సాక్షి, అమరావతి: భూముల రీసర్వేలో రాష్ట్ర ప్రభుత్వం మరో మైలు రాయిని అధిగమించింది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు వేల గ్రామాల్లో అన్ని దశల సర్వే పూర్తయింది. ఈ గ్రామాల్లో సర్వే పూర్తయినట్లు నెంబర్ 13 నోటిఫికేషన్లు కూడా జారీచేయడంతో అక్కడ కొత్త రెవెన్యూ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు దేశంలోని ఏ గ్రామంలోనూ పూర్తిస్థాయి రీ సర్వే జరగలేదు.
ఇప్పటికీ అన్ని రాష్ట్రాల్లోని గ్రామాలు, పట్టణాల్లో బ్రిటీష్ వాళ్లు రూపొందించిన రెవెన్యూ రికార్డులే ఉన్నాయి. తొలిసారిగా మన రాష్ట్రంలోనే నాలుగు వేల గ్రామాల్లో రీసర్వే పూర్తవడంతో అక్కడ డిజిటల్ రెవెన్యూ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త రికార్డుల ఆధారంగానే ఇకపై భూముల వ్యవహారాలు జరగనున్నాయి. రీసర్వేలో భాగంగా ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్‌లు (గ్రామాల ఫొటోలు) తయారుచేయడానికి విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు వినియోగిస్తున్న తొలి రాష్ట్రం కూడా మనదే.
2020 డిసెంబర్‌లో ప్రాజెక్టు ప్రారంభం
పూర్వపు కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకాన్ని 2020 డిసెంబర్ 21న ప్రారంభించారు. ఆ తర్వాత కరోనా రావడంతో కొంత ఆలస్యమైనా ఆ తర్వాత శరవేగంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, కంటిన్యూయస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్లు, రోవర్ల వంటి అత్యాధునిక సర్వే టెక్నాలజీలను ఉపయోగించి దాదాపు వందేళ్ల తర్వాత సమగ్ర రీ సర్వేను చేపట్టారు.
సర్వే తర్వాత రైతులకు భూ హక్కు పత్రాలివ్వడం.. ఆ భూములకు భద్రత నిర్ధారించడం, భూ రక్ష సర్వే రాళ్లు నాటడం ద్వారా సరిహద్దు భద్రతను ప్రభుత్వం కల్పిస్తోంది. భూరక్ష సర్వే రాళ్ల ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది.
రీ సర్వే వల్ల ప్రయోజనాలు..
► సర్వే తర్వాత భూముల రికార్డులను 10 సెంటీమీటర్ల కచ్చితత్వంతో కొలిచి తయారుచేస్తారు.
► భూ యజమానులకు భూ కమత పటం, గ్రామ పటం, భూ హక్కు పత్రం వంటి రికార్డులను జీపీఎస్ కో–ఆర్డినేట్లు, ఐడీ నెంబర్, క్యూఆర్ కోడ్‌తో ఇస్తారు.
► గ్రామంలోని స్థలాలు, అర్బన్ ప్రాంతాల్లోని భూములను కూడా మొదటిసారి సర్వేచేసి యజమానులకు యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు కూడా జారీచేస్తున్నారు.
► భూమి రికార్డులు ట్యాంపరింగ్‌కి అవకాశం ఉండదు. భూ యజమానికి తెలియకుండా భూమి రికార్డులో ఏ మార్పులు జరిగే అవకాశం ఉండదు. డబుల్ రిజిస్ట్రేషన్లకు ఆస్కారం ఉండదు.
► గ్రామ సచివాలయాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా పనిచేస్తాయి. ఎప్పటికప్పుడు భూమి రికార్డులు అప్‌డేట్ అవుతాయి.
► రిజిస్ట్రేషన్‌కు ముందే మ్యుటేషన్, పట్టా సబ్ డివిజన్ జరుగుతుంది.
► రీ సర్వేకు హాజరుకాలేని వారికి వాట్సాప్ వీడియో కాల్, జూమ్ ఇతర వీడియో ఇంటరాక్టివ్ టెక్నాలజీల ద్వారా రీసర్వే బృందాలు వారి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేస్తున్నాయి.
భూ సంబంధిత సేవలన్నీ ఏకీకృతమయ్యాయి
రీ సర్వే విజయవంతంగా జరుగుతోంది. భూమికి సంబంధించిన అన్ని సేవలు ఏకీకృతమై ఒకే డెస్క్ వ్యవస్థలోకి వస్తున్నాయి. గ్రామ సచివాలయంలో సమీకృత సర్వే, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ సేవలను దేశంలోనే మొదటిసారి అందిస్తున్నాం. మన రీ సర్వే ప్రాజెక్టు అనేక రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలుస్తోంది. ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మన అధికారులతో ఇతర రాష్ట్రాల్లో రీసర్వే శిక్షణలు ఏర్పాటుచేస్తోంది.
– సిద్ధార్థ జైన్, కమిషనర్, సర్వే, సెటిల్మెంట్ శాఖ
Comments
Please login to add a commentAdd a comment