సాక్షి, గుంటూరు: మలి విడత పరిషత్తు ఎన్నికల్లో ఓటర్లు మరింత చైతన్యం కనబరిచారు. ఎండ తీవ్రతను కూడా లెక్క చేయకుండా ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. తొలిదశలో 85.10 శాతం పోలింగ్ నమోదు కాగా శుక్రవారం జరిగిన రెండో విడత ఎన్నికల్లో సగటున 85.79 శాతం నమోదైంది. గుంటూరు డివిజన్‌లో 87.01 శాతం, గురజాల డివిజన్‌లో 83.26 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
28 మండలాల్లో జరిగిన రెండో దశ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తుళ్ళూరు మండలంలో అత్యధికంగా 91.18 శాతం నమోదు కాగా, అత్యల్పంగా గురజాల మండలంలో 80.34 శాతం నమోదైంది. ఈ రెండు డివిజన్లలో మొత్తం 11,30,636 మంది ఓటర్లుంటే, 9,69,979 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పోలింగ్ సరళిని పరిశీలించిన అధికారులు.. సత్తెనపల్లి నియోజకవర్గంలోని కంటెపూడి, ధూళిపాళ్లలో పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టరు ఎస్.సురేశ్‌కుమార్ పరిశీలించి పోలింగ్ సరళి తెలుసుకున్నారు. పల్నాడు ప్రాంతమైన మాచర్లలో జిల్లా కలెక్టరు, రూరల్ ఎస్పీలు మకాం వేసి పర్యవేక్షించారు. మంగళగిరి రూరల్ మండలంలో పోలింగ్ సరళిని అర్బన్ ఎస్పీ గోపీనాథ్, జేసీ వివేక్‌యాదవ్‌లు పరిశీలించారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కండ్లకుంటలోను, వైఎస్సార్ సీపీ గుంటూరు, కృష్ణా జిల్లాల సమన్వయకర్త ఆళ్ళ రామకృష్ణారెడ్డి స్వగ్రామం పెదకాకానిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
టీడీపీ, వైఎస్సార్ సీపీ శ్రేణుల ఘర్షణ.. శుక్రవారం నాటి ఎన్నికలు కొన్ని చోట్ల ప్రశాంతంగానే జరిగినా మరికొన్ని చోట్ల ఉద్రిక్తతకు దారితీశాయి. గుంటూరు రూరల్ మండలం లాలుపురంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మూకుమ్మడిగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై రాళ్ళ దాడి చేశారు. ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో పోలింగ్ బూత్ వద్ద టీడీపీ, వైఎస్సార్ సీపీ శ్రేణులు ఘర్షణకు దిగారు. పెదకూరపాడు నియోజకవర్గంలోని అచ్చంపేట మండలం గ్రంధశిరిలోనూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి.
ఇక్కడ దాడులకు పాల్పడిన టీడీపీ కార్యకర్తలే ఆందోళనలు నిర్వహించడ ం గమనార్హం. తాడేపల్లి మండలం గుండిమెడలో టీడీపీ సర్పంచి కాసరనేని లలిత ఓటర్లను పోలింగ్ కేంద్రం వద్దే అభ్యర్థించడంపై వైఎస్సార్ సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ నేతలతో ఘర్షణకు దిగారు. పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఇదే మండలంలో చిర్రావూరులో చెట్టు కింద నిలబడి ఉన్న వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థి ధనేకుల బ్రహ్మానందంను పోలీసులు అకారణంగా లాక్కెళ్లి జీపెక్కించారు.
స్థానికులు పోలీసుల్ని అడ్డగించి నినాదాలు చేయడంతో బ్రహ్మానందంను వదిలి అతని వద్ద ఉన్న డబ్బు రూ.12 వేలు తీసుకెళ్లారు. పెనుమాకలో టీడీపీ నేతలు డబ్బు పంచుతూ పోలీసులకు చిక్కారు. మంగళగిరి రూరల్ మండలం కురగల్లులో టీడీపీ నేతలు పోలీసులపై దాడికి యత్నించారు.
మాచర్లలో నేతల గృహ నిర్బంధం.. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ళలో పోలింగ్ అధికారుల వద్ద తొలగించిన జాబితా లేకపోవడంతో ఆ జాబితాలోని ఓటర్లు కూడా ఓట్లు వేశారు. ముప్పాళ్ల మండలం తురకపాలెంలో బ్యాలెట్ బాక్సులో నీళ్లు పోసేందుకు కొందరు ప్రయత్నించారు.
మాచర్ల నియోజకవర్గంలో అన్ని పార్టీల నేతల్ని గృహ నిర్భంధం చేశారు. దుర్గి మండలం శ్యామరాజుపురం, ఆత్మకూరు గ్రామాలకు సంబంధించి బ్యాలెట్ పేపర్లు తారుమారు కావడంతో శ్యామరాజు పురంలో రాత్రి 8 గంటల వరకు పోలింగ్ సాగింది. తాడికొండలో టీడీపీకి చెందిన కొందరు దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డగించారు.
మలిదశలో మరింత జోరు
Published Sat, Apr 12 2014 3:05 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM
Advertisement
Advertisement