Minimum support price for paddy
-
మద్దతు ధర టీడీపీ, జేడీ(యూ)కేనా?
సాక్షి, న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధర కల్పించి, రైతన్నలకు న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు గురువారం పార్లమెంట్ ఆవరణలో ప్రదర్శన చేపట్టారు. తృణమూల్ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్), శివసేన (ఉద్ధవ్) తదితర పార్టీల సభ్యులు పార్లమెంట్ మకర ద్వారం మెట్లపై గుమికూడారు. ఉల్లిపాయలు, కూరగాయల దండలను మెడపై ధరించి కేంద్ర ప్రభుత్వ తీరు పట్ల నిరసన వ్యక్తం చేశారు. ‘పంటలకు కనీస మద్దతు ధర కల్పించండి’, ‘రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోండి’ అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. శివసేన(ఉద్ధవ్) ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ... ‘‘తెలుగుదేశం పార్టీ, జేడీ(యూ)లకు బీజేపీ ప్రభుత్వం కనీస మద్దతు ధర(స్పెషల్ ప్యాకేజీ) అందించింది. అదే తరహాలో రైతులకు కూడా కనీస మద్దతు ధర అందించాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ సమానమేనని గుర్తించుకోవాలి. రైతులు దేశంలో ప్రధాన వాటాదార్లు. అందుకే వారికి మద్దతు ప్రకటిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. మహారాష్ట్ర నుంచి విదేశాలకు ఉల్లిపాయల ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేయాలని కేంద్రానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగేలా చూడడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. -
Cabinet approves: వరికి మరో 117
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. వరి ధాన్యానికి కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను 5.35 శాతం పెంచింది. అంటే క్వింటాల్‌కు రూ.117 చొప్పున పెరగనుంది. 2024–25 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో క్వింటాల్ వరి ధాన్యాన్ని రూ.2,300కు కొనుగోలు చేయనున్నారు. ప్రస్తుతం దేశంలో సరిపడా బియ్యం నిల్వలు ఉన్నప్పటికీ ధాన్యానికి మద్దతు ధర పెంచడం గమనార్హం. త్వరలో జరగనున్న హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ పెంచినట్లు తెలుస్తోంది. మంత్రివర్గం నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ మీడియాకు వివరించారు. వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్(సీఏసీపీ) సిఫార్సుల మేరకు 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు తెలిపారు. ఎంఎస్పీని సాధారణ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,300కు, ‘ఎ’ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,320కు పెంచినట్లు వెల్లడించారు. కనీస మద్దతు ధర అనేది ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 1.5 రెట్లు అధికంగా ఉండాలని 2018 కేంద్ర బడ్జెట్లో తీసుకున్న విధానపరమైన నిర్ణయాన్ని ప్రభుత్వం ఆమోదించినట్లు చెప్పారు. ఇదే సూత్రాన్ని ఇప్పుడు అమలు చేసినట్లు పేర్కొన్నారు. పంటల ఉత్పత్తి వ్యయాన్ని సీఏసీపీ శాస్త్రీయంగా మదింపు చేసిందన్నారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు → మహారాష్ట్రలోని వధవాన్‌లో రూ.76,200 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ డీప్ డ్రాఫ్ట్ మేజర్ పోర్టు అభివృద్ధి. ఈ ఓడరేవును ప్రపంచంలోని టాప్–10 ఓడరేవుల్లో ఒకటిగా అభివృద్ధి చేస్తారు. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 12 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఈ పోర్టులో 9 కంటైనర్ టెర్మినళ్లు ఉంటాయి. ఒక్కో టైర్మినల్ పొడవు వెయ్యి మీటర్లు. → రూ.2,869.65 కోట్లతో వారణాసిలోని లాల్‌బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు విస్తరణ. ఇందులో భాగంగా కొత్త టెర్మినల్ బిల్డింగ్ నిర్మిస్తారు. ఆప్రాన్, రన్‌వేను మరింత విస్తరిస్తారు. → సముద్ర తీరంలో పవన విద్యుత్ ప్రాజెక్టులకు రూ.7,453 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్(వీజీఎఫ్). 500 మెగావాట్ల చొప్పున గుజరాత్లో ఒకటి, తమిళనాడులో ఒకటి పవన విద్యుత్ ప్రాజెక్టుల అమలు. → 2024–25 నుంచి 2028–29 దాకా రూ.2,254.43 కోట్లతో జాతీయ ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకం(ఎన్ఎఫ్ఐఈఎస్) అమలు. ఇందులో భాగంగా ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాల అభివృద్ధి. నూతన క్యాంపస్‌లు, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ల నిర్మాణం. నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ(ఎన్ఎఫ్ఎస్యూ) ఏర్పాటు. -
కేంద్రం ఆఫర్ తిరస్కరణ.. చర్చలు విఫలం
చండీగఢ్: కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత తదితర డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వానికి, రైతు సంఘాలకు మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. సమస్య పరిష్కారానికి కేంద్ర మంత్రుల కమిటీ చేసిన తాజా ప్రతిపాదనలను కూడా రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. అవి రైతులకు మేలు చేసేవి కాదని నేతలు జగ్జీత్సింగ్ దల్లేవాల్, శర్వాన్‌సింగ్ పంథేర్ తదితరులు సోమవారం కుండబద్దలు కొట్టారు. ప్రతిపాదనలపై సంఘాలన్నీ చర్చించుకున్న మీదట ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. తమ ‘ఢిల్లీ చలో’ ఆందోళన బుధవారం ఉదయం 11 నుంచి శాంతియుతంగా కొనసాగుతుందని ప్రకటించారు. దాంతో సమస్య మొదటికొచ్చింది. రైతు సంఘాలతో ఆదివారం సాయంత్రం మొదలైన కేంద్ర మంత్రుల కమిటీ నాలుగో దశ చర్చలు అర్ధరాత్రి తర్వాత ముగిశాయి. చర్చల్లో మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా, నిత్యానంద రాయ్‌తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ నేత భగవంత్ మాన్ కూడా పాల్గొన్నారు. ‘ఐదేళ్ల ఒప్పంద’ ప్రతిపాదనను మంత్రులు తెరపైకి తెచ్చారు. ప్రభుత్వంతో కుదుర్చుకున్న రైతుల నుంచి పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని చెప్పారు. ఆ పంటలకు ఐదేళ్లపాటు ఎంఎస్పీ చెల్లింపుకు సుముఖత వ్యక్తం చేశారు. వారి నుంచి ఎంత పంటనైనా కొనుగోలు చేస్తామన్నారు. ఇది వినూత్నమైన ఆలోచన అని అనంతరం గోయల్ మీడియాతో చెప్పారు. ‘‘ఐదేళ్లపాటు ఎంఎస్పీకి ఆయా పంటల కొనుగోలుకు ఎన్సీసీఎఫ్, నాఫెడ్ వంటి ప్రభుత్వ రంగ సహకార సంఘాలు రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. ఇందుకు ఒక పోర్టల్ అభివృద్ధి చేస్తాం’’ అని చెప్పారు. కనీస మద్దతు ధరకు ఇప్పటికిప్పుడు చట్టబద్ధత అసాధ్యమని తేల్చిప్పారు. ఈ ప్రతిపాదనపై రైతులు, నిపుణులతో చర్చించి రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని పంథేర్ సోమవారం ఉదయం చెప్పారు. అప్పటిదాకా ‘ఢిల్లీ చలో’ కార్యక్రమాన్ని నిలిపేస్తున్నామన్నారు. కానీ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నామంటూ రైతు నేతల నుంచి రాత్రికల్లా ప్రకటన వెలువడింది. -
Farmers movement: రణరంగమైన శంభు సరిహద్దు
చండీగఢ్: డిమాండ్ల సాధన కోసం రైతులు చేపట్టిన ఆందోళనలతో పంజాబ్–హరియాణా నుంచి ఢిల్లీకి దారితీసే ప్రాంతాలన్నీ శుక్రవారం నాలుగో రోజూ అట్టుడికిపోయాయి. శంభు సరిహద్దు తదితర చోట్ల తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది. పోలీసు వలయాలను ఛేదించుకొని దూసుకెళ్లేందుకు నిరసనకారులు తీవ్ర ప్రయత్నం చేశారు. కొందరు ముసుగులు ధరించి పోలీసులపైకి రాళ్లు విసిరారు. వారిని చెదరగొట్టానికి పోలీసులు భారీ సంఖ్యలో బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. ఇరు వర్గాల ఘర్షణలతో శంభు సరిహద్దు రణరంగంగా మారింది. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత తదితర డిమాండ్ల సాధనకు సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా తదితర రైతు సంఘాలు ‘చలో ఢిల్లీ’కి పిలుపునివ్వడం తెలిసిందే. నాలుగు రోజులుగా కొనసాగుతున్న రైతుల ఉద్యమాన్ని సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్న 70 యూట్యూబ్ చానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వుతూ భద్రతా దళాలను కవి్వస్తున్నారంటూ పోలీసులు వీడియోలు విడుదల చేశారు. శంభు సరిహద్దు వద్ద నాలుగు రోజులుగా ఆందోళనల్లో పాల్గొంటున్న జ్ఞాన్‌సింగ్ అనే 63 ఏళ్ల రైతు గుండెపోటుతో మృతిచెందాడు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన ఆయనకు ఉదయం గుండె నొప్పి రావడంలో ఆసుపత్రిలో చేర్చినా లాభం లేకపోయింది. మరోవైపు, రైతు సంఘాలు ఇచ్చిన గ్రామీణ భారత్ బంద్ పిలుపుతో శుక్రవారం పంజాబ్, హరియాణాతోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో చాలాచోట్ల రవాణా వ్యవస్థ స్తంభించింది. వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. జనం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. రైతులు హైవేలను దిగ్బంధించారు. రేపు మంత్రుల కమిటీ చర్చలు కేంద్ర మంత్రులు, రైతు సంఘాల నేతల మధ్య ఇటీవల మూడు సార్లు చర్చలు జరిగాయి. ఈ నెల 8, 12, 15వ తేదీల్లో చర్చలు ఈ చర్చలు ఫలించలేదు. గురువారం రాత్రి ఐదు గంటలకు పైగా చర్చించినా ఇరు వర్గాలు ఏకాభిప్రాయానికి రాలేదు. డిమాండ్ల నుంచి రైతు సంఘాలు వెనక్కి తగ్గడం లేదు. చర్చలు ఆదివారం కూడా కొనసాగనున్నాయి. -
Delhi Chalo: రైతు ఉద్యమం ఉధృతం
న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడం సహా పలు డిమాండ్ల సాధనకు రైతులు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ మరింత ఉధృతమైంది. ఢిల్లీ సమీపంలో శంభు, టిక్రి సరిహద్దుల వద్ద పోలీసుల బారికేడ్లు, ఇనుపకంచెలు, సిమెంట్ దిమ్మెలను దాటేందుకు రైతులు ప్రయతి్నస్తున్నారు. పోలీసుల భాష్పవాయు గోళాలు, జలఫిరంగుల దాడితో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. ఉద్యమం మొదలై మూడురోజులవుతున్నా అటు రైతులు, ఇటు కేంద్ర ప్రభుత్వం పట్టువిడవడం లేదు. పంజాబ్, హరియాణాల మధ్యనున్న శంభు సరిహద్దు వద్ద వేలాదిగా రైతులు సంఘటితమయ్యారు. టిక్రి, సింఘు, కనౌరీ బోర్డర్ పాయింట్ల వద్దా అదే పరిస్థితి కనిపించింది. వారిని నిలువరించేందుకు మరింతగా బాష్పవాయుగోళాలు అవసరమని ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు. 30,000 టియర్‌గ్యాస్ షెల్స్‌కు ఆర్డర్ పెట్టారు. గ్వాలియర్‌లోని బీఎస్ఎఫ్ టియర్‌స్మోక్ యూనిట్ వీటిని సరఫరా చేయనుంది. ఘాజీపూర్ సరిహద్దు వద్ద సైతం పోలీసులు మొహరించారు. చండీగఢ్‌లో రైతు సంఘాల నేతలు జగ్జీత్సింగ్ దల్లేవాల్, శర్వాణ్ సింగ్ పాంథెర్, ప్రభుత్వ ప్రతినిధులైన వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్, హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మధ్య గురువారం రాత్రి మూడో దఫా చర్చలు మొదలయ్యాయి. చర్చల్లో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సైతం పాల్గొన్నారు. వాటిలో తేలిందనేది ఇంకా వెల్లడి కాలేదు. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)లో భాగమైన భారతీయ కిసాన్ యూనియన్ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా రైతులు నేడు గ్రామీణ భారత్ బంద్‌ను పాటించనున్నారు. ‘‘రైతులెవ్వరూ శుక్రవారం నుంచి పొలం పనులకు వెళ్లొద్దు. కారి్మకులు సైతం ఈ బంద్‌ను భాగస్వాములవుతున్నారు. ఈ రైతు ఉద్యమంలో ఎంతగా భారీ సంఖ్యలో జనం పాల్గొంటున్నారో ప్రభుత్వానికి అర్థమవుతుంది’’ అని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ అన్నారు. భారత్‌బంద్ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు హరియాణాలోని నోయిడాలో కర్ఫ్యూ విధించారు. పలు జిల్లాల్లో 17వ తేదీ దాకా టెలికాం సేవలను నిలిపేస్తూ హరియాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతులు సైన్యంలా ఢిల్లీ ఆక్రమణకు వస్తున్నారంటూ బీజేపీ పాలిత హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పంజాబ్‌లోనూ శుక్రవారం దాకా ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. పట్టాలపై బైఠాయింపు నిరసనల్లో భాగంగా గురువారం రైతులు రైల్ రోకో కూడా నిర్వహించారు. పంజాబ్, హరియాణా సరిహద్దుల్లో అతి పెద్దదైన రాజాపురా రైల్వే జంక్షన్ వద్ద వందలాది మంది రైతులు పట్టాలపై బైఠాయించారు. మధ్యా హ్నం నుంచి సాయంత్రం దాకా రైళ్ల రాకపోకలను అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. చాలా రైళ్లను దారి మళ్లించగా కొన్నింటిని రద్దు చేశారు. -
Farmers movement: సర్కారు ‘మద్దతు’ లేదనే..!
సాగు గిట్టుబాటు కావడం లేదంటూ రైతన్న మరోసారి కన్నెర్రజేశాడు. డిమాండ్ల సాధనకు రాజధాని బాట పట్టాడు. దాంతో రెండు రోజులుగా ఢిల్లీ శివార్లలో యుద్ధ వాతావరణం నెలకొంది. అవసరమైతే మరోసారి నెలల తరబడి ఆందోళనలు కొనసాగించేందుకే రైతులు సిద్ధమవుతున్నారు. పంజాబ్, హరియాణాతో పాటు ఉత్తర యూపీకి చెందిన రైతులు భారీ సంఖ్యలో నిరసనల్లో పాల్గొంంటున్నారు. అన్ని పంటలకూ కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటించడంతో పాటు దానికి చట్టబద్ధత కల్పించాలన్నది వారి ప్రధాన డిమాండ్. దాంతోపాటు స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలుకు కూడా రైతులు పట్టుబడుతున్నారు. ఇంతకీ ఏమిటీ ఎంఎస్పీ? రైతు సంక్షేమానికి స్వామినాథన్ కమిటీ చేసిన సిఫార్సులేమిటి...? ఎంఎస్పీ కీలకం.. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడంలో కనీస మద్దతు ధర (మినిమం సపోర్ట్ ప్రైస్–ఎంఎస్పీ)ది కీలక పాత్ర. ► రైతుల నుంచి పంటను సేకరించేందుకు ప్రభుత్వం చెల్లించే కనీస ధరే ఎంఎస్పీ. ► ఇది వారికి మార్కెట్ ఒడిదొడుకుల బారినుంచి రక్షణతో పాటు స్థిరత్వాన్ని, ఆదాయ భద్రతను కల్పిస్తుంది. ► దీన్ని కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ (సీఏసీపీ) నిర్ణయిస్తుంటుంది. ఈ విషయంలో ఉత్పత్తి వ్యయం, మార్కెట్ ధోరణులు, డిమాండ్–సరఫరా తదితరాలను పరిగణనలోకి తీసుకుంటుని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీకి ఎంఎస్పీపై సిఫార్సులు చేస్తుంది. వాటి ఆధారంగా సీసీఈఏ తుది నిర్ణయం తీసుకుంటుంది. సీఏసీపీ 1965లో ఏర్పాటైంది. ఇలా లెక్కిస్తారు... ఎంఎస్పీ లెక్కింపు సంక్లిష్టమైన ప్రక్రియ. ఇందుకోసం రైతులకయ్యే ప్రత్యక్ష, పరోక్ష ఉత్పత్తి వ్యయాలు రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటారు. ► ఎరువులు, విత్తనాలు, కూలీల వంటివి ప్రత్యక్ష వ్యయం కాగా రైతు సొంత కుటుంబం పడే కష్టం, అద్దెలు తదితరాలు పరోక్ష వ్యయం. ► వీటిని స్థూలంగా ఏ2, ఎఫ్ఎల్, సీ2గా వర్గీకరిస్తారు. ► పంట ఎదుగుదల, ఉత్పత్తి, నిర్వహణ నిమిత్తం చేసే ఎరువులు, విత్తనాలు, కూలీల వ్యయం ఏ2 కిందకు వస్తుంది. ► ఈ అసలు ఖర్చులకు కుటుంబ కష్టం తదితర పరోక్ష ఉత్పత్తి వ్యయాన్ని కలిపితే ఎఫ్ఎల్. ► ఏ2, ఎఫ్ఎల్ రెండింటికీ మూలధన ఆస్తులు, రైతు చెల్లించే అద్దెలను కలిపితే వచ్చేదే సీ2. ► వీటికి తోడు పలు ఇతర అంశాలను కూడా సీఏసీఊ పరిగణలోకి తీసుకుంటుంది. ఉదాహరణకు సాగు వ్యయం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. ప్రతి క్వింటా పంట దిగుబడికి అయ్యే వ్యయమూ అంతే. అలాగే మార్కెట్ ధరలు, వాటి ఒడిదొడుకులు, కూలీల వ్యయం తదితరాలు కూడా ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. వీటన్నింటితో పాటు సదరు పంట ఎగుమతులు, దిగుమతులు, మొత్తం నిల్వలు, డిమాండ్, తలసరి వినియోగం, ప్రాసెసింగ్ పరిశ్రమ ధోరణులు తదితరాలన్నింటినీ ఎంఎస్పీ లెక్కింపు కోసం సీఏసీపీ పరిగణనలోకి తీసుకుంటుంది. స్వామినాథన్ సిఫార్సులు... ► అన్ని పంటలకూ ఎంఎస్పీ హామీ ఇస్తూ చట్టం తేవాలి. ఎంఎస్పీ మొత్తం పంట సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50 శాతం ఎక్కువగా ఉండాలి (దీన్ని సీ2+50 పద్ధతిగా పిలుస్తారు). ► రైతు ఆత్మహత్యలను అరికట్టేలా భూమి, నీరు, సేంద్రియ వనరులు, రుణం, బీమా, టెక్నాలజీ, పరిజ్ఞానం, మార్కెట్ల వంటి మౌలిక సదుపాయాలు వారందరికీ అందుబాటులో తేవాలి. ► రాష్ట్రాల జాబితాలో ఉన్న వ్యవసాయాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చాలి. ► రైతు, వినియోగదారుల మధ్య ప్రత్యక్ష సంబంధం ద్వారా మెరుగైన ధర కలి్పంచాలి. ► వ్యవసాయోత్పత్తుల సేకరణ, ప్యాకేజింగ్, బ్రాండింగ్ స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రమాణాలకు తగ్గట్టు ఉండాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Farmers movement: రేపు రైతు సంఘాల ‘ఢిల్లీ చలో’
న్యూఢిల్లీ/చండీగఢ్: రైతు సంఘాలు మంగళవారం తలపెట్టిన ‘ఢిల్లీ చలో’మార్చ్ నేపథ్యంలో దేశ రాజధానితో పాటు హరియాణా సరిహద్దుల్లో అధికారులు భారీగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. నిషేధాజ్ఞలను అమలు చేయడంతో పాటు వాహనాల ప్రవేశాన్ని అడ్డుకునేందుకు కాంక్రీట్ దిమ్మెలు, స్పైక్ బారియర్లు, ముళ్లకంచెలను ఏర్పాటు చేశారు. టొహానా బోర్డర్ వద్ద ఇసుక కంటెయినర్లను, కాంక్రీట్ బారికేడ్లను, మేకులను రోడ్డుపై ఏర్పాటు చేశారు. సోమవారం చర్చలకు రావాల్సిందిగా రైతు సంఘాలను కేంద్రం ఆహా్వనించింది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత వంటి డిమాండ్లతో సంయుక్త కిసాన్ మోర్చా, పలు ఇతర రైతు సంఘాలు ఢిల్లీ మార్చ్‌కి పిలుపివ్వడం తెలిసిందే. దాంతో ట్రాక్టర్ ట్రాలీ మార్చ్ సహా ఎటువంటి నిరసనలు చేపట్టరాదంటూ హరియాణా ప్రభుత్వం 15 జిల్లాల పరిధిలో సెక్షన్ 144 విధించింది. శంభు వద్ద పంజాబ్‌తో సరిహద్దును మూసివేసింది. ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సరీ్వసులను, బల్క్ ఎస్ఎంఎస్లను మంగళవారం దాకా నిషేధించింది. 2020–21లో రైతులు ఏడాదికి పైగా నిరసనలు కొనసాగించిన సింఘు, ఘాజీపూర్, తిక్రీ సరిహద్దుల్లో బారికేడ్లనే ఏర్పాటు చేసి, తనిఖీలను ముమ్మరం చేశారు. ఢిల్లీలోని ఈశాన్య జిల్లాలో కూడా నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. నిరసనకారులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటున్నారు. యూపీ, పంజాబ్ సరిహద్దుల్లో 5 వేల మంది పోలీసులను నియోగించారు. మెట్రో స్టేషన్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నిరసనకారులు బారికేడ్లను తొలగించుకుని లోపలికి రాకుండా ఘగ్గర్ ఫ్లై ఓవర్ వద్ద రోడ్డుకు ఇరువైపులా ఇనుపïÙట్లను అమర్చారు. ఏదేమైనా కనీసం 20 వేల మంది రైతులు ఢిల్లీ తరలుతారని రైతు సంఘాలంటున్నాయి. మోదీ సర్కారు నిరంకుశత్వంతో రైతులను అడ్డుకోజూస్తోందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. దాన్ని ఢిల్లీ నుంచి శాశ్వతంగా పారదోలాలని పిలుపునిచ్చారు. -
రైతుల ‘మహాపంచాయత్’
న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ) చట్టబద్ధత, వ్యవసాయ రుణాల మాఫీ, విద్యుత్ (సవరణ) చట్టం–2022 రద్దుతోపాటు ఇతర డిమాండ్ల సాధనే ధ్యేయంగా మహాపంచాయత్‌లో పాల్గొనేందుకు రైతు సంఘాల పిలుపు మేరకు వేలాది మంది రైతులు ఢిల్లీకి తరలివచ్చారు. సోమవారం జంతర్‌మంతర్ వద్దకు చేరుకున్నారు. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ తదితర రాష్ట్రాల నుంచి రైతన్నలు తరలివచ్చారు. నగరంలో ఎక్కువ రోజులు ఉండేందుకే వారు సిద్ధపడి వచ్చినట్లు తెలుస్తోంది. తమ వెంట సంచులు, దుస్తులు తెచ్చుకున్నారు. రైతు సంఘాల నేతలు ఇచ్చిన జెండాలను చేతబూనారు. టోపీలు ధరించారు. జన్‌పథ్ మార్గంలోనూ తిరుగుతూ కనిపించారు. అన్నదాతల ఐక్యత వర్థిల్లాలని నినాదాలు చేశారు. హామీలను నెరవేర్చడం లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. జంతర్‌మంతర్‌కు చేరుకోకుండా రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నేతలు ఆరోపించారు. పోలీసులు మాత్రం ఖండించారు. మహాపంచాయత్ సందర్భంగా దేశ రాజధానిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తాము ఎవరినీ అడ్డుకోవడం లేదని చెప్పారు. డిమాండ్లు నెరవేరేదాకా తమ పోరాటం ఆగదని, అందుకోసం పూర్తిస్థాయి సిద్ధమై ఢిల్లీకి చేరుకున్నానని పంజాబ్ రైతు మాఘా నిబోరీ చెప్పారు. ప్రముఖ రైతు సంఘం నేత రాకేశ్ తికాయత్ ఢిల్లీలోకి ప్రవేశించకుండా ఆదివారమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జామ్ రైతుల మహాపంచాయత్ సందర్భంగా ఢిలీలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు పలు మార్గాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించారు. వాహనాలకు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఢిల్లీ బోర్డర్ పాయింట్ల వద్ద 2020 నవంబర్ నాటి దృశ్యాలే మళ్లీ కనిపించాయి. ఘాజీపూర్, సింఘూ, తిక్రీ తదితర బోర్డర్ పాయింట్ల వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతే నగరంలోకి అనుమతించారు. సరిహద్దుల్లో వాహనాలు గంటల తరబడి బారులు తీరాయి. -
కనీస మద్దతు ధరపై కమిటీ
న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)పై కమిటీని ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ శుక్రవారం రాజ్యసభలో ప్రకటించారు. కమిటీ విషయంలో అనుమతి కోసం ఎన్నికల సంఘానికి లేఖ రాశామని, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాతే ఈ కమిటీని తీసుకురావాలని ఎన్నికల సంఘం సూచించిందని అన్నారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన అనుబంధ ప్రశ్నకు తోమర్ సమాధానమిచ్చారు. ఎంఎస్పీకి రూ.2.37 లక్షల కోట్లు గత ఏడేళ్లలో మద్దతు ధరతో పంటల కొనుగోలు రెండింతలు పెరిగిందన్నారు. ప్రస్తుత బడ్జెట్లో ఇందుకోసం రూ.2.37 లక్షల కోట్లు కేటాయించామన్నారు. రైతుల సంక్షేమం కోసం కేంద్రం కృషి చేస్తోందని, పీఎం–కిసాన్ పథకంతోపాటు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు ఏర్పాటు చేస్తోందని వివరించారు. రైతుల నుంచి వరి, గోధుమలను కనీస మద్దతు ధరతో మరింత అధికంగా కొనుగోలు చేస్తామని అన్నారు. తృణధాన్యాలు, నూనె గింజలు సైతం కనీస మద్దతు ధరతో సేకరిస్తామని పేర్కొన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పప్పుగింజలను ప్రజలకు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరితే అందుకు అనుమతి మంజూరు చేస్తామని నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించారు. కనీస మద్దతు ధర విషయంలో ప్రభుత్వం హామీని నిలబెట్టుకోవడం లేదని సంయుక్త కిసాన్ మోర్చా ఆరోపించింది. యూపీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని రైతులకు పిలుపునిచ్చింది. -
రాజకీయ సంకల్పంతోనే.. కనీస మద్దతు ధర సాధ్యం
జాతీయ స్థాయిలో వ్యవసాయ రంగం చుట్టూ అల్లుకొన్న వివాదాలు ఇప్పట్లో వీడేట్లు లేవు. పార్లమెంట్లో ఆమోదించిన మూడు వివాదాస్పద సాగు చట్టాలను బేషరతుగా రద్దు చేస్తున్నట్లు నవంబర్ 19న నరేంద్ర మోదీ ప్రకటించినప్పటికీ, ఏడాది కాలంగా దేశ రాజధాని సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతు సంఘాలు ఉద్యమం విరమించలేదు సరికదా... మరో ప్రధాన డిమాం డ్‌పై పట్టుబట్టాయి. అన్ని పంటలకు చట్టబద్దమైన కనీస మద్దతు ధర ప్రకటించాలని, లేదంటే ఉద్యమం విరమించ మని కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. పోరాడి తేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నది ప్రజాస్వామ్యంలో నిజమే గానీ అన్ని పంటల ఎంఎస్పీకి కేంద్ర ప్రభుత్వం చట్టబద్దత కల్పించినట్లయితే రైతాంగ సమస్యలు పరిష్కారం అవుతాయా? వ్యవసాయ శాస్త్రజ్ఞుడు ఎం.ఎస్. స్వామినాథన్ కమిషన్ 2006లో సూచించిన విధానంలో ప్రధాన పంటలకు సి2+50 శాతంతో కనీస మద్దతు ధర నిర్ణయించాలన్న డిమాండ్‌ను మరుగునపర్చి.. ప్రస్తుతం కొనసాగుతున్న ఎంఎస్పీకి చట్టబద్దత కోరడం వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమిటి? సాగు చట్టాలను రద్దు చేయడం వరకు ఆహ్వానించదగినదే అయినప్పటికీ.. ఉద్యమాన్ని చల్లార్చడా నికే తప్ప రైతాంగ సమస్యల పరిష్కారానికి కేంద్రం చిత్తశుద్ధితో కృషి చేస్తున్న దాఖలాలు కనపడటం లేదు. 2014 ఎన్నికల ముందు బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామనీ, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామనీ ప్రకటించింది. కానీ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే బాణీ మార్చింది. స్వామినాథన్ కమిషన్ పేర్కొన్న విధానంలో అమలు చేస్తే వినియోగదారుడిపై అధికభారం పడుతుంది కనుక ఆ పద్ధతితో ‘ఎంఎస్పీ ఇవ్వం’ అని కరాఖండీగా చెప్పడమే కాదు... ఆ మేరకు సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. పైగా, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించే పంటల ఉత్పత్తి ఖర్చులను కేంద్ర ప్రభుత్వం తక్కువచేసి చూపడమో, తిరస్కరించడమో చేస్తూ... తక్కువ స్థాయిలో మద్దతు ధరలను నిర్ణయిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే ఎంఎస్పీలో శాస్త్రీయత పాళ్లు 1% కూడా లేవని చెప్పడం అతిశయోక్తి కాబోదు. హెక్టారు వ్యవసాయ సాగుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ కూలీల భత్యం, వ్యవసాయ పనిముట్లు, యంత్రాలకు చెల్లించే అద్దె మొత్తం, రైతు కుటుంబ సభ్యులు భూమిలో చేసిన శ్రమ, భూమి కౌలు ధర, సొంత పెట్టుబడి పెట్టినపుడు దానిపై వచ్చే వడ్డీ... వీటన్నింటిని కలిపి మద్దతు ధర నిర్ణయించాలని స్వామి నాథన్ కమిషన్ సిఫార్సు చేయగా... వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణాయక సంఘం (సీఏసీపీ) కొన్ని అంశాలనే పరిగణనలోకి తీసుకొని ఆ ధరలనే సిఫారసు చేయడం, వాటినే కేంద్రం ఆమోదించడం ఓ తంతుగా ఇన్నేళ్లూ నడిచి పోతోంది. ఈ విధానం రైతులకే కాదు ఎవరికీ ఆమోద యోగ్యం కాదు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పంటల సాగు వ్యయాలు తీసుకొని వాటిని కలిపి జాతీయ సగటుగా లెక్కించి కనీస మద్దతు ధరను నిర్ణయిస్తున్నారు. దీనివల్ల సాగు ఖర్చు ఎక్కువగా ఉండే దక్షిణాది రాష్ట్రాల రైతాంగానికి అన్యాయం జరుగుతోంది. దేశం మొత్తాన్ని 4 లేదా 5 జోన్లుగా విభజించి, జోన్ల వారీగా కనీస మద్దతు ధరలను లెక్కించాలన్న హేతుబద్ధ సూచనను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు. పంటల ఉత్పత్తి ఖర్చులను అంచనా వేయడానికి, వాటికి మద్దతు ధరలు నిర్ణయించడానికి 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం రమేష్‌చంద్ కమిటీని నియమించింది. ఆ కమిటీ దాదాపు ఏడాది తర్వాత, కేంద్రంలో ఎన్టీయే ప్రభుత్వం ఏర్పాటయ్యాక 23 సూచనలతో ఓ నివేదిక సమర్పించగా దానిని బుట్టదాఖలా చేశారు. 2018–19 నుంచి ఎఫ్2+50 శాతం విధానంలో మద్దతు ధరను అమలు చేస్తూ... అదే స్వామినాథన్ సూచించిన ఎంఎస్పీ అంటూ నమ్మబలికారు. దేశంలో 51 రకాల ప్రధాన పంటలు పండుతోంటే కేంద్ర ప్రభుత్వం 14 నుంచి 23 రకాల పంటలకు మాత్రమే అరకొరగా కనీస మద్దతు ధరను నిర్ణయిస్తోంది. కనీస మద్దతు ధరలు సక్రమంగా లభించని కారణంగా దేశ రైతాంగానికి సాలీనా రెండున్నర లక్షల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లుతోందని వివిధ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలలో వ్యవసాయోత్పత్తుల విలువలో గరిష్టంగా 25 శాతం మేర వివిధ సబ్సిడీల రూపంలో రైతులకు అందిస్తుండగా, భారతదేశంలో అన్ని రకాల సబ్సిడీలు 4 శాతం మించడం లేదు. కనీస మద్దతు ధరలు కూడా మిగతా దేశాలతో పోలిస్తే ప్రపంచ మార్కెట్లో 17 శాతం తక్కువగా ఉన్నట్లు ఓఈసీడీ (ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్) వ్యవసాయ నివేదిక తెలియజెప్పింది. ఈ నేపథ్యంలో స్వామినాథన్ కమిషన్ కనీస మద్దతు ధరలను సి2+50 శాతం ప్రకారం ఇవ్వాలని, అప్పుడే రైతులకు ప్రయోజనం కలుగుతుందని దాదాపు 15 ఏళ్ల క్రితమే స్పష్టం చేసింది. ఆహార ధాన్యాల దీర్ఘకాల విధానంపై ప్రొఫెసర్ అభిజిత్‌సేన్ కమిటీ 2002లో అందించిన నివేదిక సైతం ఇదే సూచనను బలపర్చింది. స్వామినాథన్ కమిషన్ సూచనల మేరకు వాస్తవ సాగువ్యయానికి 50% కలిపి (సి2+50 శాతం) కనీస మద్దతు ధరను అందిస్తే ప్రభుత్వంపై పడే అదనపు భారం రూ. 2,28,000 కోట్లు మాత్రమేనని కిసాన్ స్వరాజ్ స్థాపకుడు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ లెక్కగట్టారు. ఈ మొత్తం కేంద్ర బడ్జెట్లో దాదాపు 8%. పారిశ్రామిక రాయితీల రూపంలో, బ్యాంకుల మొండి బకాయిల రద్దు రూపంలో ఏటా లక్షలాది కోట్ల ఆదాయాన్ని వదులుకొంటున్న కేంద్ర ప్రభుత్వానికి ఈ మొత్తం పెద్ద లెక్క కాదు. పంటలకు మద్దతు ధర పెరిగితే రైతు కుటుంబాల ఆర్థిక, సామాజిక స్థితిగతులు మెరుగుపడతాయి. రైతుల ఆత్మహత్యలు తగ్గు తాయి. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ, నీతి ఆయోగ్ ఆశించేటట్లు రైతు ఆదాయం రెట్టింపు కావడానికి ఆస్కారం కలుగుతుంది. దేశానికి స్వాతంత్య్రం లభించిన ఈ ఏడున్నర దశాబ్దాలలో అతిపెద్ద రాజకీయ సంకల్పానికి సంబంధించిన అంశం ఇది. గట్టి రాజకీయ సంకల్పంతోనే అనేక చారిత్రా త్మక మార్పులు జరిగాయి. 2004లో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వాలని తీసుకొన్న నిర్ణయం దేశ వ్యవసాయ రంగ ముఖ చిత్రాన్ని మార్చివేసింది. అందువల్ల స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ గట్టి రాజకీయ సంకల్పం తీసుకోవాలి. అది చేయ గలిగితే ఆయన చరిత్రలో నిలిచిపోతారు. -డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ -
మద్దతు ధరలను పెంచిన కేంద్రం
-
వరికి మద్దతు రూ.53 పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: ఆహార, వాణిజ్య పంటల కనీస మద్ధతు ధర(ఎమ్మెస్పీ)లను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వరి మద్ధతు ధరను స్వల్పంగా రూ. 53 పెంచింది. ఈ పెంపుతో వరి క్వింటాల్ ధర సాధారణ రకం రూ. 1,868కి, ఏ గ్రేడ్ రకం రూ. 1888కి చేరింది. నూనె గింజలు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలకు గణనీయంగా పెంచింది. ప్రస్తుత 2020–21 పంట సంవత్సరానికి(2020 జూలై– 2021 జూన్) ఈ ఎమ్మెస్పీ వర్తిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఈ కనీస మద్దతు ధర పెంపు ప్రతిపాదనలను ఆమోదించారు. అత్యధికంగా గడ్డి నువ్వులు(నైజర్ సీడ్స్)కు క్వింటాలుకు రూ. 755 పెంచారు. నువ్వులకు రూ. 370, మినుములకు రూ. 300, పత్తికి రూ. 275 మేర పెంచారు. మద్దతు ధర పెంపులో ఉత్పత్తి వ్యయంపై మెరుగైన ప్రతిఫలంతోపాటు, వైవిధ్య పంటల ప్రోత్సాహం అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. పంట ఉత్పత్తి వ్యయంపై అదనంగా కనీసం 50 శాతం ప్రతిఫలం లభించేలా కనీస మద్దతు ధర ఉండాలని 2018–19 బడ్జెట్లో చేసిన ప్రకటనకు అనుగుణంగా మద్దతు ధరలను ప్రకటించారు. ఉత్పత్తి వ్యయానికి అదనంగా సజ్జల(బాజ్రా)కు 83%, మినుములకు 64%, కందులకు 58%, మొక్కజొన్నకు 53%, ఇతర పంటలకు కనీసం 50% మేర ప్రతిఫలం వస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఖరీఫ్ సీజన్లో వరి ప్రధాన పంట. ఇప్పటికే 35 లక్షల హెక్టార్లలో నాట్లు వేశారు. ‘కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ సిఫారసుల మేరకు 2020–21 సంవత్సరానికి గానూ 14 ఖరీఫ్ పంటలకు మద్ధతు ధరలను పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వివిధ పంటలపై, దిగుబడి ఖర్చుపై 50% నుంచి 83% వరకు రైతుకు లాభం వచ్చేలా ధరల పెంపు ఉంది’ అని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ తెలిపారు. వరి దిగుబడి వ్యయాన్ని సాధారణ రకానికి రూ. 1245, ఏ గ్రేడ్ రకానికి రూ. 1246గా నిర్ధారించి, దానిపై 50% ప్రతిఫలం లభించేలా కనీస మద్దతు ధర నిర్ణయించామన్నారు. వంట నూనెల దిగుమతిని తగ్గించేందుకు, దేశీయంగా నూనె గింజల దిగుబడిని పెంచేలా రైతులను ప్రోత్సహించేందుకు వాటి ఎమ్మెస్పీని గణనీయంగా పెంచారు. రూ. 3 లక్షల వరకు స్వల్పకాలిక పంట రుణాలు తీసుకున్నవారు తిరిగి చెల్లించే తేదీని ఆగస్ట్ 31 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. -
ఖర్చు బారెడు... ఆదాయం మూరెడు
సాక్షి, సోంపేట (శ్రీకాకుళం): దేశానికి వెన్నెముక రైతని, రైతులకు న్యాయం చేస్తామని కేంద్ర పాలకులు హామీలు గుప్పించడం తప్ప ఆచరణ కనిపించడం లేదని ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని రైతులు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్‌లో పండించిన వరికి మద్దతు ధర కంటితుడుపుగా పెంచుతున్నాయని రైతులు వాపోతున్నారు. వరికి మద్దతు ధర పెంచాలని రైతు సంఘాలు, రైతులు ప్రభుత్వాలను కోరుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. మద్దతు ధర పెరుగుతుందని ప్రతీ సంవత్సరం ఎదురు చూస్తున్న రైతుకు ప్రతీ సంవత్సరం నిరాశ తప్పడం లేదు. ఈ ఏడాది కూడా మద్దతు ధర క్వింటాకు 65 రూపాయలు పెంచి రైతులకు నిరాశ శమిగిల్చిందని రైతులు తెలియజేస్తున్నారు. ఆశించినస్థాయిలో మద్దతు ధర పెరగకపోవడంతో నిరాశతోనే రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఆదాయానికి మించి ఖర్చు వరి క్వింటాకు సాగు వ్యయం రైతు లెక్క ప్రకారం గ్రేడ్–1 రకానికి రూ.2,500లు, సాధారణ రకానికి రూ.2,200 అవుతుంది. ప్రభుత్వం మాత్రం క్వింటాకు ఖర్చు రూ.1,208 అని లెక్కలు చెబుతుంది. ప్రభుత్వం పెంచిన అత్యధిక మద్దతు ధర రూ.1,835గా ఉంది. గతేడాది వరి సాధారణ రకం క్వింటాకు రూ.1,750 ఉండగా ఈ ఏడాది రూ.1,815కు పెరిగింది. మేలు రకం రూ.1,770 ఉండగా రూ.1,835కు చేరింది. దీంతో రైతు సాగు వ్యయం ప్రకారం చూసినా వరి పండించే రైతు సుమారు రూ.600 నష్టపోవాల్సి వస్తుంది. వరికి కనీస మద్దుతు ధర క్వింటాకు రూ.3000 ఉండాలని రైతులు, రైతు సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వం వద్ద మొర పెట్టుకుంటున్నారు. అవి ఏమీ పట్టనట్టు కేంద్ర ప్రభుత్వం ప్రతీసారి కంటితుడుపుగా మద్దతు ధర పెంచుతుందని రైతులు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2019–20వ సంవత్సరాకి వరి పంటకు క్వింటాకు రూ.65 పెంచింది. వరి పంట పండించే రైతులు కష్టాలు కేంద్ర ప్రభుత్వం గుర్తించడం లేదని నియోజకవర్గంలోని పలువురు రైతులు వాపోతున్నారు. సోంపేట, ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి మండలాల్లోని రైతులకు వరి పంటే ప్రధాన పంట. ప్రతీ సంవత్సరం వరి పండించడం వల్ల నష్టాలు చవిచూడడం జరుగుతోంది. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 45 వేల ఎకరాల్లో సుమారు 50 వేల మంది రైతులు వరి పంటను పండిస్తుంటారు. ప్రభుత్వాలు వ్యయం ప్రకారమైనా మద్దతు ధర పెంచాలని, దీనిపై కేంద్ర పునరాలోచించాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం వరి పంట సాగు చేయాలంటే రైతులు భయ పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కౌలుకు సాగు చేయడానికి కూడా కౌలు రైతులు ముందుకు రావడం లేదు. ఎకరా వరి సాగు చేయడానికి, నారు మడి తయారి, పొలం తయారి, నాట్లు వేయడం, ఎరువులు, కోతలు, నూర్పు చేయడం, కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యం చేర్చే వరకు ఎకరానికి సుమారు రూ.25 వేలకు పైగా ఖర్చు అవుతుందని రైతులు తెలుపుతున్నారు. సక్రమంగా దిగుబడి వస్తే రూ. 30 వేలకు పైగా ఆదాయం వస్తుందని రైతులు తెలుపుతున్నారు. ప్రకృతి విపత్తుల వల్ల పంటనాశనం అయితే రైతులు కోలుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. కంటి తుడుపు చర్యే ప్రభుత్వం పెంచిన మద్దతు ధర కంటి తుడుపు చర్యగా ఉంది. వరి పంట సాగు చేయడానికి శ్రమతో పాటు కూలీల ఖర్చు, పెట్టుబడి కూడా ఎక్కువుగా అవసరం. ప్రభుత్వాలు రైతులకు లాభాలు వచ్చే స్థాయిలో మద్దతు ధర పెంచకపోవడం దారుణం. వరి పంట మద్దతు ధర పెంపుపై పునరాలోచించాలి. – యు.తిరుపతిరావు, రైతు, తాళభద్ర పున:సమీక్షించాలి వరి మద్దతు ధర విషయంలో ప్రభుత్వాలు పునఃసమీక్ష చేసుకోవాలి. మిగతా పంటల కంటే వరి పంట చేతికందే వరకు రైతు కష్టనష్టాలు ఎదుర్కోవడంతో పాటు, పెట్టుబడులు కూడా ఎక్కువుగా ఉంటాయి. వరి పంటకు మద్దతు ధర పెంచడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. – పల్లి సదానందం, రైతు, బుసాభద్ర -
రైతన్నకు తీపి కబురు
న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. ఈ ఖరీఫ్ సీజన్‌కు పలు ప్రధాన పంటల కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ)లను పెంచుతూ కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. వరికి ఈ ఎమ్మెస్పీకి రికార్డు స్థాయిలో క్వింటాల్‌కు రూ. 200 పెంచింది. సాధారణ రకం వరి ఎమ్మెస్పీని క్వింటాల్‌కు రూ. 1550 నుంచి రూ. 1750కి, గ్రేడ్–ఏ రకం వరికి క్వింటాల్‌కు రూ. 1590 నుంచి రూ. 1770కి పెంచారు. పత్తి ఎమ్మెస్పీని రూ. 4020 నుంచి రూ. 1130 పెంచి, 5,150 రూపాయలకు చేర్చారు. ఇటీవలి కాలంలో పలు పంటలకు ఇంత మొత్తంలో మద్దతు ధర పెరగడం ఇదే ప్రథమం. యూపీఏ–2 హయాంలో 2012–13 సాగు సంవత్సరంలో వరి మద్దతు ధరను 170 రూపాయలు పెంచారు. పంటల పెట్టుబడి వ్యయానికన్నా 50 శాతం అధికంగా కనీస మద్దతు ధర ప్రకటిస్తామంటూ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని తాజా పెంపు నిర్ణయంతో బీజేపీ నిలబెట్టుకుంది. ఈ నిర్ణయంతో ఖజానాపై రూ. 15వేల కోట్ల భారం పడనుంది. అలాగే ఈ పెంపు వల్ల ద్రవ్య లోటు, ద్రవ్యోల్బణం పెరిగిపోతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక క్వింటాల్ వరి పండించడానికి రైతులకు రూ. 1,166 వ్యయం అవుతున్నట్లు వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (సీఏసీపీ) లెక్కించిందనీ, మద్దతు ధర రూ. 1,750గా ఉండటంతో పెట్టుబడి కన్నా మద్దతు ధర 50 శాతం ఎక్కువగా ఉన్నట్లైందని కేంద్రం వివరించింది. గత నాలుగేళ్లలో వరి మద్దతు ధరను క్వింటాల్‌కు కేవలం 50 నుంచి 80 రూపాయల మధ్యనే పెంచిన బీజేపీ ప్రభుత్వం, ఈసారి మాత్రం ఏకంగా రూ. 200 పెంచింది. అన్ని పంటలకూ 50 శాతం ఎక్కువే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గ నిర్ణయాలను హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మీడియాకు వెల్లడించారు. వివిధ పంటలకు మద్దతు ధరను పెంచడం వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ. 15 వేల కోట్ల అదనపు భారం పడుతుందనీ, అందులో కేవలం వరి కోసమే రూ. 12 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని తెలిపారు. 2018–19 సీజన్‌కు మరో 14 ఖరీఫ్ పంటలకు కూడా ప్రభుత్వం మద్దతు ధరను నిర్ణయించిందన్నారు. తాజా పెంపుతో వరికే కాకుండా దాదాపు అన్ని పంటలకూ మద్దతు ధరను పెట్టుబడి కన్నా 50 శాతం ఎక్కువగా ఉండేలా చేశామని చెప్పారు. ఈ పెంపుతో రైతుల కొనుగోలు శక్తి పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి పరోక్షంగా సాయపడతారన్నారు. ద్రవ్యోల్బణంపై ఆందోళన వద్దు ఆహార రాయితీ కోసం ప్రస్తుత బడ్జెట్లో రూ. 1.7 లక్షల కోట్లు కేటాయించగా, తాజా మద్దతు ధరల పెంపుతో ఆ రాయితీ కోసం రూ. 2 లక్షల కోట్లకు పైగా ఖర్చు పెట్టాల్సి వస్తుందని వ్యవసాయ రంగ నిపుణుడు అశోక్ గులాటీ అన్నారు. దీంతో ద్రవ్య లోటు, ద్రవ్యోల్బణం పెరిగిపోతాయని ఆయన పేర్కొన్నారు. ధరలు పెరుగుతాయనే అంశాన్ని రాజ్‌నాథ్ వద్ద విలేకరులు ప్రస్తావించగా, ద్రవ్యోల్బణం పెరుగుతుందనడం సరికాదన్నారు. తృణ ధాన్యాలకే ఎక్కువ తృణ ధాన్యాలైన రాగి, జొన్న, సజ్జ తదితరాలకు మద్దతు ధరను కేంద్రం బాగానే పెంచింది. అలాగే పెసర పంట మద్దతు ధరను రూ. 1,400 పెంచగా, ప్రస్తుతం క్వింటాల్ పెసర ధర రూ. 6,975కు పెరిగింది. అయితే పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటల విషయానికి వస్తే మాత్రం గతేడాది వీటికి పెంచిన మద్దతు ధర కన్నా, ప్రస్తుతం పెంచిన ధర తక్కువగానే ఉంది. ఈ పంటలకు పెట్టుబడికి అయ్యే ఖర్చు (ఏ2+ఎఫ్ఎల్)తో పోలిస్తే మద్దతు ధర ఇప్పటికే 50 శాతం ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. క్వింటాల్ సజ్జలకు రూ. 525 (ప్రస్తుత ధర రూ. 1,950), జొన్నలకు రూ. 730 (రూ. 2,340), రాగులకు రూ. 997 (రూ. 2,897) పెంచిన కేంద్రం.. వేరు శనగకు రూ. 440, సోయాబీన్‌కు రూ. 349, కందులకు రూ. 225 పెంపుతోనే సరిపెట్టింది. సాధారణంగా విత్తన సమయానికి ముందే వివిధ పంటల మద్దతు ధరలను ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఆ ధరల ఆధారంగా రైతులు తాము ఏ పంట వేయాలో నిర్ణయించుకుంటారు. అయితే ఈసారి మాత్రం కాస్త ఆలస్యంగా ప్రభుత్వం మద్దతు ధరలను సవరించింది. హామీని నెరవేర్చాం: ప్రధాని మోదీ పెట్టుబడితో పోలిస్తే మద్దతు ధర ఒకటిన్నర రెట్లు ఉండేలా చేస్తామని తాము ఇచ్చిన హామీని నెరవేర్చామని మోదీ తెలిపారు. పెట్టుబడి వ్యయాన్ని ఇలా లెక్కిస్తారు.. కనీస మద్దతు ధరను ప్రతిపాదించే ముందు, పెట్టుబడి వ్యయాన్ని గణించేందుకు వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్(కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్– సీఏసీపీ) కొన్ని పద్ధతులను పాటిస్తుంది. ఇవి ఏ2(యాక్చువల్ కాస్ట్): రైతు స్వయంగా భరించే విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలు ఖర్చు, అలాగే కూలీల ఖర్చు, యంత్రాల అద్దె.. తదితరాల మొత్తం. ఏ2+ ఎఫ్ఎల్(ఫ్యామిలీ లేబర్): పైన పేర్కొన్న ఏ2 వ్యయానికి సాగు సమయంలో రైతు, ఆయన కుటుంబం చేసే శ్రమ విలువను జోడిస్తే ఈ మొత్తం వ్యయం వస్తుంది. సీ2 (సమగ్ర వ్యయం): ఇది సమగ్ర(కాంప్రహెన్సివ్) వ్యయం. పైన పేర్కొన్న ఏ2+ఎఫ్ఎల్ ఖర్చుకు సాగు భూమిపై గణించిన అద్దెను, పెట్టుబడిపై వడ్డీని కలిపితే ఈ సమగ్ర వ్యయం వస్తుంది. ఈ ‘సీ2’ వ్యయంపై 50 శాతం పెంపును కనీస మద్దతు ధరగా నిర్ణయించాలని స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసింది. రైతు సంఘాలు కూడా ఈ డిమాండే చేస్తున్నాయి. అయితే, ప్రస్తుతం సీఏసీపీ ‘ఏ2+ఎఫ్ఎల్’ విధానం ఆధారంగా ఎమ్మెస్పీని సిఫారసు చేసింది. మంచిదే.. కానీ! మద్దతు ధరల పెంపుపై వివిధ వర్గాల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ధరలు పెంచడం మంచిదే అయినప్పటికీ, ప్రభుత్వ తాజా చర్య వల్ల ద్రవ్య లోటు, ద్రవ్యోల్బణం పెరిగిపోతాయని కొందరు అందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో ఈ పెంపు ఏ మాత్రం సరిపోదనీ, పెట్టుబడి అంటే ప్రభుత్వం సమగ్ర వ్యయాన్ని కాకుండా, ఏ2+ఎఫ్ఎల్నే పరిగణలోకి తీసుకోవడంతో పెద్ద ప్రయోజనం ఉండదంటున్నారు. అంతర్జాతీయ స్థాయి కన్నా మనదగ్గర ధరలు పెరిగిపోతే ఎగుమతుల్లేక ధాన్యమంతా ఇక్కడే పోగుపడుతుందనీ, రైతులకు ఇది మరింత ప్రమాదకరమని వ్యవసాయ రంగ నిపుణుడు అశోక్ గులాటీ వివరించారు. ఎన్నికల తాయిలం: కాంగ్రెస్ 2019లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయం ఒక గిమ్మిక్కు, ఓటర్లకు తాయిలంగా కాంగ్రెస్ పేర్కొంది. రైతులను ప్రలోభ పెట్టేందుకు తీసుకున్న చర్యగా కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా అన్నారు. ఈ ఎంఎస్పీ వచ్చే ఏడాది అమలవుతుండగా అప్పటికి ఈ ప్రభుత్వం అధికారం కోల్పోతుందన్నారు. ఈ పెంపు సరిపోదు: బీజేడీ వరి మద్దతు ధర క్వింటాలుకు రూ.200 వరకు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఒడిశాలోని బీజేడీ ప్రభుత్వం తీవ్రంగా విమర్శించింది. ఈ పెంపు రైతులకు ఏమాత్రం ఊరటనివ్వదంది. వరి క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.200 పెంచాలన్న నిర్ణయం రైతుల పట్ల బీజేపీ ప్రభుత్వ చారిత్రక నమ్మక ద్రోహమని ఆల్ ఇండియా కిసాన్ సభ(ఏఐకేఎస్) మండిపడింది. -
వరి మద్దతు ధర రూ.60 పెంచండి!
న్యూఢిల్లీ: వరి కనీస మద్దతు ధరను (ఎంఎస్పీ) రూ.60 పెంచాలని వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణాయక కమిషన్(సీఏసీపీ).. కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. క్వింటాల్ ఎంఎస్పీని రూ.1,410 నుంచి 1,470కి పెంచాలని సూచించింది. గ్రేడ్ ఏ రకం ఎంఎస్పీ క్వింటాల్‌కు రూ.1,450 ఉంది. ఎంఎస్పీలకు కేంద్రం రైతుల నుంచి ధాన్యాన్ని కొంటుంది. పత్తి, పప్పులు తదితర 14 పంటలకు మద్దతు ధరలను 2016-17కిగాను పెంచాలని సిఫారసు చేస్తూ వ్యవసాయ శాఖకు సీఏసీపీ నివేదికను సమర్పించింది. క్వింటాల్ కంది పప్పు ఎంఎస్పీని రూ.200 పెంచి రూ.4,625గా నిర్ణయించాలంది. పెసర, మినప పప్పుల ఎంఎస్పీని రూ.150 పెంచి వరుసగా రూ. 4,800, రూ.4,575గా నిర్ణయించాలని సిఫార్సు చేసింది. ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాల అభిప్రాయాలను తెలుసుకుని కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముంది. పెంచిన కనీస ధరల కారణంగా ఈ ఏడాది గణనీయంగా పప్పు ధాన్యాలను సాగు చేయడానికి రైతులు ఆసక్తి ప్రదర్శిస్తారని వ్యవసాయ శాఖ భావిస్తోంది.