మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతన్న | Farmers Protest For Paddy minimum support price In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతన్న

Published Tue, Dec 3 2024 4:57 AM | Last Updated on Tue, Dec 3 2024 4:57 AM

Farmers Protest For Paddy minimum support price In Andhra Pradesh

ధాన్యం ఎవరూ కొనడం లేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్న కృష్ణా జిల్లా లక్ష్మీపురం రైతులు

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిరసనలు

ధాన్యం కొనేవారు లేరంటూ రైతుల గగ్గోలు

కొన్ని చోట్ల తేమ పేరుతో మద్దతు ధరల్లో కోత

రైతు సేవాకేంద్రాలు, మండల కార్యాలయాల ఎదుట ధర్నాలు

తేమ శాతంతో సంబంధం లేకుండా కొనాలని డిమాండ్‌

ధాన్యం సొమ్ము 48 గంటల్లోనే ఖాతాల్లో జమ చేయాలని వినతి

జీఎల్టీ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలని విజ్ఞప్తి

గత ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులూ లేవని వెల్లడి

సాక్షి, అమరావతి: అన్నదాత ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ధాన్యం కొను­గోలులో ప్రభుత్వ వైఫల్యాన్ని నిర­సిస్తూ అన్నదాతలు రోడ్డెక్కారు. రాష్ట్ర చరి­త్రలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం కొని ఆదుకోండి మహాప్రభో.. అంటూ ఆరు­గాలం శ్రమించి పండించిన ధాన్యం కంకుల­తోనే నిరసనలకు దిగారు. కృష్ణా, గోదా­వరి డెల్టా పరిధిలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోని మండల కేంద్రాల్లోని తహసీల్దార్‌ కార్యాలయల ఎదుటే సోమవారం పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. 

తుపాను ప్రభావంతో కురిసిన వరా­్షలకు తడిసి ముద్దయిన ధాన్యం రాసుల వద్దే నిరసనలతో తమ ధైన్య స్థితిని తెలియజేశారు. తేమ శాతంతో సంబంధం లేకుండా రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనాలని, వర్షాల వల్ల రంగుమారిన, తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనాలని, ధాన్యం సొమ్ము 48 గంటల్లోనే ఖాతాల్లో జమ చేయాలని, జీఎల్టీ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలంటూ నినాదాలు చేశారు. ధర్నాలు చేసిన తర్వాత మండల తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు.

గింజ ధాన్యానికి కూడా పూర్తి మద్దతు ధర దక్కలేదు
రాష్ట్రంలో ఏ ఒక్క రైతు నుంచి కనీస మద్దతు ధరకు గింజ కూడా ఈ ప్రభుత్వం కొనలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి గింజా కనీస మద్దతు ధరకు కొంటామంటూ గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఆచరణలో విఫలమైందని మండిపడ్డారు. ఉభయ గోదావరి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఈ నిరసనలు మిన్నంటాయి. పెద్ద సంఖ్యలో రైతులు, కౌలు రైతులు ఆందోళనల్లో పాల్గొన్నారు. 

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దళారులు, మిల్లర్లు తమను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వాధికారులు కూడా దళారుల అవతారమెత్తి రైతులను నిలువు దోపిడి చేస్తున్నారంటూ ఆరోపించారు. 25 శాతం తేమ ఉన్నా కొంటామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు పత్తా లేకుండా పోయిందని మండిపడ్డారు. 

ప్రభుత్వం పట్టించుకోలేదంటూ మండిపాటు
తుపాను వస్తుందని ముందుగానే తెలిసినా ప్రభుత్వం పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు. కళ్లాలపై ఉన్న పంటను కొనేందుకు ప్రభుత్వం ముందుకు రావడంలేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. తేమ శాతం పేరుతో ముప్పతిప్పలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మద్దతు ధర ప్రకారం 75 కిలోల బస్తాకు రూ.1,725 ఇవ్వాల్సి ఉండగా, రైతు సేవా కేంద్రంలోనే రూ.1,450కు మించి రాదని చెబుతున్నారని తెలిపారు.  

పైగా తరుగు రూపంలో 15 నుంచి 20 బస్తాలు తగ్గించి రశీదులిస్తున్నారని, ఎందుకిలా కోత విధిస్తున్నారని అడిగితే సమాధానం చెప్పే నాధుడే లేరని చెప్పారు. గతంలో రైతు భరోసా కేంద్ర (ఆర్బీకే) – మిల్లులకు మధ్య మ్యాపింగ్‌ ఉండేదని, ప్రస్తుతం పొరుగు జిల్లాలకు కూడా ఇష్టమొచ్చినట్టు తోలుతున్నారని ఆరోపించారు. రవాణా చార్జీల భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరించాల్సి ఉండగా, దానినీ రైతుల నెత్తిన వేస్తున్నారని మండిపడ్డారు. 

ప్రభుత్వమే సరఫరా చేసిన ఎంటీయూ 1262 రకం విత్తనాన్ని సాగు చేస్తే, ఆ ధాన్యాన్ని ఇప్పుడు ఎవరూ కొనడంలేదని వాపోయారు. బీపీటీ, ముతకలు మాత్రమే కొనమని చెప్పారని, మధ్యస్తంగా ఉండే ఎంటీయూ 1262 కొనలేమని చెబుతున్నారని, దీంతో దళారులకు 75 కేజీల బస్తా రూ.1,250 నుంచి రూ.1,350కు అమ్ముకోవల్సి వస్తోందని వాపోయారు. 

డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి ఆర్బీకే పరిధిలో ధాన్యం సేకరణ లక్ష్యం పూర్తయిందని, ఇక మీదట కొనేది లేదంటూ అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సగం కూడా కొనకుండానే లక్ష్యం పూర్తయిందని చెప్పడంలో అర్థం ఏమిటని మండిపడుతున్నారు.

గింజ కొనే వారు లేరు..
కృష్ణా జిల్లా మొవ్వ మండలం అవురుపూడికి చెందిన ఈ రైతు పేరు ఎం.హరిబాబు. 5.30 ఎకరాల్లో వరి సాగు చేసి గత నెల 24న కోసి 25న నూర్చారు. 29న రైతు సేవా కేంద్రానికి వెళితే 24 శాతం తేమ వచ్చింది. 30 కాటా వేశారు. తేమ 25 శాతం ఉన్నా మద్దతు ధరకు కొంటామని 4 రోజుల క్రితం మంత్రి మనోహర్‌ చెప్పారు. నిన్నటికి నిన్న తేమ 17శాతం కంటే ఎక్కువ ఉంటే బస్తాకు 5 కిలోల తరుగుతో ధాన్యం తెనాలిలో చెప్పారు. 

ఆ లెక్కనైనా అదనంగా ఉన్న తేమ శాతానికి తరుగు మినహాయించుకొని మద్దతు ధర లెక్కగట్టి ఇవ్వాలని అడుగుతుంటే.. మిల్లర్లు రూ.1,450కు మించి ఇవ్వబోమంటున్నారని అధికారులు చెబుతున్నారని హరిబాబు ఆవేదన వ్యక్తంచేశారు. పంట కోసి ఆరబెట్టేందుకు కూలీలకు రూ.3 వేలు, టార్పాలిన్ల అద్దె రూ. 8 వేలు ఖర్చయిందని తెలిపారు. ధాన్యం తరలించకపోతే మొలకలొస్తాయని మొత్తుకుంటున్నా  అధికారులు స్పందించడంలేదని, తూర్పు గోదావరి నుంచి లారీలు వస్తే పంపిస్తామని అంటున్నారే తప్ప ఎంత రేటుకు కొంటారో చెప్పడం లేదని హరిబాబు వాపోతున్నారు.

ఇదేనా 48 గంటల్లో డబ్బులేయడమంటే..
ఈ రైతు పేరు వేమూరి నాగేశ్వరరావు. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామం. ఒకటిన్నర ఎకరాల్లో వరి పంటను కోసి గతనెల 20న కాటా వేశారు. 40 కిలోల చొప్పున 96 బస్తాలు రైతుసేవా కేంద్రం ద్వారా బాలాజీ రైస్‌ మిల్లుకు ఈ నెల 21వ తేదీన పంపారు. అదే రోజున ఎఫ్‌టీవో 906200015240005 జనరేట్‌ అయ్యింది. కానీ 81 బస్తాలకే రశీదు ఇచ్చారు. 24న రూ.74,520 రైతు ఖాతాలో జమైనట్టుగా మెసేజ్‌ వచ్చింది. బ్యాంకులో చూసుకుంటే సొమ్ములు పడలేదు. 

రైతు సేవా కేంద్రానికి వెళ్లి అడిగితే బ్యాంక్‌ ఖాతాకు మీ ఆధార్‌ లింక్‌ అయి ఉండకపోవచ్చని చెప్పారు. రెండ్రోజులు పనులు మానుకొని బ్యాంకు చుట్టూ తిరిగి ఆధార్‌ లింక్‌ చేశారు. 26 నుంచి రోజూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా డబ్బులు రాలేదు. అడిగితే కంగారెందుకు.. నాలుగు రోజులాగండంటూ చిరాకు పడుతున్నారని నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పైగా 96 బస్తాలకుగాను 81 బస్తాలకే రశీదు ఇచ్చారని వాపోయారు. గతంలో ఇటువంటి పరిస్థితులు లేవని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement