ఇద్దరు మున్సిపల్ కమిషనర్లపై వేటు | two municipal commissioners are suspended | Sakshi
Sakshi News home page

ఇద్దరు మున్సిపల్ కమిషనర్లపై వేటు

Published Thu, Mar 20 2014 1:47 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM

two municipal commissioners are suspended

నరసరావుపేట, మాచర్ల మున్సిపల్ కమిషనర్లు వీరభద్రరావు, గిరికుమార్‌లను ఎన్నికల విధుల నుంచి తొలగిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ బుధవారం తెలిపారు. పురపాలక సంఘాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల పరిశీలనలో అవకతవకలకు పాల్పడినట్లు రుజువు కావడంతో వీరిపై వేటు పడినట్లు సమాచారం.
 
  నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలోని 11 వార్డులో మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి అనుచరుడు వేలూరి సుబ్బారెడ్డి నామినేషన్‌ను తొలుత తిరస్కరించినట్లు ప్రకటించిన కమిషనర్ వీరభద్రరావు ఒత్తిడులకు తలొగ్గి తిరిగి అనుమతించేందుకు ప్రయత్నించిన విషయం విధితమే. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్ధి ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్ధి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు అర్ధరాత్రి వరకూ మున్సిపల్ కార్యాలయంలో ఆందోళన చేపట్టడంతో చివరకు తిరస్కరించినట్లు ప్రకటించారు.
 
  ఈ విషయంపై సీరియస్ అయిన ఎన్నికల సంఘం వీరభద్రరావును ఎన్నికల విధుల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా మాచర్ల మున్సిపాలిటీ పరిధిలోని 21, 22 వార్డుల్లో అన్నీ పార్టీల అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించడంతో అన్నీ పార్టీల నాయకులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. దీనికితోడు 28వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి నామినేషన్‌ను తిరస్కరించడంపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు  చేశారు. వీటన్నింటినీ విచారించిన ఎన్నికల సంఘం మాచర్ల మున్సిపల్ కమిషనర్ గిరికుమార్‌ను ఎన్నికల విధుల నుంచి తొలగించారు. ఈ రెండు చోట్ల కొత్త కమిషనర్‌లను ఎన్నికల అధికారులుగా నియమించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
 
 ఒక ప్రభుత్వ వైద్యునితోపాటు నలుగురు అంగన్‌వాడీలపై సస్పెన్షన్ వేటు
 మాచర్ల పట్టణంలో ఈ నెల 14వ తేదీన ఓపార్టీ అభ్యర్ధి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారని ‘సాక్షి’ ఫోటోతో కథనాన్ని ప్రచురించింది. దీంతో విచారణ జరిపిన ఎన్నికల సంఘం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అతిక్రమించినందుకు మాచర్ల కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ నల్లూరి కుమారస్వామిని విధుల నుంచి సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
 
 అదే విధంగా ఈ నెల 14వ తేదీన తెనాలిలో జరిగిన కాంగ్రెస్‌పార్టీ అభ్యర్ధి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న నలుగురు అంగన్‌వాడీ కార్యకర్తలపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అంగన్‌వాడీ కార్యకర్తలు డి.అనూష, ఆర్.మధులత, ఎ.అరుణశ్రీ, వై.రాజేశ్వరిలను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement