Cabinet approves: వరికి మరో 117 | Cabinet approves increase in MSP of 14 kharif crops for 2024-25 | Sakshi
Sakshi News home page

Cabinet approves: వరికి మరో 117

Published Thu, Jun 20 2024 4:21 AM | Last Updated on Thu, Jun 20 2024 4:21 AM

Cabinet approves increase in MSP of 14 kharif crops for 2024-25

కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం

సాధారణ రకానికి క్వింటాల్‌కు రూ.2,300 

‘ఎ’ గ్రేడ్‌ రకానికి రూ.2,320  

పత్తికి మరో రూ.501 పెంపు  

2024–25 ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌లో 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపు  

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్‌ బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. వరి ధాన్యానికి కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను 5.35 శాతం పెంచింది. అంటే క్వింటాల్‌కు రూ.117 చొప్పున పెరగనుంది. 2024–25 ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌లో క్వింటాల్‌ వరి ధాన్యాన్ని రూ.2,300కు కొనుగోలు చేయనున్నారు. 

ప్రస్తుతం దేశంలో సరిపడా బియ్యం నిల్వలు ఉన్నప్పటికీ ధాన్యానికి మద్దతు ధర పెంచడం గమనార్హం. త్వరలో జరగనున్న హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ పెంచినట్లు తెలుస్తోంది. మంత్రివర్గం నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ మీడియాకు వివరించారు.

 వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్‌(సీఏసీపీ) సిఫార్సుల మేరకు 14 ఖరీఫ్‌ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసినట్లు తెలిపారు. ఎంఎస్పీని సాధారణ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,300కు, ‘ఎ’ గ్రేడ్‌ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,320కు పెంచినట్లు వెల్లడించారు. కనీస మద్దతు ధర అనేది ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 1.5 రెట్లు అధికంగా ఉండాలని 2018 కేంద్ర బడ్జెట్‌లో తీసుకున్న విధానపరమైన నిర్ణయాన్ని ప్రభుత్వం ఆమోదించినట్లు చెప్పారు. ఇదే సూత్రాన్ని ఇప్పుడు అమలు చేసినట్లు పేర్కొన్నారు. పంటల ఉత్పత్తి వ్యయాన్ని సీఏసీపీ శాస్త్రీయంగా మదింపు చేసిందన్నారు.   

కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు  
→ మహారాష్ట్రలోని వధవాన్‌లో రూ.76,200 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్‌ డీప్‌ డ్రాఫ్ట్‌ మేజర్‌ పోర్టు అభివృద్ధి. ఈ ఓడరేవును ప్రపంచంలోని టాప్‌–10 ఓడరేవుల్లో ఒకటిగా అభివృద్ధి చేస్తారు. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 12 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఈ పోర్టులో 9 కంటైనర్‌ టెర్మినళ్లు ఉంటాయి. ఒక్కో టైర్మినల్‌ పొడవు వెయ్యి మీటర్లు.  
→ రూ.2,869.65 కోట్లతో వారణాసిలోని లాల్‌బహదూర్‌ శాస్త్రి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు విస్తరణ. ఇందులో భాగంగా కొత్త టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మిస్తారు. ఆప్రాన్, రన్‌వేను మరింత విస్తరిస్తారు.  
→ సముద్ర తీరంలో పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు రూ.7,453 కోట్ల వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌(వీజీఎఫ్‌). 500 మెగావాట్ల చొప్పున గుజరాత్‌లో ఒకటి, తమిళనాడులో ఒకటి పవన విద్యుత్‌ ప్రాజెక్టుల అమలు.  
→ 2024–25 నుంచి 2028–29 దాకా రూ.2,254.43 కోట్లతో జాతీయ ఫోరెన్సిక్‌ మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకం(ఎన్‌ఎఫ్‌ఐఈఎస్‌) అమలు. ఇందులో భాగంగా ఫోరెన్సిక్‌ మౌలిక సదుపాయాల అభివృద్ధి. నూతన క్యాంపస్‌లు, సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ల నిర్మాణం. నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ(ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ) ఏర్పాటు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement