సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న అన్ని కేంద్రాలను పాఠశాల విద్యాశాఖ ‘నో ఫోన్’ జోన్లుగా ప్రకటించింది. దీంతో పాటు టెన్త్ పరీక్షలను సజావుగా పూర్తి చేసేందుకు జాగ్రత్తలు సూచిస్తూ డీఈవోలకు ఆదేశాలు జారీచేసింది. గతంలో జారీ చేసిన సూచనలకు కొనసాగింపుగా.. ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షలను శాంతియుతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ఈ సూచనలు అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ మంగళవారం సర్క్యులర్ జారీ చేశారు.
కొత్త నిబంధనలివీ..
► పరీక్షల విధుల్లో ఉన్న ఇన్విజిలేటర్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు, నాన్ టీచింగ్, ఇతర శాఖల సిబ్బంది (ఏఎన్‌ఎంలు, చీఫ్ సూపరింటెండెంట్లు సహా పోలీసు సిబ్బంది) పరీక్ష కేంద్రాలకు మొబైల్ ఫోన్లు తీసుకురాకూడదు.
► స్మార్ట్ వాచ్‌లు, డిజిటల్ వాచ్‌లు, కెమెరాలు, బ్లూటూత్ పరికరాలు, ఇయర్ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఫిట్‌నెస్ ట్రాకర్లు మొదలైన ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించకూడదు. ఈ నియమాన్ని కచ్చితంగా అమలు చేయాలి. సిబ్బంది లేదా అభ్యర్థుల వద్ద పరీక్ష కేంద్రం ప్రాంగణంలో ఏదైనా ఫోన్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరం గుర్తిస్తే వెంటనే జప్తు చేయాలి.
► మిగిలిన పరీక్షల కోసం అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు ఇన్విజిలేటర్ల జంబ్లింగ్‌ను సమీక్ష చేయాలి. వారు పనిచేసే పాఠశాల విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే కేంద్రాలలో ఇన్విజిలేటర్లుగా ఉండకుండా చూసుకోవాలి.
► పరీక్ష కేంద్రంలోని మిగిలిన అన్ని ప్రశ్న పత్రాలను సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్, డీవో, ఇద్దరు ఇన్విజిలేటర్లు సంతకం చేసిన పేపర్ సీల్‌తో సీలు చేసి రికార్డుల్లో నమోదు చేయాలి.
► పరీక్ష హాల్‌లో ప్రశ్నపత్రాన్ని పంపిణీ చేసిన వెంటనే అందులోని అన్ని పేజీలలో రోల్ నంబర్, పరీక్ష కేంద్రం నంబర్‌ను అభ్యర్థులతో రాయించేలా ఇన్విజిలేటర్లందరికీ సూచించాలి. ఇన్విజిలేటర్లు పరీక్ష ప్రారంభానికి ముందు ప్రశ్నపత్రంలోని అన్ని పేజీలలో రోల్ నంబర్, సెంటర్ నంబర్ తప్పనిసరిగా రాసేలా విద్యార్థులందరి ప్రశ్నపత్రాలను తనిఖీ చేయాలి.
► పరీక్షలలో అక్రమాల నిరోధానికి ఏపీ పబ్లిక్ పరీక్షలను (మాల్ ప్రాక్టీస్ నివారణ) చట్టం 25/1997ను దుష్ప్రవర్తనకు పాల్పడిన వ్యక్తులందరిపై కఠినంగా అమలు చేయాలి. చట్టంలోని కఠినమైన నిబంధనలపై విస్తృత ప్రచారం చేయాలి.
‘నో ఫోన్’ జోన్లుగా టెన్త్ పరీక్ష కేంద్రాలు
Published Wed, May 4 2022 4:13 AM | Last Updated on Wed, May 4 2022 4:13 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment