
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ చివర లేదా మేలో జరిగే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగా ఎస్‌ఎస్‌సీ బోర్డు షెడ్యూల్‌పై కసరత్తు చేస్తోంది. కోవిడ్ కారణంగా 2021–22 విద్యాసంవత్సరంలో పాఠశాలలు చాలా ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. జూన్ 12 నుంచి తరగతులు ఆరంభం కావలసి ఉండగా కోవిడ్ కారణంగా అక్టోబర్ వరకు పాఠశాలలు తెరచుకోలేదు.
ఈ నేపథ్యంలో విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను పాఠశాల విద్యాశాఖ సవరించింది. అకడమిక్ ఇయర్‌ను ఏప్రిల్ 30 వరకు కొనసాగించేలా క్యాలెండర్‌ను ప్రకటించింది. అందుబాటులో ఉండే పనిదినాలకు అనుగుణంగా సిలబస్‌ను పూర్తి చేసేలా కొంతమేర పాఠ్యాంశాలను తగ్గించింది. టెన్త్ సిలబస్‌ను మార్చి 31 కల్లా పూర్తి చేసేలా ప్రణాళిక ఇచ్చింది.
టెన్త్ విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేసేలా రివిజన్ చేయించనున్నారు. ప్రీఫైనల్ పరీక్షలను నిర్వహించి అనంతరం ఏప్రిల్ ఆఖరు, లేదా మే తొలివారంలో టెన్త్ పరీక్షలను చేపట్టే అవకాశాలున్నాయి. మరోపక్క ఇంటర్మీడియెట్ పరీక్షలు ఏప్రిల్‌లో జరగనున్నందున వాటి అనంతరం టెన్త్ పరీక్షలు మొదలు కానున్నాయి. ఇలా ఉండగా, పరీక్షల ఫీజు గడువును ఎస్సెస్సీ బోర్డు మరోసారి పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి మంగళవారం ప్రకటన జారీ చేశారు. ఫిబ్రవరి 5 వరకు ఇదివరకు తుది గడువుగా నిర్ణయించగా తాజాగా దాన్ని ఫిబ్రవరి 11వ తేదీ వరకు పొడిగించారు.
Comments
Please login to add a commentAdd a comment