ఫలితాలు ఓకే...ప్రమాణాలేవి? | Passing through the Tenth class Public Exams is Increasing Annually | Sakshi
Sakshi News home page

ఫలితాలు ఓకే...ప్రమాణాలేవి?

Published Fri, May 17 2019 6:05 AM | Last Updated on Fri, May 17 2019 6:05 AM

Passing through the Tenth class Public Exams is Increasing Annually - Sakshi

సాక్షి, అమరావతి:పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం ఏటేటా అనూహ్యంగా పెరుగుతోంది. ఆమేరకు విద్యార్థుల్లో సబ్జెక్టులపై పట్టు పెరగడంలేదు.  ప్రమాణాలూ అంతంత మాత్రమే. పాస్‌ పర్సంటేజీ పెంపుపై ఉన్న శ్రద్ధ ప్రమాణాల అభివృద్ధిపై అటు ప్రభుత్వం, ఇటు అధికారులు, బోధకుల్లోనూ కనిపించడం లేదు. 1998–99 సంవత్సరంలో టెన్త్‌లో పాస్‌ పర్సంటేజీ 52.67 శాతం మాత్రమే ఉండగా అది నేడు 95 శాతం వరకు చేరుకోవడం గమనించదగ్గ అంశం. నాలుగైదు శాతం తేడాలో ప్రతి ఏటా ఇదేరకమైన ఉత్తీర్ణత శాతాలు నమోదు అవుతున్నాయి. తాజాగా మంగళవారం విడుదలయిన టెన్త్‌ ఫలితాల్లో ఉత్తీర్ణత 94.88 శాతంగా నమోదైంది.

ప్రైవేటు కార్పొరేట్‌ స్కూళ్ల ఆవిర్భావంతోనే ఈ మార్పు
1998కి ముందు వరకు రాష్ట్రంలో విద్యా ప్రమాణాలపై ప్రభుత్వం కచ్చితమైన నియమ, నిబంధనలను అమలు చేసేది. విద్యార్ధుల్లో నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవడంతోపాటు వారిలో ఏమేరకు  విద్యాప్రమాణాలు అభివృద్ధి చెందాయనే అంశాలు తెలుసుకునేందుకు మూల్యాంకనం చేయడంలోనూ అంతే కచ్చితమైన విధానాలు పాటిం చేది. 1998–99 నుంచి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నసమయంలో  ప్రయివేటు స్కూళ్లకు, కార్పొరేట్‌ సంస్థలకు పెద్దపీట వేయడం ప్రారంభించినప్పటినుంచి ఆనారోగ్యకర వాతావరణం ఏర్పడింది. విద్య వ్యాపారంగా మారింది. ప్రయివేటు కార్పొరేట్‌ సంస్థలు ఉత్తీర్ణత శాతాన్ని పెంచి చూపించుకోవడం ద్వారా ప్రవేశాలను గణనీయంగా పెంచుకొనే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇందుకోసం వారు అడ్డదారులు తొక్కుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. 

  లక్ష్యాల నిర్దేశంతో జిల్లాల మధ్య పోటాపోటీ
 సమీక్షల సందర్భంగా సీఎంనుంచి ఉన్నతాధికారుల వరకు ఉత్తీర్ణత శాతంపైనే ఎక్కువ దృష్టి సారించి వాటిని పెంచేలా అధికారులపై ఎత్తిడి పెంచారు. దీంతో జిల్లా మధ్య పోటీ పెరిగింది. ఇది మాస్‌ కాపీయింగ్‌కు, ఇతర అడ్డదారులకు దారితీసింది. 1998–99లో 52.67గా ఉన్న టెన్త్‌ ఉత్తీర్ణత శాతం 2003–04 నాటికి ఒక్కసారిగా 80.55కి పెరిగింది. అంటే 27.88 శాతం పెరిగిందన్న మాట. ఈ పెరుగుదల ప్రయివేటు స్కూళ్లలోనే కనిపించింది. ప్రభుత్వ స్కూళ్లలో మాత్రం ఉత్తీర్ణత శాతం 50నుంచి 55 శాతానికే పరిమితమైంది. దీంతో విద్యార్ధులు ప్రయివేటు స్కూళ్లవైపు ఆకర్శితులవుతూ వచ్చారు. అక్కడ అర్హులైన టీచర్లు లేకున్నా... సరైన బోధన, దానికి తగ్గ సదుపాయాలు లేకున్నా, ప్రమాణాలతో పనిలేకుండా బట్టీ పద్దతులకు శ్రీకారం చుట్టారు. తమకు అనుకూలమైన కేంద్రాల్లో తమ విద్యార్థులు మాత్రమే పరీక్ష రాసేలా పైరవీలు చేసేవారు. మాస్‌ కాపీయింగ్‌ తదితర మార్గాల్లో  ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకుంటూ పోయారు.

ప్రభుత్వ స్కూళ్లలోనూ అదే సంస్కృతి...
 ప్రయివేటు స్కూళ్లతో సమానంగా పరుగులు పెట్టేందుకు ప్రభుత్వ స్కూళ్లలోనూ ఇదే వాతావరణం తప్పనిసరైంది. ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కలెక్టర్లు, డీఈఓలు, విద్యాధికారులు పరీక్షల సమయంలో,  మూల్యాంకనం వేళ ఒకింత వెసులుబాటు కల్పిస్తూ సాధ్యమైనంత మేర ఆయా ప్రశ్నలకు సమాధానాల్లో సంపూర్ణత లేకున్నా పాస్‌మార్కులు వేసే సంప్రదాయానికి తెరతీశారు. మాస్‌ కాపీయింగ్‌ కూడా పెరిగింది. దీంతో ఉత్తీర్ణత శాతం అమాంతం పెరిగిపోతూ వస్తోంది. జంబ్లింగ్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చినా పరిస్థితిలో మార్పులేదు. చివరకు మార్కుల పరుగులో విద్యార్ధులపై ఒత్తిడి పెరిగి అనారోగ్యకర వాతావరణం ఏర్పడడంతో ప్రభుత్వం మార్కులు తీసేసి గ్రేడింగ్‌ పద్ధతిని ప్రవేశపెట్టింది. అయినా గ్రేడ్లతోనూ కార్పొరేట్‌ సంస్థలు ప్రచారాన్ని చేసుకుంటున్నాయి. 

సీసీఈ విధానంతో మరింతగా...
విద్యాహక్కు చట్టం ప్రకారం నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానంలో పరీక్షలు నిర్వహించాలన్న హైకోర్టు తీర్పు దరిమిలా మూడేళ్ల నుంచి ఆ విధానంలో పరీక్షలు పెడుతున్నారు. అంతర్గత ప్రాజెక్టులు, ఇతర అంశాలకు 20 మార్కులు వేస్తూ, పబ్లిక్‌ పరీక్షల్లో 80 మార్కులకు ప్రశ్నపత్రం ఇస్తున్నారు. అయితే అంతర్గత మార్కుల కేటాయింపులో ప్రయివేటు పాఠశాలలు వందకు వందశాతం తమపిల్లలకు వేయిస్తున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలోనూ ఇదే తంతు కొనసాగుతోంది.

 పెరిగిన డిమాండ్‌–చుక్కల్లో ఫీజులు
టెన్త్‌లో ఉత్తీర్ణత శాతం పెరుగుతుండడంతో ఆ తదుపరి ఇంటర్మీడియెట్‌ విద్యకు డిమాండ్‌ తలెత్తుతోంది. ఇదే అదునుగా ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు దీన్ని ఆసరా చేసుకొని కాలేజీ ఫీజులను అమాంతం పెంచేస్తున్నాయి. ఎక్కువ మార్కులు వచ్చిన వారికి కొంతమేర రాయితీ ఇస్తూ తక్కిన వారినుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 3,361 జూనియర్‌ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ, ఎయిడెడ్‌ కాలేజీలు 1143.  

తక్కినవన్నీ ప్రయివేటు, కార్పొరేట్‌ కాలేజీలే. టెన్త్‌లో ఉత్తీర్ణులు అవుతున్న విద్యార్ధుల సంఖ్య 2018–19లోనే చూసుకుంటే దాదాపు 6 లక్షల మంది వరకు ఉన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌ కాలేజీల్లో కేవలం లక్ష సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. తక్కిన వారంతా ప్రయివేటు కార్పొరేట్‌ కాలేజీలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్దులు 9.30 లక్షల మంది ఉండగా వీరిలో 2.30 లక్షల మంది ప్రభుత్వ కాలేజీల్లో చదువుతుండగా తక్కిన 7 లక్షల మందీ ప్రయివేటు కాలేజీల్లో చేరుతున్నారు.  

అప్పట్లో ఫస్ట్‌ క్లాస్‌ అంటే అదో పండగే...
ఒకప్పుడు 60 నుంచి 70 శాతం మార్కులు సాధించడమంటే చాలా గొప్పవిషయంగా ఉండేది. ఫస్టుక్లాస్‌ వచ్చిందటే అదో పండగ. కానీ ఇప్పుడు 60 శాతం మార్కులు అంటే చాలా చిన్నచూపుగా మారింది. 80– 90కి పైగా మార్కులు సాధించిన వారే తెలివైన వారన్న ముద్రపడింది. విద్యార్ధుల్లో ప్రమాణాలతో సంబంధం లేకుండా మార్కులకోసం వక్రమార్గాల్లో పయనిస్తున్నాయి. ఇపుడు 70 నుంచి 90 శాతానికి పైగా మార్కులు సాధించిన వారి సంఖ్యే అధికంగా ఉంటోంది.
గత కొన్నేళ్లుగా టెన్త్‌లో ఉత్తీర్ణత శాతాలుఇలా ఉన్నాయి.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement