సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వేలో మొదటి ఘట్టమైన డ్రోన్ సర్వే దాదాపు 65 శాతం గ్రామాల్లో పూర్తయింది. రాష్ట్రంలోని 17,460 గ్రామాలకుగాను 13,481 గ్రామాల్లో ఈ డ్రోన్ సర్వే చేయాల్సి వుండగా.. ఇప్పటివరకు 8,804 గ్రామాల్లో పూర్తయింది. విస్తీర్ణపరంగా చూస్తే రాష్ట్రవ్యాప్తంగా 1,12,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న వ్యవసాయ భూములు, గ్రామ కంఠాలను సర్వే చేయాల్సి వుండగా ఇప్పటివరకూ 65,866 చ.కి.మీ.లలో (59 శాతం) ఈ సర్వే పూర్తయింది.
డ్రోన్లు, విమానాలు, హెలీకాప్టర్లతో దేశంలో ఏ రాష్ట్రం ఎప్పుడూ చేయని విధంగా రాష్ట్రంలో ఈ డ్రోన్ సర్వేను నిర్వహిస్తున్నారు. మిగిలిన 4,677 గ్రామాల్లో (46,134 చ.కి.మీ.) ఏప్రిల్ 23కల్లా పూర్తిచేయడానికి సర్వే, రెవెన్యూ యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. రెండు నెలల వ్యవధిలోనే 1,500 గ్రామాల్లో దీనిని పూర్తిచేయగలిగారు. ఇంత తక్కువ వ్యవధిలోనే ఆ స్థాయిలో సర్వే పూర్తిచేయడాన్ని బట్టి ఎంత వేగంగా జరుగుతుందో అర్థంచేసుకోవచ్చు.
అత్యాధునికంగా.. శరవేగంగా..
డ్రోన్ సర్వేను తొలుత సర్వే ఆఫ్ ఇండియాకు అప్పగించారు. సర్వేను అనుకున్న గడువులోపు పూర్తిచేయాలన్న లక్ష్యంతో మళ్లీ ప్రైవేటు ఏజెన్సీలను ఆహ్వానించి వాటితో చేయిస్తున్నారు. దీంతోపాటు సర్వే, సెటిల్మెంట్ శాఖ సైతం స్వయంగా ఈ సర్వే చేపట్టింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా 30 డ్రోన్లు కొనుగోలు చేసింది. తమ సర్వేయర్లకే డ్రోన్ పైలెట్‌లుగా శిక్షణ ఇప్పించి మరీ సర్వే చేయిస్తోంది.
సర్వే ఆఫ్ ఇండియా, ప్రైవేటు డ్రోన్ ఏజెన్సీలు, ప్రభుత్వం కలిసి శరవేగంగా ఈ డ్రోన్ సర్వే నిర్వహిస్తున్నాయి. అక్కడక్కడా ఆలస్యమవుతుందనుకున్న ప్రాంతాల్లో ఏరియల్‌గా (విమానాలు, హెలీకాప్టర్లతో) చేస్తున్నారు. ఇలా రాష్ట్రంలోని మొత్తం భూముల రీసర్వే చేయడం దేశంలో ఇదే మొదటిసారి దీన్నికూడా ఇంత అత్యాధునికంగా, పెద్దఎత్తున డ్రోన్లు, విమానాలతో చేస్తుండడాన్ని మిగిలిన రాష్ట్రాలు ఆశ్చర్యంతో పరిశీలిస్తున్నాయి.
ఇప్పటికే మహారాష్ట్ర బృందాలు రాష్ట్రానికి వచ్చి ఇక్కడ జరుగుతున్న భూముల సర్వే, డ్రోన్ సర్వే తీరును పరిశీలించి వెళ్లాయి. నిర్దేశించిన లక్ష్యం మేరకు ఏప్రిల్ నాటికి డ్రోన్లతో సర్వే పూర్తికి రెవెన్యూ, సర్వే శాఖలు ముమ్మరంగా పనిచేస్తున్నాయి.
2,079 గ్రామాల్లో తుది రెవెన్యూ రికార్డులు రెడీ..
ఇక డ్రోన్ సర్వే పూర్తిచేసిన తర్వాత ఆయా గ్రామాలకు సంబంధించిన డ్రోన్ చిత్రాలను సర్వే యంత్రాంగానికి ఇవ్వాల్సి వుంటుంది. ఇప్పటివరకు డ్రోన్ సర్వే పూర్తిచేసిన 8,804 గ్రామాలకుగాను 5,264 గ్రామాల డ్రోన్ చిత్రాలను సర్వే బృందాలకు అందాయి. 4,006 గ్రామాలకు చెందిన ఓఆర్‌ఐ (ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్)లను జారీచేశారు.
వీటిని క్షేత్రస్థాయిలో భూమితో పోల్చి నిజనిర్థారణ (గ్రౌండ్ ట్రూతింగ్) సర్వే చేయాలి. ఇప్పటివరకు 3,191 గ్రామాల్లో క్షేత్రస్థాయి సర్వేను పూర్తిచేశారు. 2,464 గ్రామాల్లో గ్రౌండ్ వ్యాలిడేషన్‌ను పూర్తిచేయగా, 2,242 గ్రామాల్లో అన్ని దశల సర్వే పూర్తయింది. 2,079 గ్రామాలకు సంబంధించిన తుది రెవెన్యూ రికార్డుల తయారీ పూర్తయింది.
65శాతం గ్రామాల్లో.. డ్రోన్ సర్వే పూర్తి
Published Mon, Feb 13 2023 3:19 AM | Last Updated on Mon, Feb 13 2023 7:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment