ఓకే...ప్రమాణాలేవి?
సాక్షి, అమరావతి:పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం ఏటేటా అనూహ్యంగా పెరుగుతోంది. ఆమేరకు విద్యార్థుల్లో సబ్జెక్టులపై పట్టు పెరగడంలేదు. ప్రమాణాలూ అంతంత మాత్రమే. పాస్ పర్సంటేజీ పెంపుపై ఉన్న శ్రద్ధ ప్రమాణాల అభివృద్ధిపై అటు ప్రభుత్వం, ఇటు అధికారులు, బోధకుల్లోనూ కనిపించడం లేదు. 1998–99 సంవత్సరంలో టెన్త్‌లో పాస్ పర్సంటేజీ 52.67 శాతం మాత్రమే ఉండగా అది నేడు 95 శాతం వరకు చేరుకోవడం గమనించదగ్గ అంశం. నాలుగైదు శాతం తేడాలో ప్రతి ఏటా ఇదేరకమైన ఉత్తీర్ణత శాతాలు నమోదు అవుతున్నాయి. తాజాగా మంగళవారం విడుదలయిన టెన్త్ ఫలితాల్లో ఉత్తీర్ణత 94.88 శాతంగా నమోదైంది. ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ల ఆవిర్భావంతోనే ఈ మార్పు 1998కి ముందు వరకు రాష్ట్రంలో విద్యా ప్రమాణాలపై ప్రభుత్వం కచ్చితమైన నియమ, నిబంధనలను అమలు చేసేది. విద్యార్ధుల్లో నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవడంతోపాటు వారిలో ఏమేరకు విద్యాప్రమాణాలు అభివృద్ధి చెందాయనే అంశాలు తెలుసుకునేందుకు మూల్యాంకనం చేయడంలోనూ అంతే కచ్చితమైన విధానాలు పాటిం చేది. 1998–99 నుంచి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నసమయంలో ప్రయివేటు స్కూళ్లకు, కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేయడం ప్రారంభించినప్పటినుంచి ఆనారోగ్యకర వాతావరణం ఏర్పడింది. విద్య వ్యాపారంగా మారింది. ప్రయివేటు కార్పొరేట్ సంస్థలు ఉత్తీర్ణత శాతాన్ని పెంచి చూపించుకోవడం ద్వారా ప్రవేశాలను గణనీయంగా పెంచుకొనే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇందుకోసం వారు అడ్డదారులు తొక్కుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. లక్ష్యాల నిర్దేశంతో జిల్లాల మధ్య పోటాపోటీ సమీక్షల సందర్భంగా సీఎంనుంచి ఉన్నతాధికారుల వరకు ఉత్తీర్ణత శాతంపైనే ఎక్కువ దృష్టి సారించి వాటిని పెంచేలా అధికారులపై ఎత్తిడి పెంచారు. దీంతో జిల్లా మధ్య పోటీ పెరిగింది. ఇది మాస్ కాపీయింగ్‌కు, ఇతర అడ్డదారులకు దారితీసింది. 1998–99లో 52.67గా ఉన్న టెన్త్ ఉత్తీర్ణత శాతం 2003–04 నాటికి ఒక్కసారిగా 80.55కి పెరిగింది. అంటే 27.88 శాతం పెరిగిందన్న మాట. ఈ పెరుగుదల ప్రయివేటు స్కూళ్లలోనే కనిపించింది. ప్రభుత్వ స్కూళ్లలో మాత్రం ఉత్తీర్ణత శాతం 50నుంచి 55 శాతానికే పరిమితమైంది. దీంతో విద్యార్ధులు ప్రయివేటు స్కూళ్లవైపు ఆకర్శితులవుతూ వచ్చారు. అక్కడ అర్హులైన టీచర్లు లేకున్నా... సరైన బోధన, దానికి తగ్గ సదుపాయాలు లేకున్నా, ప్రమాణాలతో పనిలేకుండా బట్టీ పద్దతులకు శ్రీకారం చుట్టారు. తమకు అనుకూలమైన కేంద్రాల్లో తమ విద్యార్థులు మాత్రమే పరీక్ష రాసేలా పైరవీలు చేసేవారు. మాస్ కాపీయింగ్ తదితర మార్గాల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకుంటూ పోయారు. ప్రభుత్వ స్కూళ్లలోనూ అదే సంస్కృతి... ప్రయివేటు స్కూళ్లతో సమానంగా పరుగులు పెట్టేందుకు ప్రభుత్వ స్కూళ్లలోనూ ఇదే వాతావరణం తప్పనిసరైంది. ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కలెక్టర్లు, డీఈఓలు, విద్యాధికారులు పరీక్షల సమయంలో, మూల్యాంకనం వేళ ఒకింత వెసులుబాటు కల్పిస్తూ సాధ్యమైనంత మేర ఆయా ప్రశ్నలకు సమాధానాల్లో సంపూర్ణత లేకున్నా పాస్‌మార్కులు వేసే సంప్రదాయానికి తెరతీశారు. మాస్ కాపీయింగ్ కూడా పెరిగింది. దీంతో ఉత్తీర్ణత శాతం అమాంతం పెరిగిపోతూ వస్తోంది. జంబ్లింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చినా పరిస్థితిలో మార్పులేదు. చివరకు మార్కుల పరుగులో విద్యార్ధులపై ఒత్తిడి పెరిగి అనారోగ్యకర వాతావరణం ఏర్పడడంతో ప్రభుత్వం మార్కులు తీసేసి గ్రేడింగ్ పద్ధతిని ప్రవేశపెట్టింది. అయినా గ్రేడ్లతోనూ కార్పొరేట్ సంస్థలు ప్రచారాన్ని చేసుకుంటున్నాయి. సీసీఈ విధానంతో మరింతగా... విద్యాహక్కు చట్టం ప్రకారం నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానంలో పరీక్షలు నిర్వహించాలన్న హైకోర్టు తీర్పు దరిమిలా మూడేళ్ల నుంచి ఆ విధానంలో పరీక్షలు పెడుతున్నారు. అంతర్గత ప్రాజెక్టులు, ఇతర అంశాలకు 20 మార్కులు వేస్తూ, పబ్లిక్ పరీక్షల్లో 80 మార్కులకు ప్రశ్నపత్రం ఇస్తున్నారు. అయితే అంతర్గత మార్కుల కేటాయింపులో ప్రయివేటు పాఠశాలలు వందకు వందశాతం తమపిల్లలకు వేయిస్తున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. పెరిగిన డిమాండ్–చుక్కల్లో ఫీజులు టెన్త్‌లో ఉత్తీర్ణత శాతం పెరుగుతుండడంతో ఆ తదుపరి ఇంటర్మీడియెట్ విద్యకు డిమాండ్ తలెత్తుతోంది. ఇదే అదునుగా ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు దీన్ని ఆసరా చేసుకొని కాలేజీ ఫీజులను అమాంతం పెంచేస్తున్నాయి. ఎక్కువ మార్కులు వచ్చిన వారికి కొంతమేర రాయితీ ఇస్తూ తక్కిన వారినుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 3,361 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీలు 1143. తక్కినవన్నీ ప్రయివేటు, కార్పొరేట్ కాలేజీలే. టెన్త్‌లో ఉత్తీర్ణులు అవుతున్న విద్యార్ధుల సంఖ్య 2018–19లోనే చూసుకుంటే దాదాపు 6 లక్షల మంది వరకు ఉన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లో కేవలం లక్ష సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. తక్కిన వారంతా ప్రయివేటు కార్పొరేట్ కాలేజీలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్దులు 9.30 లక్షల మంది ఉండగా వీరిలో 2.30 లక్షల మంది ప్రభుత్వ కాలేజీల్లో చదువుతుండగా తక్కిన 7 లక్షల మందీ ప్రయివేటు కాలేజీల్లో చేరుతున్నారు. అప్పట్లో ఫస్ట్ క్లాస్ అంటే అదో పండగే... ఒకప్పుడు 60 నుంచి 70 శాతం మార్కులు సాధించడమంటే చాలా గొప్పవిషయంగా ఉండేది. ఫస్టుక్లాస్ వచ్చిందటే అదో పండగ. కానీ ఇప్పుడు 60 శాతం మార్కులు అంటే చాలా చిన్నచూపుగా మారింది. 80– 90కి పైగా మార్కులు సాధించిన వారే తెలివైన వారన్న ముద్రపడింది. విద్యార్ధుల్లో ప్రమాణాలతో సంబంధం లేకుండా మార్కులకోసం వక్రమార్గాల్లో పయనిస్తున్నాయి. ఇపుడు 70 నుంచి 90 శాతానికి పైగా మార్కులు సాధించిన వారి సంఖ్యే అధికంగా ఉంటోంది. గత కొన్నేళ్లుగా టెన్త్‌లో ఉత్తీర్ణత శాతాలుఇలా ఉన్నాయి. -
టెన్త్ పరీక్షలు ప్రారంభం
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్, పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 250 సెంటర్లలో తెలుగు-1 (జనరల్, కాంపోజిట్) సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించారు. దీనికి 50839 మంది విద్యార్థులు అలాట్‌కాగా 50290 మంది పరీక్ష రాశారు. 549 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల రాష్ట్ర పరిశీలకుడు నజీమొద్దీన్ 9 సెంటర్లలో, డీఈఓ మదన్మోహన్ 6 సెంటర్లలో తనిఖీ చేశారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు 80 సెంటర్లలో తనిఖీలు నిర్వహించాయి. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు. రిలీవ్ ఉండదు... ఏకంగా సస్పెన్షనే పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, ఎక్కువగా మాల్‌ప్రాక్టీస్ కేసులు బుక్కావడం లాంటి విషయాల్లో ఇన్విజిలేటర్లను రిలీవ్ చేసే విధానం ఇకపై ఉండదు. ఇన్విజిలేషన్ విధుల పట్ల ఆసక్తిలేని వారు ఉద్దేశపూర్వకంగా పొరపాట్లు చేసి డ్యూటీ నుంచి రిలీవ్ అవుతున్న ఉదంతాలు వెలుగులోకి వస్తుండడంతో ఈ ఏడాది ప్రభుత్వం కొత్త నిబంధన విధించింది. విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే ఇన్విజిలేటర్లకు ఉన్నతాధికారులు మెమో జారీ చేస్తారు. వివరణ తీసుకుంటారు. సంతృప్తికరమైన కారణం లేకపోతే సస్పెన్షన్ వేటు వేసేస్థాయిలో చర్యలుంటాయని తెలిసింది. పరీక్షకు హాజరైన అంధవిద్యార్థులు నల్లగొండలోని అంధుల పాఠశాలకు చెందిన 20 మంది విద్యార్థులు స్క్రైబ్ (సహాయకుడు)తో పరీక్షకు హాజరయ్యారు. వారందరికీ విశ్వదీప్ పాఠశాల కేంద్రాన్ని కేటాయించారు. ఒకే పాఠశాల నుంచి 20 మంది అంధ విద్యార్థులు టెన్తపరీక్షలకు హాజరుకావడం రాష్ట్రంలో ఇదే ప్రథమం. గేట్లు తెరవని అధికారులు 10వ తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి 8.45 గంటలకే చేరుకోవాలని అధికారులు ఆదేశించడంతో విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే చేరుకున్నారు. కానీ చాలా సెంటర్లలో 9 గంటల వరకు ఆయా పాఠశాలల గేట్లు తెరవకపోవడంతో విద్యార్థులు రోడ్లపైనే వేచి చూడాల్సి వచ్చింది. తమ ఆదేశాలను ఆయా పరీక్ష కేంద్రాల నిర్వాహకులు పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని ఉన్నతాధికారులు మర్చిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.