![Andhra Pradesh Govt On Assigned Lands To District Collectors - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/6/LAND.jpg.webp?itok=xjjQKpXb)
సాక్షి, అమరావతి: పేదలకు 1954వ సంవత్సరానికి ముందు ఇచ్చిన (అసైన్డ్) భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించవచ్చని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు స్పష్టతనిస్తూ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ), ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ తాజాగా సర్క్యులర్ జారీచేశారు. కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ తమ జిల్లాలో ఉన్న పరిస్థితిని వివరిస్తూ దీనిపై స్పష్టత ఇవ్వాలని సీసీఎల్‌ఏని కోరారు.
కర్నూలు జిల్లాలో 5,382.78 ఎకరాల ప్రభుత్వ భూమిని 1954 జూన్ 18 నాటికి 2,755 మంది నిరుపేదలకు వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చారని, ఈ భూములను నిషేధిత ఆస్తుల జాబితా 22 (ఎ) 1 నుంచి తొలగించడంపై పలు ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. ఆ భూముల్ని 22 (ఎ) జాబితా నుంచి తొలగించవచ్చా? లేదా? అనే దానిపై తగు సూచనలు ఇవ్వాలని కోరారు. దీనిపై సీసీఎల్‌ఏ స్పష్టతనిస్తూ 22 (ఎ) కేసులను త్వరితగతిన పరిష్కరించడం కోసం 2022 సెప్టెంబర్ ఒకటో తేదీన జిల్లా కలెక్టర్లకు అన్ని అంశాలపైనా తగిన వివరణలు, సూచనలతో ఒక సర్క్యులర్ ఇచ్చినట్లు తెలిపారు.
మరోసారి దీనిపై స్పష్టతనిస్తూ.. 1954 జూన్ 18కి ముందు పేదలకు (డిప్రెస్‌డ్ క్లాసెస్) షరతులతోగానీ, షరతులు లేకుండా గానీ ఇచ్చిన భూములను 22 (ఎ) జాబితా నుంచి తొలగించవచ్చని స్పష్టంచేశారు. ఆ భూములకు సంబంధించిన పట్టాలు అందుబాటులో ఉన్నా, లేకపోయినా రెవెన్యూ రికార్డుల ఆధారంగా సుమోటోగా నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు. అసైన్డ్ భూముల వ్యవహారంపై తరచూ ప్రశ్నలు వస్తుండడంతో ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ ఈ సర్క్యులర్ ఇచ్చింది.
స్వాతంత్య్రానికి ముందు పేదలకిచ్చిన భూములను 22(ఎ) జాబితా నుంచి తీసివేయాలని గతంలోనే ప్రభుత్వం స్పష్టంచేసినా జిల్లా కలెక్టర్లు, జేసీలు రకరకాల కారణాలు, వివాదాల భయంతో వాటి జోలికి వెళ్లడంలేదు. నిబంధనల ప్రకారం చేయాల్సిన వాటిని కూడా చేయకుండా నాన్చుతున్నారు. అందులో భాగంగానే తమ వద్దకు వచ్చే ఇలాంటి పిటిషన్లపై తాము నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా సీసీఎల్‌ఏకి పంపుతున్నారు.
ఈ నేపథ్యంలో.. రెవెన్యూ వ్యవస్థకి సంబంధించి అనేక అంశాలపై జిల్లా కలెక్టర్లకు అధికారాలు ఉన్నాయని సీసీఎల్‌ఏ తరచూ స్పష్టంచేస్తూనే ఉన్నారు. ఇలాంటి అంశాలపై తామిచ్చిన మార్గదర్శకాల ప్రకారం కలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు. అందులో భాగంగానే 1954 ముందు పేదలకిచ్చిన భూములను 22 (ఎ) నుంచి నిరభ్యంతరంగా తొలగించవచ్చని తాజా సర్క్యులర్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment