సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూముల రీసర్వే చురుగ్గా సాగుతోంది. ప్రతిదశలోను రైతులు, భూయజమానులకు భాగస్వామ్యం కల్పిస్తూ పారదర్శకంగా అమలవుతోంది. రీసర్వే ద్వారా రికార్డులు అప్‌డేట్ చేసే ప్రక్రియ మరింత జాగ్రత్తగా అమలయ్యేలా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంది. రీసర్వే పూర్తయి తుది నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత కూడా రైతులు, భూయజమానులు రికార్డుల్లో తమ వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు, సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పించింది. దీన్ని వారు సద్వినియోగం చేసుకుంటున్నారు.
రీసర్వేలో భూయజమానుల భాగస్వామ్యం ఉండేలా రూపొందిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ) ప్రకారం ప్రతిదశను పటిష్టంగా అమలు చేస్తున్నారు. రీసర్వే జరిగినప్పుడు వివిధ కారణాల వల్ల అందులో పాల్గొనని భూయజమానులు సర్వే పూర్తయ్యాక ఆర్‌వోఆర్ ప్రక్రియలో తమ రికార్డులను అప్‌డేట్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఏపీ సర్వే అండ్ బౌండరీ యాక్టు ప్రకారం సర్వే ముగిశాక అప్పీల్‌కు గడువు పూర్తయినా రైతులు, భూయజమానులు అప్పీల్ చేస్తే వాటిని స్వీకరించి విచారిస్తున్నారు.
ఒకవేళ వారు సర్వే సమయంలో గ్రామంలో లేకపోతే వీడియో కాన్ఫరెన్స్, వాట్సాప్ వీడియోకాల్, జూమ్ వీడియోకాల్ వంటివాటి ద్వారా వారి స్టేట్‌మెంట్ తీసుకునే వెసులుబాటు ఉంది. విచారణ సమయంలో మొబైల్ మేజిస్ట్రేట్లు ఈ స్టేట్‌మెంట్లను పరిగణలోకి తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం నిర్దేశించింది. సర్వే పూర్తయినట్లు 13 నోటిఫికేషన్ జారీచేసిన తర్వాత తమ హద్దులపై సంతృప్తి చెందకపోతే భూయజమానులు మధ్యవర్తిత్వం కోరే అవకాశం ఉంది.
గ్రామసభలో తుది ఆర్‌వోఆర్ ప్రచురించిన తర్వాత కూడా ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్ చట్టం ప్రకారం రికార్డుల్లో నమోదైన వివరాలను సరిదిద్దుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. నోటిఫికేషన్ ప్రచురించిన ఒక సంవత్సరం తర్వాత దిద్దుబాటు కోసం తహశీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. తహశీల్దార్ ఇచ్చే ఆర్డర్‌పై 90 రోజుల్లో ఆర్డీవోకు అప్పీల్ చేసుకోవచ్చు.
మరింత పక్కాగా అమలు చేయాలని సీసీఎల్‌ఏ సర్క్యులర్
రీసర్వేలో ప్రతిదశలోను రైతులు, భూయజమానుల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండలా చూడాలనే మార్గదర్శకాలతో భూపరిపాలన ప్రధాన కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ సర్క్యులర్ జారీచేశారు. ప్రతిదశలో రైతులు, భూస్వాములు వారి అవకాశాలను వినియోగించుకునేలా చేయాలని సూచించారు. ఈ అవకాశాల గురించి అందరికీ తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్దేశించారు.
సర్వే ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను కూడా ప్రత్యేక ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించేలా చూడాలని సూచించారు. సర్వే జరుగుతున్న గ్రామాల్లో నెలలో 15 రోజులు మొబైల్ మేజిస్ట్రేట్లు పర్యటించి పెండింగ్ దరఖాస్తుల క్లియరెన్స్ చేసేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇలా వచ్చే వినతులను గ్రామాల వారీగా జాబితాలు రూపొందించాలని సూచించారు.
రాష్ట్ర, జిల్లాస్థాయి కమిటీలు ఈ దరఖాస్తులు నిర్దిష్ట గడువులోపు పరిష్కారమవుతున్నాయో లేదో పరిశీలిస్తాయని పేర్కొన్నారు. మధ్యవర్తిత్వం, ఆర్డీవోకి అప్పీలు వంటి వాటికోసం ప్రత్యేక ఐటీ అప్లికేషన్లు తీసుకురానున్నట్లు సర్క్యులర్‌లో తెలిపారు.
మరింత జాగ్రత్తగా రికార్డుల అప్‌డేట్
Published Tue, Nov 22 2022 3:32 AM | Last Updated on Tue, Nov 22 2022 3:32 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment